Monday, March 26, 2018

ప్రేమలేఖ 6


కడలి. అలలు. ఆకాశం. మబ్బులు. వాటిని చూడగానే గాల్లో తేలియాడే మనసు. వాటిని గాల్లో విహరిస్తూ చూస్తె?కేవలం బాగుంది అని చెప్పలేం కదా! గాలి మోటరు ప్రయాణం. ఆ ప్రయాణాన్ని వర్ణించడానికి ఏమి లేదు. బస్సులోనో, రైల్లోనో పోయినట్లే ఉంది. వాటికి టేకాఫ్, ల్యాండింగ్ ఉండదు అంతే తేడా. చిన్నప్పుడు జాయింట్ వీల్ చాల ఇష్టంగా ఎక్కినా అనుభవం వల్లేమో జనాలు చెప్పినంత థ్రిల్లింగ్ ఏమి లేదు. అయిన నీకు తెలియందా! ఎన్నిసార్లు రమ్మని పోరు చేశావు. రానని మొండికేసి రైల్లో పుస్తకం చదువుతూ పోలేదు. ఇప్పుడు అంతే నాలుగు పుస్తకాలు వేసుకుని అందులో మనుషులతో మాట్లాడుతూ పోదాం అనుకున్న. కానీ తప్పలేదు. ప్రయాణాలు ప్రతిసారి ఓ కొత్తకోణాన్ని పరిచయం చేస్తాయి. ఇది అంతే. పెట్టుబడి వికృత రూపాన్ని పరిచయం చేసింది. వస్తువు కొనడం అనివార్యమైన చోట పెట్టుబడి లాభాల్ని ఎట్లా గడిస్తుందో పుస్తకాల్లో చదవడానికి, కళ్లారా చూడడానికి, అనుభవంలోకి రావడానికి తేడా ఉంది. నేను పోయిన మీటింగ్లో ఒక కళాకారుడు పాట పాడినట్లు. ‘వచ్చింది సూడు తమ్మి మార్కెట్ జమానా, మంచినీళ్ళు సైతం అమ్ముడుపోయే రోజుల కాలం.’ ఈ ఆర్థిక దోపిడీకి తోడూ భద్రతా పేరా చేకప్ లు మరోవైపు. నాలుగైదు సార్లు చెక్ చేయడానికి ఏముందో? రాజ్యం తనపై ఎవరు దాడి చేస్తారో అనే ఒక అభద్రతా భావనలోంచి, తన దోపిడీని వ్యతిరేకిస్తున్న శక్తుల నుండి తనను తాను కాపాడుకోవడానికి  పుట్టుకొచ్చినవే కదా. ఈ సైన్యాలు. పోలీసులు. భద్రతా బలగాలు. అయిన వాళ్ళు కూడా ఏం చేస్తారు వాళ్ళ ఉద్యోగం వారిది. సొంత ఆలోచనలు అమలుపరచలేని ఒక రోబోట్ బతుకులు. ‘పోనిలే అయ్యా. ప్రతి మూలకు ఒకడ్ని పెట్టుకొనీ, వందల, వేల కోట్లు దోచుకొని పోబడుతున్నాయి. ఇట్లా ఉన్నా, నాలుగు ఉద్యోగాలు పెరిగి నలుగురు బతుకుతారు.’ అన్నాడు వసంతం.

వెళ్తున్నప్పుడు ఇండిగోలో ఒక ఎయిర్ హోస్టెస్ చాల ముచ్చటగా ఉంది. అందమైన నవ్వు తనది. తప్పదు. ఉద్యోగం అలాంటిది. నవ్వక తప్పదు కదా. ఒక ఆర్టిఫిషల్ నవ్వు. అయినా బాగుంది. ఆ ఆర్టిఫిషల్ నవ్వు చూశాక అనిపించింది. ఆ అమ్మాయి మనస్పూర్తిగా నవ్వితే ఎంత బాగుంటుంది అని. విశాఖపట్నంలో గాలిమోటరు కిందకి దిగుతున్నప్పుడు ఆ అమ్మాయిని చూడాలి. పక్కన కిటికిలోంచి సముద్రం. ఎదురుగా ఈ పిల్లా. కడలి కెరటాల నవ్వు పిల్ల. అక్కడే ఆగిపోతుంది అనుకున్నా. తరువాత ఫ్లైట్ లో కూడా వచ్చింది. నా ముందు సీట్లో ఒక చిన్నపాప ఉంది. ఈ పిల్ల పసిపాప అయి తనతో కాసేపు ఆడుకుంది. బహుశ ఈ ఒత్తిడిలో తనకు ఉపశమనం దొరికింది కాబోలు. ఆ పిల్ల గురించి బేటూకి చెప్తే, ఏందీ డాడీ పిన్నిని తీసుకువద్దాం అనుకుంటున్నావా? అని నవ్వింది. Naughty girl. కాచిగూడ రైల్వే స్టేషన్లో ఎంత నవ్వుకున్నాం అనుకున్నావు. నువ్వు ఉండాల్సింది. ఎరుపెక్కే నీ బుగ్గలు చూస్తో మరింత నవ్వుకునే వాళ్ళం.  అయినా నువ్వు చాలవు ఈ జీవితానికి. మనది దూరాలను దగ్గర చేసే అచంచలమైన ప్రేమ.

            కలకత్తాలో ఒక పాత మిత్రుడు కలిశాడు. బక్కపలచని దేహం వాడు. ఎంత బాగ పాడతాడో. ఇంకో మిత్రుడ్ని పరిచయం చేశాడు. అతడి పేరు మరచిపోయాను. గజల్, కవ్వాలి ఇంటర్నెట్ లో వినడమే కదా! మొదటిసారి లైవ్ లో వినడం బాగుంది. మార్కెట్ ప్రతి వస్తువును వ్యాపారం ఎట్లా చేస్తుందో తన పాటలో చెప్పాడు. ‘నస్రత్ ఫతే ఆలి ఖాన్’ కవ్వాలి పాడుతున్నట్లు ఉంది ఆ గొంతు. నస్రత్ కూర్చొని పాడతాడు. మనోడు నిలబడే పాడాడు. పాట వింటూ ఒక రకమైన తన్మయత్వంలోకి పోయా. రెండు పాటలు విన్నా, ఫ్లయిట్ టైం అయిందని వచ్చేశా. అవి విన్నాక అనిపించింది. ఇక్కడా ఆర్ట్ ఫార్మ్ ని మార్చుకోవాల్సి ఉందని. గిటార్, జాజ్ లోకి ఇప్పుడే పోలేకపోయిన దక్కన్ గజల్ లో ప్రజా ఉద్యమాల పాటలు ఎందుకు రావట్లేదని. కవ్వాలి ఎంత బాగా ఉంటుంది ఆ ఆర్ట్ ఫార్మ్స్. ఆ రెండు ఇక్కడి ప్రజల్లో భాగమయ్యాయి. ఇప్పుడు చార్మినార్, పాతబస్తీలో తప్ప గజల్, కవ్వాలి ముషాయిరాలు ఎక్కడ కనిపిస్తలేవు. అక్కడ అంతంత మాత్రమే. కొన్నిసార్లు పోదాం అనుకున్నా, వాటిని ఎంజాయ్ చేసే తోడూ లేక పోలేదు. ఒకప్పుడు ఇప్టా, ప్రజానాట్య మండలి, జన నాట్య మండలి గజల్, కవ్వాలీలను రివల్యుషనరైజ్ చేసింది. జన నాట్య మండలి తరువాత ఆ ప్రయోగం ఆగిపోయినట్లు ఉంది. బహుశా గజల్, కవ్వాలిలపై నాకున్న ప్రేమవల్లేమో! దాని మళ్ళి పునరుద్ధరించాల్సిన అవసరం ఉందనిపించింది.

‘తేరి అంఖోకే సివా, ఇస్ దునియా మే రఖా క్యా  హై’ అని నీ కళ్ళలోకి చూస్తూ ఎన్ని వందల, వేల సార్లు పాడుంటాను. ‘హమ్ దేఖేంగే, లాజిమ్ హై హమ్ భీ దేఖేంగే’ అని ఇక్బాల్ బానో పాడిన ఫైజ్ పాటను రోజుకు నాలుగైదు సార్లు ఎంత తన్మయత్వంతో వినేవాళ్ళం. నస్రత్ ‘తుమ్హే దిల్లగి’ అయితే ఎంత పాడుకునే వాళ్ళం. మళ్ళి దాని అర్థం చెప్పుకుంటూ ఎంత నవ్వుకునే వాళ్ళం.

తెలుగులో గజల్ అని చెత్తనంతా ప్రచారం చేశారు. గజల్ తెలియని వాండ్లు తెలుగు గజల్ వింటే గజల్ అంటే ఇదా అనుకునేలా తయారు చేశారు. ఇప్పుడు ఇంక్విలాబి గజల్  రాసేందుకు ఫైజ్ లేడు. మఖ్దుం లేడూ. కానీ వాళ్ళు రాసిన గజల్ బతికే ఉంది. జనాలకు వాటిపై ప్రేమ ఉంది. మనం చెయ్యాల్సిందల్లా వాటిని వెలికితీయడమే. వాళ్ళని కొనసాగించడమే.

ఎందుకో పంచుకోవాలనిపించింది. మనం ఇష్టంగా విన్న గజల్ ని, కవ్వాలిని. నువ్వు లేకుండా చేసిన గగన ప్రయాణాన్ని. జ్ఞాపకాల్ని. అనుభుతూల్ని. అనుభవాల్ని.

‘’నా కళ్ళలో కన్నీటి అలల రంపపు కోత
రాత్రి నీ తలపుల రాకపోకలయందు’’  అని మఖ్దూం మన విరహాన్ని చెప్పేందుకే రాశాడా అనిపించింది.

No comments:

Post a Comment