Friday, May 24, 2019

ప్రేమలేఖ 32



నీకు ఓ లేఖ రాద్దాం అని కూర్చున్న. ఎలా మొదలుపెట్టాలి. ప్రియాతిప్రియమైన పిల్లకి అని రాద్దాం అనుకున్న. కానీ, అది రాసి మరీ చెప్పాలా? నీకు తెలియదూ నాకు నీవెంత ప్రియమైనదానవో.

సాకీ...
నువ్వు లేని కాలమంతా ఒంటరిగా గడుపుతూ, ఓ సహారా కోసం ఎదురుచూస్తూ ఉంటాను. ఇప్పుడు అంతే. నువ్వు పక్కన లేవు. మళ్ళీ ఓ సహారా కావాలి. ఎప్పటిలానే పెక్కుకాలపు మత్తుకు తోడు నీ యాదులే సహారా అయ్యాయి.


ఇప్పుడు ఒక మైదాన యుద్ధ బీభత్స భయం అందరిని వెంటాడుతుంది. ప్రశ్న ఎప్పటిలానే వధించబడుతుంది. పాత ప్రశ్నలు ఇంకా సంకెళ్లనుండి విడివడే అవకాశం 'అచ్చేదిన్'లానే ఉన్నది. అప్పుడే మాట్లాడుకున్నట్లు 'అఖ్లాక్'లు ఇప్పుడు సర్వనామం. ఇంకా ఎన్ని ఘోరకళులను చూడనున్నదో ముందుకాలం. నేర్చుకోవాల్సినవారు చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోనంత కాలం విజయం ఫాసిజానిదే. ఇప్పుడిక హిందూ వేరు, హిందుత్వ వేరు అనే 'కుల'పలుకుల లిబరళ్లకు కాలం చెందింది. రాడికల్ హిందుత్వ, సాఫ్ట్ హిందుత్వ ఐక్యత చూశాక కూడా ఆ మాట అంటే ఏమనాలో కూడా చరిత్ర నిర్ణయిస్తుంది. తెలంగాణ ఇంకా ఆర్యసామాజిక ప్రభావం నుండి బయటపడలేదు. రామానుజాచార్యుల బోధనలనుండీ బయటపడలేదు. రామానుజుడు ఏమి చెప్పాడో లోతుల్లోకి పొదలచుకోలేదు. కానీ, రాష్ట్రాన్ని నడిపిస్తున్న రామానుజుని గురించి మాట్లాడాల్సిందే. ఇక్కడ రాజ్యమేలు వైష్ణవ ఫాసిజం గురించీ మాట్లాడాల్సిందే. ఒక్కమాటలో హిందూ అనే గంపగుత్త అస్తిత్వం కింద వైష్ణవోన్మాదాన్ని కప్పిపెట్టలేను.


కొన్ని దేహాలిప్పుడు
యుద్ధ పిపాసులు
కనిపించినదాన్నల్లా కబళించే
కొత్త జంతువులు

సాటి మనిషినే చంపుకు తినే
'కార్నివోరస్'లు


సాకీ...
జంట కమ్మలో రాసిన
ప్రేమలేఖ సాక్షిగా
పల్ బార్ కే లియే
ఇన్ ఆఖోమే హమ్ ఎక్ జమానే డూండేంగే
న్యాయం వర్ధిల్లు సమాజం కోసం కలిసే పోరాడుదాం
పాశ్ అన్నట్లు 'పోరాటం అవసరమున్నంతవరకు పోరాడుదాం'

రేపటి కల


ఏమైందనిప్పుడు

వాడు భాగహారాలు చేసి విభజించిన చోటే
తీసివేతల్లో పోయినవి పోయాక
మిగిలినవాటిని కూడికలుగా ఓ చోట కూడుదాం
అంకెలుగానో... మనుషులుగానో...

బతుకు బజారైందని బేజారయ్యే బదులు
ఎప్పటిలాగే బజారెంబడి బాటను
పోరు క్షేత్రం చేసుకుందాం
ధర్నాగానో... ర్యాలీగానో...

ద్వేషమే చట్టమై రాజ్యమేలు కాలనా
వేలికోస నుండి ప్రేమవాక్యమొకటి జాలువార్చుదాం
గట్టి వచనంగానో... చిక్కటి కైతగానో...

ప్రశ్నల గొంతుకలకు సంకెళ్లు పడుతున్న చోట
మన గొంతుల్ని పోరాటాలకు అంటుగడుదాం
ధిక్కార పాటగానో... రణ నినాదంగానో...


ఈ క్షణాన దీన్ని ఓడిస్తామనేది
వొఠ్ఠి ఉటోపియన్ కలగావొచ్చు
నా భలీయమైన కోర్కేగావొచ్చు
కానీ, అది ర్రేపటి వాస్తవం

ఈ పూటకి నేనొక్కడినేగావొచ్చు
మాదొక గుంపేగావొచ్చు
రేపటి కాలాన అదే జనసంద్రానికి నాంది

రోడ్డున్నంతవరకు పోరాటముంటుంది
పోరాటమున్నంతవరకు గెలుస్తామనే ఆశా ఉంటుంది

నడుస్తున్న రోడ్డుమీదోట్టు
రేపటి లక్షాన్ని చేరేది
ఈ రోడ్డుమీదుగానే

24/05/2019

రేపటి కల


ఏమైందనిప్పుడు

వాడు భాగహారాలు చేసి విభజించిన చోటే
తీసివేతల్లో పోయినవి పోయాక
మిగిలినవాటిని కూడికలుగా ఓ చోట కూడుదాం
అంకెలుగానో... మనుషులుగానో...

బతుకు బజారైందని బేజారయ్యే బదులు
ఎప్పటిలాగే బజారెంబడి బాటను
పోరు క్షేత్రం చేసుకుందాం
ధర్నాగానో... ర్యాలీగానో...

ద్వేషమే చట్టమై రాజ్యమేలు కాలనా
వేలికోస నుండి ప్రేమవాక్యమొకటి జాలువార్చుదాం
వొట్టి వచనంగానో... చిక్కటి కైతగానో...


ఈ క్షణాన దీన్ని ఓడిస్తామనేది
వొఠ్ఠి ఉటోపియన్ కలగావొచ్చు
నా భలీయమైన కోర్కేగావొచ్చు
కానీ, అది రేపటి వాస్తవం

ఈ పూటకి నేనొక్కడినేగావొచ్చు
మాదొక గుంపేగావొచ్చు
రేపటి కాలాన అదే జనసంద్రంగావొచ్చు

నడుస్తున్న రోడ్డుమీదోట్టు
రేపటి లక్షాన్ని చేరేది
ఈ రోడ్డుమీదుగానే

రోడ్డున్నంతవరకు పోరాటముంటుంది
పోరాటమున్నంతవరకు గెలుస్తామనే ఆశా ఉంటుంది

24/05/2019

Thursday, May 23, 2019

ప్రేమలేఖ 31

ఫ్రీడో...
"పగళ్లకన్నా కొన్ని రాత్రులు సుదీర్ఘంగా ఉంటాయి". ఈ మాటలెవరన్నారో గుర్తుకులేదు. నువ్వు యాదికొచ్చిన రాత్రులందు నిదురపట్టక పట్నాన్ని ఒక చుట్టుచుడితే నాకూ అలానే అనిపించింది. ఈ రాత్రి నీ జ్ఞాపకాలంత సుదీర్ఘమైనదని.

తూర్పూ పశ్చిమలను కలుపు వర్తక దారిని సిల్క్ రూట్ అన్నట్లుగా, బంగ్లాదేశ్ నుండి ఆఫ్ఘనిస్తాన్ వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్డులా, మనం హైదరాబాద్ లో తిరగాడిన రాత్రి రోడ్డుకు ఓ పేరు పెట్టాలి.

రోడ్డు ఓ జ్ఞాపకాల పుట్ట. ఎప్పుడు పోయినా నోస్టాల్జియా. మెడవొంపులో నీ శ్వాసలా ఒంటరి రాత్రులందు మేనిని తాకే గాలి. గుల్ మోహర్ పూల పరిమళం.

నీకు గుర్తుందా! నేనెప్పుడైన నీకో రోజాపూవు కొనిచ్చిన జ్ఞాపకం. ఆరోజు ఈట్ స్ట్రీట్ నుండి బయటకు వచ్చాక 'పొద్దటి నుండి అన్నం తినలేదన్నా' అంటూ వచ్చాడు కదూ ఆ పిల్లవాడు. ఏమైనా తినిపిస్తాం రా అంటే, 'వద్దులే అంటూ రోజాపూలు కొనమన్నాడు.' స్వాభిమానం ఉన్నవాడు అని రెండు పూలు కొనగానే తుర్రుమన్నాడు. ఇవ్వాళా కనపడ్డాడు ఓ పిల్లవాడు అలాగే చేతిలో పూలతో. నువ్వూ, నీ నవ్వు యాదికొచ్చింది.

ఇదిగో ఇలా నీ జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాక ఈ రాత్రి ఎంతకూ కదలనంటుంది. జ్ఞాపకాలూ నన్ను విడవనంటాయి. అందుకేనేమో వదులుకోవాల్సినవాటిని హత్తుకుంటున్నాను. మరచిపోవాల్సినవాటిని స్మృతికి తెచ్చుకుంటూ. పగళ్లకన్నా కొన్ని రాత్రులు సుదీర్ఘమైనవి. మే మాసపు రాత్రిలో గుండె ఉక్కపోస్తూ ఉంది.

Wednesday, May 22, 2019

నగరంలో గ్రీన్ హంట్


ఒకప్పుడు ఇక్కడ చెట్లుండేవి
ఆ చెరువు పక్కనే వాటిపై పక్షులుండేవి
చెట్లకీ, పక్షులకు ప్రణయ గాథలుండేవి
రాత్రి కాగానే వెన్నెల వాటిపై దుప్పటిలా పరచుకునేది

కానీ,
ఇప్పుడో!
నాగరికత నగరంలో గ్రీన్ హంట్ ప్రకటించాక
అక్కడ ఎత్తైన కాంక్రీట్ వృక్షాలు పుట్టుకొచ్చాయి
చెరువు రియల్ ఎస్టేట్ అయింది
గూడెలను వదిలిన ఆదివాసుల్లా
గూడులు విడిచి పక్షులు ఎక్కడికో వలసవెళ్ళాయి
సూర్యుడూ, చంద్రుడు చుట్టమయ్యారు

అక్కడ ప్రణయమిప్పుడు వొఠ్ఠి మారకం
పల్లెను మింగేసిన
నగరమిప్పుడు నాటకరంగం

(బెంగళూరు, హైదరాబాద్ పట్నాలు పల్లెలను కబళించడం చూసి)