Monday, September 10, 2018

అంగారిక



ఎప్పటిలాగే అలసటతో వచ్చి బెడ్ పై నడుం వాల్చింది అంగారిక. ఆలోచనలు తన తలలో సుడులు తిరుగుతున్నాయి. ‘ఆఫీసు ఒత్తిడి ఎలాను ఉండేదే. కానీ ఈ తలపులే, జ్ఞాపకాలే, వెంటాడుతాయి. అవి ఏదో రోడ్డుపై పోతున్నప్పుడు జరిగే పెద్దగా పట్టింపు అవసరం లేని సంఘటనలు కాదు. జీవితంలో భాగమైనవి. అవి ఎద లోతుల్లో నాటుకుపోయిన జ్ఞాపకాల విత్తనాలు. ఇప్పుడవి మొలకలెత్తి, చెట్టయి, మహావృక్షమయి మర్రిచెట్టు ఊడల్లా మదిని చుట్టూ ముట్టాయి.  గుండెను కొమ్మల మధ్యన పట్టి నలిపినట్లు ఉన్నాయి.  మరిచిపోదామనుకున్న, ఏదో ఓ సందర్భమో, సంఘటనో వాణ్ని గుర్తుకు తెస్తున్నది. ఇప్పుడు ఈ ఉక్కపోతకు కారణం వాడే. వాడి జ్ఞాపకాలే.’ ఇప్పుడు అతడి జ్ఞాపకాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుంది అంగారిక. గత రెండు గంటల కాలం నుండి నిదురపట్టక పరుపుపై పొర్లాడుతూ...
            ఈ జ్ఞాపకాల విలుకాడు ఎక్కడ కలిశాడు. వెళ్ళకూడదు అనుకుంటూనే పురాస్మ్రుతుల్లోకి పయనిస్తుంది తాను.
...............................................................
మూడేండ్ల క్రితం ఓ ఫ్రెండ్ సంగీత్ పార్టిలో కలిశాడు.బయటకి  అప్పుడు పెద్దగా మాట్లాడింది ఏమి లేదు. ఏదో హాయ్, బాయ్ అన్న పలకరింపులే. అందరు కలిసి తాగుతుంటే మధ్యలో ఏదో కాల్ వస్తే వెళ్ళిపోయాడు. కాసేపు మాట్లాడి మళ్ళి వచ్చాడు. ఎవరో అన్నారు ‘ఏరా గర్ల్ ఫ్రెండా?’ అని కాదు అని మళ్ళి తాగడంలో మునిగిపోయాడు. మళ్ళి పెళ్ళిలో కలిశాడు. పైకి కనిపించెంతా ముద్దపప్పు ఏం కాదు అనిపించింది. ఎవరో అమ్మాయితో మాట్లాడుతూ బాగానే ఫ్లర్ట్ చేస్తున్నాడు. కాసేపటికి మేము కూరుచున్న దగ్గరికి వచ్చాడు. నా వైపే వస్తుంటే, ఏంటి ఈ అబ్బాయి నాకోసం వస్తున్నాడా! అనుకున్నాను. అంతలోనే నా పక్కనే కూర్చున్న హేమంత నెత్తిమీద ఒకటి మొట్టి ‘ఏం­టే మొన్న సంగీత్ కి రాలేదు?’ అని అరుస్తున్నాడు. వాళ్లనే చూస్తున్న నావైపు వాళ్ళిద్దరూ ఓ చూపు చూసి నవ్వుకున్నారు. ఎందుకో అర్థం కాలేదు. హేమంత దగ్గరికి వచ్చి అతడ్ని పరిచయం చేసింది. వెంటనే అతడో నవ్వు నవ్వి, మా పరిచయాలు మొన్నే అయిపోయాయి అని హేమంత వైపు ఓ చూపు చూశాడు.
పెళ్లి అయిపొయింది. పెళ్లికి సంభందించిన తంతులు అయిపోయాయి. ఓ రోజు ఉదయాన్నే ఫోన్ లో మెసేజ్, ‘హాయ్, ఎలా ఉన్నావు?’ అని. ‘మీరెవరో తెలుసుకోవచ్చా!’ అని రిప్లయ్ ఇచ్చాను.
‘అరే, నేనే, కలుద్దాం అనుకుంటున్నా. నువ్ ఖాళీగానే ఉన్నావా! కలవచ్చా?’
- సరేకలుద్దాం. ఎక్కడా?
‘సాయంత్రం 6గం.లకి, ఈట్ స్ట్రీట్’
- సరే. కలుద్దాం.
.....................
            శరదృతువు వెన్నెల మెల్లిగా మబ్బుల చాటు నుండి వస్తున్నప్పుడు కలిశాడు. పలకరించాడు. ‘అక్కడ వెన్నెల ఆగమనం, ఇక్కడ నీ ఆగమనం రెండు యాదృశ్చికమే. అయినా బాగున్నాయి.’ అంటూ  కళ్ళలోకి కళ్ళుపెట్టినట్లుగా చూశాడు. ‘ఏంటి  ఫ్లర్ట్ చేస్తున్నావా?’ ‘అంత అదృష్టం ఎక్కడుంది తల్లి. ఆల్రేడి బుక్కైపోయా.’ అన్నాడు. ‘ఓహ్, గుడ్. మరి ఆ పిల్లని ఎప్పుడు పరిచయం చేస్తున్నావ్?’ ‘తొందర్లోనే చేస్తాలే. తనిక్కడ ఉండదు. ఊర్లో ఉంటుంది. బహుశ, వచ్చే నెల వస్తుందనుకుంటా! వచ్చాక చేస్తాలే.’ ‘ఎప్పటి నుండి పరిచయం అని అడిగా’ ‘చాల సంవత్సరాలుగా తెలుసు. డిగ్రి చదువుతున్నప్పుడు ప్రపోస్ చేశా. ఒప్పుకుంది.  ఆరు సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్నాం.’ ‘గుడ్, తొందర్లోనే పెళ్లి అనుకుంటా?’ ‘అంత తొందరేం లేదు. ఇంకా కొన్ని సంవత్సరాలు ఆగుదాం అనుకుంటున్నాం.’
అప్పుడు కలిసింది మొదలు, ఈట్ స్ట్రీట్ వారి అడ్డా అయిపొయింది. ఎన్ని సూర్యాస్తమయాలు. ఎన్ని చంద్రోదయాలు. వారి కళ్ళముందు కదిలిపోయాయో.  హుస్సేన్ సాగర్ వీళ్ళకోసమే కట్టినట్లు. ఈట్ స్ట్రీట్ వీళ్ళకోసమే పెట్టినట్లు అనిపించేంతలా వచ్చేవారు. బుద్ధుడి మీద పడే మలిసంధ్య కిరణాలు. వెన్నెల వెలుగు చూస్తూ, ఎంత కవిత్వం జాలువారేదో.  ఒడిసిపట్టుకుంటే  వాళ్ళ మాటలన్నీ, ఎన్ని కవితల పుటలయ్యేవో.
............................
            ‘ఓ రోజు వాడు ఫోన్ చేసి నీకో సర్ప్రైస్ అన్నాడు. ఏంటో అని వాడు చెప్పిన చోటికి వెళ్తే వాడి గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేశాడు. ఆ పిల్ల చాల ముభావంగా, ముక్తసరిగా ఏదో మాట్లాడాలి తప్పదు కాబట్టి మాట్లాడినట్లు అనిపించింది. కొత్త కదా అంతే అనుకున్నా. కానీ ఎప్పుడు కలిసిన ఆ పిల్ల ఒక అనుమానపు చూపు చూసేది.  తరువాత వాళ్ళ లైఫ్ లో వాళ్ళు పడిపోయారు. అడపాదడప కలిస్తే మాట్లాడుకోవటం మినహా, అంతక ముందులా, కవిత్వమై ప్రవహించడాలు. వెన్నెల రాత్రుల్లో రోడ్లపై తిరుగుతూ ఐస్ క్రీం తినడాలు తగ్గిపోయాయి. ఎందుకో వాడు సరిగ్గా మాట్లాడటం తగ్గించాడు. ఓ సారి అడిగితే, ఏం లేదు, కొద్దిగా బిజీ అయిపోయా అన్నాడు.’
            ‘కాలంతో పాటే నడుస్తుంటే అప్పుడు వచ్చాడు విహార్. పేరుకు తగ్గట్టే ఎప్పుడు ఏదో పని మీద విహరిస్తూ ఉంటాడు. ఇద్దరికీ తెలిసిన ఫ్రెండ్, నాకన్నా కాస్తా వాడికే ఎక్కువ తెలుసు. కానీ ఎందుకో చాల తక్కువ కాలంలోనే అత్యంత దగ్గరయ్యాడు. విహార్ వి  నావి భిన్న దృవాలు. అతడేమో ఎప్పుడు గగనతలాన విహరిస్తూ ఉంటాడు. నేనేమో ఆకాశాన్ని చూస్తూ ఉంటాను. కవిత్వం నా జీవితంలో భాగమైంది. విహార్ కేమో అది అర్థమే కాదు అన్నట్లు మొహం పెడతాడు. అయినా విహార్ కళ్ళల్లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది. మాటల్లో ఓ రకమైన మత్తు ఉంది. ఆ మ్యాజిక్, మత్తే విహార్ కి నన్ను దగ్గర చేసింది. ఆ మత్తే మమ్మల్ని ప్రేమలో పడేసింది. మా మాటల్లో రోజుకు ఒకసారైన వాడి ప్రస్తావన వచ్చేది. విహార్ నవ్వి ఊరుకునే వాడు. కొన్ని సార్లు ‘నాకు మీ ఇద్దరినీ చూస్తే అసూయ. ఇంత గొప్పగా ఎట్లా ఉంటారు మీరిద్దరు, నేను అందరిలానే మీరిద్దరు టుగెదర్ అనుకున్నా. బట్ యు ఫోక్స్ ఆర్ మోర్ దెన్ దట్.  మీ ఇద్దరినీ చూస్తే నాకు పాయల్ గుర్తుకు వస్తుంది. స్టుపిడ్ గర్ల్ గొడవ పెట్టుకొని వెళ్ళిపోయింది.’ అని కళ్ళనిండా నీళ్ళు తెచ్చుకునే వాడు.
పాయల్ వాడికి చిన్నప్పటి ఫ్రెండ్. ఇద్దరు ఒకరు విడిచి ఒకరు ఉన్నకాలం చాల తక్కువ. పాయల్ హయ్యేర్ స్టడీస్ కోసం స్టేట్స్ పోతే వీడు ఆమె రాకకోసం చూస్తూ పేషెంట్ అయ్యాడు. అప్పటి నుండి కాస్త దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరు దూరం వెళ్తున్న వీడు శోకసంద్రం అయ్యేవాడు. పరిచయం అయిన కొన్ని రోజులకే నేనో ప్రాజెక్ట్ వర్క్ మీద నాలుగు రోజులు పోతానంటే ఎంత ఏడ్చాడో పిచ్చికన్నా. వీడి ఏడుపు చూడలేక నాలుగు రోజుల ప్రాజెక్ట్ వర్క్ కాస్త ఒకటిన్నర రోజులోనే ముగించుకొని వచ్చేశా. నేను వచ్చానని చెప్పగానే రాత్రంతా పడుకోలేదేమో! ఎర్రబారిన కళ్ళతో, షార్ట్ మీదే వచ్చాడు.
            .............................
ఓ సంవత్సరన్నర కాలం గడిచిపోయాక విహార్ తో అంగారికకు పేచీలు మొదలయ్యాయి. తను మీటింగులు, ప్రాజెక్ట్ వర్క్స్ అంటూ బయటకి పోతూ విహార్ తో సరిగ్గా ఉండటం లేదు అనే కంప్లైంట్స్ మొదలయ్యాయి. ఆమె చిన్ననాటి నుండి స్వేచ్చా జీవి.  తను అనుకున్న పని చేసుకుంటూ పోతుంది. అట్లా అని విహార్ కి సరిగా సమయం కేటాయించదా అంటే అదేమీ లేదు. అంగారిక రాసే కవితలలో భావుకత, లోతు ఎక్కువ. అది విహార్ కి సరిగా అర్థం కాదు. ఇటు విహార్ తో ఘర్షణ, అటు అతడు మాట్లాడట్లేడనే ఘర్షణలో అంగారిక ఉక్కిరిబిక్కిరి అయిపోయేది. ఆ కోపాన్నంత విహార్ పై వెళ్లగక్కేది. .
..............................
ఉదయాన్నే లేవలేనితనపు బలహీనత ఏదో ఒంట్లో. సమయానికి విహార్ కూడా ఊర్లోలేడు. ఇప్పుడు ఎవరిని పిలవాలి అనుకుంటూనే, వాడికి కాల్ చేశా. ‘పది నిమిషాల్లో వస్తున్నా’ అని వచ్చాడు. వస్తూనే తినడానికి బ్రెడ్, పాలు తీసుకువచ్చాడు. మాట్లాడక చాల కాలం అయింది కదా! కాసేపు మౌనం మా మధ్య రాజ్యమేలింది. కాస్త తిని ఇంకా అలసట తగ్గక అట్లే వాడి వొళ్ళో పడిపోయా. తలపై చేయి వేసి దగ్గరగా అదుముకొని, తల నిమురుతున్నాడు. వాడి తలనిమరటంలో అమ్మ చేతివేళ్ళ స్పర్శ ఉంటుంది. కన్నీళ్లు పెడుతున్నప్పుడు ఓదార్చడంలో నాన్న కౌగిలి వెచ్చదనం ఉంటుంది. ఏమైందో తెలియదు. చెంపలపై రెండు కన్నీటి బొట్లు రాలిపడ్డాయి. ‘రేయ్, నాకు జ్వరం వస్తే నువ్వు ఏడుస్తున్నావా?’ అన్నా చాల ఎమోషనల్ అయిపోయి. కళ్ళనిండా నీళ్ళతోనే నవ్వాడు వాడు. ఎన్ని రోజులైంది వీడు నవ్వు చూసి. వీన్ని, వీడి నవ్వు మొఖాన్ని కండ్లనిండా నింపుకొని. ‘రేయ్, ఎందుకు నవ్వుతున్నావ్? అని గట్టిగా అడిగా?’ ‘నీకు జ్వరం వచ్చిందని ఏడుస్తున్నా అంటే నవ్వొచ్చింది.’
‘సరే మరి ఎందుకు ఎద్చావ్?’
 ‘ఏం లేదు, కలవక చాల రోజులైంది కదా! నువ్విలా ఒళ్లో తలపెట్టుకొని పడుకుంటే ఏడుపొచ్చింది, నన్నెంతా మిస్ అయ్యి ఉంటావేమోనని.’
‘అంతేనా? నమ్మొచ్చా?’
‘నమ్మొచ్చే బాబు. అంతే, ఇంకేం లేదు.’
            అయినా వాడి మాటల్లో ఏదో దాస్తున్నట్లు అనిపించింది. వాడే చెప్తాడులే అని ఆగా. కాసేపయ్యాక ఓపెన్ అయ్యాడు.  ‘మయూరితో ఒకసారి మాట్లడరాదు.’ అన్నాడు, నిశ్శబ్దాన్ని బద్దలుకొడుతూ. ‘ఎందుకు, ఏమైనా గొడవైందా?’ అని అడిగా.
‘గోడవంటు ఏమి లేదు. కానీ.’
‘హా, కానీలు, అయితేలు కాదు. ఏం జరిగిందో చెప్పు.’
‘అదే ఏ అమ్మాయితో మాట్లాడినా, చాల పోసేసివ్ గా ఫీల్ అవుతుంది. నా పనుల్లో పడి, తనకు టైం ఇవ్వడం లేదని రోజు కంప్లైంట్స్.’
‘టైం ఇవ్వట్లేదని, విహార్ కూడా కంప్లైంట్స్ చేస్తాడు. దానికే అంత ఏం ఇబ్బంది.’
‘అది కాదు. అంగారిక, షీ థింక్స్ దట్, యు హావ్ ఫీలింగ్స్ ఆన్ మీ.’
‘డోంట్ బి స్టుపిడ్ రా, నేను విహార్ తో రిలేషన్ లో ఉన్నా తనకి తెలుసు కదా! అయిన తను అలా ఎందుకు అనుకుంటుంది.’
‘నీతో మాట్లాడిన ప్రతిసారి ఇద్దరికీ ఏదో ఓ గొడవ, ఇక మన ఇద్దరం బయటకు వెళ్ళాం అని చెప్తే, ఆరోజు రూమ్ లో పెద్ద యుద్ధమే.’
‘ఓహో అందుకేనా! తమరు మాట్లాడటం తగ్గించింది.’
‘అవును.’
‘ఈ మాట ముందే చెప్పి చస్తే నేనే దూరంగా ఉండేదాన్ని కదా!’
‘అదే కదా వచ్చిన బాధ. తనకు మనిద్దరం క్లోజ్ గా ఉంటాం అని తెలుసు. విహార్ చిల్ గా ఉన్నట్లు తను ఉండట్లేడనే బాధ. ఓ సారి తనతో చెప్పొచ్చు కదా!. మన మధ్య అట్లా ఏమి లేదని.’
‘వాడు చివరగా అన్నమాటకు ఏం అనాలో అర్థంకాక మౌనంగా ఉండిపోయా.’ అంతలో వాడే
‘వద్దులే. నువ్వంటే చెప్తావ్. మిగిలిన వాళ్లతో మాట్లాడితే కూడా అలానే అంటే. అంటుంది కూడా. మన బ్యాచ్ తో తిరగడం అందుకే తగ్గించేశా.’
‘కూర్చోబెట్టి చెప్పి చూడక పోయావా!?.’
‘అన్ని అయిపోయాయి. చెప్పినప్పుడు బానే ఉంటది. నేను చాల పోసేసివ్ గా ఉంటున్నా, అట్లా ఉండటం కరెక్ట్ కాదు అనే అంటది. మళ్ళి మళ్ళి అదే రిపీట్ చేస్తుంది. ఏం చేస్తాం.’ సరే నేను వెళ్తా నీ దగ్గరికి వచ్చిన అని తెలిస్తే మళ్ళి ఇంకో గొడవ. ఐయాం లిటరల్లి డైయింగ్ విత్ హర్ పోసేసివ్నెస్. అని చెప్పి వెళ్లి పోయాడు.
...............................................
            పొద్దున్న పెట్టిన మేసేజ్ చూసుకొని కాల్ చేశాడు విహార్. జరిగిందంతా తనతో చెప్తే, ‘ఒకే. లీవ్ ఇట్. వాడు సాల్వ్ చేసుకుంటాడు. నువ్వు ఇంటర్ ఫియర్ అయితే అది ఇంకా పెద్దగా అవుతుంది, వదిలేయ్’ అన్నాడు.  నేను వేరే అబ్బాయిలతో మాట్లాడే విషయంలో ప్రోగ్రెసివ్ గా ఉండే విహార్ ఎందుకు టైం ఇవ్వట్లేదు. మీటింగ్స్ అంటే, ప్రాజెక్ట్ వర్క్స్ అంటే విసుక్కుంటాడు? ఇదో రకమైన ఉక్కపోత. విహార్ ఇట్లే ఉంటే బ్ర్రేక్ అప్ అవ్వడమే మంచిది అనిపించింది అంగారికకి.

            అంగారికకు ఎట్లా ఉంటే నచ్చాదో, అట్లా ఉండడం మొదలుపెట్టాడు విహార్. ఆ విషయమై నిత్యం వాళ్ళిద్దరికీ గోడవలవుతూ ఉండేవి. అయినా విహార్ కి అర్థం చేసుకుంటూ, తనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసేది అంగారిక. అయిన విహార్ లో పెద్ద మార్పులేమీ లేవు. ఓ రోజు విహార్ ని గట్టిగానే అడిగేసింది. ‘ఎందుకు నాకు నచ్చనట్లు బిహేవ్ చేస్తున్నావ్? ఇట్లా పోసేసివ్ గా ఉంటే నాకు నచ్చదని తెలుసుకదా! అయినా అట్లనే ఎందుకు ఉంటున్నావ్? అని. దానికి విహార్ ‘అంగారిక నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు అనే కంప్లైంట్ ఎప్పటికి ఉంటుంది. ఐ  నీడ్ ఫుల్ ఆఫ్ యువర్ అటేన్షన్. చిన్నప్పటి నుండి అట్లానే చాల గారభంగా పెరిగా, నువ్వు పాంపర్డ్ చేస్తావు. కానీ మళ్ళి నీ పని ఉందని పోతావ్. దాన్ని ఈజీగా తీసుకోవడం నాతొ కావట్లేదు. ఐ థింక్ వి షుడ్ బ్రేక్ అప్.’ అని వెళ్ళిపోయాడు. 

            విహార్ అలా చెప్పడాన్ని బాగా ఆలోచించిన అంగారిక, నిత్యం గొడవపడుతూ ఉండడం కంటే ఇలా విడిపోవడమే మంచిది అనుకుంది. ఆ విషయాన్నే విహార్ కి మెసేజ్ చేసింది. అన్ని రిలేషన్స్ లో లాగ బ్రేక్ అప్ కాగానే ఆడిపోసుకోవడాలు, ఆమెను అతడు, అతన్ని ఆమె వారి వారి స్నేహితుల ముందు తిట్టుకోవడాలు లేకుండా వారి వారి జీవితాల్లో తీసుకునే నిర్ణయాలకు మరొకరి సలహాలు తీసుకుంటూ, సంతోష, కన్నీటి సమయాల్ని పంచుకుంటూ విడిపోయిన మంచి స్నేహితుల్లా మిగిలిపోయారు.  
....................................................
విహార్ తో విడిపోయిన తరువాత తన పనుల్లో తాను పడిపోయింది అంగారిక. మయూరి కోసం అతడు అంగారికతో మాట్లాడటం తగ్గించాడు. యే కారణం లేకుండా ఇన్ని రోజులు మాట్లాడకపోతే బాధపడ్డ అంగారిక, ఇప్పుడు కారణం తెలుసు కనుక అతడ్ని అర్థం చేసుకుంది. అయినా తనను ప్రశ్న ఎప్పటికీ వెంటాడుతూనే ఉంది. ‘స్వతంత్ర్యంగా ఉండేందుకు ఇష్టపడే వాడు మయూరి స్వాధీనతను ఎట్లా భరిస్తున్నాడు? అని. అతడు ఎప్పుడైనా మాట్లాడితే అది మయూరితో గోడవపడిన సందర్భమో! లేదా మిత్రులంతా కలిసిన యాదృశ్చిక సందర్భమో అవుతుంది. ‘అయినా మా ఇద్దరిని అట్లా ఎట్లా అనుకుంటుంది తాను? ఇది మయూరి అన్నదని అంగారికను అతడు చెప్పిననాటి నుండి వెన్నాడుతున్న ప్రశ్న. ‘ఇద్దరం చాలా దగ్గరగా ఉంటాం. వాడి స్పర్శలో అమ్మతనపు మాధుర్యం ఉంది. నాన్నతనపు భద్రత ఉంది. వాడు అదే అన్నాడు. వాడిపై కవిత రాశాక. మేమిద్దరం ఒకరిమీద ఒకరం పడి కొట్టుకుంటుంటే చూసి విహార్ ఎంత నవ్వుకునే వాడు. పిల్ల ఏంటి ఇంత అనుమానంతో చంపుతుంది. ‘వాడు మనసారా నవ్వి ఎన్ని రోజులైంది. అతడి తలపులు రాగానే అంగారిక మదిలో సుళ్ళు తిరిగే ఆలోచనలు.

ఎప్పటిలానే సాయంత్రం కలిశాడు అతడు. వారికిష్టమైన ఇష్టమైన ఈట్ స్ట్రీట్ లోనే. అప్పుడు చెప్పాడు. మయూరితో బ్రేక్ అప్ చేసుకున్నా అని. ‘మళ్ళీ ప్యాచ్ అప్ ఎప్పుడు? అని అడిగింది అంగారిక. ‘ఇది ఇక ఎన్నడూ ఏకం కానీ విభజన అన్నాడు.’ అతడు. ‘ఇన్నియేండ్ల సహవాసం కదా! తేరుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఏమైనా అయితే నువ్వు ఉన్నావు కదా! అని అంగారిక ఉన్నదనే భరోసాని ప్రకటిస్తూ.

మళ్ళీ వీళ్లద్దరి జుగల్ బందీ మొదలయింది. స్నేహంలోను విరహం ఉంటుందని అర్థం అయింది. విహార్ తో మాట్లాడుతుంటే అతడి కాల్ వచ్చింది. విహార్ తో మాట్లాడుతున్న ఫోన్ పక్కన పెట్టి, అతడు చేస్తున్న ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడింది అంగారిక. చూస్తే విహార్ ఇంకా లైన్ లో ఉన్నాడు. ‘సారీ, యార్. కాల్ కట్ చెయ్యడం మర్చిపోయా. అన్నది. ‘అంగారిక, యు బోథ్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, వై డోంట్ యు గాయ్స్ హుక్ అప్’అన్నాడు. ఆమాట వినగానే మధ్య కాలంలో ఎన్నడు నవ్వనంతగా నవ్వింది. ‘అంగారిక మీరిద్దరిలో స్పెషల్ బాండ్ ఉంది. మీతో వచ్చిన ప్రాబ్లమ్ అల్లా మీరు దాన్ని గుర్తించరు. జస్ట్ రియలైజ్ ఇట్. అన్నాడు. ‘నువ్వూ మొదలుపెట్టావా మహానుభావా. అని నవ్వి ఉరుకుంది. ఇదే విషయం అతడితో చెప్పి మరోసారి అతడి నవ్వులతో జతకలిసింది.

ఎప్పటిలాగే ఉదయం అతడ్ని కవిత్వమై పలకరించింది. దానికి వెంటనే ‘ఐయాం రియాలైజ్డ్’ అని రిప్లయ్ వచ్చింది. మొదట తాను జోక్ చేస్తున్నాడు అనుకుంది. అడిగితే లేదు సీరియస్ అని రిప్లయ్ వచ్చింది, మార్పు అనివార్యం అని అన్నారెవరో అంటూ. సరే కాస్త టైం కావాలి అంది అంగారిక. ఎవరి పనుల్లో వారు ఉండడం వలన పెద్దగా మాట్లాడుకోలేదు. కొన్ని రోజులకు మళ్ళీ అడిగితే, ‘నో రే, వాస్ జస్ట్ కిడ్డింగ్ అన్నాడు’. రోజు అతడు పంపిన మెసేజ్ కి ‘నేను రియలైజ్ అయిపోయా’ అని రిప్లయ్ ఇచ్చింది అంగారిక. అతడు అడిగితే ‘నీలా కాదు, నేను సీరియస్’ అంది.
  రోజు కలిసినప్పుడు అతడు అడిగాడు. నిజంగా రియలైజ్ అయ్యవా? అని
‘అయ్యాను. అనే చెప్తున్న కదా’
‘ఐ కాంట్ బిలివ్ ఇట్ రే’
Though you have to believe it
‘అవునా. సరే ఆలోచిద్దాంలే.’ అన్నాడు అతడు.

అతడికి దగ్గరగా వెళ్లి, ‘డియర్ నాకు ఇంకా ఎలా వ్యక్తిరించాలో తెలియట్లేదు’ అని ఇంకాస్త దగ్గరగా వెళ్ళింది. అతడు కళ్ళు మూసుకున్నాడు. ఆమె అతడి పెదాల్ని, తన పెదాలతో మూసేసింది. పెదాల కలయికలో రాత్రి గడచిపోయింది. వారి ప్రేమ వ్యక్తికరణకు సాక్షంగా వారిద్దరూ అమితంగా ప్రేమించే వెన్నెల, కిటికీలోంచి వాళ్ళిద్దరి మీద పడుతూ. అతడి నుదిటిపై ముద్దుపెట్టి, ఎదపై తలవాల్చి నిదురపోయింది. ఆమెను బాహువుల్లోకి తీసుకొని అతను పడుకున్నాడు. అతడ్ని చుట్టేసుకుని ఎప్పుడు పడుకున్నా లేని అనుభూతి ఏదో ఇవ్వాళ అతని స్పర్శలో అనుభవిస్తుంది.

ఉదయాన్నే తనకోసం ఓ లేఖ రాసి పంపింది.

నువ్ అడిగావ్ కదూ. మన మధ్య ప్రేమ ఉందని గుర్తిస్తే ఎట్లా ప్రపోస్ చేస్తావని? వెతుకుతుంటే మనకు దగ్గరగా. మన కోసమే రాసినట్టు ఉన్న జాన్ బోవ్ స్కి కవిత ఒకటి దొరికింది.


“అనేకమార్లు గాయపడి/ మళ్ళీ గాయపడేందుకు భయపడుతు/ అప్పుడు ఇప్పుడు ఒకర్ని ఒకరు చూసుకునే/ ఇద్దరు మిత్రులలానే మనం మొదలయ్యాం
మెల్లిగా మనం సుదూరపు నడకలు పంచుకోవడం మొదలెట్టాం
/ అంతేనా...  మన మాటల్లో భావాల్ని పంచుకోవడము/ అంతేనా.... మనిద్దరి మధ్య ఇష్టమూ పెరిగింది/ అప్పుడు, మనిద్దరికీ ఏదో ప్రత్యేక బంధం ఉన్నట్లు తెలుసుకున్నాం.
తీవ్రంగా గాయపడిన హృదయాలుతా మళ్ళీ ప్రేమలో పడుతాయని  అనుకోని ఉండరు/  ఇన్నినాళ్ళు రహస్యంగా కాంక్షించింది
/ ఎవరో ఒకరు కాస్త మనశ్శాంతిని ఇస్తారనే.
లోలోపల కోల్పోయిన ప్రేమను
/ దూర, విశాల ప్రాంతలంతా వెతికిన హృదయం/ ఏదో ఓ నక్షత్రపు తోవలో దొరకదా!/ అని దూర దూరాలు తిరిగిన మనసు.
నా కోరిక తీరే రోజు రానే వచ్చింది
/ నాకు మళ్ళీ ప్రేమ దొరికింది, అది నీవే

ఇంతకన్నా  బాగా ఇంకా ఏం చెప్పగలను. అందుకే దాన్నే అనువాదం చేసి పంపిస్తున్న 

 నిన్ను నీలా ప్రేమించే 
అంగారిక

అంగారిక తన ప్రేమను వ్యక్తికరించింది. తన వ్యక్తికరణను అతడు ఒప్పుకున్నట్లే అనుకుంది. వాళ్లిద్దరు అట్లా ఉన్నారు మరి. రోజు అతడు అంగారిక హృదయం బద్దలయ్యే వార్త తెచ్చాడు. 'మయూరి మళ్ళీ తన జీవితంలోకి వచ్చిందని'. 'మనం ఇంతక ముందులానే ఉందాం' అని. 'నాకు అభ్యంతరం ఏమి లేదు.' 'మయూరి?' అని అడిగింది. 'తాను మారిపోయింది. నీ దగ్గరికి వస్తున్న అంటే, సరే అంది. ఇకమీద పోసేసివ్ గా ఉండను అంది' అన్నాడు. 'సరే, మంచిదే కదా. నేను నార్మల్ అయిపోతాలే' అంది అంగారిక. అనుకోకుండా ఫ్రెండ్స్ తో టూర్ ప్లాన్ చేసుకుంది అంగారిక. అతడ్ని అడిగితే సరే వస్తా అన్నాడు. అందరూ వెళ్లారు. టూర్ బాగానే అయింది. తిరిగి వస్తున్నప్పుడు అతడి మొహంలో ఎదో తేడా. 'ఏమైంది?' అని అడిగింది అంగారిక. 'కొత్తగా ఏముంటుంది, ఎప్పుడు ఉండేదే కదా. టూర్ కి నువ్వు వచ్చావని చెప్తే మళ్ళీ గోడవపడింది.' అన్నాడు. అంతే ఒక్క మాట మాట్లాడలేదు అంగారిక. కానీ తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుంది. ఉదయం ఇద్దరు ఫ్లయిట్ దిగి, అతడు వెళ్తూ అంగారికను తన ఫ్లాట్ దగ్గర దింపేసిపోయాడు. వెళ్లేముందు నవ్వుతూ ఒక హాగ్ ఇచ్చి కార్ దిగింది. వస్తూ ఫ్లయిట్ లో తాను తీసుకున్న నిర్ణయంతో.

ఇంటికి రాగానే అతడికి మెయిల్ చేసింది. 'మీ ఇద్దరికి దూరంగా ఉందాం అని డిసైడ్ అయ్యాను. నావల్ల మీరిద్దరూ గోడవపడటం నాకే గిల్టీగా ఉంది. నేను లేనప్పుడే మీరిద్దరూ సంతోషంగా ఉంటున్నారు. ఎప్పుడైతే మనం కాస్త దగ్గరగా, మనలాగా ఉంటామో మీ ఇద్దరికి గొడవలు. అందుకే నీ నుంచి దూరంగా ఉందామని డిసైడ్ అయ్యా.' అని.

అప్పుడు డైరీలో రాసుకుంది. ‘He Choosed Liberty, I choose pain, his memories and eternal love, which we shared for a while’ అతడు లేడు. కానీ జ్ఞాపకాల్లో, ఎదలో నిండి నాతోనే ఉన్నాడు. He is A Friend, A Comrade, and A Commissar. ‘ఆ రాత్రి ముద్దులకు ఎన్ని పేర్లు పెట్టుకున్నాం. ఎన్ని ఫ్లేవర్స్ ముద్దులు. ఆపిల్, పైనాపిల్ ఫ్లేవర్డ్ వోడ్కా ముద్దులు. ముద్దులో ఉండే ఓ అందమైన అనుభూతిని అనుభవించిన క్షణాలు. అవాజ్యమైన ప్రేమను వ్యక్తికరించిన క్షణాలు ఎంత త్వరగా కరిగిపోయాయి. రెండు నాలుగైన పెదాలు. మళ్ళీ రెండుగానే మిగిలిపోవడం ఎంత విషాదం. ఆ అద్భుతక్షణాలు మళ్ళీ తిరిగిరాని జ్ఞాపకాలుగా మిగిలిపోవడమే మరింత విషాదం.’

ఆ విషాదాన్ని బయటపడేందుకు అంగారిక ఒక యుద్ధమే చేస్తుంది. ఆ యుద్ధంలో ఎందుకో ఎంత పోరాడిన ఓటమే ఎదురవుతుంది. ఆ కొన్ని రోజుల రియలైజేషన్ ను మరిచిపోయి మళ్ళి మామూలు అవ్వాలని ప్రయత్నిస్తూనే ఉంది. అయిన ఎందుకో ‘ఆ కొన్ని రోజులలో జీవితాంతం గుర్తుండే  ప్రేమ దాగుంది.’ అని ఆ జ్ఞాపకాల్లో మునిగిపోతుంది.  కాసేపట్లోనే ఆ జ్ఞాపకాల నుండి బయటకు రావాలి అనుకుంటుంది. మళ్ళి ఆ జ్ఞాపకాల మడుగులో, ఆ జ్ఞాపకాల ఊబిలో కూరుకుపోతుంది. తన జీవితంలో విషాదమల్లా ఎవరికైతే అన్ని విషయాలు చెప్పుకోగలదో అతడి గురించే ఈ ఘర్షణ అంతా. మిగిలిన మనిషి అంటే విహార్ ఒక్కడే. ఇప్పుడు విహార్ కాంటాక్ట్ లో లేడు. మనుషులు అవసరాల కోసమే మాట్లడేంతగా మారిపోయాక, హిప్పోక్రాట్స్ గా మరిపోయాక, ఎవరితో మనసులో మాటలని పంచుకుంటాం. నిజంగాఎదలోని భావాలను పంచుకునే మనుషులు లేకపోవటమే విషాదం.  తనకు ఆ పేరు వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు పెట్టారో గానీ తాను తాను ఆ పేరు చరిత్రలాగే మౌనంగా ఉంటుంది.

అంగారిక పేరు చిత్రంగా అనిపించినా తనలాగే తన పేరుదొక చరిత. చరిత్ర పుటల్లో పితృస్వామ్యాన్ని మౌనంగా ధిక్కరించిన భూమి పుత్రికల కథ. ‘వ్యవసాయం తోలి దశలో భూమి మహిళల చేతిలో ఉండేది. భూమిని తల్లిలాగా భావించిన మాతృస్వామిక వ్యవస్థ, భూమిని నాగలితో దున్నడాన్ని వ్యతిరేకించింది. భూమిని నాగలితో దున్నడాన్ని నిరసిస్తూ మహిళలంతా మౌనంగా ఉపవాస దీక్ష చేసిన రోజు అంగారిక పూర్ణిమ. నాగలితో దున్ని పండించిన పంటను గాక, చెట్టునుండి పండ్లు తెంపుకొని తిని వారి ఉపవాసాన్ని ముగించేవారట.’ అంగారిక తన పేరుకు తగ్గట్టే తన బాధను లోలోపలే దాచుకుంటుంది. కుమిలిపోతుంది. తప్ప ఎవరికీ చెప్పుకోదు. నాగలి పెత్తనాన్ని వాళ్ళు అంగికరించినట్లే, వాడు పోయిన తరువాత మిగిలిన ఖాలితనాన్ని తను అంగికరించిది. పైకి నవ్వుతూనే, కనురెప్పల మాటున, కనుగుడ్లకు ఆవల, పోటేత్తుందుకు సిద్ధంగా ఓ సముద్రాన్ని దాచుకుంది.

వాళ్ళిద్దరి కోసమే అతడికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నా ఆమెను వెంటాడుతున్న ప్రశ్న. 'తనకు నచ్చినట్లు ఉండాలనుకున్నవాడు, ఎట్లా ఇంత పోసేసివ్ అమ్మాయితో ఉంటున్నాడు. వాడు నా దరికి వస్తాడా? రాడా? అనేది ప్రశ్న కానీ కాదు. ప్రశ్నల్లా. వాడు ఎందుకు కాంప్రమైజ్ అయ్యాడనే. యే స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు లేవని బంధనంలో ఉండద్దు అనుకున్నాడో. ఇప్పుడు అవే లేకుండా ఎట్లా ఉంటున్నాడు? అని. ఎవరితో కలిసి మాట్లాడే స్వేచ్ఛ లేకుండా ఎట్లా ఉన్నాడు? అనే. సొసైటల్ స్ట్రక్చర్ ని బద్దలు కొట్టాలి అనుకున్నాడో, అదే స్ట్రక్చర్లో ఎట్లా భాగమయ్యాడు అనే. వాడే అన్నట్లు 'మార్పు అనివార్యం' కాబోలు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల విషయంలో రాజీపడ్డ మనిషిని ఎట్లా క్షమించేది. అమితంగా ప్రేమించాను కదా. అందుకని క్షమించనా?' ప్రశ్నలన్నింటికి ఇప్పటికి సమాధానం లేకుండానే ఉంది అంగారిక. సమాధానం వెతక్కుండా ఉంది. అడిగితే, అతడిని అడగాలి. కానీ అడగదు.