Saturday, April 13, 2019

అయ్యా అంబేడ్కరా

అయ్యా అంబేడ్కరా
మా బత్కు విముక్తి గానమా
మా గుండె గుడిసెకు ఒంటి నిట్ఠాడా

ఎన్నో రాత్రులు నీ చదువులో కాలిపోతేనే కదా
ఈ దేశానికి ఓ రాజ్యాంగం
మా వెలి బతుకులకు కాసింత ఉప్పోస దొరికింది

పెండ్లికి ఆరు కచ్రాలు కట్టుకొని పోతుంటే
అడ్డం తిరిగిన దొరల ముందే
ఏసీ కార్లో కాలు మీద కాలేసుకుపోయే ధైర్నం
నువ్వొచ్చాకే కదా గుడిసె గుండెలదాకా నడిచొచ్చింది

అయ్యా నువ్వే రాకపోతే
మా నాలుక మీద బీజాక్షరాలు
మా చేతుల్లోకి పలకా, బలపం వచ్చేవా

నాలుకమందం గాళ్లని తిట్టిన నోర్లే
మా అడుగు యూనివర్సిటీలో పడినాక వెళ్ళబెట్టింది
నిన్ను మా గుండెల్లోకి ఆవాహన చేసుకున్నాకే

నీ మీద చెప్పులేసారని పుస్తకాల్లో చదువుకొనే
తల్లడమల్లడమైనోల్లం
నేడు నగరంలో నీ విగ్రహ విధ్వంస వార్త విన్నాక
తినే కంచంలో ఎవడో మన్నుబోసినట్లున్నది
పక్కబొక్కలను యే నరసింహుడో చీల్చి
మా గుండెను వాడి గుప్పిట్లోకి తీసుకొని నలిపినట్లున్నది
మనువు మళ్లీ పుట్టి
చెవుల్లోనే కాదు ఒళ్ళంతా సీసం పోసినట్లున్నది

నీ జయంతి సాచ్చిగా
Survival of the fittest బతుకులు
Fistగా మారనున్నాయి
నగరం నిప్పుల కుంపటి మీద
డప్పు దండోరై మోగనున్నాది
ఆరె అడ్డమొచ్చిన ఏ చర్మాన్నైనా
చెప్పు చేయనున్నది

అన్నంలో పడ్డ మన్ను సాచ్చిగా
ఉండబట్టలేక అడుగుతున్న
కడుపు చించుకుంటే
కాళ్ళమీద పడితే పడనియ్ అయ్యా
ఇప్పుడున్నా
జాంబడితో చెన్నడు కలిసొస్తాడా?

Tuesday, April 2, 2019

ప్రేమలేఖ 30


కైసే కైసే లోగ్ హామారే జీ కో జలానే ఆ జాతే హై... అంటూ ఈ పొద్దు మెహదీ హసన్ పాటతో పొడిచింది.  కరిగినపోయిన కాలాలందూ, గడిచిపోయిన సమయాలందూ ఎదను కాల్చిపోయిన ముచ్చట్లన్నీ ఒక్కొక్కటిగా యాదికి రాసాగాయి. ఎన్నో రాత్రులందూ చుప్ కే చుప్ కే ఆసూ బహాయించిన యాదీ. ఇదంతా వొట్టి నీ యాదేనా! యే బే దర్ద్ దునియా కా యాద్ ఆ!. ఏమో తెలియదు అనే అనుకుంటాను. తెలుసుకొని చేసేదాని కన్నా ఇలా సౌ బార్ దొరికిన ఘమ్ బాగుంది. ఈ బాగుండడంలో బాధలేని జీవితమూ ఓ జీవితమేనా రాఅని నువ్ చెప్పిన మాటా జ్ఞాపకమొచ్చింది.

ఏదో ఉప్పోసకు బే దర్ద్ దునియా అన్నాను గానీ, కిత్నా దర్ద్ బర్ గయే రే ఇస్ దునియామే. అక్కడ నీవు. ఇక్కడ నేను. రోజూ చూస్తూనే ఉన్నాం కదా. నెయాజ్ అన్నట్లే వారి వారి బాధల గాథలను చెప్పుకునేందుకు మన దగ్గరకు వస్తారుకదూ. వచ్చిన వారు పోతూ పోతూ మనలో వారి బాధను భాగం చేసే పోతారు. కొన్నిసార్లు వారు ఎదురుపడే సజీవ మనుషులు. మరికొన్నిసార్లు పత్రికల్లో వార్తలు. ఇంకొన్నిసార్లు పుస్తకాల్లో పాత్రలు. అంతా బాధను దాచుకున్న హృదయాలు. హృదయంతో హృదయం పెట్టు ముచ్చట్లు. .

ఈ బాధ ఇదంతా చూస్తుంటే ఎప్పుడో రాయాలనుకుని ఆపేసిన దుఃఖం రాయాలి అనిపిస్తుంది నవ్వొచ్చినప్పుడు ఎంతమందిలో ఉన్నా, యే చోట పగలబడి నవ్వుతాం కదూ. మరి దుఃఖం వస్తే ఎందుకు దిగమింగుతాం. అతడు/ఆమె దుఃఖాన్ని దిగమింగాడు/గింది. దుఃఖాన్ని గొంతులోనే దాచుకున్నారు అని వారిని గొప్పగా చెప్పడం ఎన్ని వందల, వేల సందర్భాల్లో చూసి/విని ఉంటాం. అది నిజంగా గొప్ప విషయమా? వారిని నిస్సహాయ స్థితిలోకి నెట్టడమా!? ఖచ్చితంగా రెండోదే. ఈ పొగడ్తల పేర వాళ్ళ దుఃఖ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వాళ్ళని దూరం చేయడమే.

నీకు గుర్తుందా!
దుఃఖాన్ని 'నాగరిక' మనుషుల మధ్య దిగమింగీ, మనదైన వైయుక్తిక స్థలానా ఎంతగా దుఃఖ పడ్డాం. ఎంతగా పొగిలి పొగిలి ఏడ్చాం. ఎక్కిళ్ళు పడుతూ ఏడ్చాం. Alienation of Man గురించి చాలా చర్చించాడు మార్క్స్. ఈ పెట్టుబడి మనిషిని మనిషికి దూరం చేస్తుంది. ఆమధ్య నగ్నముని 'ఆకాశ దేవర' చదువుతుంటే అదే అనిపించి.

అయితే స్వేచ్ఛను కోరే పోరాటాల్లో తమ హ్యూమన్ ఎమోషన్స్ వ్యక్తపరచే స్వేచ్ఛను లేని మనుషులను చాలా మందిని చూశాను. Human emotions వ్యక్తపరచలేని ఓ నిస్సహాయత సమాజంలో నెలకొని ఉన్నది. కొన్ని emotions వ్యక్తికరణల పట్ల పరువు, పేరు, ధైర్యం గల మనిషి అనే అమూర్త భావన రుద్దబడి ఉన్నది. స్వేచ్చకోసం పోరాడే మనుషులూ తమ ఎమోషన్స్ వ్యక్తికరించే స్వేచ్ఛ లేకుండా బతుకుతున్నారు. స్వేచ్ఛాయుత పోరాటాల్లో ఇదో విషాదం. దీన్ని దాటిన నాడు మాత్రమే మనిషిపై కొందరు రుద్దిన cultural fascism అంతమవుతుంది. మనమనుకునే నూతన మానవావిష్కారం జరుగుతుంది. 

నువ్విపుడు పక్కన లేవు
నీ గురించి ఓ రెండు మాటలు అనుకుంటే 
అబ్ తో లగ్తాహై సబ్ కుచ్ 
తేరా బినా బేకార్ హైఅంటూ 
గులాం అలీ చెవుల్లో మొగుతున్నాడు.

ప్రేమలేఖ 29


నా కనులలోంచి నిదురనెవరో దొంగిలించారు. ఈ రాత్రి నిదురరాని కన్నులతో మేల్కొని ఉన్నాను. ఇది నీకు నే రాసే 'మేల్కొన్న' లేఖా. 'మేల్కొలుపు' లేఖా. ఏమో! రాసే నాకైతే తెలియదు. చదివే నువ్వు చెప్పు. ఇన్ ఆంఖోంకి మస్తీమే అని అభినయించే ఏ రేఖా లేని ఒంటరి రాత్రియందు రాస్తున్న లేఖ ఇది.

వేణన్న అన్నట్లు రోదగాన నిపుణురాలు లతా మంగేష్కర్ 'మేరీ ఆంఖోంసే కోయి నీంద్ లియా జాతా హై' అంటూ పాడిన పాటను నా రాత్రిని నీ యాదిలో గడిపేందుకే అన్నట్లుగా మోహన్ షేర్ చేశాడు. అసలే ఆమె రోదగాన నిపుణురాలు. నువ్వు పక్కనలేని ఒంటరితంలో నేను. ఇది చాలదూ ఈ రాత్రీ నిదురలేకుండా గడిచిపోవడానికి.

ఇప్పుడు ఆ పాటను రాయనా? నిదురరాని రాత్రిని రాయనా? నిదుర దొంగలించబడిన నా కనులను రాయనా? నిదురను రాయనా? ఏమో ఏమి రాయాలో తెలియడం లేదు. కానీ, ఏదో ఒకటి నీకు రాయాలి అనే కోర్కె మాత్రం బలంగా ఉన్నది. ఏమి రాయాలి అని కూర్చొని ఆలోచిస్తున్నపుడు కిటికీలోంచి తాకిన చల్లని గాలి దూరతీరాల నుండి నీ ప్రేమ సందేశాన్ని మోసుకొని వచ్చింది. అంతే నిదురరాని నా కళ్ళలోకి నువ్వొచ్చావ్. ఎప్పటిలాగే విప్పారిన నేత్రాలతో వచ్చావ్. పెదాల మీద చిర్నవ్వుతో వచ్చావ్.
నువ్వట్లా కనుల ముందరకు రాగానే జగ్జిత్ రేంజ్ లో 'తుమ్ కో దేఖా తో యే కయాల్ ఆయా' అని పాడుకోవటం మొదలెట్టాను.

నేడూ నువ్ పక్కన ఉండాలనే 
కోర్కనే కోరింది హృదయం
ఏదో మాయ చేసి మభ్యపెట్టాను

అడిగాయి
నిన్ను నిండా నింపుకోవాలని కనులు
పెక్కుకాలపు మత్తులో వాటిని ముంచేశాను

ఇలా తలపోసుకుంటున్నాను
ఈ తలపుల్నే ఏమీ చేయలేక

ఇంతకు నా నిదురను ఎవరు దొంగలించారో చెప్పలేదు కదూ. వెతికాను. ఆ దొంగ ఎవరో అని వెతికాను. వెతకగా, వెతకగా దూరాల నుండి ప్రేమ సందేశాన్ని పంపిన పిల్ల అని తేలింది. ఆ పిల్లకే ఈ లేఖ.