Thursday, May 31, 2018

అజ్ రాత్ షహార్ కే సాత్

ఈ బుజారం సందెపూట
మొన్నరాని మూలుగతో కల్సీ
మూకుట్లో ఎగిన
ఎద్దు తునకలు

బెంగళూర్ పోవుడు ఐత లేదు గానీ
ఛలో బెంగళూర్ డేస్దేఖెంగే
అరే పారు పారు
ప్యార్ హుహారే తుమ్ పర్
జ్యాదా ముస్కురావో మత్ ప్యారే ముస్కాన్
నజర్ న లగ్ జాయే

చాయ్ కా ప్యాస్ లగ్రే మియా
తో చల్ ఛార్మినార్ కే తరఫ్అంటూ దోస్తు గొంతు

చారెడు చారెడు దోసి
మాకోసమే కట్టిచ్చినవా ఏంది
సూడంగానే దిల్ ఖుష్ ఐతది

..............................................

అరే ఉపర్ దేఖ్ చాంద్
ఏం చుప్పనాతిది భై అది
మబ్బుల్లకి పోవుకుంటా, అచ్చుకుంటా పరశీకాలడ్తది

.......................................................

మౌసమ్ అంటే రంజాన్ దే భాయ్
పేట్ భర్ ఖానా సస్తే మే మిల్తా,
ఓ భీ మస్త్ హాట్కే
గంతే... గంతే...
భాయ్ ఔర్ ఏక్ రోల్...

...............................................

ఆరే రేపు బ్యాంక్ బంద్,
జేబుల  పైసల్ గుడ లెవ్
ఇంకేంది ఏ‌టి‌ఎం ఏడుందో ఎతుకుడే
తిన్నదరిగే దాకా

నీయవ్వ ఈ బాడ్కవ్ అచ్చినకాడికెళ్లి
పైసల్ దొర్కుత లెవ్అంటూ
పైసల్ రాని ఏ‌టి‌ఎం ముంగట
నడివయస్సు నామాల గొణుగు
ఇగ లోపట్కి పోయి సూసుడు అవసరమా
చల్ పీఛేముడ్

..............................................................

కాచిగూడ కాచి వడపోస్తే
కప్పు టీ
ఏం జెప్పినవ్ అలిశెట్టిఅనుకుంటా
మల్లో చాయ్ దూప తీర్సుకొని
ఇంటికి రస్తా పట్టినం.

Sunday, May 27, 2018

పానం సల్లవడ్డది

ఆవును తిన్నంక
దాని గుండెను తిన్నంక
ముడుసు లేని వెలితితోనే
వెన్నుపూసతో జతగూడిన
ఒక్కో ముక్క ముద్దలో కలిసి
గొంతులోకి దిగుతుంటే
ఆకలి ఖాళీ కడుపు నిండి
నిజంగానే పానం సల్లవడ్డది

దొబ్బ, గుండె, కార్జాల కోసం
కొట్లాట జరిగేచోట
పోగు, పోగుకు వాటిని సమానంగా పంచడం
మాకు చియ్యతో పెట్టిన విద్య

ఇక్కడ ఆవును కోసినా రక్తమే
ఆవును తిన్నా రక్తమే
మాంసం తింటున్నందుకు
నెత్తురు పారుతున్న దేశం
దేహాలు మృతదేహాలు అవుతున్న దేశం
ఇది నాగరిక అనాగరిక దేశం

ఎవడ్రా ఇక్కడ
మనుషులంతా సమానం అన్నది
జంతువులంతా సమానం అన్నది
ఒక్కసారి వాడికి
ఈ దేశపు మూర్ఖ చిత్రాన్ని చూపించండి
'All are equal but some are more equal' అన్న
వాస్తవ దృశ్యం ఏమైనా అర్థమవుతుందో చూద్దాం

లేకపోతే వాన్నోసారి
ఇటు పట్టుకరండీ
చూసి తట్టుకుంటానంటే
ఆవును తిన్నందుకు పారిన
అలగా జనాల నెత్తురు చూపిస్తాం

('శివరాత్రి సుధాకర్, విజయ్ సాధు'లతో కలిసి)

పోగు


పొద్దున్నే కాసేపలా బయట
గాలికి తిరిగి
తెల్లని గోడ మలుపు తిరగ్గానే
అప్పుడే కోసిన ఎర్రని మాంసం
పోగును ఎత్తుకుందాం అనుకుంటుండగా 
ఎక్కడో ఓ అనుమానం
'భాయ్ గోష్ భైల్ కా? యా భైన్స్ కా'? అని అడిగా
'గాయ్ కా భాయ్' అని అతడి
నగుమోము సమాధానం
రెండు పోగులెత్తుకొని ఇంటికి పయనం

Saturday, May 26, 2018

ఒకానొక ఉదయం

ఎన్ని ఉదయాలు
సూర్యోదయాన్ని చూడకుండా గడిచిపోయాయి

అయినా నీ మోములోనే
ఎన్ని సూర్య, చంద్రోదయలు చూల్లేదూ...

ఈ ఉదయం ఎంత దుర్మార్గమైనది
నువ్వు పక్కన లేవని గుర్తు చేయడానికి కదూ
నన్ను మేల్కొలిపింది

బతుకు


ఏదో తెలియని ఒంటరితనం
వెన్నాడుతున్నప్పుడు
గ్లాసులో కాసిన్ని మంచు ముక్కలు
వేసుకొని మెడపైకి పోతాను

చల్లగా గాలులు మేనిని తాకుతున్నప్పుడు
నీ వెచ్చని కౌగిలికై వెనక్కి తిరిగి చూస్తాను
నువ్వుండవు
కానీ దూరంగా వెన్నెల
అచ్చంగా ఒంటరి నక్షత్రానికి తోడుగా

Tuesday, May 22, 2018

సరిహద్దులు లేని ప్రేమ



ప్రియా...
నిన్ను ప్రేమించడమంటేనే
నీ విముక్తి కాంక్షను ప్రేమించడం
నేనున్న దేశపు యుద్ధోన్మాద
కాంక్షను ద్వేషించడం

రా ప్రియా రా...
ఈ సరిహద్దుల గోడలు కూలగొట్టి
హద్దులంటూ లేని ప్రపంచాన్ని నిర్మిద్దాం

'యుద్ధమెప్పుడూ పాలకులదే
ప్రేమేన్నడూ ప్రజలదే' అని
మళ్ళీ మళ్ళీ నిరూపిద్దాం

Come on dear,
Tie your heart to mine,
Let us spread love
To defeat this bloody War

కల


సంద్రంలోతు నవ్వు పిల్ల
చూపుల గాలం వేసే కనుల పిల్ల
మళ్ళొసారి రావూ
మబ్బులకు తాళ్ళుకట్టి ఊయలుగుదాం
వెన్నెలకు నిచ్చెనేసి ఆరోహణ చేద్దాం
ఆకాశంలో చుక్కలను కలుపుతూ
ఓ అందమైన ముగ్గుగీద్దాం

అది కుదిరేపని కాదంటావా
అయితే
ఓ వానకాలపు నడిరేయి జాము
వెన్నెల వెలుగులో
చుక్కలను చూస్తూ
ఒక నడక కలిసి నడుద్దాం
కాసేపలా
సంద్రం పక్కన సేద తీరుదాం

మళ్ళీ ఓసారి రా పిల్ల
మరచిపోలేని జ్ఞాపకల్ని మరిన్ని పంచుకుందాం

Friday, May 18, 2018

ప్రేమలేఖ 10


ప్రేమలేఖ రాయమని అడిగిన పిల్ల. ఇవ్వాళ వర్షం పడుతుంటే గుర్తొచ్చావొయ్. ‘వానొచ్చెనమ్మా, వరదొచ్చెనమ్మా’ అన్నాడు గోరేటి. నాకెంటో ఇవ్వాళా ‘వానతో పాటు జ్ఞాపకాలు వస్తున్నాయ్.’ అవును పిల్ల. ఈ వానపై  నా వల్ల నీకు ప్రేమయిందా? నీవల్ల నాకు అయిందా? ఎవరివలన ఎవరికి అయితేనేం! ఇద్దరికీ ప్రేమయింది. వాన పడ్డప్పుడల్లా నువ్వే గుర్తొస్తావ్ పిల్ల. ఎన్ని వాన కథలు చదువుకున్నాం. వర్షపు సాయంకాలల్లో ఎంత కవిత్వమై ప్రవహించాం. మన వాన ముచ్చట్లని రాయాలి పిల్లా. రాస్తే ఓ నవల అవుతుందా? ఏమో అయినా అవుతుంది. ఎంత మాట్లాడుకున్నాం వాన పడుతో ఉంటే. అట్లా ఆ చిరు జల్లులు, ఉదృతం అయ్యేంత వరకు బాల్కనీ నిలబడి చూస్తునో, కుర్చీ వేసుక్కూర్చొని ఛాయ్ తాగుతూనో ఉండిపోలేదూ. 

 ఎంత అందమైన జ్ణాపకాలు పిల్లా. వాన అంటే కేవలం జల్లు కురవడమేనా!  ఆ వెన్నెల మనపై పడడాన్ని వెన్నెల వాన అందామా! వెన్నెల మనపై కురిసిన రాత్రులు కదూ అవి. ఆ వెన్నెల వానలో చలంను మాట్లాడుతో తడిసి ముద్దైపోలేదూ. ఎన్ని రాత్రులు అలా వెన్నెల్లో కవిత్వం చదువుతూ గడపలేదు. ఎప్పుడు నన్నే వినిపించమనకపోతే, నువ్వు బాగా రాస్తావ్ కదా! ఎప్పుడైనా వినిపించావా? అడిగితే మూతి ముడుచుకుంటావ్. లేకపోతే మెడ ఒంపులో తల దాచుకుంటావ్. నీ మూతి విరుపులో ఓ గమ్మత్తు ఉంది. అట్లా కట్టిపడేస్తుంది ఆ సమ్మోహన దృశ్యం. వసంతంలో సుభద్ర చూపు. గాలం చూపు అంటాడు కదూ మన వసంతం. చూపుల గాలం విసిరే ఓ పిల్ల. ఆ గాలానికి చిక్కిన చేపపిల్లలా  ఎంత విలవిలలాడుతానో ఎనాడైన ఆలోచించావా. 

 ఇవ్వాళ వానలో చిక్కుబడినప్పుడు నన్ను మదిని తొలిచిన జ్ఞాపకాలు ఇవి. 

 వాన కురిసింది. వాన వెలిసింది. నగరం మునిగింది. నగరం ఇప్పుడు నడుస్తున్న సంద్రం. నగరంలో సముద్రం లేదని  అనుకునే వాళ్ళం కదూ. నగరంలో సంద్రం ప్రవహిస్తుంది. ఆ ప్రవాహంలో పడి వచ్చాను. ఓ వెన్నెల రాత్రి కథ చెప్పుకున్నాం గుర్తుందా! ఎగిరేసిన పావురాయి కథ. దాని ఇష్టానికి అది దేశం మీద పడి తిరిగి రాత్రవగానే గూటికి చేరుకున్న కథ. ఇవ్వాళ నగరంలో ప్రవహిస్తున్న నీళ్ళను చూస్తుంటే ఆ కథ గుర్తొచ్చింది. అయితే ఇక్కడ నీళ్ళు పావురాయి. అవి వాటి గూటికి పోదాం అనుకుంటే అక్కడ వాటి గూడు లేదు. నగర విస్తరణ కాంక్ష దాని గూటిని ఆక్రమించి అపార్ట్మెంట్ అయింది. రోడ్డయింది. దానికి ఎక్కడికి పోవాలో తెలియక ఆ ఆపార్ట్మెంట్ ముందు, రోడ్డుమీద నిరాహారదీక్షకు దిగింది. అనేక పావురాళ్ల దీక్ష శిబిరాలను దాటుకుంటూ నా గూటికి చేరుకున్నాను. వాటికి మౌనంగా సంఘీభావం ప్రకటించటం తప్ప ఇంకా ఏమి చేయలేక. 

 నగరంలో వాన కురిస్తే పడ్డ నీళ్ళు ఇపుడు మనలాగే నిర్వాసితులు. మనం వలస పోగలం. అవి పోవు. అడ్డందాగా ముంచేస్తాయి. మనిషికి ప్రకృతికి తేడా అది. మనిషి ప్రకృతిని ప్రేమించడం మానేసి ద్వంసం చేయడం మొదలుపెట్టాడు. నగరంలో పడ్డ మనిషి మట్టి వాసన కోల్పోయాడు. దాంతోనే ప్రేమను. 

 వాన కురిసి వెలిసిన నగరాన్ని, భాగమతి, కుతుబ్ షా లా ప్రేమ చిహ్నాన్ని చూస్తే పై మాటలు రాయాలి అనిపించింది. ప్రేమ లేని నగర విస్తరణ కాంక్ష మీద కోపం వచ్చింది. అలసిపోయిన నువ్వు ఒల్లో సేదతీరినట్లు, మెడవొంపులో తలవాల్చినట్లు, లేదా నన్ను ఓదార్చినట్లు ప్రేమగా ఈ నగరాన్ని చూసుకుంటే, ప్రేమకు గుర్తుగా కట్టబడిన నగరం ఇంకెంత ప్రేమను కొసరి కొసరి వడ్డించేదో అనిపించిది. అట్లా అనిపించడం తప్పు కాదనుకుంటాను. అది మన ప్రేమంత అందమైనదనుకుంటాను.

 ప్రేమ క్షణాలు – జ్ఞాపకాలు యుగాలు. నగరం నాకిచ్చినవి. మనకిచ్చినవి. నిజంగా యుగయుగాలు గడచిన మరచిపోని జ్ఞాపకాలు. వాన మోసుకచ్చిన జ్ఞాపకాలు.

Tuesday, May 8, 2018

She Creats



Loneliness is curse, he said
No, it's a privilege, she replied

A village in a poem
City in a story
Utopia in a novel
I create, to Solace the solitude in solitary
She added

He agreed
They hugged

He never asks, Why solitary?
Nor she shared.

Sunday, May 6, 2018

Perhaps, Last letter

ఉమ్మడి అనుభవం ఒకరికి అందమైన జ్ఞాపకంగా, మరొకరికి మరచిపోదగినదిగా అనిపించడం నిజంగా ఎంత విషాదం. No more regrets on this అన్న నువ్వేనా ఆ మాట అన్నది. ఒక్కసారిగా నువ్ చదవకుండా ఇచ్చేసిన Tale of two cities కళ్లముందు కదలాడింది. అందులో మొదటి వాక్యాలు ఎన్నిసార్లు చెప్పాను నీకు. కేవలం ఆ వాక్యాలు చదివించడం కోసమే ఆ పుస్తకం ఇచ్చాను. Really 'that was the best of the times' what I thought. but, 'that was the worst of times' you said... 'That was age of wisdom' i thought again positively but, 'that was the age of foolishness' you replied... ఇంకా చెప్పడానికి, రాయడానికి యేముంది. గడచిన కాలమంతా ఇప్పుడు కన్నీళ్ళయి కరిగిపోతుంది.

ప్రేమలేఖ 9


ప్రేమలేఖ 9

భరించలేని తలపోటు అనబడు మైగ్రేన్ ఒక ఆట ఆడుకున్నాక నిద్రపట్టక అటు ఇటు పొర్లుతూ అలాగే పడుకుండి పోయా. కన్నంటుతుండగా ఎందుకో జ్ఞాపకం వచ్చావ్. హత్తుకుందాం అని చేయి చాస్తే తాకిన గోడ నువ్వు పక్కనలేవనే వాస్తవాన్ని చెప్పింది. ఆ జ్ఞాపకాల నదిలో కాసేపు తండ్లాడి, ఇక నిద్రపట్టేలా లేదని అర్థమయ్యి గాలికి తిరుగుదామని బయటకి వెళ్ళా. ఇందిరా పార్కు దాటాక కానీ చూసుకోలేదు బండిలో పెట్రోల్ ఉందో? లేదో? లకడికాపూల్ పోతే బ్యాంకులు బంద్. మళ్ళీ మన పెట్రోల్ బంక్ కి పోయా. అక్కడ రెగ్యులర్ గా పెట్రోల్ పొసే పిలగాడే ఉన్నాడు. గుర్తుపట్టినట్టున్నాడు. 'ఏం సార్, ఒక్కరే వచ్చిండ్లు. మేడమ్ రాలేదా?' అని అడిగాడు. 'లేదు, దేశం పోయింది' అని చెప్పి వచ్చేశా. కాస్త ముందుకు వచ్చి ట్యాంక్ బండ్ ఎక్కగానే చల్లగా తాకిన గాలి. తనతోపాటే జ్ఞాపకల్ని మోసుకువచ్చింది. ఒకప్పుడు రాత్రీ జనాలతో కలకళలాడిన ట్యాంక్ బండ్ రోడ్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. అక్కడక్కడా పుట్టినరోజులు జరుపుకునే జనాలు. మొఖాలకు కేకులు పూసుకుంటూ ఆడుకుంటున్నారు. ఆ చివరి వరకు పోయి ఎలెక్షన్ కమిషన్ ఆఫీసు దగ్గర నుండి నెక్లెస్ రోడ్ వైపు పోదాం అని బండి తిప్పిన. ఆ ములమీద కేఫ్ చూడగానే మళ్ళీ కొన్ని జ్ఞాపకాలు. ఎంత కాలం ఆ కేఫ్ ముందు టీ కప్పుల్లో కరిగిపోయిందో కదా!.

రోడ్డుపై రాలిపడిన పూలను చూసి 'బాగున్నాయ్ కదా' అన్నాను. వెనకనుండి నీ సమాధానం రాకపోతే అర్థం అయింది. నువ్వు లేకుండా ఒక్కడినే పోతున్నా అని. అట్లా అనుకుంటుండగా ఎదురుగా ఓ జంట యు టర్న్ చేసుకుంటూ. ఆ పిల్ల బండి నేర్చుకుంటున్నట్టుంది. వెనుకాల ఉన్న పిలగాడు ఆ అమ్మాయి చేతులు పట్టుకొని జాగ్రత్తగా చూస్తున్నాడు. ఇంకాస్త ముందుకు పోగానే వెనకనుండి ఓ బైక్ ఓవర్ టేక్ చేసింది. మళ్ళీ ఇంకో జంట. వెనుకాల కూర్చున్న అమ్మాయి ఓ చూపు చూసి ఒక వీయర్డ్ లుక్ ఇచ్చింది. 'ఇంత మంచి రొమాంటిక్ వాతావరణంలో ఒక్కడివే పోతున్నావేంట్రా పిచ్చోడా' అన్నట్లు. ఏం చేస్తాం. వెనుకాల నువ్వు లేకున్నా, నీ జ్ఞాపకాలతో పయనిస్తున్న అని ఆ పిల్ల చూపుకు జవాబివ్వలేను కదా. లెఫ్ట్ సైడ్ ఈట్ స్ట్రీట్. ఆ పక్కనే బుద్ధుడు. మొన్న ఆ మధ్య ఎవరో బుద్ధుడి విగ్రహం గురించి మాట్లాడితే హుస్సేన్ సాగర్ లో బుద్ధుడు అనకుండా ఈట్ స్ట్రీట్ పక్కన బుద్ధుడు అన్నా. నీతో ఆ ఈట్ స్ట్రీట్ లో గడిపి గడిపి, సూర్యాస్తమయాలు, చంద్రోదయలు చూసి చూసి, హుస్సేన్ సాగర్ బుద్ధుడు కాస్త ఈట్ స్ట్రీట్ బుద్ధుడయ్యాడు నాకు.

చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం, పొద్దున కావాలన్న దొరకది అని అలా ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ దింపి రాజ్ భవన్ రోడ్డులోకి పోనిచ్చా. ఆ రోడ్డులో కాస్త పోగానే గుల్ మెహర్ పూల గాలి. ఎన్నిసార్లు ఆ పువ్వులను చూస్తూ ఆ రోడ్డులో పోలేదు. గుర్తుందా రోడ్డుమీద పడ్డ గుల్ మెహర్ పుష్పాలను కార్లు తొక్కుతూ పోతుంటే ఎంత బాధ పడ్డావ్ ఆరోజు. మన ఇంట్లో ఓ చెట్టు పెట్టుకుందాం అన్లేదు. ఈ జ్ఞాపకాల సుడిగుండంలో ఓ ఘర్షణ. ఎట్లాగూ నువ్వు వస్తావ్. వస్తావు కదూ!. అయినా ఎందుకో ఘర్షణ. ఘర్షణ ఐక్యత కోసమే కదా. అవి రెండు పెనవేసుకున్నదే జీవితం అని రాసుకోలేదు.

బేగంపేట్ దాటి ముందుకు పోతుంటే రోడ్డు పక్కన ఓ జంట కారుదిగి నిల్చున్నారు. ఎందుకో ఓ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చూసిన ఆ దృశ్యం ఒక గొప్ప సినిమాటోగ్రఫిక్ అనిపించింది. 'తల పైకిత్తి తాను. ఆమె వెంట్రుకలను మునివేళ్ళతో నిమురుతూ అతను. అతడి కళ్ళలోకి ఆమె చూస్తున్న చూపులో నా మొహాన్ని ముద్దుల్లో ముంచెయ్యవు అన్న కాంక్ష.' ఆ దృశ్యం అట్లా ఉండిపోయింది. ఆ పిల్ల చూసిన చూపులో నే వెళ్లిపోతున్నప్పుడు నువ్వు కండ్లనిండా నింపుకునే దృశ్యమే కనపడ్డది. ఎంత ముద్దొస్తావ్ అప్పుడు. ఎన్ని ముద్దులిచ్చాను ఆ కనులకు. ఆ పివిఆర్ లోనో, జీవికేలోనో సినిమా చూసి వస్తుంటే వెనకనుండి నువ్వు అద్దంలో నా ప్రతిబింబాన్నిఎంత ఆర్తిగా చూసేదానివో జ్ఞప్తికి వచ్చింది. ఇంటికి పోతుంటే జూబ్లీ ఫ్లై ఓవర్ దగ్గర ఎన్నిసార్లు దింపలేదు. అక్కడికి రాగానే ఎందుకో మళ్ళీ ట్యాంక్ బండ్ పోవాలనిపించింది. ట్యాంక్ బండ్ ని ఇంకో చుట్టేసి గాని ఫ్లాట్ కి రాలేదు.

ఇవ్వాలెందుకో వెన్నెల రాలేదు. ఏమైందో! ఏమో! ఇటు నువ్వు, అటు వెన్నెల లేక విద్యుత్ దీపాల నా ఒంటరి ప్రయాణం. వచ్చాకా నిద్ర పట్టక ఈ రాత్రి జ్ఞాపకల్ని, అనుభవాల్ని, అనుభూతుల్ని ఇదిగో ఇలా రాస్తున్న.