Sunday, May 27, 2018

పానం సల్లవడ్డది

ఆవును తిన్నంక
దాని గుండెను తిన్నంక
ముడుసు లేని వెలితితోనే
వెన్నుపూసతో జతగూడిన
ఒక్కో ముక్క ముద్దలో కలిసి
గొంతులోకి దిగుతుంటే
ఆకలి ఖాళీ కడుపు నిండి
నిజంగానే పానం సల్లవడ్డది

దొబ్బ, గుండె, కార్జాల కోసం
కొట్లాట జరిగేచోట
పోగు, పోగుకు వాటిని సమానంగా పంచడం
మాకు చియ్యతో పెట్టిన విద్య

ఇక్కడ ఆవును కోసినా రక్తమే
ఆవును తిన్నా రక్తమే
మాంసం తింటున్నందుకు
నెత్తురు పారుతున్న దేశం
దేహాలు మృతదేహాలు అవుతున్న దేశం
ఇది నాగరిక అనాగరిక దేశం

ఎవడ్రా ఇక్కడ
మనుషులంతా సమానం అన్నది
జంతువులంతా సమానం అన్నది
ఒక్కసారి వాడికి
ఈ దేశపు మూర్ఖ చిత్రాన్ని చూపించండి
'All are equal but some are more equal' అన్న
వాస్తవ దృశ్యం ఏమైనా అర్థమవుతుందో చూద్దాం

లేకపోతే వాన్నోసారి
ఇటు పట్టుకరండీ
చూసి తట్టుకుంటానంటే
ఆవును తిన్నందుకు పారిన
అలగా జనాల నెత్తురు చూపిస్తాం

('శివరాత్రి సుధాకర్, విజయ్ సాధు'లతో కలిసి)

No comments:

Post a Comment