Tuesday, November 27, 2018

సాకీ

నువ్ పెదాల మీద మత్తును మోసుకువస్తున్నా
నా చూపేందుకో నువ్ గుప్పిట పట్టుకొచ్చే సీసా పైనే

సాకీ
సురా ఏరులై పారిన నేలలో
నేడు మధువుగ్రోలడం నిషేదం కదూ

ఎప్పటిలానే
తడిఅధర తీర్థమివ్వు
మత్తు దుఃఖపు మాటలలో
నన్ను నాలా బత్కనివ్వు

సాకీ
ఈ చలిరాత్రి
అలసి సొలసి దరికి వచ్చా
నీది ఒంటిని దుప్పటిగా కప్పు

సాకీ

కొన్ని అమూర్త కలలు
గడిచిపోయిన కాలాలు

మాటల్లో కొవ్వత్తై
కరిగిపోయిన రోజులు

ఎప్పుడూ ఫిజికల్ యేనా
అప్పుడప్పుడు మెంటల్ ఆర్గాజం

ఒకే ఊరు
రెండు చివర్లు

ప్రేమ
ఒక షార్ట్ టర్మ్ క్రాష్ కోర్స్

సాకీ
మళ్ళీ ఓసారి అదే మధువు పొయ్యవూ
సాకీ
చివరకు నన్ను నాదైన చోటులో ఉండనివ్వవూ*
అంటూ ఓ జఖ్మీ దిల్

*ఇక్బాల్ 'లా ఫిర్ ఎక్ బార్ ఒహి' గీతం మొదటి పంక్తులు

Saturday, November 24, 2018

ప్రేమలేఖ 21

ఓయ్ అమ్మాయి.
నువ్ సుదూర తీరం నుండి పంపిన ముద్దులను గాలి ఇప్పుడే మోసుకొని వచ్చింది. ముద్దులతో పాటు నీ నవ్వుల్ని మోసుకొని వస్తున్న అని చెప్పేందుకేమో హోరుగా శబ్దం చేస్తూ మేనిని తాకింది. బాల్కనీలోకి వచ్చి చూస్తును కదా! వెన్నెల నన్నే తదేకంగా చూస్తూన్నట్టుగా అనిపించింది. అచ్చంగా నువ్ స్కైప్ లో చూసినట్లుగా ఉంటేనూ నీ చూపులను ఏమైనా ఈ రాత్రికి వెన్నెలకి అరువిచ్చావా!? అనే అనుమానం కలిగింది. నీ ప్రేమను మూటగట్టి పంపినట్టుగా లేవు. వర్షించే మబ్బుల ఆనవాళ్లు లేవు. ఒకేసారి అన్ని పంపితే ఎక్కడ తడిసి ముద్దవుతానేమో అని భయపడినట్లు ఉన్నావ్. ఇదిగో ఈ పక్క ఇంకా నీవు లేక వెలవెల పోతున్నది. నా ఎదను నీ తలగడగా చేసిపెట్టాను. త్వరగా వచ్చెయ్.

బోలెడంత ప్రేమతో
నీ నేను

Wednesday, November 21, 2018

ప్రేమలేఖ 20


ఓయ్ పిల్లా. ఇవ్వాళ మన ఫైజ్ పుట్టిన రోజు అట. ఎంత కాలాన్ని ఇక్బాల్ బానో గొంతులో ‘హమ్ దేఖెంగే’ వింటూ కాలబెట్టి ఉంటాం. ‘ముజ్ సే పెహ్ లిసి మొహబ్బత్ మేరే మహబూబ్ నా మాంగ్’ అంటూ ఎన్నిసార్లు కలిసి చదువుకున్నాం. నూర్జహాన్ గొంతులో ఎన్నిసార్లు విన్నాం. ‘తేరి అఖోంకా సివా దునియామే రఖా క్యా హే’ నీ కళ్లలోకి చూస్తూ ఎన్ని సార్లు చెప్పుంటాను. ‘ముజ్ సే పెహ్ లిసి మొహబ్బత్’ ఓ పిల్లకు చెబితే ‘మొహబ్బత్ కె సివా కోయి దుఖ్ నహి రహతే జానేమన్’ అని వెళ్లిపోయింది. మొన్న ఉర్దు కవిత్వం వింటుంటే సురేఖ సిక్రి recite చేసిన ఇదే కవిత కనిపించింది. ఎంత బాగా చదివిందో. చివర్లో కళ్ళనిండా నీళ్ళతో ముగించింది. నాకూ కళ్ళు చెమర్చాయి. ఈ కవిత చుట్టూతనే ఎన్ని జ్ఞాపకాలు అల్లుకున్నాం.

‘అల’మీద కవిత్వం రాస్తుంటే ‘హమ్ పర్ తుమ్హారా చాయ్ కా ఇల్జామ్ హీ తో హై, దష్నం తో నహి ఇక్రామ్ హీ తో హై’ అని జనాలకి సమాధానం చెప్పింది ఇదే ఫైజ్ కదూ. దానికి చెబితే ఎంత నవ్వుకుందో. నీకు చెబితే జనాల గురించి మీకేందుకురా అన్నావ్. 


పిల్లా ‘ఔర్ క్యా దేఖ్నే కొ బాకీ హై
ఆప్ సే దిల్ లాగా కె దేఖ్ లియా’ నిజమే కదూ ఇంకా చూడడానికి ఏమి మిగిలున్నది. నీతో గుండె కలిపి చూశాక. (మీరు అని అనను కదా). 

తెలంగాణ ‘కల’ అర్థ సాకారం అయ్యాక, నడుస్తున్న కాలాన్ని చెప్పడానికి మళ్ళీ ఫైజ్ యే కావాల్సి వచ్చింది. ఓ సారి ఇది చూడు. 
“యే దాగ్ దాగ్ ఉజాలా, యే షబ్ గజీదా సహర్
వో ఇంతిజార్ థా జిస్ కా, యే వో సహర్ తో నహీం
యే వో సహర్ తో నహీం, జిస్కా ఆర్జూ లేకర్
చలే థే యార్ కే మిల్ జాయేగీ కహీం న కహీం”

(ఈ మచ్చల మచ్చల వెలుగు, రాత్రి కాటు వేసిన ఉదయం
దేనికోసం ఎదురు చూసామో! ఇది కాదు ఆ ఉదయం.
కానే కాదు ఇది ఆ ఉదయం, దేన్ని కాంక్షిస్తూ...
దేన్ని కలవాలని దోస్తులు బయలుదేరారో... అది ఈ ఉదయం కానేకాదు) 

అచ్చంగా ఇది ఫైజ్ అనుభవమేనా? కానే కాదేమో! స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల కోసం పొరాడి ఓడిన వారందరి గాథ. మొదటిసారి సుధా భరద్వాజ్ ని హిమాయత్ నగర్ తాజ్ మహల్ హోటల్ లో కలిసినప్పుడు తన ఛత్తీస్ ఘడ్ అనుభవం చెప్పింది. దామోదర్ తూరే తన ఝార్ఖండ్ అనుభవం చెప్పాడు. ఇది మా ఉమ్మడి అనుభవం కదూ. రేపు వచ్చే విధర్భ, గూర్ఖాలాండ్, బుందేల్ ఖండ్ కూడా ఇవే అనుభవాలు రాసుకోవాలేమో! అయినా విభజనలో అటు పోయిన ఫైజ్ గుండెను కలిపింది ఇక్కడి మన మఖ్దూం తోనే కదా. లేకపోతే “ఆప్ కి యాద్ రహి రాత్ భర్/ చాందిని దిల్ దుఖాతి రహి రాత్ భర్” (రాత్రంతా నీ జ్ఞాపకాలు వస్తూనే ఉన్నాయ్/ వెన్నెల హృదయం రాత్రంతా రోదిస్తూనే ఉంది) అని ఎట్లా రాయగలిగాడు. ఎంత విషాదం ఇది. ‘అధికార మార్పిడి’ అని బ్రిటిష్ అధికార పత్రాలే రాశాక, ఇంకా దీన్ని స్వాతంత్ర్యం అని భ్రమపెడుతూ పాలకులు, భ్రమిస్తూ ప్రజలు. ఇది ‘స్వాతంత్ర్యం కానీ కాదు అన్నవాళ్లేమో జైల్లో. ‘ఐసీ తైసి డెమోక్రసీ’ వాళ్ళు రాసినట్లు ‘డెమోక్రసీ సడ్ రహి హి జైలోమే’.

స్వేచ్ఛా, స్వాతంత్ర్యల కోసం పోరాడేందుకు ‘బోల్ కె లబ్ ఆజాద్ హై తెరే’ అంటూ మనకు ఓ నినాదం ఇచ్చిందీ ఫైజే. ఇప్పుడు గొంతు చించుకుని మరి చెప్పాలి. “మాట్లాడు నీకున్న స్వల్ప సమయం సరిపోతుంది/ గొంతు మూగ పోకముందే శరీరం మృతి చెందకముందే /మాట్లాడు ఇప్పటికీ సజీవమయిన సత్యం కోసం /మాట్లాడు మిత్రమా మాట్లాడు చెపాల్సినదంతా చెప్పేయి” (ఇది ఫైజ్ కవితకు వారాల ఆనంద్ అనువాదం. బాగా చేశాడు కదా)


ఎంతగా ‘హం అప్నే దిల్ కీ ధడ్కన్ కో తేరీ ఆవాజ్ పా సమఝే’ (నా గుండె చప్పుడును నీ అడుగుల అలికిడి అనుకున్నాను) అని నేనూ భావించినా ప్రియా ‘ఔర్ భీ దుఖ్ హై జమానే మే మొహబ్బత్ కె సివా /రాహతే ఔర్ భీ హై వస్ల్ కి రహత్ కె సివా’ (ప్రేమయే కాదు లోకాన బాధలింకా ఉన్నాయి/ శరీర కలయికే కాదు ఓదార్పులెన్నో మనకున్నాయి) ఇవాల్టికి ఇంతే. మళ్ళీ ఇంకో లేఖతో పలకరించే వరకు వేచి చూడు. ఇంతేహా హోగాయి ఇంతేజార్ కి.

Tuesday, November 20, 2018

సాకీ


నెత్తిమీద గండ దీపం
నడకా, నృత్యమా
రెండు కలగలిపిన రూపమా


ఎన్ని రాత్రుళ్ళు
కాలబడి ఉంటాయి


ఇంతకీ నాకేమవుతావ్ నువ్వు
ఏమో!
నాకు అర్థం కాదు
నువ్వూ చెప్పవు
జనం మాత్రం చెవులు కొరుక్కుంటూ ఉంటారు

అయినా ఎవరేమనుకుంటే మనకేం


ఓ నిశీధిలో
కాలువ గట్టున
మబ్బుల మాటున ఎన్నెలను చూస్తూ
నీ కళ్ళలోంచి కారిన
కన్నీటిబొట్ల సాక్షిగా
నువ్ నా గుండె సఖివి


సాకీ
రాత్రి నువ్ మిగిల్చిన
మధుపాత్రలోని నాలుగు చుక్కలు
నా నాలుక మీద సాకబొయ్యి

Monday, November 19, 2018

ముసాఫిర్





"హం లడేంగే సాథీ, ఉదాస్ మౌసమ్ కె ఖిలాఫ్ʹʹ అంటూ గొంతులోనే ఉదాస్ పలికిస్తో పోతున్నాడు ఓ మనిషి. పిలిచి ఏంటి బాటసారి అంటే నేను ముసాఫిర్ అని ముందుకు పోయాడు. మనకు ముసాఫిర్, బాటసారి రెండు ఒకటే. కానీ అతడికి కాదు. అతడి ఎదను తట్టి లేపేది ముసాఫిర్ అనే పిలుపే. అతడే ముసాఫిరా? అది అతడి పేరా? ఏమో అతడు మాత్రం అట్లా పిలిస్తేనే పలుకుతాడు.

***

ఒక నడక అతడి వెనకాల నడుస్తుంటే ఏమో అర్థం కానీ పదాలు వల్లే వేస్తూ పోతుంటాడు. నడుస్తూ, నడుస్తూ ఏదో దృశ్యాన్ని చూసి గున్ గునాయిస్తాడు. "ఇస్ దునియామే గమ్, నఫ్రత్ ఫైల్ గయే, ఔర్ ఇన్సాన్ కి జిందగిమే గుస్తాక్ʹʹ
***

ఎన్ని వందల సార్లు రోడ్డుమీద చూసి ఉంటానూ. ఎప్పుడు నిలబడో, కూర్చునో, నడుస్తునో ఏదో అనుకుంటూ పోతుంటాడు. ʹనేల మీద విరిసిన ఓ గుల్ మొహర్. నా గుల్ సితʹ. ఎవరు ఆ గుల్ మొహర్, ఎక్కడా గుల్ సిత. ఏమో who knows?
***


ఎప్పటిలాగే ఓ ఉదయం.
జాగా: గల్లీ చివర్న చాయ్ దుకాణం.
ముచ్చట: ప్రేమించుకున్నందుకు చంపబడిన ప్రేమికులు.
పక్కనే రాగయుక్తంగా ఓ గొంతు ʹదో బదన్, దో బదన్ ప్యార్ కి ఆగ్ మే జల్ గయేʹ
ఎవరికి అర్థం కాలే. కానీ కళ్ళలో సుడులు తిరిగిన నీళ్ళు.

***

ఓ సాయంత్రం.
అదే జాగా.
ఇద్దరు యూనివర్సిటీ పొరగాళ్ళు.
ముచ్చట: తెలంగాణ సాయుధ పోరాటం.
మళ్ళీ ఇతనే ʹఓ క్వాబ్ అధురా తా, అధురే హామ్, అజ్ నహీ తో కభీనా కభీ పూరే హోంగే హామ్. తబ్ తక్ టూటే హుయే సప్నే ఔర్ హమ్ దర్దిʹ
ఏమి అర్థం కానీ పిల్లలు. Is he mad? వాళ్ళు వెళ్తూ పలికిన మాట.

***

తెల్లారి అదే జాగ.
ఓ గుంపు ముచ్చట.
నీ అవ్వ దునియా మస్త్ కరాబ్ అయింది రా బై. థూ ఒక్కడన్న నియ్యత్ తోటి లేడు.
ʹజలాదో ఇసే ఫంక్ దాలో యే దునియా
మేరే సామ్నే సే హటా లో యే దునియా
తుమ్హారిహై తుమ్ హి సంబాలో యే దునియా
యే దునియా అగర్ మిల్ భీ జాయే తో క్యా హైʹ అంటూ మళ్ళీ అదే మనిషి.
ఈ సారి ఎవరు తిట్టుకోలే. చాయ్ గిలాస అక్కడ పెట్టి ఏం చెప్పిండు రా భై ముసలోడు అని వెళ్ళిపోయారు.

***


వరుసగా నాలుగో రోజు.
ఈ ఇల్లు ఆయనదే సార్. నేను దుకాణం పెట్టుకుంటా అంటే సరే అన్నడు. అడగని ప్రశ్నకు చాయ్ బండి యాదగిరి సమాధానం.
ఇంతకు ఆయన కథెంటి?
ఏమో సార్? ఎవల్ని అడిగిన తెల్వది అంటారు.
ఆయన్నే అడగకపోయావా?
ఓ సారి అడిగిన సార్ నవ్వి ఊకున్నాడు. సార్ ఆ మూలన ఉండే ముసలైన అప్పుడప్పుడు వస్తాడు. ఇద్దరు కలిసి పాటలు పాడుకుంటారు.
***

ఓ రోజు ఉండబట్టేలేక అడిగేశా. ఏంది నీ కథ. ఇక్కడ ఎవలు ఏం మాట్లాడినా ఓ షాయరీ చెప్తావ్ అని.
ఇంతకీ నీదేవూరు? నీ ఉదాస్ కథ ఏంటి అని అడిగా.
ʹ1947లో రెండు దేశాలు ఆజాద్ అయ్యాయి. రెండు దేశాల ప్రజలు ఆ దేశాల బానిసలయ్యారు. ఆ రెండు కాకుండా మూడో రాజ్యం ఉంది. అక్కడ జనాలు రాజ్యానికి బానిసలు కాదు. రాజే డిల్లీకి బానిసయ్యాడు. నేను ఆ రాజ్యానికి చెందిన వాణ్నిʹ అన్నాడు. దాన్ని కొనసాగిస్తూ అప్పుడు చెప్పాడు. ఓ యవ్వనపు ప్రేమకథని, రాజకీయ కథని.

ʹఅనగనగా ఓ రాజ్యం. ఆ రాజ్యంలో రాజు. రాజు కింద దొరలు. దొరలు దోపిడిదారులు. దొరలకు ఖిలాఫ్ సంఘం. సంఘంతోని జనం. ఇది బిడ్డ నా కథʹ

కథ చెప్పు అంటే సాయుధపోరాటం షార్ట్ కట్ లో చెప్తావ్ ఏంది?

ʹకభీ కభీ నేను భీ సంఘంతో ఊర్లపొంటి పోతుంటి. అట్లా పోయినప్పుడు ఓ ఊర్లో ఒక అమ్మాయిని చూశాను. కోహినూర్ హే వో కోహినూర్. వాళ్ళ నాన్న దళంకి చేనులో జాగిచ్చెటోడు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో కలిసచ్చేది. ఎప్పుడో ఓసారి ఆ ఊరికి పోయేటోల్లం. కొన్నిసార్లు ఆ పిల్ల వచ్చేది. కొన్నిసార్లు రాకపోయేది. ఓసారి వాళ్ళ ఊరు మీద యాక్షన్ అయింది.ʹ అంతే కాసేపు నిశ్శబ్దం.
తరువాత?
ఏమో కొన్ని రోజులకు ఆ పిల్ల చచ్చిపోయింది అని కబర్.
ఎట్లా?
చంపేశారు బేట చంపేశారు.
ఎవరు?
ʹకిత్నే ఆద్మీతే, పూరే ఫౌజ్ తే సర్దార్ʹ అని వెళ్లిపోయాడు గొడవైపు చూస్తూ.
అక్కడ పొద్దున చాయ్ దుకాణంలో చూసిన ʹస్టాచ్యు ఆఫ్ యూనిటీʹ పేపర్.

***

ఇదంతా ఎక్కడి కథో అనుకున్నా. మా కథే 48-52 పేజీలలో దాచిన కథ. మనుషులను మతాలుగా చీల్చిన ఆధునిక రాజ్యపు నెత్తుటి దాహం, నేల దాహం తాలూకు ఓ విషాద దృశ్యం. ఇంత విషాదాన్ని కొన్ని షాయరీల్లో ఎట్లా చెప్పాడు ఈ ముసలోడు అనుకుంటూ ఉండగానే దర్వాజని


ʹహాయాత్ లే కే ఛలో కాఎనాత్ లే కే ఛలో
ఛలో తో సారే జమానే కో సాత్ లే కే ఛలోʹ అంటూ సాగిపోయాడు.
ఇప్పుడతను కాలాన్ని వెంటబెట్టుకొని నడుస్తున్న ముసాఫిర్. ప్యారే, లాలే ముసాఫిర్.


http://virasam.org/article.php?page=947&fbclid=IwAR1Xo1n6fz2Q6mXFEh-toKHCd7lScBtd_qBIlo94_B_FVNQbMd8DhfqWnB8

చిరున‌వ్వే ఓ ప్ర‌క‌ట‌న‌ |



ఎప్పటిలాగే తెల్లారింది
లేచి బయటకు వద్దును కదా
రోడ్డు మీద వంకర టింకరగా బైక్ నడుపుతూ పోరడు
ఏదో మార్పుకోసం
ఎడతెగని ఎదురుచూపు
గల్లీలో ఆదివారం వాసన మారలేదు
సంతాప సభకు పోతును కదా
అక్కడా సావగొట్టుడు మారలేదు
ప్రకృతి చలనం
సూర్యుడి వేడి
గాలి స్వాంతన
పట్నం ట్రాఫిక్
ఖాకీని చూడగానే attitude
ఏదీ ఏదీ మారలేదు
కానీ
మారాలి
ఏదో మారాలి
ఒక్కమాట చెవిని తాకాలి
ఒక్కటంటే కనీసం ఒక్కటైనా
ఒక్కరైనా అనకపోతారా

సభానంతర ముచ్చట
నిన్న రాత్రి ఆయన్నీ తీసుకుపోయారటగా

OKAY
ఉంది
చలనం
ప్రకృతిలోనే కాదు
అందులోని
మనిషిలోనూ
మనిషిలోని
మనసులోనూ

సముద్రంలో నీటిచుక్క
తన స్వేచ్ఛను నవ్వుతూ ప్రకటించింది
నవ్వడమే స్వేచ్ఛని
పిడికిలి బిగించి చెప్పింది

నీటిచుక్కను చూసి
ఎడారిలో
ఇసుక రేణువులు
గాలికి కదులుతున్నాయి

కొత్త కుట్ర మొదలైంది...!?
వాక్యం
అర్థాంతరంగా....?!
.....
.........
............
కొనసాగించబడుతుంది
(కామ్రేడ్ తుమ్ హస్ తే రహో
హమ్ హస్ తే హస్ తే జీత్ జాయేంగే)

http://virasam.org/article.php?page=952

Sunday, November 18, 2018

నిద్రను చెరిపిన కల


ఎక్కడో ఓ ఆర్తనాదం
పోయి చూస్తును కదా
గుట్టలు గుట్టలుగా శవాలు


ఓ పసి బాలిక
హృదయ విధారక ఏడుపు
రసి కారుతున్న దేహం మీద
గాయమంటూ లేని చోటు
వెతికినా దొరకదేమో


రెండు కాళ్ళ మధ్యన
తన బలాన్ని చూపిస్తూ ఇనుప బూటు


గాల్లోకి కాల్చిన తూట
పిడికిలెత్తిన వాడి గుండెల్లో దిగింది


వేటకత్తి
తలను మొండాన్ని
ఒక్క వేటుతో దూరం చేసింది


మనువు
న్యాయపీఠం మీద  కూర్చొని
ప్రవచిస్తున్నాడు


దేశమే ఒక్కడి మీద యుద్ధం ప్రకటించినట్టు
ఇంటిముందు సైనిక పటాలం


పక్కకు తిరిగితే
మోచేతికి బలంగా తాకిన గోడ

ఓహో ఇదంతా కలా?

తరువాత ఇక నిద్రపట్టలేదు

17/11/18

Saturday, November 10, 2018

ఓ బానిస నవ్వు

రక్తపాతాన్ని చూసి చలించినా
కళింగను తిరిగివ్వని అశోకుడు
ఇప్పుడు పశ్చాత్తాపం ప్రకటిస్తున్నాడు

గిరి గీసుకున్న సమూహాల పూజారులు
ఇప్పుడు సామ్యవాదాన్ని ప్రవచిస్తున్నారు

యుద్ధం ప్రకటించిన వాడే
శాంతి పలుకులు వల్లిస్తున్నాడు

అన్నీ వింటున్న హాలికుని బానిస
నవ్వుతూ భుజాన నాగలి మోసుకుపోతున్నాడు