Wednesday, November 21, 2018

ప్రేమలేఖ 20


ఓయ్ పిల్లా. ఇవ్వాళ మన ఫైజ్ పుట్టిన రోజు అట. ఎంత కాలాన్ని ఇక్బాల్ బానో గొంతులో ‘హమ్ దేఖెంగే’ వింటూ కాలబెట్టి ఉంటాం. ‘ముజ్ సే పెహ్ లిసి మొహబ్బత్ మేరే మహబూబ్ నా మాంగ్’ అంటూ ఎన్నిసార్లు కలిసి చదువుకున్నాం. నూర్జహాన్ గొంతులో ఎన్నిసార్లు విన్నాం. ‘తేరి అఖోంకా సివా దునియామే రఖా క్యా హే’ నీ కళ్లలోకి చూస్తూ ఎన్ని సార్లు చెప్పుంటాను. ‘ముజ్ సే పెహ్ లిసి మొహబ్బత్’ ఓ పిల్లకు చెబితే ‘మొహబ్బత్ కె సివా కోయి దుఖ్ నహి రహతే జానేమన్’ అని వెళ్లిపోయింది. మొన్న ఉర్దు కవిత్వం వింటుంటే సురేఖ సిక్రి recite చేసిన ఇదే కవిత కనిపించింది. ఎంత బాగా చదివిందో. చివర్లో కళ్ళనిండా నీళ్ళతో ముగించింది. నాకూ కళ్ళు చెమర్చాయి. ఈ కవిత చుట్టూతనే ఎన్ని జ్ఞాపకాలు అల్లుకున్నాం.

‘అల’మీద కవిత్వం రాస్తుంటే ‘హమ్ పర్ తుమ్హారా చాయ్ కా ఇల్జామ్ హీ తో హై, దష్నం తో నహి ఇక్రామ్ హీ తో హై’ అని జనాలకి సమాధానం చెప్పింది ఇదే ఫైజ్ కదూ. దానికి చెబితే ఎంత నవ్వుకుందో. నీకు చెబితే జనాల గురించి మీకేందుకురా అన్నావ్. 


పిల్లా ‘ఔర్ క్యా దేఖ్నే కొ బాకీ హై
ఆప్ సే దిల్ లాగా కె దేఖ్ లియా’ నిజమే కదూ ఇంకా చూడడానికి ఏమి మిగిలున్నది. నీతో గుండె కలిపి చూశాక. (మీరు అని అనను కదా). 

తెలంగాణ ‘కల’ అర్థ సాకారం అయ్యాక, నడుస్తున్న కాలాన్ని చెప్పడానికి మళ్ళీ ఫైజ్ యే కావాల్సి వచ్చింది. ఓ సారి ఇది చూడు. 
“యే దాగ్ దాగ్ ఉజాలా, యే షబ్ గజీదా సహర్
వో ఇంతిజార్ థా జిస్ కా, యే వో సహర్ తో నహీం
యే వో సహర్ తో నహీం, జిస్కా ఆర్జూ లేకర్
చలే థే యార్ కే మిల్ జాయేగీ కహీం న కహీం”

(ఈ మచ్చల మచ్చల వెలుగు, రాత్రి కాటు వేసిన ఉదయం
దేనికోసం ఎదురు చూసామో! ఇది కాదు ఆ ఉదయం.
కానే కాదు ఇది ఆ ఉదయం, దేన్ని కాంక్షిస్తూ...
దేన్ని కలవాలని దోస్తులు బయలుదేరారో... అది ఈ ఉదయం కానేకాదు) 

అచ్చంగా ఇది ఫైజ్ అనుభవమేనా? కానే కాదేమో! స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల కోసం పొరాడి ఓడిన వారందరి గాథ. మొదటిసారి సుధా భరద్వాజ్ ని హిమాయత్ నగర్ తాజ్ మహల్ హోటల్ లో కలిసినప్పుడు తన ఛత్తీస్ ఘడ్ అనుభవం చెప్పింది. దామోదర్ తూరే తన ఝార్ఖండ్ అనుభవం చెప్పాడు. ఇది మా ఉమ్మడి అనుభవం కదూ. రేపు వచ్చే విధర్భ, గూర్ఖాలాండ్, బుందేల్ ఖండ్ కూడా ఇవే అనుభవాలు రాసుకోవాలేమో! అయినా విభజనలో అటు పోయిన ఫైజ్ గుండెను కలిపింది ఇక్కడి మన మఖ్దూం తోనే కదా. లేకపోతే “ఆప్ కి యాద్ రహి రాత్ భర్/ చాందిని దిల్ దుఖాతి రహి రాత్ భర్” (రాత్రంతా నీ జ్ఞాపకాలు వస్తూనే ఉన్నాయ్/ వెన్నెల హృదయం రాత్రంతా రోదిస్తూనే ఉంది) అని ఎట్లా రాయగలిగాడు. ఎంత విషాదం ఇది. ‘అధికార మార్పిడి’ అని బ్రిటిష్ అధికార పత్రాలే రాశాక, ఇంకా దీన్ని స్వాతంత్ర్యం అని భ్రమపెడుతూ పాలకులు, భ్రమిస్తూ ప్రజలు. ఇది ‘స్వాతంత్ర్యం కానీ కాదు అన్నవాళ్లేమో జైల్లో. ‘ఐసీ తైసి డెమోక్రసీ’ వాళ్ళు రాసినట్లు ‘డెమోక్రసీ సడ్ రహి హి జైలోమే’.

స్వేచ్ఛా, స్వాతంత్ర్యల కోసం పోరాడేందుకు ‘బోల్ కె లబ్ ఆజాద్ హై తెరే’ అంటూ మనకు ఓ నినాదం ఇచ్చిందీ ఫైజే. ఇప్పుడు గొంతు చించుకుని మరి చెప్పాలి. “మాట్లాడు నీకున్న స్వల్ప సమయం సరిపోతుంది/ గొంతు మూగ పోకముందే శరీరం మృతి చెందకముందే /మాట్లాడు ఇప్పటికీ సజీవమయిన సత్యం కోసం /మాట్లాడు మిత్రమా మాట్లాడు చెపాల్సినదంతా చెప్పేయి” (ఇది ఫైజ్ కవితకు వారాల ఆనంద్ అనువాదం. బాగా చేశాడు కదా)


ఎంతగా ‘హం అప్నే దిల్ కీ ధడ్కన్ కో తేరీ ఆవాజ్ పా సమఝే’ (నా గుండె చప్పుడును నీ అడుగుల అలికిడి అనుకున్నాను) అని నేనూ భావించినా ప్రియా ‘ఔర్ భీ దుఖ్ హై జమానే మే మొహబ్బత్ కె సివా /రాహతే ఔర్ భీ హై వస్ల్ కి రహత్ కె సివా’ (ప్రేమయే కాదు లోకాన బాధలింకా ఉన్నాయి/ శరీర కలయికే కాదు ఓదార్పులెన్నో మనకున్నాయి) ఇవాల్టికి ఇంతే. మళ్ళీ ఇంకో లేఖతో పలకరించే వరకు వేచి చూడు. ఇంతేహా హోగాయి ఇంతేజార్ కి.

No comments:

Post a Comment