Sunday, October 28, 2018

ప్రేమలేఖ 19

ఈ మధ్య రజిత అక్కా 'హమ్ దిల్ దే చుకె సనమ్'లోని కళ్ళ పాట ఒకటి షేర్ చేసింది. అంతక మునుపు 'ఓంకార' లోనిది షేర్ చేస్తే నువ్వు గుర్తొచ్చి The Eyes అని పోయెమ్ రాస్తా అని చెప్పిన. కళ్ళ పాటల గురించి ముఖపుస్తకం లో రజిత, మోహన్, నేనూ ఓ పెద్ద చర్చే చేస్తున్నాం లే.

నేనలా కింద పడుకొని ఉన్నప్పుడు, నువ్ బెడ్ పైన కూర్చొని కాళ్ళు ఆడిస్తూ ఉంటే ఆ పాదాలను ముద్దాడుతో పాబ్లో నెరుడా The Feet పోయెమ్ చెప్పేవాణ్ణి. ఇక కళ్ళ మీద నాకున్న obsession నీకు తెలియంది కాదు. ''అమ్మాయిల అందమంతా కళ్లలోనే దాగుంది అనుకునే పిచ్చోడివి'' అనే కదూ నువ్వెప్పుడూ అనేది.

'i have seen the most beautiful eyes in this world, the vigilant eyes, infinite eyes. When she laugh with those, butterflies runs in my heart, heart's beat increase and the feeling which comes, I cannot write in letters nor express in words' అని లాంఠ గోళిలంతా కళ్ళున్న ఓ పిల్లకు రాసిన అంటే నా కళ్ళలోకి మత్తుగా చూస్తూ "మరి నా కళ్ళ పైనో" అన్నావ్. అప్పటి నుండి రాస్తూనే ఉన్నా, ఎంతకీ ఒడవని ముచ్చటే అది. ఛాయ మోహన్ అన్నట్టు 'తుచ్ఛమైన ప్రేమలో కళ్లలోతూ కూరుకుపోయాను' (ఛాయ మోహన్ అంటే చాయ్ ఫ్రెండ్ కాదు. అంతకు మించేలే.) కూరుకుపోయాను అని అన్నాడు కానీ కూర్చుకున్నది నువ్వే కదూ.

ఎన్ని రాత్రులు అలా చూస్తూ కళ్ళలోకి నింపుకున్నావో. ఎన్ని ఉదయాలు నీ కళ్ళలోకి చూస్తూనే నిద్ర లేచానో. ఎట్లా నింపుకుంటావ్ అట్లా. ఓ చేయిని నాకు తలగడలాగా వదిలేసి, అట్లాగే చూస్తూ ఉండిపోతావ్. ఉదయాన్నే లేవగానే తదేకంగా చూస్తున్న రెండు దీపకాంతులు కనపడతాయి. 'ఏంటే' అంటే, "ఏం లేదురా. రోడ్డు మీద పడితే ఎప్పుడు వస్తావో, అందుకే కళ్ళనిండా నింపుకుంటున్నా" అంటావ్. "నిద్రపోతున్నప్పుడు ముద్దొస్తావ్" అని నుదుటి మీద పెదాల ముద్ర వేస్తావ్. నేను కాస్త పైకి జరిగి పెదాలకు పెడితే "go n brush" అంటూ లేచి కౌగిలికి చిక్కకుండా పారిపోతావ్. ఉదయకాలపు ప్రేమలు కదూ అవి. వెన్నెల ముచ్చట్లు, వెన్నెల ముచ్చట్లే... ఉదయపు ప్రేమలు, ఉదయపు ప్రేమలే. ఎన్ని చలికాలపు రాత్రుళ్ళు మేల్కొని ఉండుంటావ్, నా ఛాతీ నిమురుతూ. కొన్నిసార్లు పేగులు బయటపడేలా వచ్చే దగ్గునూ భరిస్తూ. టాబ్లెట్ వేసిన తగ్గకపోతే "ఎదపై ముద్దుపెట్టి తగ్గి పోతుంది లేరా" అంటూ కళ్ళలోకి ఓ చూపుల బాణం విసురుతావ్. అంత బాధలోనూ నవ్విస్తావ్. That's the power of your looks. కలిసినప్పుడు చూసే చూపుతో నవ్వును, వెళ్లిపోతున్నప్పుడు చూసే చూపుతో కన్నీళ్లను తెప్పిస్తావ్. 'కలలందు వెంటాడే కన్నులే నీవి'.

స్వేచ్ఛగా నవ్వుతూ ఎగిరిపోయిన కనుల పిల్లా త్వరగా రావూ నీకోసం ఎప్పటిలాగే పగటి ముద్దులు దాచి ఉంచాను.

Thursday, October 25, 2018

లోపల నిప్పు కణికలు ఉన్నవాడు

ఎవడు బతికేను నిండా పది పదులు
నేల తనకోసం  కన్నదో
నేలకోసం వాడు పుట్టాడో
అన్నట్లు ఎవడూ పుట్టడు

కానీ
అందరిలానే పుట్టినా
చచ్చేనాటికి దేశ ముఖచిత్రం మీద
ఎడమకాలి ముద్రను తన సంతకంగా
చేసేవాడు మాత్రం అరుదుగా రూపొందుతాడు

పుట్టిన కులం నిషేధమైన చోట
నిషేధాక్షరాలను ఏరి వాక్యాల దండ కట్టడం
తెలిసినవాడు మాత్రమే
కాలిపోతున్న మనుషుల కోసం
మనుషుల్లో కాలిపోతున్న మనసుల కోసం
లోపలా బయటా ధగ్ధమవుతూ రాయగలడు

లోపల నిప్పు కణికలున్నవాడే
బయట మంటల్ని పుట్టించగలడు

‘పిడికెడు ఆత్మగౌరవం కోసం ‘
‘అంటరాని ప్రేమ’ చేసిన పోరాటం
వాడి జీవితం
వాడు రాచరికాన్ని కూల్చే అరాచకుడు
వాడే ప్రకటించుకున్నట్లు
‘జన సమూహాల గాయం
గాయాల సమూహం’

బతకడమొక నిరసనగా బతికిన వాడు మాత్రమే
చావునూ నిరసనగా రిజిస్టర్ చేసి పోతాడు

He lived shorter
But, his life? eternal

Sunday, October 21, 2018

వెలుతురు చీకటి

ఎప్పటిలాగే ఈరోజు
కాకపోతే నువ్వు లేవనే వెలితి

దిగంతాల్లోకి చొచ్చుకొని వచ్చాక
కొన్నిసార్లు పైకి రాలేక అక్కడే ఆవాసం
అన్ని చెప్పినంత సహజంగా ఉండవు కదా

నీకో కథ చెప్తా వినూ

చీకటిలో మొదలై
వెలుతురు గుండా ప్రవహించి
మళ్ళీ చీకట్లో కలిసిన
ఓ ప్రేమికుడి కథ

సొరంగం మధ్యలో నిలబడి
మరో చివరకోసం చూస్తున్నాడొకడు
ఎక్కడినుండో వచ్చి వీపుతట్టి
వెలుతురు వైపు నడిపించింది ఒక్కర్తి

వ్యక్తావ్యక్త ఆలోచనల మధ్య
ప్రేమామోహ భావనల మధ్య
భౌతికాలౌకిక ఆనందాల మధ్య
ఘర్షణ పడి
వాళ్ళ పోరాటమంతా 'ప్రేమ, స్వేచ్ఛ'ల
కోసమే అని కనుగొన్నారు
వాటికోసమే కలసి నడచారు

విరిగిన హృదయాలను
ఒకరి బిగి కౌగిళ్ళలో మరొకరు
అతికించుకుని
అడవులు
సముద్ర తీరాలు
పల్లెలు
పట్టణ ప్రాంతాలంతా
కలియదిరుగుతూ
వాళ్లిద్దరూ ఓ జుగల్ బందీ
గొంతెత్తి పాడారు

గాలి చొరబడని
వాళ్లిద్దరి మధ్య సంద్రాలు పుట్టాకా
ఒక్కసారి ద్వేషించవూ
అంటూ వచ్చింది తాను
ప్రేమైక బంధమున్న చోట
ద్వేషానికి తావు లేదూ అంటూ
అతడు మళ్ళీ చీకట్లో కలిసిపోయాడు

Friday, October 19, 2018

ప్రేమలేఖ 18

ఆ గొంతు
ఎదలోతుల్లోంచి వచ్చే నవ్వు
అనేకానేక భావాల్ని పలికించే కళ్ళు
ఎంత కవిత్వం  రాసుకున్నా వాటిని చూస్తూ...
అవి అట్టాగే ఉండాలని చెప్తూ..

గొంతులో జీర
జీవం కోల్పోయిన నవ్వు
విషాదపు చూపు
ఇది కాదు నువ్వు

కనులు, నోరు కలిపి నవ్వే జుగల్ బందీ
ఎగిసే అల
లోతైన సంద్రం
అనంతానంత ఆకాశం
సలువదనపు వెన్నెల
ఎగురుతూ పోయే సీతాకోకచిలుక
కురిసే మేఘం
తడిసే నేను
ఇది కదా నువ్వు

పిచ్చి పిల్లా
ముప్పై రెండు అణాల పిచ్చి పిల్లా
కాస్త నవ్వవు...
రాలిపడే ముత్యాలను ఏరి
నీ చిత్రాన్ని గీసుకుంటా

ఎందుకో పాత పుటలు తిరగేస్తుంటే ఈ కవిత దొరికింది. సందర్భం ఏమిటో గుర్తులేదు. జీవంలేని విషాదపు చూపుల నిన్ను ఊహించుకోలేను. అందుకేనేమో! ఆ సందర్భాన్ని యాది పెట్టుకోలేదు.

ముప్పై రెండు అణాల పిచ్చిపిల్లా. అరవై నాలుగు అణాల అరనవ్వు విసిరే పిల్లా. త్వరగా రావు. మళ్ళీ ఓ నవ్వుల వర్షమై కురిసేందుకు. అందులో తడిసి ముద్దై చాలా రోజులైంది. ఓయ్ సీతాకోకచిలుక ఒక్కసారి వచ్చిపోవూ. ఊహు వచ్చి ఇక్కడే ఉండిపోవూ. పుప్పొడుల ముద్దులన్నీ నీకోసం దాచి ఉంచా. పాపం వెన్నెల. ఇంకా ఎన్ని రోజులిలా మన సందేశాలని మోస్తూ ఉంటుంది. ఎప్పటిలాగే ఓ పున్నమి పూట మనదైన చోట కూర్చొని ఆ ఒంటరి చుక్కను, వెన్నెలను చూస్తూ మాట్లాడుకుందాం. పొట్లాడుకుందాం. అలుగుదాం. మారాం చేద్దాం. గారం చేద్దాం.

వార్తలు ఫాలో అవుతూనే ఉండుంటావ్ కదా. శబరిమల తీర్పు వచ్చింది. మహిళలు వెళ్లాలనుకుంటే వెళ్ళవచ్చు అని చెప్పింది. 'యత్ర నార్థ్యాస్తూ' దేశంలో మహిళకు ముట్లు రావడం అంటరానితనం. అదే  ఆడ విగ్రహానికి ముట్లు వస్తున్నాయి అంటే కొబ్బరికాయలు పట్టుకొని పరిగెడుతుంటారు. 'ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు' ఎక్కడో చదివిన జ్ఞాపకం. కానీ వాస్తవంలో 'ఎక్కడ మహిళలను దేవతలు అని పూజిస్తారో అక్కడ వాళ్ళకో గర్భగుడి కట్టి బంధిస్తారు'. గడచిన చరిత్ర, నడుస్తున్న చరిత్ర అంతా అదే కదా. ఆమెకో భర్త, ఇళ్లు ఉండాలి. ఆ ఇంటిని, ఇంటాయనని చూస్తూ ఉండడం తన బాధ్యత. ఇదే కదా ఈ దేశపు సంస్కృతి. పీడక కులాల ముచ్చట్లు పీడితులకు చెప్తే ఎట్లా నడుస్తుందని కదూ మనం మాట్లాడుకుంది. ఉత్పత్తి కులపు స్త్రీ ఇల్లు, ఇంటాయన అని కూర్చుంటే చేతిలోకి ముద్ద ఎట్లా వస్తుంది. అని కదూ ముగించింది. ఇప్పుడు ఆధునికత జీవితాల్లోకి వచ్చి ఇల్లు దాటి బయటకు నాలుగడుగులు బయటకి నడిపించింది. ఇంట్లో మొక్కే దేవున్నే గుళ్లోకి వచ్చి మొక్కుతా అంది. అంతే దేవతలు (మహిళలు) గర్భగుడిలో (ఇంట్లో) ఉండాలి. భర్తకు, పిల్లలకు సేవలు చేస్తూ ఉండాలి అని సంస్కార, సంస్కృతి వాక్యాలు నాలుకలు మీదుగా జాలువారుతున్నాయ్.

మొన్న అస్సాంలో అన్న పెళ్లికి పోయి వస్తుంటే అక్కడ కామాఖ్య గుడి దగ్గర ఆపారు. పద్దెనిమిది ముక్కలైన శక్తి స్వరూపిణి దేహపు ఒక్కో ముక్క పడిన చోటు ఒక్కో శక్తి పీఠం అయిందంటా. అట్లా అష్టాదశ (పద్దెనిమిది) శక్తి పీఠాలు ఉన్నాయటా. ఇక్కడ ఆమె యోని భాగం పడిందంటా. ఆదివాసీ సమూహం ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో హిందుత్వ ఆనవాళ్లు ఎక్కడివి అనేది ప్రశ్న. ఆ ప్రశ్నను కాసేపు పక్కన పెడితే. కామాఖ్యలో యోనిని దేవత స్వరూపమని మొక్కుతున్న జనాలే శబరిమలలో యోని స్రవించే మహిళలను గుడి మెట్లు ఎక్కోద్దు అంటున్నారు. మతం నెత్తికెక్కితే మెదడు మోకాళ్ళలోకి దిగడమంటే ఇదే కదూ. శైవ, వైష్ణవులు ఒకర్నొకరు చంపుకునెంత వైరం ఉన్న కాలంలో శివుడు, విష్ణువు (మోహిని అవతారం) సంగమించి అయ్యప్పని కనడం ఓ చారిత్రక వైచిత్రి. 'మొగోడు మొగోడు కలుసుకుంటే అయ్యప్ప, నువ్వేట్ల పుట్టినవో చెప్పప్పా' అని చిన్నప్పుడు విన్న జనానాట్యమండలి పాట యాదికి రావడం యాదృశ్చికం కాదు.

అయినా సీతాకోకచిలుకల్ని బంధించే మతాల్లో హక్కులు కోరడం పిచ్చి పనే ఐనా, హక్కును నిరాకరించిన చోట నిలబడి, కలబడి సాధించడమూ అవసరమే. బాబాసాహెబ్ కాలారాం గుడి తలుపుల్ని దళితుల కోసం తెరిపించినప్పుడు చెప్పిన మాటలు 'నాకు విగ్రహాల మీద నమ్మకం లేకున్నా, అక్కడికి పోకుండా అడ్డుకునే హక్కు మాత్రం ఎవరికి లేదు' (సరిగ్గా ఇవేనో కాదో యాది లేదు. ఆ మాటల భావం ఇదే)

చెప్పడం మరిచాను అంటావేమో. బిడ్డ అడిగింది ఎప్పుడొస్తున్నావ్ అని. నువ్ రాట్లేదని తిట్టింది అది వేరే విషయం అనుకో. ఇప్పటికి ఇంతే. ఉంటాను. లవ్ యు ఫ్రీడో.

Friday, October 5, 2018

కుచ్ భీగి అల్ఫాజ్

టూటే హువా దిల్ కే
కుచ్ భీగి అల్ఫాజ్

ఎందుకో ఖాళీతనం
ఆవరించినప్పుడు
ఎద ముక్కలైన భావన
కొన్ని తడి మాటలు

కొన్నిసార్లు అంతే
మనదైన కొన్ని ఖాళీతనాలు

అవసరమే
మనకంటూ ఓ ఒంటరితనం
ఓ నిశా(షా)చరుడిలా
ఓ బైరాగిలా
కొన్ని ఒంటరి గీతాలు
రాసుకోడానికో
పాడుకోడానికో

జనం నుండి మనల్ని
మనమే వెలివేసుకొని
చుట్టూ ఓ గీత గీసుకొని
నాలుగు వాక్యాలు రాసుకోడానికి
ఓ ఖాళీతనం అనివార్యం

ఎందుకో గాయపడ్డ ఎద పలికే
కొన్ని తడి మాటలు బావుంటాయ్