Friday, July 26, 2019

మరణాంతర కలవరింత

నువ్వెళ్ళి పోయావ్. అంతా వెళ్ళిపోయింది. నువ్ వెళ్ళిపోయాక. ఓ కారుచీకటి వచ్చి చేరింది. నా కాళ్ళ కింద నేలే పైకి దుమ్ములా ఎగిసి నన్ను తనలోకి లాక్కుంది. నేనూ నేల ఐక్యమై పోయాక, నేల నా సమాధిగా మారిపోయాక ఆకాశం దాని మీద దుప్పటయ్యింది. ఇప్పుడు నేను నేల వేరుకాదు. నేనూ ఆకాశమూ వేరు కాదు. నేలా ఆకాశమూ అంతే. ఏది వేరుకాదు. అంతా ఒక్కటే. నేలపొరల్లో నేను. నాపై నేల. నేలపై ఆకాశం. అంతా నువ్వెళ్ళిపోయాకే.

అప్పుడప్పుడూ నేల పొరల్లో మెలకువ వచ్చినప్పుడు అనుకుంటాను. ఇంతకీ నేల నన్ను లాక్కుందా? నేనే నేలలోకి చొచ్చుకు పోయానా అని. ఏదైతేనేం తానెళ్ళిపోయాక అని ఓ ఇసుకరేణువు సమాధానమిస్తుంది. అంతేకాదు. నువ్వేమి ఇట్లా అనుకున్న మొదటివాడివి కాదు కదా చివరివాడివి కూడా కాదు అని తన అనుభవంతో చెబుతుంది. ఇప్పుడు నేనూ ఇసుక రేణువులు మంచి దోస్తులం. నేను నా జ్ఞాపకాల్ని, అది తన అనుభవాల్ని పంచుకుంటూ ఉంటున్నాం. అంతా నువ్వెళ్ళిపోయాకే.

జబ్ దిల్ హి టూట్ గయా అంటూ సైగల్ తాగకుండా ఆర్డీ కోసం ఒకేఒక్క పాట పాడాడు. ఆ పాట గుర్తొస్తే అనిపించేది. హృదయమే బద్దలయ్యాక బతికి ఇంకా చేసేదేముందని. అయినా పగిలిన హృదయంతోనూ ప్రేమించాను కదూ. ఏమైంది. ఎక్ దిల్ కి తుక్డే హజార్ హుయే అన్నట్లుగా మళ్ళీ మళ్ళీ ముక్కలయ్యింది. ముక్కలైన ప్రతీసారి ముక్క ముక్కను ఏరి ఓ వాక్యం కుట్టాను. గట్టిగా శ్వాస ఎగబీలిస్తే పెకిలిపోయిన కుట్లలా వాక్యమూ అస్తవ్యస్తమైంది. చెల్లాచెదురైంది. అంతా నువ్వెళ్ళిపోయాకే.

తుమ్ గయే, సబ్ గయా అని పాడుకునేందుకు ఇప్పుడు నేనూ లేను. "నే నిదరోయే చోటుకు ఎవ్వరికీ అనుమతిలేదు. ఒక్క మధుపాత్రతో వచ్చు సాకీకి తప్ప" అని గాలిబ్ అన్నాడో, మీర్ తఖీ మీర్ అన్నాడో యాదిలేదు. నేనూ ఈ మట్టిపొరల్లో కలత నిద్దురలో అదే కలవరిస్తున్నాను. నాదైన చోటుకు ప్యాలతో నడిచొచ్చే సాకీకై. తనుపోసే సాకకై.

Thursday, July 4, 2019

నడిరేయి పాట



సాకీ

ఈ రేయి ఓ పాటను
పాడటం మొదలెట్టింది


వినపడుతోంది
కిటికీ చప్పుడులో
నీ నామస్మరణ


నీవే పంపినట్లుగా
నా దరికి చేరిన గాలిలో
నీ దేహ పరిమళం


అలిగి విసురుగా నువ్ తిరిగితే
తాకిన చీర కొంగులా
మొహన్ని తాకిన పరదా


మరిచిపోయిందేదో
గుర్తుచేస్తూ
క్యాలెండర్ లో
మారిన తేదీ


ఈ నడిరేయి
నేనూ
నాకు తోడుగా
మధుపాత్ర


చిత్రంగా
కిటికీలోంచి చూస్తూ
నాలాంటి
ఒంటరి చుక్క


పక్కన లేనిది నీవే
పదిలంగానే ఉన్నాయ్
నీ జ్ఞాపకాలింకా

ఈ నడి రేయి
వినిపిస్తున్న పాటలాగా

Tuesday, July 2, 2019

ప్రేమలేఖ 34


"కొందరు వర్షంలో తడుస్తారు. మరికొందరు దాన్ని ఆస్వాదిస్తారు" అంటాడు బాబ్ మార్ల్. నిజమే. మొన్నటిదాకా ఉక్కపోసిన ఎదను ఇప్పుడు వర్షం తడిపింది. వర్షం తడిపిన ఎద పురా జ్ఞాపకాల యుద్ధభేరి మోగిస్తుంది. దేహాన్ని తడుపుతున్న ఒక్కో చినుకు తుడుం మోతలా జ్ఞాపకాల్ని తట్టిలేపుతుంది. చినుకులకు తోడుగా వచ్చే చల్లని గాలి స్వెట్టర్ ను చీల్చుతూ దేహాన్ని వణికిస్తోంది. ఒకనాటి మన తోవ, వర్షము, చల్లని గాలి, తుడుమై మొగుతున్న ఎద నిన్ను యాదికి తెస్తున్నాయి.

అదే తోవలో ఎన్నిసార్లు అట్లా వర్షంలో తడుస్తూ వచ్చుంటాం! ఇంటికి రాగానే కాస్త ఫ్రెష్ అయి, అలా వణుకుతూనే చాయ్ పెట్టేవాడ్ని.'రెండు కప్పుల్లో ఏమోద్దు, పెద్దదాంట్లోనే తీసుకురా' అనే నీ ఆజ్ఞ కిచెన్ లోకి వినపడేది. చాయ్ తీసుకొని నేనలా గోడకు అనుకుని కూర్చుంటే, గూటిలో గువ్వపిల్లలా ఒడిలో ఒదిగిపోయేదానివి నా చేతిలో చాయ్ కప్ లాక్కుంటూ. వర్షానికి తడిసి, మంచులా మారిన రెండు దేహాలు ఆ చాయ్ కప్పులో కాస్త, కౌగిల్లో కాస్త వేడిని వెతుక్కునేవి.

ఇప్పుడు ఇంటికి వస్తే నువ్వు లేవని వెక్కిరిస్తూ ఖాళీ రూమ్ లోని పుస్తకాల షెల్ఫ్, తెరచున్న కిటికీలోంచి వస్తున్న చల్లని గాలి. ఈ చలినుండి తప్పించుకోవడానికి ముచ్చట చెప్పె ముసలోడు లేడు. చర్చలు ఎక్కువవుతున్నాయని 'ముసలోడిని' ఇంట్లో పెట్టుకోవడం లేదు. ఈ మధ్య ముసలోడి నుండి విడిపోయి 'పెక్కుకాలపు' మత్తులో ముచ్చటాడుతున్న. ఇక చర్చలు తగ్గిస్తానని మొన్నే 'సాకీ'కి మాటిచ్చా. చర్చల్లో పడి తినట్లేదని తిట్టి, దానికి తోడు మందుల బాక్స్ లో  antacidsని తీసి టేబుల్ మీద పెట్టి మరి టైమ్ కి తినమని వార్నింగ్ ఇచ్చిపోయింది.

ఎదలో ఎదో పురా యుద్ధభేరి ఇంకా మొగుతూనే ఉంది. బహుశా అది ఈ రాత్రంతా మొగుతూనే ఉంటుందేమో! యుద్ధభేరి నేపథ్యగానంలో నీవు లేని చోట నీ జ్ఞాపకాల్ని పలవరిస్తున్నాను. అట్లా పలవరిస్తున్న వాటినే ఏదో ఓ రోజు నువ్ చదువుతావని ఇలా రాస్తున్నాను. ఈ రాత్రీ అనేక రాత్రుల్లాగే నీ జ్ఞాపకాల్లో కాలిపోనుంది. నను కాల్చనుంది. కొన్ని గాయాలు అంతేనేమో...!