Thursday, December 28, 2017

యుద్ధం



నిశ్శబ్ద యుద్ధం 
నాలో నేను
నాతో నేను

అరణ్యము నేనే
మైదానము నేనే

యుద్ధం నాతోనే అయ్యాక
నేనే అస్మదీయుణ్ణి
నేనే తస్మదీయుణ్ణి

ఎద దిగంతాల నుండి
దేహ శికరాగ్రం చేరేందుకు
ఎడతెరిపిలేని యుద్ధం 

అంతర్ముఖ మలిసంధ్య నుండి
బహిర్ముఖ తొలిసంధ్య వరకు
పెంజికటి యుద్ధం

............................

జ్ఞానం విలసిల్లుతూనే 
అజ్ఞానంలోకి నెట్టబడ్డ
గడ్డుకాలంలో సైతం
అందమైన రోజుల కోసం*

మళ్ళీ జ్ఞాన పునరుత్థానానికీ యుద్ధం 

............................

'నాన్న నీ యుద్ధానికి కాస్సేపు విశ్రాంతి ఇచ్చి
ఎందుకోసం యుద్ధమో చెప్తావా' 
అంటూ వచ్చింది ఆమె

'యుద్ధం శాంతి కోసం'
'పోయినవాటిని తిరిగి పొందటం కోసం'
నీకు తెలియందా ఇది.

అయితే
"నీ పెంజికటి యుద్ధం ఇక నాది కూడా
వస్తున్నా ఆగు కలిసే పోదాం''
అంతలోనే... ఓయ్ ఒక్కమాట
నిజం చెప్పు యుద్ధం శాంతి కోసమే కదూ! 
శాంతి కోసం కాకపోతే నువ్వెందుకు యుద్ధం చేస్తావులే. 

'ప్రశ్న తనదే
సమాధానం తనదే'

''ఆగాగు. యుద్ధం ఇద్దరిది''

* "It was the best of times, it was the worst of times, it was the age of wisdom, it was the age of foolishness." Charles Dickens 'Tale of two cities' లోని ఈ వాక్యాల్ని ఓ కవితలోకి తీసుకురావడం ఇన్నాళ్లకు కుదిరింది. 

Thursday, December 21, 2017

మనసులో మనసై


ఆమె జ్ఞాపకాల్లో
అతడి కాలం కరిగిపోయింది

రెండు దేహాలు ఒక మనసై
ప్రేమాగ్నిలో కాలిపోయింది

మనసు ఫీనిక్స్ అయి 
బూడిదలోంచి పురోడుసుకుంది
అందమైన రేపటికి 
అక్షరాల్ని వాగ్ధానం చేస్తూ

.......

ఈ అక్షరాలన్నీ నా కోసమే కదూ
అంటూ మనసులో గొంతుక పలుకు

ఆమె గాయపడ్డ ప్రతిసారీ


ఆమె గాయపడ్డ ప్రతిసారీ
  గుండెలో గేయమొకటి
అర్ధాంతరంగా ఆగిపోతుంది

Sunday, December 17, 2017

జీవిత పరుగులో (जिन्दगी की दौड़ में)


జీవిత పరుగులో
అనుభవాలింక పచ్చిగానే ఉన్నాయి|
ఏ చలాకీతనం నేర్చుకోకుండా
హృదయం ఇంకా పసిపిల్లలాగే ఉండిపోయింది|
పసితనంలో ఎక్కడ అనుకుంటే అక్కడే నవ్వే వాడిని
ఎక్కడబడితే అక్కడే ఏడ్చే వాడిని|
కానీ, ఇప్పుడు నవ్వడానికి సంస్కారం కావాలి
కన్నీళ్లకు ఒంటరితనం|
మేము పట్టింపుల్లేకుండా నవ్వే వాళ్ళం
నన్ను నేనే ఇవ్వాల పాత ఫోటోలో చూసుకున్న|
నడూ, చిరునవ్వులకు కారణాలు వెతుకుదాం
నువ్ నన్ను వెతుకు... నేను నిన్ను వెతుకుతా...

(స్వేచ్ఛానువాదం అరుణాoక్)

Gulzar రాసిన హిందీ కవిత

जिन्दगी की दौड़ में,
तजुर्बा कच्चा ही रह गया...।
हम सीख न पाये 'फरेब'
और दिल बच्चा ही रह गया...।
बचपन में जहां चाहा हँस लेते थे,
जहां चाहा रो लेते थे...।
पर अब मुस्कान को तमीज़ चाहिए
और आंसुओ को तन्हाई..।
हम भी मुस्कराते थे कभी बेपरवाह अन्दाज़ से...
देखा है आज खुद को कुछ पुरानी तस्वीरों में ..।
चलो मुस्कुराने की वजह ढुंढते हैं...
तुम हमें ढुंढो...हम तुम्हे ढुंढते हैं .....!

- गुलजार

Tuesday, December 12, 2017

తన కళ్ళు


అక్షరాలకు అందని భావాలు
కళ్ళతో తను జరిపే సంభాషణలు
కలిసిన ప్రతిసారీ ఎదలో
మిగిలిపోయే జ్ఞాపకాలు

Thursday, December 7, 2017

రహస్యాంగం


చిన్నప్పుడు
నిన్ను గుర్రాలు .... అంటే
అది తిట్టెట్లో
ఇతిహాసం చదివేదాక తెల్వలేదు

అంగాన్ని లింగమెందుకంటారో
గుడికి పోతెగాని సమజ్ కాలేదు

ఆకలి రెండు రకాలని
ఉదయాన్నే పత్రిక చెప్పింది

బతకనీకి ఆకలి
బతుకుని బలిగొనే ఆకలి

.....................

ఖజురహో శిల్పాలు
గుడిమీద బొమ్మలు
అశ్వమేథ, పౌండరీక యాగాలు
శృంగార వర్ణన, కవుల కావ్యాలు
కావ్యాలు కావవి కామసూత్రాలు

లింగాన్ని పూజించే దేశంలో
లింగవాడుకదారులు ఉండడంలో వింతేముంది!?
"ఊరపిచ్చుక లేహ్యం తిని,
నూరు కోట్లమందితో రతిసల్పగల శక్తి నీకున్నది ప్రభు"
వాడినోడే వీరుడన్న రాత సాహిత్యమై వెలుగుతుంది

.....................

వాత్సాయనుడు ఏమన్నాడో
తెలియదు గానీ
"ప్రేమకు అత్యున్నత రూపం"
ఇపుడు
కార్చుకునే నాలుగు చుక్కలయింది

రహస్యాంగం
బహిరంగమై రంధ్రాన్వేషణ చేస్తుంది

Wednesday, December 6, 2017

అంబేద్కర్ నా అంబేద్కర్



ఈ దేశపు మనువాద వ్యవస్థను
గజగజలాడించిన విప్లవకారున్ని
‘జంటిల్మెన్’ చేసేందుకు
ఎన్ని కుట్రలు పన్నుతున్నారు
భూమి జాతీయికరణ, కుల నిర్మూలన ఆశయాల్ని
చట్ట సభల్లో సీట్ల కోసం, నోట్ల కట్టల కోసం
రిటైల్ గా తాకట్టు పెడుతూ
నీ నూట ఇరవై ఐదోవ జయంతిని
అగ్రహారాల జాతరగా మార్చి
నిన్నొక ఉత్సవ విగ్రహం చేస్తున్నారు

నువ్ ఆదేశించిన
మహత్తర కుల నిర్మూలన పోరాటాన్ని
ఏట్లో కలిపేసిన దుర్మార్గులు
నువ్ నడుంబిగించిన
సామాజిక విప్లవ సాధన
గొంతు నుమిలిన ఖూనికోర్లు
అభినవ మనువాదులు
నిన్ను వక్రికరించేందుకు
ఎంత విఫల ప్రయత్నం చేస్తున్నారు
అయినా కామ్రేడ్ అంబేద్కర్
నిన్ను తనలో  కలిపేసుకోవాలనే
హిందుత్వ కుట్ర అంతం కాక తప్పదు

మహాద్ చెరువు పోరాటంలో
నువ్ చిందించిన నెత్తురు
ఇంకా పచ్చిగానే ఉంది
రాజ్యంగా సభలో ‘వైరుధ్యల’పై నీ ఉపన్యాసం
మా చెవుల్లో ఇంకా మార్మోగుతూనే ఉంది
మనుస్మృతిని కాల్చి వేదాలకు శాస్త్రాలకు
డైనమేట్లు పెట్టి పెల్చేయమన్న  నీ పిలుపు
మా కుల నిర్మూలన కర్తవ్యాన్ని
నిరంతరం గుర్తు చేస్తూనే ఉంది
శ్రమ విభజనతో పాటు
శ్రామి’కుల’ విభజన జరిగిన ఈ దేశంలో
నీ జీవితం, నీ పోరాటం
మమ్మల్ని ప్రభావితం చేస్తూనే ఉన్నది

డియర్ కామ్రేడ్
నీ మరణాంతరం ఇక్కడ పెద్దగా మార్పులేమీ లేవు
నువ్ చెప్పిన కుల ‘మాన్ స్టర్’  ఇంకా అలానే ఉంది
ఇప్పుడది యూనివర్సిటిల్లో ‘వెలివాడ’లను
తయారు చేయడంలో తలమునకలై ఉంది
కులాల ఆధిపత్య పోరులో ‘కుల నిర్మూలన’
పాథాలానికి తోక్కబడ్డది
భూమీ జాతీయికరణ ‘విప్లవకరం’ అయి
విప్లవం నేడు అంటరానిదయింది
"భోదించు, పోరాడు, సమీకరించు" లో
పోరాటం మరచి చానా ఏండ్లయింది
ఈ బూటకపు ‘రాజకీయ ప్రజాస్వామ్యం’
నువ్ ఆశించిన సామాజిక, ఆర్ధిక
ప్రజాస్వామ్యాలని ప్రజలకింక రానివ్వనేలేదు

మనువు మనవళ్ళు
నీ జయంతులు జరుపుతున్న చోట
కౌటిల్యుని వారసులు
నిన్ను స్మరిస్తున్న చోట
నీ విగ్రహాలకు పాలాభిషేకాలు,
నీ పేర దీక్షలు చేస్తూ
నిన్ను  బ్రాహ్మణీకరించి
‘స్వామిజీ అంబేద్కర్’ని
చేయజూస్తున్న చోట
కాశీలో పొర్లుదండాలు పెట్టి
ముంబై స్టాక్ మార్కెట్ కు
వంగి వంగి దండాలు పెట్టేవాళ్ళు
నీ శత్రువులైన బ్రాహ్మణ, పెట్టుబడిదారి వాదాలకు
పాదాక్రాంతం అయ్యేవాళ్ళు
సామాజిక, ఆర్ధిక, రాజకీయ విప్లవాన్ని
విందు భోజనంగా,
చట్టసభల్లో కుర్చీగా,
ఊకదంపుడు ఉపన్యాసంగా
ప్రవచించే ‘మేధావులు’ ఉన్నచోట
అంబేద్కర్ మేం బలంగానే ఉన్నాం
స్వయంగౌరవం కోసం తలెత్తే ఉన్నాం
పిడుగులు పడిన తుఫానులే వచ్చిన
ఎదుర్కొనేందుకు సిద్దంగానే ఉన్నాం
అంబేద్కర్ అంటే పోరాటం
అంబేద్కర్ అంటే విప్లవం
కులనిర్మూలన అతని ఆశయం
స్వంత ఆస్తిని నిరాకరించిన భౌద్దం
అతని జీవన విధానం

స్వయంగౌరవం ప్రకటించిన  ప్రతిసారి
వల్లకాడవుతున్న వెలివాడల
గాయాల్ని తడుముకుంటు
రక్తసిక్త మార్గంలో
లోకాయుత, చార్వాక, భౌద్దాల నుండి
నువ్ అందించిన స్పూర్తితో
సుదీర్ఘ పోరాటానికి సిద్దంగానే ఉన్నాం
నీ వారసులం ఇంకా బతికే ఉన్నాం

ఆకలి అవమానాల అంటరాని వాడ నుండి
అంతర్జాతీయం అయిన వాడా
వెలివాడలకు వెలుగులు చూయించినవాడ
‘అలగ’జనాలను మేల్కొలిపి
సమానతకై నడిచినవాడ
నడిపించినవాడ

అంబేద్కర్  ఓ అంబేద్కర్ నా అంబేద్కర్
అందుకొ మా నెత్తుటి సాల్యూట్
మనువాదంపై  పేలబోతున్న
డైనమెట్ల విప్లవాభినందన
సామాజిక, ఆర్ధిక ప్రజాస్వామ్యాన్ని
అందనివ్వని బూటకపు రాజకీయ
ప్రజాస్వామ్యాన్ని కూల్చబోయే  ప్రజల
విప్లవ జైభీమ్

14-04-2016
శివసాగర్ కి  ప్రేమతో  

వెన్నెల


అలలపై వాలిన
సెంద్రవంకీ వెన్నెల
జవరాలి మోమయ్యి 
అగుపించు వెన్నెల

ముసలవ్వ ముక్కుపుడక
మెరుపులా వెన్నెల
ముసలయ్య చుట్టోదులు
పోగలో వెన్నెల

చెలక కాపుగాసే
పాలేరు వెన్నెల
నడిజాము చిత్రాల
సాక్షి ఈ వెన్నెల 

నక్కల ఊళల
వినిపించు వెన్నెల
గబ్బిలం చూపయ్యి
నడిపించు వెన్నెల

పగిలిన డప్పులో 
వికసించు వెన్నెల
వాడలో ఏలాడే
తునకయ్యి వెన్నెల

బాయెనెట్ కొస 
మెరుపోలే ఎన్నెల
మరో ప్రపంచపు 
వాగ్దానమే వెన్నెల

Sunday, December 3, 2017

సమూహారణ్యం




"దేహమొక్కటే 
కానీ,
అది అనేకానేక గాయాల సమూహం 
అయితేనేం, 
అదిప్పుడు యుద్ధతంత్రాల్ని దాచుకున్న అరణ్యం"