Wednesday, February 28, 2018

ఆమెను చూశాక



ఎన్ని వందల వేల పుప్పొడుల 
ముద్దులిచ్చానో నా సీతాకోకచిలుక
నవ్వుల కనులకి
చూపుల మెరుపులు పుట్టించిన 
ఆ విప్పారిన నేత్రాలకి

ఎడబాటనంతరం కలయిక 
కనులు ఎందుకో కాంతివిహీనం
గుండెలో మొదలై గొంతులో ఆగిపోయిన మాట
జ్ఞాపకాలు కంటనీరై ఒలికిన కాలం
నిశ్శబ్దాన్ని చేదిస్తూ కవిత్వం

Tuesday, February 20, 2018

తంగేడు పువ్వు



1
బతుకమ్మయిన తంగేడుపూల
చూసిన ప్రతిసారి గుర్తొస్తావ్ కామ్రేడ్
చాలా తక్కువ పరిచయం మనది
అయిన అందమైన జ్ఞాపకాలు
అచ్చంగా నీ నవ్వులా

ఇప్పుడు నువ్వు లేవు
నీ నవ్వూ లేదు
మిగిలినవి జ్ఞాపకాలే
కన్నీటి సంద్రమయ్యే జ్ఞాపకాలే

2
నీ బాధను చూడలేక చంద్రుడు
మబ్బుల చాటున దాక్కొనే ఉండుంటాడు
నీ రోదన విని పక్షులు కన్నీళ్లు
పెట్టుకుని ఉంటాయి
నీ నెత్తురుతో ఎర్రబారిన నేలని చూసి
ఎర్రరంగు పులుముకున్న ఆకాశం
చారేడు కన్నీళ్లు కార్చి ఉంటుంది

3
చివరి కలిసినప్పుడు
చేతిలో చెయ్యేసి
మళ్ళీ కలుద్దాం కామ్రేడ్
అని బాస చేశావ్ కదూ
ఆర్ట్స్ కాలేజ్ మెట్లపైనో
ఆదివాసీ గూడెంలోనే
ఎదురుచూస్తుంటాను
అమర'శృతి' గీతం వినిపించే
నీ రెండవ రాకడకై

(రెండేండ్లుగా రాద్దాం అని మొదలెట్టిన ప్రతిసారి కళ్ళు మసకబారి అపరిపూర్ణంగా వదిలేసిన కవిత. ఇవ్వాళ శృతి పుట్టినరోజు అని సుదర్శన్ అన్న పెట్టిన పోస్టు చూశాక పాత రాతప్రతుల్ని తిరగేసి రాశా. ఇప్పుడు అంతే ఆ నవ్వుల మోము గుర్తొస్తే మసకబారే కళ్ళతో)

Butterfly



చూపులతో నవ్వుల వల విసిరే తన కళ్ళలో
ఓ అయస్కాంత శక్తి

తనతో కలసి నడిచే ప్రతి నడకలో
పోరాటమూ సౌందర్యం

ప్రకృతిలో భాగమైన తానొక
సీతాకోకచిలుక

Thursday, February 15, 2018

ప్రేమ పునాదులకై

యుగపురుషుడని పూజిస్తూనే
వాడి తల్లిని
గుర్రంతో రమింపజేసిన
అశ్వమేధయాగాన్ని అద్బుతమని
పొగిడే sexual perverts

కోరి వచ్చిన అమ్మాయి ముందు
False prestageకి పోయి
ముక్కు చెవులు కోసి పంపిన
నపుంసక 'వీరుడి' వారసులు

చెట్లపై, పుట్టలపై
కుండలలో స్ఖలిస్తే పుట్టారన్న
పుక్కిటపురాణాలను
ప్రచారం చేసే మూర్ఖులు

వాళ్ళ గ్రంధాలు, పురాణాల నిండా
కామసూత్రమే ఉంటే
వాళ్ళు ప్రేమనెట్ల భరిస్తారూ

వాళ్ళను తన్నడమే కాదు
వాటిని కాలబెట్టందే మార్పురాదు

ప్రేమను నిరాకరించిన
ఆయాణాలను, ఆరథాలను
కాలబెట్టాల్సిందే

ముక్కు చెవులు కోసి
ఈ వెదవలకు ఆదర్శమైన వాడి
విగ్రహాలను బద్దలుకొట్టాల్సిందే
వాటి సమాధులపైన
ప్రేమ పునాదులు నిర్మించాల్సిందే

Tuesday, February 13, 2018

కవిత్వం



ఖాళీగా కూర్చున్నప్పుడు
కలం నుండి జాలువారేది
కాదు కవిత్వం
కాలే కడుపుల
మంటల జెండా అది

మండే బొగ్గుల్ని 
దోసిల్లో పట్టిన వాడే
గుప్పిట గుండెను పట్టినట్లు
వాక్యం రాయగలడు

యాభై డిగ్రీల ఎండలో
కాళ్లకు చెప్పుల్లేకుండా
పాదాలు మాడుతున్న
పొట్టకూటికై నడిచివాడే
కవిత్వానికి చుక్కాని కాగలడు

.....………….....…………

చావుకి, పండక్కి తేడా
వాడికి తెలుసేమో
వాడి కడుపుకు మాత్రం
దరువేస్తూ, చిందేస్తూ
నుదుటితో తీసిన రూపాయి బిళ్ళలతో
గుప్పెడు, గుప్పెడంటే గుప్పెడు
గింజల్ని కొని నాలుగు సోలల నీళ్లలో
ఉడికిస్తే గాని సగం తీరని
వాడి ఇంటి మనుషుల ఆకలి

ఆకలికి మాడిన పేగుల
యాసిడిటి శబ్దాలను రాయి
అదే కవిత్వమవుతుంది

కవిత్వం ఎక్కడినుండో ఊడిపడదు
కాళ్ళలో పల్లెర్లు దిగిన
పరిగేరడం ఆపని అవ్వ

మోటగొడుతూ గొంతెండిన
గుక్కెడు నీళ్లకు మోటాపితే
వీపున పడే చర్ణకోల అచ్చులు

కుమ్మరి కుండ
కమ్మరి పొయ్యి
సాలేల మగ్గం
మంగలి కత్తి
మాదిగ దప్పు
చూస్తే ప్రతిదీ వస్తువే
వాళ్ల మాటలే శిల్పం

వాళ్ళ బతుకు రాయకగానీ
రాస్తే అదే కవిత్వమై
కావ్యమై పలకరించదు

(Kavi Yakoob అన్న 'సరిహద్దు రేఖ' ముందుమాట చదివి వినిపించాక, హంట్ చేసిన వాక్యాలకు స్పందన.వినగానే కావలించుకోవలనిపించింది ఎందుకో ఆగిపోయా. ఇదిగో ఇప్పుడు కవిత్వమై కావలింతను పంపుతున్నా)

Monday, February 12, 2018

సూఫీకి ప్రేమలేఖ




ప్రియమైన సూఫీ
కుంకుమపూల పరిమళమా
ఆపిల్ తోటల సోయగమా
ఉరకలెత్తే నదుల సంగమమా

నేను ప్రియతమ
నీలాగే భంగపడ్డదానను
ప్రేమకు గుర్తుగా కట్టబడ్డదానను

ఇంకా గుర్తుపట్టలేదా
ఓ నా పోరు సూఫీ
నేను గజల్ ని

ఇప్పుడు నిన్ను చూస్తుంటే
కళ్ళు నీటిని ఎర్రగా స్రవిస్తున్నాయే తల్లి
నీ దేహానికి వచ్చిన ఎరుపు
కుంకుమ పూల మెరుపు అనుకున్న
అది ఇన్నెండ్లుగా పారుతున్న నెత్తురా!

కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుందన్నట్లు
నీది నాది ఒకే కథ కదనే
మనల పాలించిన రాజులకు
భోగాలు, భాగ్యాలు
మనకు మిగిలింది ఎప్పటిలా కన్నీళ్లే
కమిలిపోయి, కాలిపోయి
రాలిపోయిన దేహాలు

నీ 'ప్రజాభిప్రాయ సేకరణ'
నా 'యధాతథ ఒప్పందం'
ఎన్నడూ కాగితాలు దాటి బయటకి రాలేదు
చరిత్రలో మూలుగుతూ ఉన్నాయో!
లేక చెదలైన తిన్నదో ఏమో!
ఆధారాలు చూపిన నమ్మని
మూఢ భక్తుల కాలం ఇది సూఫీ

నిన్ను పెల్లెట్లతో ఛిద్రం చేస్తున్న ఈ సైన్యమే
నీ బిడ్డల ఇంటినుండి పట్టుకపోయి చంపి
ఎదురుకాల్పులు కథలల్లుతున్న ఈ సైన్యమే
నా బిడ్డల రెండు లక్షల మందిని చంపింది
నీ దగ్గర తల్లుల ముందు బిడ్డలను,
బిడ్డల ముందు తల్లులను చెరుస్తున్న ఈ సైన్యమే
నా బిడ్డల చెరిచింది
మనది ఒకటే కథ సూఫీ

నా బిడ్డల అంత మంది చంపినా, చేరిచిన
ఇంకా నా దేశమని లొంగబడి బతుకుతూ నేను
మట్టిని, మట్టికింద ఉన్న సంపద కోసమే తప్ప
మట్టిని కాపాడే మనుషుల ప్రేమించని వాళ్ళు నావాళ్ళు ఎట్లయితరు?
నన్ను ఓటుగా తప్ప మనిషిగా చూడని వ్యవస్థ నాదెట్లయితది?
బిడ్డల చంపుకునే దేశం ఒకదేశమేనా? అని
నేను వదిలిన ఆయుధాన్ని అందుకుని
తిరగబడుతూ నీవు

పోరాడవే తల్లి పోరాడు
నీ సూఫీ గాయాలను
నా గజల్ గొంతులో వినిపిస్తా
నీవు విముక్తి అయ్యేదాక, అయ్యాక
ఎప్పటిలాగే సూఫీ గజల్ జుగల్ బందీ వినిపిద్దాం
పోరాడవే తల్లి పోరాడు
నీ పోరాటాన్ని నా గొంతుతో కాపలకాస్తాను

బోలెడంత ప్రేమతో
నీ గజల్

(సంజయ్ కాక్, పర్వేజ్ బుఖారీలకు ప్రేమతో)

Sunday, February 11, 2018

Happy B'day dear


నిత్యం తలనిండా  మల్లెపూలు తురమడం వల్లేమో
తను రాకను తెలియజేస్తూ మలయాళీ మల్లెపూల పరిమళం

విప్పారిన నేత్రాల చెవుల పిల్లా
సిగ్గుతో బుగ్గలేరుపెక్కే నవ్వుల పిల్లా
పసిప్రాయం పోగొట్టుకోని పడుచుపిల్లా
నువ్వు నీలాగే చిరకాలం వర్ధిల్లు