Tuesday, February 13, 2018

కవిత్వం



ఖాళీగా కూర్చున్నప్పుడు
కలం నుండి జాలువారేది
కాదు కవిత్వం
కాలే కడుపుల
మంటల జెండా అది

మండే బొగ్గుల్ని 
దోసిల్లో పట్టిన వాడే
గుప్పిట గుండెను పట్టినట్లు
వాక్యం రాయగలడు

యాభై డిగ్రీల ఎండలో
కాళ్లకు చెప్పుల్లేకుండా
పాదాలు మాడుతున్న
పొట్టకూటికై నడిచివాడే
కవిత్వానికి చుక్కాని కాగలడు

.....………….....…………

చావుకి, పండక్కి తేడా
వాడికి తెలుసేమో
వాడి కడుపుకు మాత్రం
దరువేస్తూ, చిందేస్తూ
నుదుటితో తీసిన రూపాయి బిళ్ళలతో
గుప్పెడు, గుప్పెడంటే గుప్పెడు
గింజల్ని కొని నాలుగు సోలల నీళ్లలో
ఉడికిస్తే గాని సగం తీరని
వాడి ఇంటి మనుషుల ఆకలి

ఆకలికి మాడిన పేగుల
యాసిడిటి శబ్దాలను రాయి
అదే కవిత్వమవుతుంది

కవిత్వం ఎక్కడినుండో ఊడిపడదు
కాళ్ళలో పల్లెర్లు దిగిన
పరిగేరడం ఆపని అవ్వ

మోటగొడుతూ గొంతెండిన
గుక్కెడు నీళ్లకు మోటాపితే
వీపున పడే చర్ణకోల అచ్చులు

కుమ్మరి కుండ
కమ్మరి పొయ్యి
సాలేల మగ్గం
మంగలి కత్తి
మాదిగ దప్పు
చూస్తే ప్రతిదీ వస్తువే
వాళ్ల మాటలే శిల్పం

వాళ్ళ బతుకు రాయకగానీ
రాస్తే అదే కవిత్వమై
కావ్యమై పలకరించదు

(Kavi Yakoob అన్న 'సరిహద్దు రేఖ' ముందుమాట చదివి వినిపించాక, హంట్ చేసిన వాక్యాలకు స్పందన.వినగానే కావలించుకోవలనిపించింది ఎందుకో ఆగిపోయా. ఇదిగో ఇప్పుడు కవిత్వమై కావలింతను పంపుతున్నా)

No comments:

Post a Comment