Sunday, December 30, 2018

వో కల ఉండేది


వో కల ఉండేది 
ధ్వంసమైంది
వో తలంపుండేది 
దాని జాడ లేదు
కానీ,
ఈ ఎదకేమయింది
ఎందుకారిపోయిందో
తెలియకుంది

Friday, December 21, 2018

దిశంబర్ 6





1
కాల్పుల శబ్దం. దూరంగా వినపడుతూ ఉంది. ఎదురుగా గుంపులు గుంపులుగా మనుషులు. అందరి కళ్ళల్లో ఎదో భయోత్పాతం. ఒళ్ళంతా రక్తం. కాస్త ముందుకు వెడితే వాళ్ళు నడచి వచ్చిన దారి పొడుగుతా ఎర్రని మరకలు. ఇది ఎర్రమన్ను నేలా!? అన్నంతగా ఆ తోవపై రక్తం.


కాలుపుల శబ్దం ఆగిపోయింది. ఓ సమూహం అక్కడి నుండి వెళ్ళిపోయింది. చెట్లదాటున దాగున్న మనుషులు ఒక్కరోక్కరిగా బయటకి వస్తున్నారు. వాళ్ళ రాకడ దూరం నుండే కనిపిస్తున్నది. అట్లానే ఇంకాస్త ముందుకు పొతే. సమూహం వదిలి వెళ్ళిన జాగా. పక్కనే గుబురు పొదల మీద. మానుల మీద. పచ్చికల మీద అంతటా ఎర్రని మరకలు. ఆకాశం పాన్ నమిలి ఊసినట్లుగా. మబ్బులు ఎర్రని నీళ్ళనే కురిసినట్లుగా. పచ్చని చెట్లమీద ఎర్రని మరకలు. చెట్లకు వేలాడుతూ దేహాలు. ఎక్కడపడితే అక్కడే దేహాలు. మృత దేహాలు. 
***********

2
భీమా...... ఫిర్ అజా జరా... అంటూ ఆర్ద్ర్తంగా ఓ గొంతు. ఎన్ని ఏండ్ల ఎదురుచూపో ఆ గొంతులో. ʹ ఎందరో మహాత్ములు వచ్చారు. ఎందరో మహత్ములు పోయారు. కానీ అంటరానివారు ఇంకా అంటరానివారు గానే ఉన్నారు.ʹ ఓ ఉపన్యాసం. మళ్ళీ కొన్ని గొంతులు. అంతే ఆర్ద్రంగా. దీనంగా. విషాదంగా. అదే పిలుపు. ʹభీమా... మళ్ళీ రావా ఓ సారి...ʹ
రేపే ఎన్నికలు. 
నేడు ఆయన వర్ధంతి. 
ʹఓటు ఆయన ఇచ్చిన హక్కు. దాన్ని వాడుకోవాలి.ʹ
ʹవైరుధ్యాల మీద ఆయన ఉపన్యాసం విన్నావా? ఇట్స్ టైం టు ఓవర్ త్రో దిస్ ఆటోక్రసి.ʹ

ʹఒక మనిషి ఒక ఓటు. ఒక వోటు ఒక విలువ.ʹ ఉపన్యాసం కొనసాగుతూ ఉంది. 
ʹఒక మనిషి ఒక విలువʹ. ఎవరో అరిచారు. అరుపు ఉపన్యాసంలో కలిసిపోయింది.

ʹమన రాజ్యం రావాలి. మనం రాజులం కావాలి.ʹ ఉపన్యాసం ఆగట్లేదు. 
ʹసంపద జాతీయం కావాలి. భూమి అందరికి దక్కాలి. స్టేట్ సోషలిజం. ఇంకా ముందుకు పోయి స్టేట్ లెస్ సోషలిజంʹ ఎవడో ʹస్టేట్స్ అండ్ మైనారిటిస్ʹ చేతిలో పట్టుకొని మరీ అరుస్తున్నాడు.
ఎవడ్రా ఈ పిచ్చోడు. రాజ్యం వద్దంటున్నాడు. అంటూ ఓ గుంపు, చేతులకు దారాలు, మేడలో రుద్రాక్ష ఉన్న నాయకుని వెంట పోతుంది.
ʹభీమా... మళ్ళీ రావా ఓ సారి...ʹ అదే గొంతు ఆర్ధంగా అర్ధిస్తున్నది. అంతే ఓ అగ్ర గుంపు మీదపడి ఆ గొంతును నులిమేసింది. ఆ పాట మూగబోయింది. అంతా మౌనం. 
కొన్నిరోజులకు మళ్ళీ అదే ఉపన్యాసం. మాయమైన మనుషులు చాలామంది మళ్ళీ కనిపిస్తున్నారు. చూస్తుండగానే కాలసూచికలో తేది మారింది. ఫోన్ తెరమీద చూస్తే అది ఏప్రిల్ 14.
***********

3
వరుసగా జనాలు. అందరి చేతుల్లో కాషాయరంగు జెండాలు. జై శ్రీరాం అని నినాదాలు. అందరి మొహాల్లో ఓ ఉన్మాదానందం. దూరంగా ఓ పురాతన కట్టడం. దాన్ని చూడాగానే వీళ్ళది పరుగులాంటి నడక. ఒక్కొక్కరుగా ఆ కట్టడం మీదకి ఎక్కుతున్నారు. సుత్తెలు. గడ్డపారాలతో దాని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చూస్తూ ఉండగానే అది కూలిపోయింది. అందరి కళ్ళలో ఓ వికృతానందం. ʹబృహదత్తున్ని చంపి, బౌద్ధరామాలను కూల్చిన ʹపుష్యమిత్ర శృంగుడిʹ ఆనందం అది. గోబెల్స్ తన అబద్దాలను నిజం అని నమ్మే జనాలను చూసి పడిన ఆనందం అది.ʹ

అరేయ్ ఆ నిండు నల్లనిదాన్ని ఆపండి. ఎవరో చేతులో త్రిశూలంతో అరుస్తున్నారు. అడ్డంపడి ఆమెను ఆపేశారు. ఒకడు త్రిశూలాన్ని ఆమె...
ఉలిక్కిపడి లేచాను. నేను రాత్రి పడుకున్న చోటే ఉన్నాను. ఓహో ఇదంతా కలా!? కండ్లముందటి విషాదమా!?

అంతఃస్రావం





1
వర్షా, హేమంత్ ఇద్దరు కాలేజ్ లో సహ విద్యార్థులు. ఇద్దరి అభిప్రాయాలూ దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళు కూడా దగ్గరయ్యారు. కాలేజ్ అయిపోయి ఉద్యోగాల్లో జాయిన్ అయినా వారి పరిచయం కొనసాగుతూనే ఉన్నది. వారి స్నేహం ప్రేమగా పరిణామం చెంది చాలా రోజులు అవుతున్నా, ఎవరి తల్లిదండ్రుల మీదా ఆధారపడకుండా తమకు తామే బతికే స్తితి వచ్చేదాకా పెళ్లి చేసుకోకూడదు అనుకున్నారు. ఉద్యోగంలో చేరిన మూడు సంవత్సరాలలో చెరికొంత పోగేసుకొని ఇద్దరి పేరుమీద ఓ ఫ్లాట్ కొనుక్కున్నారు. ఆ తరువాతే ఇద్దరి వారి రిలేషన్షిప్ ని అందరికీ చెప్పి ఎటువంటి హడావుడి లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఫ్లాట్ కి షిఫ్ట్ అయ్యారు. ఇద్దరివి వేరు వేరు కులాలు, వేరు వేరు ప్రాంతాలు, ఆచారాలు అయినా యేనాడు వారి ఇన్నేండ్ల సహవాసంలో అది వారికి సమస్య కాలేదు. మెచ్యూరిటీ లెవల్స్ అట్లా ఉన్నాయ్ వారివి. అయితే హేమంత్ పట్లా వర్ష తల్లిదండ్రులకు సదాభిప్రాయం లేదు. అతడు వేరే కులం అది తమకన్నా తక్కువ కులానికి చెందినవాడు కావడం వల్ల వచ్చినది అని వర్షాకు తెలుసు. చాలాసార్లు వారికి చెప్పిన మారకపోయేసరికి వారిపట్ల కూతురుగా తన బాధ్యతలు ఏమైనా ఉంటే చేస్తుంది తప్ప అంతకు మించి ఏమీలేదు. మనుషులని కులాల వల్ల విభజించి చూడకూడదడు అని చదువుకున్న చదువు తనకు నేర్పింది. హేమంత్ కూడా తాను చదివే సాహిత్యాన్ని వర్షాతో చర్చించేవాడు. దానితో తనకు కులాలు అంటే ఏహ్యభావమే తప్ప వాటిపట్ల యేనాడు పాసిటీవ్ గా లేదు. కొన్నిసార్లు తనలో తన కులం తాలూకు ఛాయలు వస్తే హేమంత్ చెప్పేవాడు. తనకి హేమంత్ చెప్పే పద్దతి చాలా నచ్చుతుంది. అట్లా చెబుతున్నప్పుడు స్కూల్లో పిల్లలని కొట్టకుండా పాఠాలు చెప్పే అరుదైన టీచర్లు తనలో కన్పిస్తారు అంటుంది. ఓ రిలేషన్షిప్ లోకి వచ్చాకా అడ్జస్ట్ అయి ఉండాలీ అనే భావనకు తాను వ్యతిరేకం. హేమంత్ తో ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే దాదాపు మాట్లాడుకొని, చాలా అరుదుగా గొడవపడి, అలిగి తమ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారు. ఆ అలక ఏనాడూ తేదీ మారలేదు.

2
రోజు తొందరగానే ఇంటికి వచ్చే హేమంత్ కి ఆరోజు లేట్ అయింది. వచ్చేసరికి వర్ష ముసుగుతన్ని పడుకుని ఉంది. హలో డియర్, how was your day? అని తన సమాధానం వినకుండానే వాష్ రూమ్ లోకి పోయాడు హేమంత్. ఓ పది నిమిషాలకు బయటకు వచ్చి చూస్తే వర్ష పొయ్యిలో పిల్లి పడుకున్నట్లు మోకాళ్ళు పొట్టలోకి మడుచుకొని మూడంకే వేసి పడుకుని ఉంది. ‘ఏమైంది ఈ పిల్లకి, అయినా ఈ టైమ్ లో ఇది ఆఫీస్ లో కదా ఉండాలి’ అని దుప్పటి తీసి నుదుటి మీద చేయి పెట్టాడు. నుదురు దోస పెంకలెక్క కాలిపోతుంది. ఆ వేడికి చెయ్యిని ఒక్కసారిగా వెనక్కితీసి ఓ క్షణం పాటు ఉలిక్కిపడ్డాడు. అంతలోనే తేరుకొని ‘వర్షా ఏమైంది లే, ఇంతలా జ్వరం ఉంటే ఎట్లా ఒక్కదానివే ఉన్నావ్? కాల్ చెయ్యల్సింది కదా!’ అని అంటూనే బెడ్ పై కొర్చొని తన తలను ఒళ్ళోకి తీసుకున్నాడు. తన చేయిని చేతిలోకి తీసుకుని అరచేతులను నిమురుతున్నాడు. అప్పటివరకూ వణుకుతూ ఉన్నది కాస్తా హేమంత్ నడుమును చేతులతో చుట్టేసి ఏడ్వడం మొదలెట్టింది. ‘ఏమైంది లే, హాస్పిటల్ కి పోదాం పదా. లే డియర్’ అంటూ భుజాలు పట్టుకొని లేపాడు. లేచినది కాస్తా మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకొని ‘హాస్పిటల్ కి ఏమి అవసరం లేదు. ఓ టాబ్లెట్ చెబుతాను తీసుకొని రా.’ అన్నది. 
అరే ఇంతలా జ్వరం ఉంటే హాస్పిటల్ కి వద్దు అంటావెంటీ? 
వద్దు హేమంత్ అదే తగ్గిపోతుంది. ఇది ఎప్పుడు ఉండేదే. ఈసారి ఎందుకో కాస్త ఎక్కువైంది. 
ఏమైంది పీరియడ్స్ వచ్చాయా? 
హ్మ్. అందుకే ఇదంతా. అని మళ్ళీ దుప్పటి కప్పుకొని, ముడుచుకు పడుకుంది.
వెళ్ళేముందు ఓ సారి వర్షా అని పిలిచి తనవైపు తిరగగానే, ఇంతకీ టాబ్లెట్ పేరెంటి అని? అడిగాడు. 
ఎన్నిసార్లు తెచ్చుంటావ్. ప్రతిసారి కొత్తగా తెచ్చినట్టు అడుగుతావ్ అని కాసేపు అరచి, ‘Meftal Spas’ స్పెలింగ్ తో సహ చెప్పింది. ఒకవేళ అది లేకపోతే Drotin తీసుకో అని చెప్పి మళ్ళీ దుప్పటి కప్పుకుంది. 
వర్ష చెప్పిన టాబ్లెట్స్ తీసుకుని రావడానికి బయటకి పోయిన హేమంత్ టాబ్లెట్స్ తో పాటు, తినడానికి కూడా బయట నుండే తెచ్చాడు. వచ్చి లేపి తనకు తినబెట్టి టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టాడు. పొద్దున్నే సబ్మిట్ చెయ్యాల్సిన ప్రాజెక్ట్ ఒకటి ఉంటే ఆ రాత్రి దాదాపు పనంతా పూర్తిచేసి ఆఫీస్ గ్రూప్ లో అప్లోడ్ చేసి పడుకున్నాడు. ఉదయాన్నే తనకు జ్వరం తగ్గకపోతే కాస్త లేట్ గా పోయినా నడుస్తుంది అని పని చేసి పడుకున్నాడు. వెళ్ళి దుప్పటిలో దూరగానే తన భుజం మీద తలవాల్చి పడుకుంది వర్ష. తలను నిమురుతూ, జో కొడుతూ అలాగే పడుకుండిపోయాడు.

3
ఉదయాన్నే ఆఫీస్ నుండి వచ్చిన కాల్ తో మేల్కొన్న హేమంత్ ఫ్రెష్ అప్ అవుదాం అని వెళ్తుంటే డోర్ బెల్ మోగింది, వెళ్ళి చూస్తే పనిమంషి కొమురమ్మ. ఎంటమ్మా ఏమైనా మర్చిపోయావా? అని అడిగాడు హేమంత్. లేదు సార్ పొద్దున లేట్ అయింది ఇప్పుడే వస్తున్న అంది రోజు పొద్దున్నే వచ్చి వెళ్లిపోయే కొమురమ్మ. మేడమ్ ఆఫీస్ పోయిందా సార్ అని లోపలికి వెళ్తూ అడిగింది. ఇవ్వాళ వెళ్ళదు అనుకుంటా దానికి పానం మంచిగలేదు అనుకుంటూ ఫ్రెష్ అప్ కావడానికి పోయాడు.
కొమురమ్మ పేరుకు పని మనిషే అయినా ఇద్దరు యేనాడు తనని అట్లా చూడలేదు. అత్యంత నమ్మకమైన మనిషి అని భావిస్తారు కనుకే తన దగ్గర ఒక తాళం చెవి ఎప్పుడు ఉంచుతారు. రాత్రి డోర్ లాక్ చేసుకొని పడుకుంటే, తన దగ్గర ఉన్న తాళం చెవితో తాళం తీసిపని చేసుకుంటుంది. కొత్తగా పెళ్లైనా వారు కదా అని తాను వచ్చానని చెప్పడానికి సూచనగా లోపలికి వస్తునే వర్షమ్మా అని పిలుస్తూ వస్తుంది. ఆమె పని చేసి వర్షకు కాఫీ, హేమంత్ కి చాయ్ చేసి లేపుతుంది. వాళ్ళు రెడీ అయి వచ్చేసరికి నాస్తా చేసి ఉంచుతుంది. ఆమె తిని వెళ్లిపోయాక వాళ్ళు తిని మెల్లిగా ఆఫీస్ లకు బయల్దేరుతారు. కొమురమ్మ అనే పేరు చాలా పాతగా ఉన్నా ఆమె వయసు నలభై కూడా దాటి ఉండదు. కొన్నిసార్లు ఇంటర్ చదివే వాళ్ళ పాపని తీసుకొని వస్తుంది. వాళ్ళ పాప ఏదైనా పని చేస్తే వర్షా, హేమంత్ ఇద్దరు ఆమెను పని చెయ్యనియ్యరు. వెళ్ళి హాల్ లో కూర్చొని టీవి చూసుకో తల్లి అంటారు. 
ఫ్రెష్ అప్ అయి బయటకి వచ్చేసరికి వర్ష ఇంకా లేవలేదు. అలాగే ముసుగుతన్ని కడుపులోకి కాళ్ళు పెట్టుకొని పడుకుని ఉంది. లేపితే కాసేపాగి లేస్తా అని అలాగే పడుకుంది. హేమంత్ రాకను చూసి చాయ్ చేసి ఇచ్చింది కొమురమ్మ. పని అయిపోయింది సార్ వెళ్తున్న, నాస్తా హాట్ బాక్స్ లో ఉంది అని పోయింది. చాయ్ తాగి రూమ్ లోకి పోయి వర్షను లేపి నాస్తా చేయించి కాఫీ కలిపి ఇచ్చాడు. కాఫీ తాగి టాబ్లెట్ ఇవ్వురా అని అడిగింది. వేసుకొని రూమ్ లోకి పోతూ అరేయ్ పొద్దటి నుండి కాళ్ళు లాగుతున్నాయ్, కాస్తా వచ్చి వత్తరాదూ అని అడిగింది సరే అని తన అరికాళ్ళ నుండి తొడల జాయింట్స్ వరకు మసాజ్ చేశాడు. పొట్టను నిమిరి జోకొడుతుంటే, అరేయ్ ఈ టైమ్ లో థైస్ దగ్గర ఎక్కువగా లాగినట్టు అనిపిస్తుంది, నిన్ను ఎప్పుడు మసాజ్ చేయమన్నా అక్కడే ఎక్కువ చేసి రిలాక్స్ చేస్తా హొ యు నో ఎబౌట్ ఇట్ అని అడిగింది. ఎక్కడో చదివిన జ్ఞాపకం ఇలా పనికి వచ్చింది అని, అయినా మీ కన్నా ఎక్కువ మాకే తెలియాలి లేకపోతే మీ పి‌ఎం‌ఎస్ మూడ్ స్వింగ్స్ ని అర్థం చేసుకోవడం కష్టం అని నవ్వాడు. రేయ్ నేనేం అంతా ఎక్కువను చేయను పి‌ఎం‌ఎస్ ఉంటే సైలెంట్ గా పాడుకుంటా అని అన్నది. నువ్వేదో చేస్తావని నేనేం అనట్లేదు నీ చిరాకు ఇంకొ రెండు రోజులు అయితే బయటపడుతుంది అప్పుడు నేనే చెప్తాలే అన్నాడు. ఆఫీస్ పోవాలి పనుంది టైం అవుతుంది అని లేవబోయాడు, అంతే లేస్తున్న వాణ్ని పట్టుకొని ప్లీజ్ ఇవ్వాళ వెళ్లకు నేను అస్సల్ బాలేను. చాలా బ్లోటింగ్ ఉంది. ఐ మే ఫెయింట్ ఎనీ టైమ్ అని ఏడ్చేసింది. అయ్యో దానికి ఏడ్వడం దేనికి ఉంటాలే అని పొదివి పట్టుకున్నాడు.

4
కాసేపటికి ఆఫీస్ నుండి కాల్. వచ్చేయ్ అని హెచ్‌ఆర్ అరుస్తున్నాడు. సార్ నా వైఫ్ కి బాలేదు have to take care of her, sorry I can’t come అన్నాడు. హేమంత్ యు నో హొ మచ్ ఇంపార్టన్స్ ఇస్ యౌవర్ ప్రేజెన్స్ అని తాను చెప్పేది వినకుండా అరుస్తున్నాడు హెచ్‌ఆర్. సార్ నేను ప్రాజెక్ట్ అల్మోస్ట్ నిన్న రాత్రే మెయిల్ చేసిన, నేను ఉండాల్సిన అవసరం లేదు. If you really need my assistance, I can login from home అని అన్నాడు. నేను చెప్తే రానంటావా నీ సంగతి చూస్తా అని అరుస్తున్నాడు. Do whatever you want అని కాల్ కట్ చేశాడు. నిజానికి ఆఫీస్ కి పోయినా తన పని ఉండేది రెండు, మూడు గంటలే. అది చేసి మళ్ళీ ఇంటికి రావచ్చు. కానీ వర్ష కన్నీళ్ళను చూశాక అది అంత అవసరం అనిపించలేదు. ఇది పోతే ఇంకా ఎక్కడైనా చేసుకోవచ్చు అని తన మీద తనకు ఉన్న నమ్మకం.

5
ఎప్పుడు ఎగురుతూ గెంతుతూ నవ్వుతూ ఉండే వర్షను ఎందుకో ఈ మూడు రోజులు ఇట్లా ఉంటే చూడలేడు. ఒళ్ళో పడుకుని ఉన్నది లేచి అరేయ్ బ్లీడింగ్ ఎక్కువగా ఉంది రా అన్నది. కొన్నిసార్లు ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉంది పోతాడు. ఇప్పుడు అంతే తలను నిమురుతూ, మధ్య మధ్యలో జో కొడుతూ ఉన్నాడు, తాను మాట్లాడుతూ మాట్లాడుతూ అట్లాగే పడుకుంది. తాను లేచేసరికి చపాతీ చేసి అందులోకి బీట్రూట్ కర్రీ చేశాడు. ఐరన్ లాస్ ఉంటుంది అని ఎగ్స్ బాయిల్డ్ చేసి పెట్టాడు. వెళ్ళి లేపి తినడానికి తీసుకువస్తే హేమంత్ ప్లీజ్ ఈ బీట్రూట్ కర్రీ అసలు తినలేను, వేరే కర్రీ ఇవ్వు లేదంటే జామ్ పెట్టుకొని తింటా ప్లీజ్ ప్లీజ్ అని చేతులు దగ్గరికి పెట్టుకొని అడుగుతుంది. బ్లీడింగ్ ఎక్కువ ఉంది అన్నవ్ కదా తిను, రేపు లంచ్ కి బయటకి పోదాం, లేదంటే చికెన్ చేసి పెడ్తా తిను స్వీట్ హార్ట్ అని ప్లేట్ లో పెట్టుకొని తినపెట్టడానికి వచ్చాడు. నువ్ కూర్చొని ఉండు నేనే తినిపిస్తాలే అంటూ. వద్దురా ప్లీజ్ అంటున్న వినకుండా నేనే ప్లీజ్ అంటూ దగ్గరికి జరిగాడు. ఎప్పుడు ఇంతే నువ్వు, మూతి ముడుచుకొని దగ్గరికి వచ్చింది తినపట్టూ అంటూ. ఒక ముద్ద పెట్టుకొని, అరేయ్ రేపు చికెన్ చేసి పెడ్తావ్ కదా! కాజు చికెన్ చేసి పెట్టవా! లాస్ట్ టైమ్ సరిగా చేయలేదు. నీ అథెంటిక్ ఫ్లేవర్ మిస్ అయింది అంటూ తినేసింది.

కాలం ఎప్పుడు మనం అనుకున్నట్లు నడవదు. నడిస్తే అది కాలం అవదు. కాలం తెచ్చే మార్పులు ఊహకు అందకుండా ఉంటాయ్ కొన్నిసార్లు. ఉదయం లేచి చూస్తే ఆఫీస్ నుండి మెయిల్. Irresponsibleగా ఉన్నావ్ అని తనని terminate చేస్తున్నట్లు. తనకూ తెలుసు ఆ Irresponsible అనే పదం వాడకుండా తనని టెర్మినేట్ చేయలేరు అని. బ్లడీ హెచ్‌ఆర్ అని అనుకోని, ఇది కాకపోతే ఇంకోటి. ఏది రాకపోతే ఉన్న సేవింగ్స్ తో ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం nothing is more important than self-respect అని ఊరుకున్నాడు. వర్ష లేచిన తరువాత ఈ విషయం చెబితే you deserve better darling అని మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. ఛలో గో అండ్ ఫ్రెష్ అప్. కొమురమ్మ నాస్తా చేసిపెట్టి పోయింది. వస్తే తిందాం. అని తనని వాష్ రూమ్ వైపు నెట్టాడు.
6
హేమంత్ కి ఆఫీస్ లో కూర్చొని చేసే పని ఇక చేయదలచుకోలే ఏదైనా బిజినెస్ పెడదాం అనే ప్లాన్లో ఉన్నాడు. రెస్టారెంట్ అయితే తన టెస్ట్ కి తగినట్టు ఉంటుంది అని అదే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా సేమ్ ప్లాన్ ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎవరైనా ఇంటరెస్టింగ్ గా ఉంటే వాళ్ళతో కలిపి జాయింట్ గా పెడుదాం అని వర్షతో అంటే ప్లాన్ బానే ఉంది, మీ ఫ్రెండ్స్ ని అడిగిచూడు అన్నది. 
ఎప్పుడు తొందరగా వచ్చే కొమురమ్మ ఇంకా రాలేదు ఏంటి అనుకుంటుండగా తన కూతురును తీసుకొని వచ్చింది. బిడ్డకు పానం మంచిగా లేదు సార్, అందుకే కొద్దిగా లేట్ అయింది అని పనిలోకి పోయింది. పాపని దగ్గరికి పిలిచి ఏమైంది బేట అని అడిగాడు. కాసేపు సైలెంట్ గా ఉండి ఫీవర్ వచ్చింది అని చెప్పి కొమురమ్మ దగ్గరికి పోయింది. వర్షని పిలిచి పాపకి తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వు, షీ లుక్స్ సో వీక్, గివ్ సమ్ ప్రోటీన్ ఫుడ్, అండ్ మిల్క్ అని రూమ్ లోకి పోయాడు. వర్ష తనని దగ్గరికి పిలిచి ఫ్రీడ్జ్ లో నుండి ప్రోటీన్ మిల్క్ షేక్ పోసి ఇచ్చింది. అమ్మ పని చేసుకుంటది, మనం టీవి చూద్దాం రా అని పిలిచింది. వర్ష ఆఫీస్ కు సెలవు ఉన్నప్పుడు ఆ అమ్మాయి వస్తే తనతో కాసేపు మాట్లాడుతుంది. లంచ్ ఇక్కడే చేసిపో అని ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటారు ఉంటారు. ఇవ్వాళ ఎందుకో ఆ అమ్మాయి మూడీగా ఉంటే పక్కన కూర్చొబెట్టుకొని మాట్లాడుతూ ఉంది. మిల్క్ షేక్ తాగి గ్లాస్ కిచెన్ లో పెట్టి వచ్చింది. ఎప్పుడు వచ్చిన కాలేజ్ విషయాలో, ఫ్రెండ్స్ ముచ్చట్లో చెప్పే తాను ఇవ్వాళ ఎంత మాట్లాడించినా ముక్తసరిగా సమాధానాలే ఇస్తుంది. తనని అడిగితే పీరియాడ్స్ అక్క చాలా నొప్పిగా ఉంది అందుకే కాలేజ్ పోలేదు. ఇంట్లో ఒక్కదాన్నే ఉంటే భయం వేస్తుంది అని అమ్మతో కలిసి వచ్చిన అని చెప్పింది. అంతా పెయిన్ ఉంటే టాబ్లెట్స్ వేసుకోపోయావా అంటే ఏమో నాకు తెలియదు, అమ్మని అడిగినా ఏమి చెప్పలేదు అన్నది. సరే నేను ఇస్తా లే అని లోపలికి వెళ్ళి హేమంత్ ని టాబ్లెట్స్ అడిగింది. ఇప్పుడు ఎందుకు అని అన్నాడు హేమంత్. నాకు కాదు సామీ, కొమురమ్మ వాళ్ళ పాపకి అని తీసుకొని పోయింది. కొమురమ్మ పని అయిపోయింది వర్షమ్మా పోతున్నా అని పాపని తీసుకొని పోయింది. 
లోపలికి వచ్చి హేమంత్ కి పాప గురించి చెప్పింది వర్ష. తాను చెప్పిందంతా విని, ఫోన్ తీసుకొని ‘కొమురమ్మ పాపకి పానం మంచిగాలేదన్నావ్ కదా తనని జాగ్రతగా చూసుకో. తగ్గే దాకా పనికి ఏమి రాకు. డబ్బులు ఏమైనా కావాలి అంటే వర్ష దగ్గర తీసుకొనిపో’ అని ఫోన్ పెట్టేశాడు.

7
ఫోన్ పెట్టేశాకా, హేమంత్.. తాను రాకపోతే పని ఎవరు చేస్తారు. కనీసం నన్ను ఒక్కమాటైన అడగకుండా పనిమనిషిని రావద్దు అని ఎట్లా చెప్తావ్ అని అరవడం మొదలుపెట్టింది. 
‘అదేంటి వర్షా అట్లా అంటావ్, నువ్ అర్థం ఛేసుకుంటావ్ అనుకున్నా. పొద్దున పాపని చూసుంటావ్ కదా ఎంత వీక్ ఉందో, తాను చాలా వీక్ ఉందని నువ్వే వచ్చి చెప్పినవ్ కదా! తనని అట్లా చూడలేకపోయా అని, అందుకే కొమురమ్మను రావద్దు అని చెప్పిన. నీకు బాలేనప్పుడు నేను ఉన్నా కదా, ఆ పాపకి వాళ్ళ అమ్మ పక్కన ఉండాలని ఉండదా? అందుకే కదా అంతా వీక్ ఉన్నా తనతో వచ్చింది.’ 
అయినా నన్ను ఓ మాట అడగాలి కదా, నాకు ఈ పనులు సరిగా రావు అని తెలుసు కదా. అన్నీ తెలిసి ఎట్లా చేస్తావ్?
‘నేను చేస్తా కదా. మనం ఉండేదే ఇద్దరం, అప్పుడు ఆఫీస్ కి పోతున్నాం కాబట్టి పనులు ఇబ్బంది ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్న కదా నేను చేస్తాలే, నువ్ ఆఫీస్ కి వెళ్ళు’
నువ్వైనా చేయడం ఎందుకు, పనిమనిషిని పెట్టుకుందే మనం పనులు చేయొద్దని కదా!
‘కాసేపు నువ్ గట్టి గట్టిగా మాట్లాడటం ఆపితే నేను చెప్తా’
హా, ఏంటో చెప్పు. 
‘నీకు బాగా లేకుంటే నా తోడు కోరుకున్నట్లే ఆ అమ్మాయి. ఓ రెండు రోజులు మన పనులు మనం చేసుకోలేమా? ఎప్పుడు నోరారా కొమురమ్మ అని పిలిచే నీవు ఇవ్వాళ పనిమనిషి అన్నావ్. పని మనుషులు కానిది ఎవరు? మనం కాదా పనిమనుషులం. వాళ్ళు పని చేస్తే మనం ఉంటున్నాం. మనం పని చేస్తున్నందుకే మన కంపెనీలు బతుకుతున్నాయ్. నేను నా చిన్నప్పటి నుండి మా అమ్మ పనిచేయకుండా ఊరకే ఉండటం యేనాడు చూడలేదు. పీరియడ్స్ అనేవి వస్తాయ్, నొప్పి అని కూర్చుంటే పనులు ఆగిపోతాయ్ అని పనులు చేస్తూనే ఉంటారు. మన జెనరేషన్ కి ప్యాడ్స్ ఉన్నాయ్, నొప్పి ఎక్కువైతే టాబ్లెట్స్ ఉన్నాయ్, వాళ్ళకి ఏమున్నయ్? ప్యాడ్స్ లేని సమాజానికి అవి అందివ్వాలని ఓ మనిషి చేసిన ప్రయత్నాన్ని సినిమాగా తీసి కాపిటల్ చేసుకున్నారు. చివరకు వాటి మీద టాక్స్ వేసి ప్రభుత్వాలు బతుకుతున్నాయ్. ఈ ప్యాడ్స్, టాబ్లెట్స్ అనేవి కాస్త మధ్యతరగతి మనుషులకు అందుబాటులో ఉన్నాయ్. అవి ఉంటే అని తెలియని జనాలు ఉన్నారు. ఆ మూడు రోజులు ఓ మనిషి తోడు కావాలి ఉంటుంది అంటావ్ కాదా, అట్లాంటి స్థితిలో వాళ్ళను వెలివేసినట్లు వేరే రూమ్ లో ఉంచిన జనాలను ఎంత తిట్టుకున్నాం. ఇప్పుడేమో ఈ అమ్మాయి విషయంలో ఇట్లా అంటున్నావ్. కొమురమ్మ రానన్నీ రోజులు నువ్వు ఒక్క పని కూడా చేయకు సరేనా. నువ్వే ఓ సారి ఆలోచించుకో’ అని సైలెంట్ అయిపోయాడు. 
కాసేపటికి బెల్ రింగ్ అయితే వెళ్ళి తలుపు తీశాడు హేమంత్. ఎదురుగా కొమురమ్మ, వర్షమ్మ ఫోన్ చేసి రమ్మన్నది సార్ అంటూ లోపలికి వచ్చింది. కొమురమ్మ వెళ్లిపోయాక, వర్షని దగ్గరకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకొని క్రికెట్ మ్యాచ్ చూడటానికి హాల్ లోకి పోయాడు.