Monday, April 30, 2018

ఇంద్రావతి



ప్రవహిస్తున్నది నీరు కాదు
నెత్తురు
నెత్తురు ప్రవహించడం యే నదికి కొత్తకాదు
కొత్తళ్ళా దేహాలు ప్రవహించటమే
ముక్కలుగా నరికి గోతాల్లోకుట్టి
పడేస్తే అది చుండూరు
చుట్టుముట్టి కాల్చిచంపి
ఈడ్చుకెళ్లి పడేస్తే అది ఇంద్రావతి

గోదారి దాటిపోయిన మనుషులు
ఇంద్రావతిలో శవాలై తేలుతూ వస్తున్నారు
పుట్టపగిలి చీమలు వచ్చినట్లు కాదు
పొట్ట పగిలి పురుగులు పారుతున్న దేహాలై
కనుగుడ్లు, నోరు పురుగులు పారుతున్న దృశ్యం
ఇంద్రావతి ఇప్పుడు నెత్తురోడుతున్న దుఃఖచిత్రం

తెల్లవాడు నాడు నిన్ను భగత్ సింగ్ అన్నాడు
నల్లవాడు నేడు నిన్ను నక్సలైట్ అన్నాడు
కవి కాల్పనికుడు గనుక ఎట్లా అన్నాడో శ్రీశ్రీ
దేహాలను ముక్కలు చేసి నదిలో పడేయడం మాత్రం
యాదృశ్చికం కాదు
మొసలి తిన్నది నిజమే
ఆ మొసలి ఏమిటన్నదే తేలాల్సిన ప్రశ్న

ఇప్పుడిక ఎదురుపడడాలు లేవు
లొంగిపొమ్మనే హెచ్చరికలు లేవు
'ఆత్మరక్షణ'కై జరిపే కాల్పులు లేవు
'కట్టుకథ'ల అవసరం అసలే లేదు
ఉన్నదల్లా సమాచారం
'వాళ్ళు వస్తున్నారని తెలిసింది
వెళ్లి చంపి వచ్చాము
ఇది మా విజయం'
అనే ప్రకటనలే
డీజెలా ముందు గంతులే
చంపి పండుగలు చేసుకునే
రామరాజ్యం కదా

'సంపుకున్నా మీరే
సాదుకున్నా మీరే' అని
సాయుధులైన వాళ్లకోసం
కన్నీరు కార్చకండి
మౌనం దాల్చకండి
వీలయితే మౌనం వీడి మాట్లాడండి
ఎలిజిలు కాదు
గుండెకు గుండెకు మధ్య వారధి కట్టే
కవితొకటి రాయండి
కాగితంపై నాలుగు అక్షరాలై వాలండి
పదాల దండగుచ్చి వాక్యమై మారండి
ఓ నినాదం కండి
ఓ ర్యాలీ కండి
ఓ ధర్నానో, హర్తాలో కండి
కన్నీరు కార్చి మౌనంగా మాత్రం ఉండకండి

వాళ్లదాక వచ్చింది రేపు మనదాక రాకపోదు
అప్పుడు మనము ఏ నదిలోనో
పారే పంటకాల్వలోనే తెలుతాం
అట్లానే రావచ్చు లేదా ఇంకోలా రావచ్చు
తొలిపొద్దు వేళా తలుపు బద్దలు కావచ్చు
ఇంటికొస్తుంటే గయాబ్ కావచ్చు
అక్కడ అంత ధ్వంసం అయ్యాక
మన ఇంటి మీద సిరియాలా బాంబులే పడొచ్చు
రాజ్యం ఒక విచ్చుకత్తి
అది ఎప్పుడు విచ్చుకున్న ఎవరమో ఒకరం బలవ్వాల్సిందే

ఇంద్రావతిలో తేలుతున్నది దేహాలు కాదు
వారు కన్న కలలు
మనిషి మరణించడం విషాదమే కావచ్చు
కానీ, కలలు మరణించడం ప్రమాదం
వారు మరణించినా వారి కల బతికే ఉంది
బతికే ఉంటుందా....!?
అనేది మనమే తేల్చుకోవాలి
మనమిక కలల వైపా
కాల్పుల వైపా అని.

(ఇందులో కొంతభాగం ఆంధ్రజ్యోతి వివిధలో ప్రచురితం)

Wednesday, April 25, 2018

Another Sleepless Night 4



ఎప్పటిలాగే కొన్ని జ్ఞాపకాలు
కొత్త కవితకు జీవం పోస్తూ...

ఇంద్రావతిలో తేలుతూ దేహాలు
మిగిలున్న పోరాటాన్ని జ్ఞాపకం చేస్తూ...

జ్ఞాపకాల దేహాలు
పోరాట జీవితాలు
.............

Some memories as usual...
Giving birth to a new poem

Bodies bloating in Indravathi
Remembering the Remaining Struggle

Bodies with memories
Struggling lives

25/04/18
7.40am

Monday, April 23, 2018

శీర్షిక అవసరం లేని కవిత


చిదిమేయబడింది
వికసిస్తున్న పువ్వొకటి
ఇది మొదలా? పోనీ చివరా?

తాను అడిగింది...
కుంకుమ పూల సోయగాన్ని చూడాలని
తెల్లని మంచు నేలపై తిరగాడాలని
'తెల్లని మంచు నేల ఏనాడో ఎర్రబారింది' అన్నాను

'కునాన్ పోష్పోరా నుండి ఆసిఫా దాకా
వయా దండకారణ్యం' జరిగిన హత్యాచారాలన్ని
తన కళ్లముందు కదలాడాయి అన్నది.

'గుడిలో ఎంత దారుణం' అన్నారట ఎవరో!
'దారుణాలకు పుట్టుకే గుడి,
కావాలంటే మాతంగుల్ని అడుగు' అని
జవాబిచ్చిందంట....

ఇప్పుడిక కన్నీళ్లు కార్చడం కాదు
కత్తుల వాడకం నేర్పాలి
ఇంటిముందు ఆడుకోవడంతో పాటు
వేటకుక్కలను వేటాడటం నేర్పాలి అంటో
మాటల బుల్లెట్ల వర్షం అయింది

ఆసిఫా స్మృతిలో #విరసం నిర్వహించిన కవిసభ కోసం రాసింది

Saturday, April 21, 2018

Another Sleepless Night 3

రోడ్డు పక్కన సేద తీరుతో కార్లు
వాటిపై విశ్రమిస్తో కుక్కలు
...........

మెయిన్ రోడ్డుపై మలిగిపోయిన దీపాలు
దూరంగా సెల్ టవర్ పై ఎర్ర బుగ్గ
రాత్రి తిరగడం ఈ దేశంలో నిషిద్ధం నాయన అన్నట్లు
............

తడి చెత్తను, పొడి చెత్తను వేరుచేస్తూ కార్మికులు
మంచికి, చెడుకు మధ్య విభజన రేఖను గీస్తున్న స్వాప్నికులు
...........

రాత్రికి నిట్టాడు నేనే అంటూ
ఒంటరిగా నిలబడ్డ చాయ్ దుకాణం
రాత్రి బతుకులకు స్వాంతన
.............

తిరిగి రాగానే బుక్ షెల్ఫ్ పై రోహింటన్ మిస్ట్రీ
ఇకనైనా పూర్తి చేస్తావా లేదా అన్నట్లు......

ప్రేమలేఖ 7

మళ్ళీ ఒక నిద్రలేని రాత్రి గడిపి, ఉదయాన్నే పడుకుందాం అనుకుంటుండగా మార్నింగ్ కాఫీలా రూమి పలకరింపు.’నీ లోపలి అలల శబ్దాల్ని విను’ అంటూ. కొన్నిసార్లు నేనే సంద్రమయ్యాక, లోపలి అలలు తీరాన్ని తాకాలని, చేరాలని ఎంత ఎగిసిపడతాయి. అలలు ఎదలో రేగే భావాలయితే, తీరం నీవు. చెప్పలేదు కదూ... మొన్న ‘సంద్ర’ ప్రచురితం అయింది. సంసారిక పాఠకుల కోసం రోమాన్స్ ని, భావుకతని ఎడిట్ చేయగా, సంద్రకాస్త మడుగై ప్రచురితం అయింది. బేటుని ఎవరో అడిగారట. ‘సంద్ర’ నీపైన రాసిందా అని. దానికి తాను ‘కాదు. మా డాడీ , మా మమ్మిపై రాసిండు’ అన్నదట. ‘కరక్టే చెప్పిన కదా డాడీ’ అని అన్నది. రాసిన సంద్ర నువ్ కాకపోయినా. నువ్ మాత్రం ఎప్పటికి నా సంద్రానివే. మరి నేను? నిన్ను చేరేందుకు నదిని పట్టుకొని నిన్ను చేరిన పిల్ల కాలువని.

ఈ మధ్య లేఖ రాయక చాల రోజులైంది కదూ.ఏమని రాయమంటావు? దేని గురించి రాయమంటావు? ‘కనుగుడ్లు కన్నీరై స్రవించాయి’ అన్నాడో కవి. గడుస్తున్న నిద్రలేని రాత్రులు అట్లాగే ఉన్నాయి. ఈ దేశం భారత్ నుండి బలత్కారత్ గా పేరు మార్చుకున్నది. పసిపిల్లల దేహాలు కళ్ళముందు కదలాడుతుంటే కన్నీరు కాలువలై పారుతుంది. మనం ఎన్నిసార్లు అనుకున్నాం కాశ్మీర్ కి పోవాలని, కుంకుమ పూల పరిమళాన్ని, యాపిల్ హొటల సోయగాల్ని, మంచుకొండల అందాల్ని, పచ్చిక బయల్లను చూడాలని. కానీ ఎక్కడ చూసిన రక్తం మడుగులు ఉంటాయి అని అనుకోలేదు. కాశ్మీర్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ మాయమైన వాళ్ళు ఎందరో!? ‘మీకు మీ వాళ్ళు చనిపోతే శవాలన్నా ఇస్తారు. మా వాళ్ళు ఉన్నారో, చనిపోయారో తెలియకుండా బతుకుతున్నాం.’ అని అన్నా కాశ్మీర్ తల్లి మాటలకి ఎంత కరిగిపోయాం. మనం చూడాలనుకున్నా, పోవాలనుకున్నా, అస్వాదించాలనుకున్నా వాటిని చూసి, ఆస్వాదించి, ఆడీ, పాడిన ఓ పాపా మదొంమాదానికి చిధ్రం అయింది. ఆ పాపా గురించి రాద్దామంటే కవిత్వం కాదు కదా. పదాలు దొరకట్లేదు. అక్షరాలూ పొందట్లేదు.

‘స్వేచ్చ కోసం పోరాడే ప్రజలు, స్వేచ్చ అంటే ఏంటో తెలియకుండా హిట్లర్ లాంటి వాళ్ళను గెలిపించుకుంటారు.’ అన్నాడు విల్ హెల్మ్ రైక్ తన ‘లిసన్ లిటిల్ మ్యాన్’లో. ఇక్కడ అదే జరిగింది అనిపిస్తుంది. అయితే, జార్జ్ ఆర్వెల్ అన్నట్లు ‘ఉద్యమాలు విఫలం అయితే ఆ నేరం ప్రజలది కాదు. ఉద్యమకారులదే.’ అన్న వాక్యాలు గుర్తుకు వస్తాయి. అయినా మధ్య అతరగతి ‘స్వేచ్చ’కి పరిమితులున్నాయి. మధ్యలో ఉన్నారు కనుక వాళ్ళకి కింద ఉన్న వాళ్ళను చూసి సంతోషపడే బ్లడీ సాటిస్ఫక్షన్ ఉంది. అన్ని కులాలో, వర్గాల్లో ఉన్నా మధ్య తరగాత్రితో ఉన్న సమస్యే. పాలో ఫ్రేయిరి చెప్పినట్లు ‘సూపర్ వైజర్’ మనస్తత్వం కలిగిన వాళ్ళు కదా. తమపై జరుగుతున్న అణచివేతను ప్రతిఘటించలేక, తమ కింద వాళ్ళపై అదే అణచివేతను ప్రయోగించి సంతృప్తి పడతారు ఈ భద్ర జీవితాల బతుకుజీవులు. కొన్నిసార్లు అనిపిస్తుంది. వీళ్ళు వెన్నెముక లేని జీవులు అని. ఏదైనా ఒక సంఘటన జరిగితే దానికి అనుకూలంగా వచ్చే మెసేజెస్ ని పంపిస్తారు. దానికి వ్యతిరేఖంగా వచ్చే మెసేజెస్ ని పంపిస్తారు. అటువంటి వారిని చూస్తె ఒ వైపు కోపం, మరి వైపు జాలి కలుగుతుంది.

కొత్త కథ ఒకటి రాయడం అయిపొయింది. ఓ రోజు ఒక పిల్లా వచ్చి తన డిప్రెషన్ కి కారణమైన కథ చెప్పింది కదా! ఆ పిల్ల కథనే పేరు మార్చి రాసాను. నిజంగా మనసులో భావాల్ని పంచుకోవడానికి ఒక మనిషి లేకపోవడం ఎంత విషాదం. ఓ రోజు నీకు అంగారిక పూర్ణిమ కథ చెప్పిన గుర్తుందా? కథకి ఆ పేరే పెట్టా. అంగారిక అని. ‘నీ లోపలి అలల శబ్దాన్ని విను’ అని రూమి అన్నాడు గాని, అలల శబ్దాన్ని పంచుకొవాలనిపిస్తే? పంచుకోవడానికి ఓ మనిషి కూడా లేకపోతే? అది ఎంత ఘోరమైన విషాదం. అంగారిక పరిస్థితి అదే కదా. అంగారిక నిజానికి సర్వనామం. అనేకానేక మంది అనామకులకు ఈ అంగారిక ప్రతిక.

Tuesday, April 17, 2018

మనం స్నేహితుల్లా మొదలయ్యాం

అనేకమార్లు గాయపడి
మళ్ళి గాయపడేందుకు భయపడుతు
అప్పుడు ఇప్పుడు ఒకర్ని ఒకరు చూసుకునే
ఇద్దరు మిత్రులలానే మనం మొదలయ్యాం

మెల్లిగా మనం సుదూరపు నడకలు పంచుకోవడం మొదలెట్టాం
అంతేనా... మన మాటల్లో భావాల్ని పంచుకోవడము
అంతేనా.... మనిద్దరి మధ్య ఇష్టమూ పెరిగింది
అప్పుడు, మనిద్దరికీ ఏదో ప్రత్యేక బంధం ఉన్నట్లు తెలుసుకున్నాం

తీవ్రంగా గాయపడిన హృదయాలు
మళ్ళీ ప్రేమలో పడుతాయని అనుకోని ఉండవు
మళ్ళీ దొరుకుతుందేమోనని రహస్యంగా కాంక్షించింది
ఎవరో ఒకరు కాస్త మనశ్శాంతిని ఇస్తారనే

లోలోపల కోల్పోయిన ప్రేమను
దూర, విశాల ప్రాంతలంతా వెతికిన హృదయం.
ఏదో ఓ నక్షత్రపు తోవలో దొరకదా!
అని దూర దూరాలు తిరిగిన మనసు

నా కోరిక తీరే రోజు రానే వచ్చింది
నాకు మళ్ళీ ప్రేమ దొరికింది, అది నీవే
నా మనసులో కోల్పోయిన ఒక ముక్క
నువ్ నన్ను సంపూర్ణం చేసిన నా అందాల చుక్క

Alan W Jankowski కవిత' 'We Started As Friends'కి తెలుగు అనువాదం

వసంతం నుండి శిశిరం వైపు



వసంతం వాడిపోయింది
కడలెందుకో చిన్నబోయింది

ఆశలన్నీ చిగురించే వసంతం
కొత్తపొద్దుల వసంతం’
అందమైన వసంతం
పెనవేసుకున్న వసంతం
ఎందుకో వాడిపోయింది

అలలపై ఊయలుపిన కడలి
ముంచేస్తూ ఎగిరేస్తూ ఆడించిన కడలి
ఎందుకో చిన్నబోయింది

నిత్య శరత్కాలపు వెన్నెల
వెలుగులు పంచే వెన్నెల
దూరాలను దగ్గర చేసే వెన్నెల
ఎందుకో మౌనందాల్చింది

నా ఎదను తాకిన వాన చినుకులు
తన కన్నీళ్లు కాబోలు

(తవ్వకాల్లో దొరికిన పాత కవిత)

Saturday, April 14, 2018

చూపు

ఆమె  నవ్వుతూ చూసే చూపులో
అబ్సలుట్ మత్తు ఉంది
అయినా
ఆ రెప్పల మాటున
కనుగుడ్లకు ఆవల 
పోటెత్తేందుకు సిద్ధంగా 
ఓ సంద్రముంది

Friday, April 13, 2018

Another Sleepless Night 2

నిదురపోతున్న నగరం
నడిబొడ్డున సెంట్రీ కాస్తూ బుద్ధుడు
....................
మీ బద్దకాల బతుకులకు భరోసా
నేనంటూ రాత్రీ పగలోలే ఛాయ్ బిస్కట్
పర్సులో మరిన్ని కాసులుంటే
ఖీమా - రోటీ, పాయ - బన్
.......................
పగటి సమూహాల చెత్తను
ఎత్తిపోస్తూ రాత్రి కార్మికులు
........................
సగటు మనిషి జీవితంలాగా
మిణుకు మిణుకుమంటూ విద్యుత్ దీపాలు
.........................
ఈ దేశ చిత్రపటాన్ని
తమలో చూపుతూ గుంతల రోడ్లు
..........................
జీతమాంధ్యమేమో! 
'రేయ్ బండి తీయ్' అంటూ మామూళ్ల మావలు
...........................
'ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము
నిప్పులలో కరిగిపోయే' అంటూ ఎదలో గీతం
రవింద్ర భారతి దాటుతుండగా

Thursday, April 12, 2018

Another Sleepless night

బాల్కనీ గోలెంలో కదలాడుతున్న 
నీళ్లపై నెలవంక
అలలపై వాలిన సెంద్రవంక
.................

చాయ్ తో నా సంభాషణను చెడగొడుతూ
పక్కనే వచ్చి ఆగిన బస్సు
ఉద్యమ ఉధృతి చాటింపులో దహనమైన అమర
...................

కడుపులో ఆకలి శబ్దాల్ని విన్నదేమో!
వస్తున్న ఆగు అన్నట్లు
పొయ్యిపై సుయ్ మనే సప్పుడు
....................

కిటికీలోంచి చూస్తే దూరంగా 
రాలిపడుతూ ఆకు
ఏ అడవిలో తూట పేలిందో?
ఎవరు నేలకొరిగారో?

Monday, April 9, 2018

సంద్ర



సార్ పోస్ట్.
పడకదిగి వెళ్లి పోస్ట్ తీసుకున్నా.
ఎవరు రాశారు అని చూస్తే,

To,
Dear poet.

From,
సంద్ర

ఏం రాసుంటుంది. అని తెరచి చూస్తే,

'మై డియర్ పోయెట్, కవిత్వం అంటే పారిపోయే నీవు ఎంత బాగా రాస్తున్నావ్. ఎప్పుడు అకడమిక్ పుస్తకాలు దాటి చూడని నీవు. ఈ మధ్య లేఖలో రాసే ప్రతి వాక్యంలో వచనమే రాస్తున్నావ్. క్రితంసారి నువ్ రాసిన లేఖ ముగింపునీ ఎన్నిసార్లు చదువుకున్నానో. "నీవు లేని కాలమంతా/ కన్నీళ్లయి కారిపోయి/ కవిత్వమై కళ్లముందుకు వాలింది. నీవే రాకుంటే/ నీ పరిచయమే లేకుంటే/ నాకు నేనే కొత్తగా/ ఎన్నటికీ తెలిసేవాణ్ణి కానేమో. నీవక్కడా/ నేనిక్కడా/ దూరాల్ని దగ్గర చేస్తూ/ ఈ అక్షరాలు/ ఈ ఉత్తరాలు." నచ్చిందోయ్. నిజంగా. ఒక్కమాట చెప్పనా, నాకన్నా బాగా రాస్తున్నావ్. ప్రౌడ్ ఆఫ్ యు స్టుపిడ్. నా రీసెర్చ్ మొత్తానికి అయిపోయింది. అది అయిపోగానే నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఒకటే ఆత్రం. కండ్లనిండా నింపుకొని ఎన్నాళ్ళయింది. ఈ ఐదేండ్ల ఎడబాటును చెరిపేస్తూ నీ దరికి వస్తున్న.'
బోలెడంత ప్రేమతో.
  సంద్ర

అచంచలమైన ప్రేమను లేఖల్లో వ్యక్తపరచే తాను, ఐదేండ్ల తరువాత కళ్లముందుకు వస్తున్నట్టు రాసింది. ఎప్పుడు వస్తుంది. మళ్ళీ చదివా. తారీఖు చూస్తే రేపే వస్తున్నట్టుంది.

తన జ్ఞాపకాల్లో కాలం గడిచిపోయింది. గడచిన కాలమంతా ఒకవైపు. ఆమెతో కలసి నడచిన కాలం ఒకవైపు. స్వేచ్ఛగా ఉండటం అంటే ఏమిటి? అని ఎవరైనా అడిగితే తనని చూపిస్తే సరిపోతుందేమో. తన స్వేచ్ఛను ప్రకటించి పోయిన తాను, ఎప్పటిలాగే ఉత్తరమై పలకరించింది. ఈసారి ఎడబాటును ఓపమని గాక ఎడబాటును చెరిపెయ్య వస్తున్నట్టు.

ఇప్పుడంటే ఇట్లా రాస్తున్నాను గానీ తన పరిచయం లేకముందు ఎంత ముభావంగా ఉండేవాన్నో తలచుకుంటే నవ్వొస్తుంది. ఎంత అందమైనవి తన తలపులు, కేవలం అందమైనవేనా? అద్భుతమైనవి. నగ్నదేహంపై పారాడే సీతాకోకచిలుకలు పెట్టె చక్కిలిగింతలు.

'ఇన్ని నే న దినాన/ పన్నిన వ్యూహాన/ నిన్నెక్కడ కలసికొనినానో స్మృతికిరాదుగానీ/ నీవు లేవనునట్టి కాలమే లేదు నాకు"  బాలగంగాధర్ తిలక్, ఎవరెస్టు కైతను మా ఇద్దరి గురించి చెప్పేందుకే అనువాదం చేసిండా ఏందీ! అనే అనిపిస్తది. 'తాను నిదురించక నేను నిదురించు శయ్య గృహము నాకు పచ్చి శూన్యమ్ము' నాకోసమే చేశాడా అని అనిపించేలా ఉంటుంది 'నీవు'. తనతో కలసి ఉన్న కాలమంతా అక్షరాల ఆధారాలు అమృతం కురిపించిన రాత్రులైతే, తాను దూరమున్న కాలమంతా జ్ఞాపకాలతో గరళం గొంతులోకి దిగిన రోజులు.

ఎట్లా వచ్చింది తను జీవితంలోకి. గుడ్లగూబ కళ్ళది. ఇంతిత కళ్లేసుకొని, కోరుక్కు తినేలాచూస్తూ. మగాళ్ల కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడటం ఈ సమాజంలో మాములు విషయం కాదు. ఏంటి ఈ పిల్ల ఇట్లా కళ్ళలోకి చూస్తూ మాట్లాడుతుంది అనుకునేవాణ్ణి. ఓ రోజు యూనివర్సిటీలో నడుస్తూ ఉంటే వెనకనుండి నెత్తిపై మొట్టి, వెనక్కి తిరగగానే కౌగిలించుకుంది. 'ఏంట్రా ఈ మధ్య కనపడట్లేదు' అని అత్యంత సహజంగా అడిగింది. ఏంటి ఈ పిల్ల పరిచయమై నాలుగు రోజులన్నా కాలేదు. ఎదో ఏండ్ల నుండి సావాసం ఉన్నట్లు మాట్లాడుతుంది. నడిరోడ్డుపై కావలించుకుంటుంది. ఈలోకంతో పట్టింపులేనట్లు. జనాలని, జనాల చూపుల్ని తప్పించుకు తిరగడం నాతో కాట్లేదు. ఈ పిల్లేమో తనకు లోకంతో, లోకులతో సంబంధంలేనట్లు వెళ్లిపోతుంది.

ఏదో ఓ సందర్భంలో కలవడం, మాట్లాడటం దినచర్యలాగానే అయిపోయింది. ఓ రోజు తన స్నేహితురాలి ఇంటికి పోవాలి రా అని పిలించింది. వెళ్లి వాళ్ళింట్లో కూర్చోని మాట్లాడుతుంటే ఓ ముసలమ్మ వచ్చి మా ఇద్దరిని, పరీక్షగా తనను చూసి మా ఎదురుగా కూర్చుంది.
'ఓయ్ అమ్మాయ్, ఎప్పుడు చూసినా మగరాయుడిలా ఆ ప్యాంటు, షర్టు వేసుకుని రాకపోతే ఎంచక్కా లంగా, ఓణిలో రావచ్చు కదా!'
'రాకూడదని ఏమి లేదు బామ్మ, కానీ లంగా, ఓణిలో బండిపై ఆటోకాలు, ఇటోకాలు వేసుకొని కూర్చోవడంకాదు అనే వేసుకోట్లేదు. ఈ ప్యాంటు, షర్టుల కన్నా కూడా చిన్న చిన్న నిక్కర్లు బాగా సౌకర్యంగా ఉంటాయి బామ్మ. వచ్చేసారి అవి వేసుకొని వస్తాలే'
ఏందీ ఈ పిల్ల ఇంత బాంబు పేల్చేసింది? ఇంకాసేపు ఉంటే ఏమేమి అంటుందో, అసలే ఆ ముసలావిడ అదోలా చూస్తుంది. ఈ పిల్ల అన్న మాటలకు ముసలామే ఊకుంటదేమో అనుకున్నా.

అంతలోనే అవును అమ్మాయ్ ఇంతకీ మీరేంటి?
'మీరేంటి అంటే ఈ దేశంలో, మీదే కులమనేగా? అదేనా బామ్మ నువ్వు అడుగుతుంది.
- అవుననుకో
'నాకు ఒక కులమంటూ లేదు. అయ్యదో కులం. అమ్మదో కులం. ఇక మతమంటావా! నాన్న కొద్దిగా భక్తుడు. అమ్మకు ఏ నమ్మకాలు లేవు.
అంటే దేవుడ్ని కూడా నమ్మదా ఏంటి?
ఉంటే కదా బామ్మ నమ్మడానికి. అయినా తెలియక అడుగుతా పెండ్లాన్ని అడవికి పంపినోడు, ఏడుగురు సవతులు తెచ్చినోడు, జూదంలో పెట్టినోడు, సంతలో అమ్మినోడు ఆదర్శం ఎట్లయిండ్రు బామ్మ.
ఏందో అమ్మా బొత్తిగా ఈ కాలం పిల్లలకు భయము, భక్తి లేకుండా పోతుంది. అంటూ వెళ్ళిపోయింది.


2.
ఉదయాన్నే లేవగానే తన నుండి ఫోన్, ఆర్జంట్ గా హాస్టల్ కి రమ్మని. వెళ్లి వేచి చూస్తుంటే మెల్లిగా వచ్చింది. మోకాళ్ళపైకి షార్ట్, క్రాప్డ్ టాప్ తో. జనాల కళ్ళన్ని తన కాళ్ళ మీదే. వచ్చి బ్యాగులోంచి ఓ పుస్తకం తీసి, పెన్ను ఉందా అని అడిగి ఎదో రాసిచ్చింది. రూంకెళ్ళేదాక పుస్తకం చూడొద్దని బాసతీసుకుని మరీ.

రూంకి వెళ్లి ప్రాజెక్ట్ వర్క్ రాస్తుండగా ఫోన్ చేసింది. రేయ్ ఇంతకీ చదివావా? లేదా అని. అప్పటికి గానీ గుర్తుకురాలేదు. తను పుస్తకంలో రాసిన సంగతి. 'లేదు. ప్రాజెక్ట్ వర్క్ రాస్తున్న, చదువుతా' అన్నా. 'నువ్వు, నీ ప్రాజెక్టు వర్కులు, సెమినార్లు, ఇవేగాకా జీవితంలో చెయ్యాల్సినవి చాలా ఉన్నాయిరా బాబు. ముందు అది చదివి కాల్ చెయ్'
అప్పుడు తెరిచా పుస్తకాన్ని, తను ఏం రాసిందో చదవడానికి.

మై డియరెస్ట్.
“I love you without knowing how, or when, or from where. I love you straightforwardly, without complexities or pride; So I love you because I know no other way than this: where I does not exist, nor you, so close that your hand on my chest is my hand, so close that your eyes close as I fall asleep.” పాబ్లో నెరుడా
నా ఇష్టాన్ని వ్యక్తపరిచేందుకు ఇంతకన్నా గొప్ప వాక్యాలు రాయలేను. నా భావాల్ని చెప్పేందుకు సరిపోయే నా ప్రియకవి పాబ్లో కవితని పంపుతున్నా. కవితలో ప్రతి పదం, ప్రతీ పాదం నీపై నా అనుభూతే. నీది సహానుభూతి కావాలని ఆశిస్తూ. నీ సమాధానంకై వేచి చూస్తూ.
సంద్ర

పుస్తకంలో తను రాసింది చదవగానే కాల్ చేశా.
:ఏంట్రా చదివావా?'
- చదివాను, నువ్ ఏదో ఇష్టాన్ని చెప్పాలని రాశావ్. ఆ కవిత సరిగా అర్థం కాలేదు. నువ్వంటే నాకు ఇష్టమే కానీ, ఇంతకీ అనుభూతి, సహానుభూతి కావడం అంటే ఏంటి?
'ఒసేయ్, పిచ్చిమొద్దు. అంతలా నీకోసం రాస్తే అర్థం కాలేదు అంటావేంట్రా!'
- నిజంగా అర్థం కాలేదు.
'అది ప్రేమలేఖరా బాబు, నిన్ను ప్రేమిస్తున్నాని లేఖ రాశా'
ఊహించని పరిణామానికి నా వైపు నుండి నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని బద్దలుకొడుతూ, 'రేయ్ నాకు అనిపించింది చెప్పిన, నీకు ఏమనిపిస్తే అది చెప్పు.' అని ఫోన్ పెట్టేసింది.

మర్నాడు యూనివర్శిటీలో కలిసింది. ఏమి జరగనట్టే, ఏమి ఎరగనట్టే అత్యంత సహజంగా, ఎప్పటిలాగే పలకరించింది. కాసేపు అలా దిక్కులు చూస్తో, మధ్యలో మధ్యలో పుస్తకాన్ని తిరగేస్తో మాట్లాడుకున్నాం. మాటల్లో మాటగా, అవును. నిన్న ఎందుకు లేఖ రాశావ్? అని ఆడిగేసా.
'ఎందుకో రాసానో నిన్ననే చెప్పాను కదా' ఒక్కటే సమాధానం.
అసలు ఎందుకు రాశావ్, మరో ప్రశ్న
అదికూడా నిన్ననే చెప్పిన కదా, మళ్ళీ అదే సమాధానం.
అదే ఎందుకు.
పైకి ఇలా ముద్దపప్పులా కనిపిస్తావ్ గానీ, నీకు సమాజం పట్ల మంచి కన్సర్న్డ్ ఉంది.
అయితే ప్రేమిస్తారా?!
నాపట్ల కూడా అంతే కన్సర్న్డ్ ఉంది. అందుకు ప్రేమించా.
నీకెలా తెలుసు? నాకు కన్సర్న్డ్ ఉందని.

వేసుకున్న బట్ట కాస్త పక్కకి తొలగితేనే, చూపులు తిప్పకుండా, కళ్ళతోనే అనుభవించి స్ఖలించే చోట, నువ్వెప్పుడు ఏ అమ్మాయిని అట్లా చూడలేదు. అంతెందుకు ఇంత పొట్టి పొట్టి బట్టలు వేసుకు తిరిగే నన్ను, నాలాగే చూశావ్. నీ దోస్తులంతా, నా బట్టల్ని కామెంట్ చేస్తుంటే 'ఆమె బట్టలు ఆమె ఇష్టం. ఆమెకి సౌకర్యంగా ఉంటే సరిపోతుంది. సెక్సప్పీల్ చూడాల్సింది బట్టల్లో కాదు. నువ్వు షార్ట్ వేసుకు తిరగడానికి, ఆమె ఫ్రాక్ వేసుకొని రావడానికి పెద్ద తేడా ఏమీ లేదు. మీరు చూసే చూపుల్లో తప్ప, ఆమె బట్టల్లో తప్పు లేదు.' అమ్మాయిని మాంసపు ముద్దగా చోట, ఆమె వ్యక్తిగత స్వేచ్ఛని గౌరవించిన నువ్వు, నచ్చేసావ్. పైకి కనిపించే ముద్దపప్పువేం కాదు అనిపించింది అప్పుడు.

సంద్ర ఒక మాట చెప్పనా. నీలాంటి ఆధునిక ఆలోచనలు కలిగిన అమ్మాయితో కలిసి బతకాలంటే నేనూ నీలాగే ఉండాలి. నేను కాస్త రిసర్వడ్, నువ్వేమో అలా కాదు. కలిసిన వెంటనే కలిసిపోతావ్. నాలుగు రోజుల్లోనే ఆ మనిషిపై ఒక అంచనాకి వస్తావ్. ఇదిగో ఇలా కలిసి నెల రోజులన్న కాలేదు ప్రపోస్ చేశావ్. నేను ఇలాగే ఉంటాను. నీలాగ ఉండలేను.
- ఓసే ముద్దపప్పు, నువ్వు నీలాగ ఉన్నావు కాబట్టే నచ్చావ్. నాలాగా ఉండాలనే, మారాలనే స్వార్ధమేమి లేదు నాకు. అయిన నువ్వు నీలాగే, నేను నాలాగే ఉంటూ, ఇద్దరం ఒక్కటిగా ఉండటం ఎంత బావుంటుంది. నువ్వు నన్ను నీలా మారమని కాకుండా, నాలా ఉండలేనని అంటున్నావ్ చూడు అందుకు ఇంకా నచ్చావ్. నువ్వు నీలాగే ఉండు. నన్ను నాలాగే ఉండనివ్వు. నీకు ఇష్టముంటే, నేను ఇంకొకడిని చూసుకోక ముందే చెప్పు.
అంటే నాకోసం, నా జవాబు కోసం ఎదురుచూడవా.!?
ఈ ఎదురుచూపులు, నువ్వు కాదాన్నవనీ కన్నీరు మున్నీరై విలపించడాలు సినిమాల్లో బాగుంటాయి. నా వంటికి వాటికి పడవు. నువ్వు నచ్చావని నేను స్వేచ్ఛగా చెప్పినపుడు. నీకు నచ్చలేదనో, ఇంకేదో చెప్పే స్వేచ్ఛ నీకుంది. సరే నేను మీటింగ్ కు పోవాలి. కలుస్తా.

3.
కాలం ఎవరి కోసం ఆగదు కదా. కాలం ఒక జీవనది. అది ప్రవహిస్తూనే ఉంటుంది మనము ఆ నదిప్రవాహంలో పడి కొట్టుకుపోవాల్సిందే. మేము అంతే. ఎప్పటిలాగే రూంకి వచ్చిన సంద్ర. రేయ్ నాకు సముద్రం చూడాలని ఉంది అంది. సరే, ప్లాన్ చేద్దాం లే. లేదు, ఇవ్వాలే వెళ్దాం. ఏంటి పిచ్చా, హైదరాబాద్ కి ఎటు పది గంటలు పోతేగాని సముద్రం లేదు. నాకదంతా తెలియదు మనం వెళ్తున్నాం. ఇప్పటికిప్పుడు టికెట్లు ఎట్లా? నేను బుక్ చేస్తాలే. కాసేపు ల్యాప్ టాప్ మీద గడిపి ఆ రాత్రికే గోవాకి రెండు టికెట్లు బుక్ చేసింది.  ఉదయానికల్లా చేరుకున్నాం. దిగగానే క్యాబ్ తీసుకొని హోటల్ కి పోయి, లగేజ్ దింపగానే, రేయ్ నడువ్, బీచ్ కి పోదాం. కాసేపు ఆగు సంద్ర. నైట్ నిద్ర లేదు, లేచాక పోదాం. వస్తున్నావా? లేదా. సరే నడువు వస్తున్న.

బీచ్ కి వెళ్ళగానే తీరంలో కూర్చోని తదేకంగా సముద్రం వంక చూస్తుంది. అంతలా ఏం చూస్తున్నావ్ సంద్ర. ''ఎగిసిపడే అలల్ని. తీరం తాకి, వెనక్కి మల్లె అలల్ని. అలలు సముద్రంలోకి పోతున్నప్పుడు జాలువారే ఇసుకని. అదుగో దూరంగా నేల, ఆకాశాన్ని కలుపుతున్నట్టు ఉన్న దృశ్యాన్ని. సముద్రాన్ని తాకుతున్నటు కనిపిస్తున్న మేఘాల్ని. ప్రశాంతంగా అలలు చేసే శబ్దాన్ని విను. ఏ సంగీతకారుడు పలికించగలడు దీన్ని." సముద్రం అంటే అబ్సెషన్ ఎందుకు సంద్ర. నేనే సముద్రం కాబట్టి. అవును. నీలోతు,ఆలోచనలు, నువ్వు కొన్నిసార్లు మాట్లాడే మాటలు, వాటి అర్థాలు ఇప్పటికి అర్థంకావు నాకు. భవిష్యత్తులోనైనా అర్ధం అవుతాయో లేదో. ఎప్పటి నుండో అడగుదాం అనుకుంటున్నా, సంద్ర అంటే అర్థం ఏమిటి? సంద్ర అనే పేరు ఉందో, లేదో తెలియదు. అమ్మకి సముద్రం అంటే ఇష్టం. అందుకే సముద్రాన్ని షార్ట్ గా చేసి, మా అమ్మ పెట్టింది సంద్ర అని. నాకు సముద్రాన్ని చూడడం అమ్మతోనే అలవాటయింది. నాన్న దూరమయ్యాక ఇద్దరం ఇలా సముద్ర తీరంలో గంటలు, గంటలు, రోజులు, రోజులు గడిపేవాళ్ళం. అమ్మ లేకుండా సముద్రాన్ని చూడటం ఇదే మొదటిసారి అంటూ భుజంపై తలవాల్చింది.

ఎప్పుడు గంభీరంగా కనిపించే సంద్రలో, పైకి ప్రశాంతంగా కనిపించే సంద్రంలో ఇంత విషాదమూ ఉందా. అయిన బయట పడదేంటి. ఏమో ఈ పిల్ల అర్థం కాదు. అర్థమయినట్టే అనిపించే అర్థంకాని పిల్ల.

సూర్యుడు సముద్రంలోకి మాయమయ్యే దృశ్యాన్ని చూపిస్తూ, మెడపై చేతులు వేసి కావలించుకుంది. వదులు సంద్ర, చుట్టూ జనాలున్నారు. అంటే జనంలేకపోతే ఏమికదా?. సంద్ర ప్లీస్. "If you don't stop talking, I'll shut your mouth with mine, and start loving you. I'll take your breath". సంద్ర చాలు ఎక్కువైంది. ముందు ఇక్కడి నుండి పోదాం పదా. నోటిలో మాట నోట్లో ఉండగానే, మూసేసింది. విదిలించుకొని ఊపిరి ఆగిపోయేలా ఉంది సంద్ర. ఆగిపోతున్నప్పుడు చెప్పు ఊపిరి ఊదుతా అని, ఊపిరిపోయడం మొదలెట్టింది. కాసేపటికి ఊపిరూదడం ఆపి, ముద్దుకు స్పందించడంరాని Unromantic fellow అని రూంకి వెళ్ళిపోయింది.

రూంకి వెళ్ళేసరికి గాలిలో మేఘాలు తయారుచేస్తూ తాను. పక్కనే కిటికీలోంచి పడే వెన్నెల. వెన్నెల వెలుగు తనపై పరచుకుని, ఎప్పటికన్నా మరింత ప్రకాశవంతంగా తాను. డోర్ దగ్గర నిలబడి అలానే చూస్తుండి పోయా. ఆ అందాన్ని. మెల్లిగా కన్నుగీటి. పెదాలు సున్నాలచుట్టి ఓ గాలి ముద్దు పంపింది. కిటికీ తెరచి ఉందేమో? గాలితో పాటు తాకిన ముద్దుతో సోయిలోకి వచ్చా.

పొద్దటినుండి అలసిపోయి బెడ్ పై పడుకోగానే, వచ్చి పక్కన పడుకుంది. మాటల్లో కాసింత కాలం గడిచిపోయింది. కాసేపు మాటల్లేని యుద్ధం. గెలుపోటములు లేని యుద్ధం. రక్తపాతాలు లేని జలపాతాల యుద్ధం. యుద్ధం ముగిశాక. తొలికలయికలో కార్చిన కన్నీళ్లను తాను దాచాలనుకున్నా, చెదిరిన కాటుక తన కన్నీళ్లకు సాక్షం చెప్పింది. కన్నీరు వస్తున్న భరించడం దేనికి అంటే, కొన్ని తీపి బాధల భరింపు బాగుంటుందని. పక్కదిగి కాసేపు కిటికీలోంచి బయటకు చూసి, ఏదో రాసుకుంది.

పొద్దున్నే లేచే వరకు చుట్టూ చేతులు వేసి అల్లుకొని పడుకుంది. మెల్లిగా పక్కకు జరిపి పడకదిగి టేబుల్ ముందు కుర్చీలో కూర్చొని చూస్తుంటే, దూరంగా సూర్యోదయం. పక్కనే రాత్రి తాను రాసిన పుస్తకం. తెరచి చూశా.

"కిటికీలోంచి బయటకి చూస్తే, చూపుకు దగ్గరగా, అయిన అందుకోలేనంత దూరంగా సముద్రం. తీరాన్ని తాకుతూ అలలు. తీరాన్ని తొలుస్తూ అలలు. అక్కడ అలలు తీరంతో సంగమిస్తున్న అద్భుత దృశ్యం. ఇక్కడ అలసిపోయి, ఏసీలోనూ చెమటలు కక్కుతూ రెండు దేహాలు. నుదుటిపై స్వేద బిందువులు. ఏసీ గాలికి ఎగిరిపడుతూ వాడి తల వెంట్రుకలు. అనిర్వచనీయ ప్రేమను వ్యక్తికరించిన క్షణాలు. గుర్తుకురాగానే ఎరుపెక్కిన బుగ్గలు. వాన్నలా చూస్తుంటే మళ్ళీ ఓసారి ఊపిరి ఆపేసినంత పనిచేసి ఊపిరి పోయాలనిపిస్తుంది."  Such a naughty girl. అని నవ్వుకొని మళ్ళీ పడుకున్నా.

4
ఓరోజు హడావుడిగా రూంకి వచ్చి, రేయ్ నాకు oxfordలో సీటు వచ్చింది. ఇంకో పది రోజుల్లో ప్రయాణం. What? అంటే ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్తావా!? నీకు తెలుసుకదా నాకు అక్కడ చదవడం కల అని, అయినా నేనేం నిన్ను వదిలేసి పోట్లేదు. రీసెర్చ్ కోసం పోతున్నా. మళ్ళీ వస్తా కదా. ఊహు, వెళ్లడం మానెయ్. ఇక్కడే రీసెర్చ్ చేద్దాం. సారీ డార్లింగ్, నో కాంప్రమైజ్ ఆన్ మై డ్రీమ్. అయిన నీకు ముందే చెప్పిన కదా. కొత్తగా ఇదేంటి. డోంట్ బి పోసేసివ్. అదంతా నాకు తెలియదు. కాంట్ లివ్ వితౌట్ యు. డోంట్ బి స్టుపిడ్. జస్ట్ కాంసెంట్రేట్ ఆన్ యువర్ రీసెర్చ్. వద్దు సంద్ర. ఉండిపో ఇక్కడే. ఆ రీసెర్చ్ ఏదో ఇక్కడే చేసుకో. అయినా ఎవరి ఇష్టానికి వారి ఉందాం అనుకున్నాం కదా. నేను అక్కడ సీట్ రావడం కోసం ఎంత కష్టపడ్డానో తెలుసుకదా. నువ్వే కదరా రాత్రంతా మెలకువుండి మరి నన్ను చదివించింది. ఒక్క ఫైవ్ ఇయర్స్ యే కదా. నీ రీసెర్చ్ కూడా అయిపోతుంది అప్పటికల్లా. నాలుగేళ్లలో ఫినిష్ చేసేందుకు ట్రై చేస్తా. అంతే అంటావా? అంతే. సంద్ర ఫిక్స్ అయితే ఎవరి మాట వినదు తెలుసు కదా. అయిన ఇది నా స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలకు సంబంధించిన విషయం. అవసరమైతే నిన్నే వదిలేసుకొని పోతా. సరే పో, బాయ్. వెళ్తున్నా వెళ్తే మళ్ళీ రాను. నా నిశ్శబ్దాన్ని బద్దలుకొడుతూ డోర్ గట్టిగా వేసి పోయింది. తన స్వేచ్ఛను ప్రకటించి మరీ.

రెండు రోజుల తర్వాత క్యాంటీన్లో కలిసింది. ముఖం తిప్పుకుని వెళ్లిపోతున్న తన ముందుకు వెళ్లి, క్షమాపణ అడిగా. 'నువ్వు నీలాగా, నేను నాలాగే ఉండాలనుకున్నాం. నువ్వెప్పుడు నన్ను ఇది చెయ్యి, అది చెయ్యకు అనలేదు. నా ఇష్టానికి నన్ను వదిలేశావ్. నా తప్పుల్ని అర్థం అయ్యేలా చెప్పావ్ తప్పితే ఆధిపత్యం చెయ్యలేదు. నేను మాత్రం నీ కలని నాకోసం వదులుకో అన్నా ఎంత స్వార్ధపరుణ్ణి నేను. నువ్వు నీ ఇష్టమైన చోటికి వెళ్ళు. నీ ఇష్టమైనప్పుడు రా. అంతవరకు, అంతే ప్రేమతో ఎదురుచూస్తుంటా'. మాట్లాడటం అయిపోగానే గట్టిగా హత్తుకుంది.
సంద్ర రేపటి నుండి నిన్ను కలవను. మాట్లాడను. నువ్వు లేకుండా ఉండడం అలవాటు చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. యూనివర్శిటీలో జాయిన్ అయ్యాక మెయిల్ చెయ్యి.

అప్పుడు కలిసిన తాను. తన స్వేచ్ఛను ప్రకటించి, గొడవపడి, అర్థంచేయించి వెళ్లిన తాను.  ఆ తర్వాత నుండి మెయిల్ కాలంలో కూడా ఉత్తరమై పలకరిస్తునే ఉంది. ఎప్పుడు రాసిన ఎదో కొత్త విషయం. ఎదో తెలియని ఉత్సుకత ఉంటుంది తన ఉత్తరాలలో. మళ్ళీ మళ్ళీ చదివించేలా రాస్తుంది. ఎప్పుడు చదివిన అదే కొత్తదనం. ఎట్లా అబ్బింది తనకు ఇట్లా రాయడం. బహుశా బాగా చదవడం వల్లేమో. తను వస్తుందనే విషయం ఒక్కచోట కాలు నిలవనివ్వడం లేదూ. సంద్ర. తిరిగొస్తుంది. నాకోసం వస్తుంది. మాకోసం వస్తుంది. ఎప్పటిలాగే నవ్వుతూ. అందమైన నవ్వులమోముతో వస్తుంది. తను నవ్వితే గనుక ముత్యాలు రాలిపడితే నేను ఈ ప్రపంచానికే ముత్యాల్ని ఎగుమతి చేయగలవాణ్ణి. సంద్రమంత అందమైన సంద్ర. మళ్ళీ వస్తుంది. ఆమె ఊహలు, జ్ఞాపకాలనుండి నన్ను దూరం చేసేందుకు   డోర్ బెల్ మోగిన మోత. ఇప్పుడెవరో అనుకుని ఒక నడక చేతిలో ఉత్తరం బల్లపై పెట్టి, తలుపులనుండి బయటపడి తలుపు వైపు....

(ఇందులో కొంతభాగం 8/4/2018న సాక్షి దినపత్రిక అనుబంద ఆదివారం సంచిక ‘ఫండే’లో ప్రచురితం)
https://www.sakshi.com/news/funday/funday-new-story-special-1061934

Sunday, April 8, 2018

తెగిన చూపు



ఏమైంది ఆ కనులకి
చూపులతోనే సంగమించిన నేత్రాలకి

మాటలు కరువైనపుడు
బరువైనపుడు
రెండు హృదయాలని కలిపే
వంతెనయిన చూపులు
ఈవాళెందుకో పలకరింపును దాటవేశాయి

తెగిపోయిన ఆ చూపుకు
మది పిన్ లాగిన గ్రెనేడయ్యింది

Friday, April 6, 2018

రివల్యుషనరీ

రాలిపడిన పూవు
గాయపడిన జ్ఞాపకం
పూరేకులు
ఖండిత అంగాల చిహ్నం

పూవులను, పూరేకులను
దోసిళ్ళలో నింపుకొని
దండగా గుచ్చుతున్న అతడు
పదాలను పాటగా సాయుధం
చేస్తున్న రివల్యుషనరీ

ఆమె రాకడ

ఆమె ప్రతి రాకడ
అల తీరానికి మోసుకువచ్చే కానుక

Tuesday, April 3, 2018

after you

The days has gone,
The sweetness has gone
but, the memories...
it haunts

Your warmth against mine
in those cold days
Your gazing eyes
in the shady nights
Your breath on my neck

and the moon and stars
over our heads
those eternal nights
under infinite sky

.............

After your depart,
you know?
What i am having now!
tearful words,
saddest lines,and
an aborted poem, and 
an old monk

|| రాజ్యం నాకు ఆయుధం అప్పువడ్డది ||

 అది 1997 జులై 11,
జాగ: మహారాష్ట్ర, రమాబాయి అంబేద్కర్‌ నగర్‌,
ఘటన: అంబేద్కర్‌ బొమ్మకు చెప్పుల దండ వేసిన గుర్తు తెలియనివ్యక్తులు.
ప్రతిఘటన: రోడ్డు ఉద్యమమైంది. రోడ్లన్నీ దళితులతో నిండి పోయాయి.
ప్రభుత్వ చర్య: దళితులపై కాల్పులు, పది మంది అమరత్వం...

ఇది 2018 ఏప్రిల్‌ 3
జాగ: మధ్యప్రదేశ్‌
ఘటన: ఎస్సి, ఎస్టి అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చే కుట్ర.
ప్రతిఘటన: మళ్ళీ రోడ్డు ఉద్యమమైంది. దళితలు రోడ్డై చేస్తున్న కవాతు.
హిందూత్వ, ప్రభుత్వ చర్య: ఎప్పటిలెక్కనే కాల్పులు. ఈసారి తొమ్మిదిమంది అమరత్వం.

అధర్మనిదనంలో యమధర్మరాజంతటి న్యాయముర్తి గారికి మేమంటే వల్లమాలిన ప్రేమ. చుండూరు మొదలు మంథని మధుకర్‌ దాక హంతకులెవడికి శిక్షలు పడలే. అయినా మా రక్షణ చట్టం దుర్వినియోగం అయింది. వేలాది కేసుల్లో ఒక్కడు, ఒక్కడంటే,
ఒక్కడూ అరెస్ట్‌ కాలే, అయినా ఎవరిని కేసు అయిన వెంటనే అరెస్టు చేయొద్దని ఆదేశం. న్యాయం మనువు సాక్షిగా నాలుగు పాదాల మీద నడుస్తున్న దేశం కదా!

అయ్యా న్యాయమూర్తి గారు. మీ కోర్టులు వద్దు. వాయిదాలు వద్దు. తీర్పుల కోసం కాళ్ళరిగేలా తిరగడం వద్దు. చట్టమే చెప్పినట్లు మాకో ఆయుధం ఇయ్యండి బాంచెన్‌. మా బాధలేమో మేమే పడతాం. రచ్చన కోసం సంపితే నేరం కాదంట కదా అయ్యా. నారిగాడ్ని సంపిన కరణం గారు సిచ్చ లేకుండా బయటపడింది అందుకే అట గదయ్య. మేము గూడా మా జోలికి ఎవడన్న అత్తే, కరణంగారు నారిగాడ్ని పండవెట్టినట్లే పండవెడ్తం. అయ్యా మీరన్న ఇయ్యుండ్లి, ‘ఇచ్చేట్లోల్లు ఉన్నరు. ఆల్లిత్తె అద్దనకుండ్లి