Monday, April 30, 2018

ఇంద్రావతి



ప్రవహిస్తున్నది నీరు కాదు
నెత్తురు
నెత్తురు ప్రవహించడం యే నదికి కొత్తకాదు
కొత్తళ్ళా దేహాలు ప్రవహించటమే
ముక్కలుగా నరికి గోతాల్లోకుట్టి
పడేస్తే అది చుండూరు
చుట్టుముట్టి కాల్చిచంపి
ఈడ్చుకెళ్లి పడేస్తే అది ఇంద్రావతి

గోదారి దాటిపోయిన మనుషులు
ఇంద్రావతిలో శవాలై తేలుతూ వస్తున్నారు
పుట్టపగిలి చీమలు వచ్చినట్లు కాదు
పొట్ట పగిలి పురుగులు పారుతున్న దేహాలై
కనుగుడ్లు, నోరు పురుగులు పారుతున్న దృశ్యం
ఇంద్రావతి ఇప్పుడు నెత్తురోడుతున్న దుఃఖచిత్రం

తెల్లవాడు నాడు నిన్ను భగత్ సింగ్ అన్నాడు
నల్లవాడు నేడు నిన్ను నక్సలైట్ అన్నాడు
కవి కాల్పనికుడు గనుక ఎట్లా అన్నాడో శ్రీశ్రీ
దేహాలను ముక్కలు చేసి నదిలో పడేయడం మాత్రం
యాదృశ్చికం కాదు
మొసలి తిన్నది నిజమే
ఆ మొసలి ఏమిటన్నదే తేలాల్సిన ప్రశ్న

ఇప్పుడిక ఎదురుపడడాలు లేవు
లొంగిపొమ్మనే హెచ్చరికలు లేవు
'ఆత్మరక్షణ'కై జరిపే కాల్పులు లేవు
'కట్టుకథ'ల అవసరం అసలే లేదు
ఉన్నదల్లా సమాచారం
'వాళ్ళు వస్తున్నారని తెలిసింది
వెళ్లి చంపి వచ్చాము
ఇది మా విజయం'
అనే ప్రకటనలే
డీజెలా ముందు గంతులే
చంపి పండుగలు చేసుకునే
రామరాజ్యం కదా

'సంపుకున్నా మీరే
సాదుకున్నా మీరే' అని
సాయుధులైన వాళ్లకోసం
కన్నీరు కార్చకండి
మౌనం దాల్చకండి
వీలయితే మౌనం వీడి మాట్లాడండి
ఎలిజిలు కాదు
గుండెకు గుండెకు మధ్య వారధి కట్టే
కవితొకటి రాయండి
కాగితంపై నాలుగు అక్షరాలై వాలండి
పదాల దండగుచ్చి వాక్యమై మారండి
ఓ నినాదం కండి
ఓ ర్యాలీ కండి
ఓ ధర్నానో, హర్తాలో కండి
కన్నీరు కార్చి మౌనంగా మాత్రం ఉండకండి

వాళ్లదాక వచ్చింది రేపు మనదాక రాకపోదు
అప్పుడు మనము ఏ నదిలోనో
పారే పంటకాల్వలోనే తెలుతాం
అట్లానే రావచ్చు లేదా ఇంకోలా రావచ్చు
తొలిపొద్దు వేళా తలుపు బద్దలు కావచ్చు
ఇంటికొస్తుంటే గయాబ్ కావచ్చు
అక్కడ అంత ధ్వంసం అయ్యాక
మన ఇంటి మీద సిరియాలా బాంబులే పడొచ్చు
రాజ్యం ఒక విచ్చుకత్తి
అది ఎప్పుడు విచ్చుకున్న ఎవరమో ఒకరం బలవ్వాల్సిందే

ఇంద్రావతిలో తేలుతున్నది దేహాలు కాదు
వారు కన్న కలలు
మనిషి మరణించడం విషాదమే కావచ్చు
కానీ, కలలు మరణించడం ప్రమాదం
వారు మరణించినా వారి కల బతికే ఉంది
బతికే ఉంటుందా....!?
అనేది మనమే తేల్చుకోవాలి
మనమిక కలల వైపా
కాల్పుల వైపా అని.

(ఇందులో కొంతభాగం ఆంధ్రజ్యోతి వివిధలో ప్రచురితం)

No comments:

Post a Comment