Saturday, April 21, 2018

ప్రేమలేఖ 7

మళ్ళీ ఒక నిద్రలేని రాత్రి గడిపి, ఉదయాన్నే పడుకుందాం అనుకుంటుండగా మార్నింగ్ కాఫీలా రూమి పలకరింపు.’నీ లోపలి అలల శబ్దాల్ని విను’ అంటూ. కొన్నిసార్లు నేనే సంద్రమయ్యాక, లోపలి అలలు తీరాన్ని తాకాలని, చేరాలని ఎంత ఎగిసిపడతాయి. అలలు ఎదలో రేగే భావాలయితే, తీరం నీవు. చెప్పలేదు కదూ... మొన్న ‘సంద్ర’ ప్రచురితం అయింది. సంసారిక పాఠకుల కోసం రోమాన్స్ ని, భావుకతని ఎడిట్ చేయగా, సంద్రకాస్త మడుగై ప్రచురితం అయింది. బేటుని ఎవరో అడిగారట. ‘సంద్ర’ నీపైన రాసిందా అని. దానికి తాను ‘కాదు. మా డాడీ , మా మమ్మిపై రాసిండు’ అన్నదట. ‘కరక్టే చెప్పిన కదా డాడీ’ అని అన్నది. రాసిన సంద్ర నువ్ కాకపోయినా. నువ్ మాత్రం ఎప్పటికి నా సంద్రానివే. మరి నేను? నిన్ను చేరేందుకు నదిని పట్టుకొని నిన్ను చేరిన పిల్ల కాలువని.

ఈ మధ్య లేఖ రాయక చాల రోజులైంది కదూ.ఏమని రాయమంటావు? దేని గురించి రాయమంటావు? ‘కనుగుడ్లు కన్నీరై స్రవించాయి’ అన్నాడో కవి. గడుస్తున్న నిద్రలేని రాత్రులు అట్లాగే ఉన్నాయి. ఈ దేశం భారత్ నుండి బలత్కారత్ గా పేరు మార్చుకున్నది. పసిపిల్లల దేహాలు కళ్ళముందు కదలాడుతుంటే కన్నీరు కాలువలై పారుతుంది. మనం ఎన్నిసార్లు అనుకున్నాం కాశ్మీర్ కి పోవాలని, కుంకుమ పూల పరిమళాన్ని, యాపిల్ హొటల సోయగాల్ని, మంచుకొండల అందాల్ని, పచ్చిక బయల్లను చూడాలని. కానీ ఎక్కడ చూసిన రక్తం మడుగులు ఉంటాయి అని అనుకోలేదు. కాశ్మీర్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ మాయమైన వాళ్ళు ఎందరో!? ‘మీకు మీ వాళ్ళు చనిపోతే శవాలన్నా ఇస్తారు. మా వాళ్ళు ఉన్నారో, చనిపోయారో తెలియకుండా బతుకుతున్నాం.’ అని అన్నా కాశ్మీర్ తల్లి మాటలకి ఎంత కరిగిపోయాం. మనం చూడాలనుకున్నా, పోవాలనుకున్నా, అస్వాదించాలనుకున్నా వాటిని చూసి, ఆస్వాదించి, ఆడీ, పాడిన ఓ పాపా మదొంమాదానికి చిధ్రం అయింది. ఆ పాపా గురించి రాద్దామంటే కవిత్వం కాదు కదా. పదాలు దొరకట్లేదు. అక్షరాలూ పొందట్లేదు.

‘స్వేచ్చ కోసం పోరాడే ప్రజలు, స్వేచ్చ అంటే ఏంటో తెలియకుండా హిట్లర్ లాంటి వాళ్ళను గెలిపించుకుంటారు.’ అన్నాడు విల్ హెల్మ్ రైక్ తన ‘లిసన్ లిటిల్ మ్యాన్’లో. ఇక్కడ అదే జరిగింది అనిపిస్తుంది. అయితే, జార్జ్ ఆర్వెల్ అన్నట్లు ‘ఉద్యమాలు విఫలం అయితే ఆ నేరం ప్రజలది కాదు. ఉద్యమకారులదే.’ అన్న వాక్యాలు గుర్తుకు వస్తాయి. అయినా మధ్య అతరగతి ‘స్వేచ్చ’కి పరిమితులున్నాయి. మధ్యలో ఉన్నారు కనుక వాళ్ళకి కింద ఉన్న వాళ్ళను చూసి సంతోషపడే బ్లడీ సాటిస్ఫక్షన్ ఉంది. అన్ని కులాలో, వర్గాల్లో ఉన్నా మధ్య తరగాత్రితో ఉన్న సమస్యే. పాలో ఫ్రేయిరి చెప్పినట్లు ‘సూపర్ వైజర్’ మనస్తత్వం కలిగిన వాళ్ళు కదా. తమపై జరుగుతున్న అణచివేతను ప్రతిఘటించలేక, తమ కింద వాళ్ళపై అదే అణచివేతను ప్రయోగించి సంతృప్తి పడతారు ఈ భద్ర జీవితాల బతుకుజీవులు. కొన్నిసార్లు అనిపిస్తుంది. వీళ్ళు వెన్నెముక లేని జీవులు అని. ఏదైనా ఒక సంఘటన జరిగితే దానికి అనుకూలంగా వచ్చే మెసేజెస్ ని పంపిస్తారు. దానికి వ్యతిరేఖంగా వచ్చే మెసేజెస్ ని పంపిస్తారు. అటువంటి వారిని చూస్తె ఒ వైపు కోపం, మరి వైపు జాలి కలుగుతుంది.

కొత్త కథ ఒకటి రాయడం అయిపొయింది. ఓ రోజు ఒక పిల్లా వచ్చి తన డిప్రెషన్ కి కారణమైన కథ చెప్పింది కదా! ఆ పిల్ల కథనే పేరు మార్చి రాసాను. నిజంగా మనసులో భావాల్ని పంచుకోవడానికి ఒక మనిషి లేకపోవడం ఎంత విషాదం. ఓ రోజు నీకు అంగారిక పూర్ణిమ కథ చెప్పిన గుర్తుందా? కథకి ఆ పేరే పెట్టా. అంగారిక అని. ‘నీ లోపలి అలల శబ్దాన్ని విను’ అని రూమి అన్నాడు గాని, అలల శబ్దాన్ని పంచుకొవాలనిపిస్తే? పంచుకోవడానికి ఓ మనిషి కూడా లేకపోతే? అది ఎంత ఘోరమైన విషాదం. అంగారిక పరిస్థితి అదే కదా. అంగారిక నిజానికి సర్వనామం. అనేకానేక మంది అనామకులకు ఈ అంగారిక ప్రతిక.

No comments:

Post a Comment