Saturday, August 25, 2018

ప్రేమలేఖ -17



ఇది మొదటిసారి కాదు. నీవు లేకుండా ప్రయాణం. ప్రయాణంలో నీ జ్ఞాపకం. ఎప్పుడు పక్కకి తిరిగి పడుకున్నా మిగతా సగం ఖాళీ బెర్త్ నీ తాలూకు యాది. మొన్న వస్తుంటే బయట వర్షం. లోపల చలి. మన పాత ప్రయాణాల్ని ఫ్యాన్ గాలి యాదిలా మోసుకువచ్చింది. నేను కింద బెర్త్ లో ఉంటే చలి పెడుతుందని వచ్చి పక్కనే పడుకున్నావ్. మీద చెయ్ వేసి దగ్గరగా లాక్కుంటే వెచ్చగా ఉందని అలానే చేయిపై పడుకున్నావ్. మళ్ళీ పైకి పోయావ్. ఉదయాన్నే కంప్లైంట్ ‘రాత్రి చలి బాగా ఉంది. నీ పక్కన పడుకుంటేనే బాగుండేది’ అని. ఎందుకు రాలేదు? అంటే నా నిద్ర చెడగొట్టలేను అన్నావ్. ‘నాకు నిద్ర పట్టక నిన్ను మేల్కొల్పిన రాత్రులతో పోలిస్తే నువ్వు లేపడం ఏమాత్రం డిస్టర్బెన్స్ కాదు’ అన్నా. అంతే ఎప్పటిలాగే ఓ నవ్వు. ఎట్లా నవ్వుతావే అట్లా. ఎదలోతుల్లోంచి బొక్కెనేసి మరీ ప్రేమను తోడి కళ్ళనిండా నింపుకొన్నట్లు. పెదాల నుండి వర్షపు చినుకులు చిలకరించినట్లు.

చాలా నెలల తరువాత కలసిన దోస్తులు. రాత్రంతా కాసిన్ని ముచ్చట్లు. ఒక ఫోన్ కాల్ విషాదం. ముసలి సాధువును వెతుక్కుంటూ కాళ్ళు ఈడ్చుకువచ్చేంతా నడక. రూమ్ కి వచ్చాక ప్లేయర్స్ పెదాల మీద నర్తించి, ముసలి సాధువు తన తత్వాన్ని గొంతులో దింపి దేహమంతా ప్రవహింపజేశాడు. జాయింట్ అనంతర పింక్ ఫ్లాయిడ్, గన్స్ అండ్ రొసెస్ గీతాల్లా 'ఆజ్ జానే కి జిద్ నా కరో' అంటూ ఫరీదా ఖానం గొంతుతో 'శృతి' కలుపుతూ ఓ గీతం.

కలవాలనుకుంటూ అనేక వాయిదాల అనంతరం కుదిరిన దినం. సిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ గా మారిన సిటీ ఆఫ్ గార్డెన్ లో చెట్ల మధ్య ప్రశాంత ప్రయాణం. ఎప్పుడు పోయిన ఆతిథ్యం ఇచ్చే ఇండియన్ సోషల్ ఇన్సిస్ట్యూట్ ఇప్పుడూ ఇచ్చింది. ఇద్దరు ట్రాన్స్ మిత్రులు ప్రేమతో నోరు తీపి చేశారు. అక్క ఎప్పటిలాగే అంతే ప్రేమతో ముచ్చటించింది. అక్కడికి వచ్చిన తనకు తెలిసిన వారందరికీ పరిచయం చేసింది.

తిరిగివస్తుంటే బాగా తెలిసిన పరిమళమేదో ముక్కుపుటల్ని తాకింది. గుర్తుపట్టడానికి ఎక్కువసేపేం పట్టలేదు. నేను తిడతానని తెలిసినా నాకు అలవాటయ్యేదాకా కావాలని నువ్ వేసుకోచ్చిన చాక్లెట్ ఫ్లేవర్డ్ పెర్ఫ్యూమ్ పరిమళమది. మొదటిసారి చేతిపై నువ్ కొట్టినప్పుడూ, ట్రైన్లో తలగడగా నీ బ్యాగ్ వాడినప్పుడూ అందులోంచి వచ్చే స్మెల్ అంతగా నచ్చలేదు. నీ దేహపరిమళంతో కలిసాకే కదూ అది నచ్చింది. వస్తున్నపుడు మెడవొంపులో కాసింత స్ప్రే చేసుకొని వస్తావేమో, నిదురరాకో, నువ్ హత్తుకుంటేనో మెడవొంపులో తలవాల్చితే నన్ను చేరేందుకు నువ్ పడిన కష్టానికి గురుతుగా రాలిన చెమటబోట్లతో కలిసి అదో గమ్మత్తు మత్తును నాలోకి ప్రహహింపజేస్తుంది. ఆమాటే అంటూ అక్కడే తలవాల్చి శ్వాస ఎగబీలుస్తుంటే ‘రేయ్ చక్కిలిగింతలూ’ అంటూ నవ్వుతూనే ఉంటావ్. ఒక్క పరిమళం ఎన్ని జ్ఞాపకాలను మోసుకువచ్చింది. ఆ జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఇంటికి చేరాను.

Wednesday, August 1, 2018

ప్రేమలేఖ 16

బతుకు నిరంతర వలస అయినచోట నేనో నిత్య నోమాడిక్. మా తాత  బతుకుదెరువు కోసం వలస పోయాడు. మా అయ్యా చదువుకోసం  వలస పోయి అక్కడే స్థిరపడ్డాడు. నేను అంతే చదువు కోసం వలస వచ్చి నా ముందు తరాలు పోగొట్టుకున్నదేదో వెతుకుతున్నాను. మూతికి ముంత, మొలకు చీపురు పోయి, అల్ట్రా మోడ్రన్ బతుకే బతుకుతున్నా నన్నింక అలగాగ తప్ప మనిషిగా చూడని చోట మానవీయ సమాజం ఎక్కడైనా తారసపడక పోతుందా అని వెతుకుతున్నాను. ఆ వెతుకులాటలోనే  స్వేచ్ఛను, విముక్తిని కలగంటూ, నిజం అయ్యే కాలం కోసం ఎదురుచూస్తున్నాను. ఎదురుచూపులో, వెతుకులాటలో పడి నేనో భైరాగినయ్యాను. ఆ తత్వం నా రాతలోకి ఎంత వచ్చిందో తెలియదు గానీ గడ్డం మాత్రం ఓ మోస్తరుగా పెరిగింది. ఎందుకో ఇప్పుడు పుట్టినూరికి పోయి రావడం నాకు ఓ ట్రావెలాగ్ యే తప్ప నోస్టాల్జియా కాదు. ఇంటికి పోగానే నేనేదో కొత్త చుట్టం అయిన ట్రీట్మెంట్. మా తాత అన్నట్టు సుక్క తెగిపడినట్టు పోతే అంతే కావచ్చు. ఒక్కరోజు పర్యటనకు రెండు రకాలుగా వండిన చేపలు, రొయ్యలు కాస్తా 'రాక్ ఫోర్డ్'. నువ్వు రావాల్సింది. నాకు కాస్త చుట్టం ట్రీట్మెంట్ నుండి తెరిపి దొరికేది. ఎప్పుడు వస్తా అన్నా హామీ తప్ప అది అమలయ్యింది లేదు. నువ్ నాతో ఇంటికి రావడం  'అమలుకానీ హామీల చరిత్ర'. బేటుని అడిగితే బిజీ డాడీ అంది. నేను ఫ్రీగా ఉన్నప్పుడు అడగవేంటి డాడీ అని అంది.

ఒక్క సంవత్సరానికి ఊరు ఎంత మారిపోయింది. తిరిగి FCI తెరుస్తున్నారని సంతోషపడాలా! నలభై ఫీట్ల రోడ్డు కోసం సగానికి తెగిపడ్డ దేహాల లాంటి ఇళ్లను చూసి భాధపడాలా!?. బస్టాండ్ లో దిగి ఇంటికి పోతున్న చూసిన దృశ్యం ఎందుకో హాంట్ చేసింది. అభివృద్ధి పేరుమీద జరిగే విధ్వంస దృశ్యం అది. ఎప్పటి సాయంత్రాల్లాగే ఓల్డ్ అశోక్ దగ్గరి టీ స్టాల్ కి పోయా. అక్కడి మిర్చిల బండి మాయం అయి, చుట్టూ ఇనుప కంచె మొలిసి బండ్లు పెట్టె జాగను ఆక్రమించింది. దుకాణం ముందు బండి పెడితే బిక్కుబిక్కుమనే చాయ్ దుకాణం ఓనర్. అర్జున్ స్వీట్ హౌస్ రస్ మలాయ్ టెస్ట్ యేమి మారలే. న్యూ అశోకలో ఇంకా ఏసీ పనిచేస్తలేదు. ఉక్కపోతలోనే, అంగీ వెనుకవైపు తడిచి ముద్దయితే సినిమా అయిపోయినట్టు.

తెల్లారి సాయంత్రం మళ్ళీ  ఓల్డ్ అశోక్ పర్యటన. ఎందుకో ఊర్లో ఉన్నన్నీ రోజులు అక్కడకు పోయి ఛాయా తాగడం ఓ మానుకోలేని అలవాటు. లక్ష్మీనగర్ తొవ్వ ఇప్పుడు వన్ వే. కొత్తగా చౌరస్తాలో ట్రాఫిక్ లైట్లు వెలగడం మొదలెట్టాయి. అవి ఆఖరిసారి యే పదేండ్లకిందనో వెలిగిన జ్ఞాపకం. అక్కడ రైట్ తీసుకొని ఫైవింక్లైన్ దాకా పోయోద్దం అని పోయాం. కనకయ్య దుకాణం రూపు మారినట్టు ఉంది. ఆ పక్కన గల్లీలోనే ఆకర్ష్ వాళ్ళు ఉండేవారు. సీత నగర్ బోర్డు వెలిసి పోయి, రాం నగర్ బోర్డు సిలుము పట్టింది. ఈరమ్మ హోటల్ నడుస్తుందో లేదో! ఆ రాత్రి ఎందుకో కనపడలేదు. అట్లే పుట్టుక, ఊహచ్చేదాక బాల్యం గడిపిన పాత ఇంటి దాకా పోయోద్దాం అనుకున్న ఎందుకో పోవాలనిపించలే. నువ్వుంటే తీసుకుపోయేవాడిని. మా వాడకట్టులో ఉన్న నానమ్మలకు, అత్తలకు పరిచయం చేసేవాడ్ని. అంతా కలిసి 'నీ బుగ్గలు చిదిమి దీపం పెట్టేవాళ్ళు'. ఏరియా హాస్పిటల్ లో బాబాయ్ దగ్గరికో, లేక నా హెల్త్ చెకప్ కు పోయినప్పుడు తప్ప ఆ ఏరియాకు పోయింది లేదు. అది దాటి పోక ఏండ్లు గడుస్తుంది. ఏరియా హాస్పిటల్, సబ్ స్టేషన్ గోడకు GRMC పెయింటింగ్ లు. 'ఆడపిల్లల కాపాడుకుందాం', 'నీళ్లు జీవనాధారం' సరిగ్గా గుర్తులేదు కొటేషన్ ఇదో కాదో, కానీ అమ్మాయిలు, నీళ్ల గురించి ఉన్నాయి. కాసేపు నవ్వుకున్నా. గోదావరిఖని గోడల మీద ఆ నినాదాలు చూసి. 'అమ్మాయి ప్రేమించట్లేదని యాసిడ్ పోయడం' అనే ఉన్మాద ప్రక్రియకు ఆద్యురాలు మా ఊరు. ఓపెన్ కాస్ట్ ల పేర ఊర్లన్నీ బొందల గడ్డలు, మట్టి దిబ్బలు అవుతుంటే నీళ్ళేక్కడ ఉంటాయి. ఆ నినాదాలు హాంతకులే సంతాప సభలు జరిపినట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమి మారలేదు. 'ఎచట స్త్రీలు పూజింపబడతారో అచట దేవతలు కొలువుంటారు' గాంధీ కాలేజ్ తలుపు రాసిఉన్న రాత. దాని ముందే అమ్మాయిలను చిడాయించడం చూశాను.

జ్యోతినగర్ బోర్డు ఇప్పుడో పురా జ్ఞాపకం. ఆ పక్కనే దాదాపు ఏడెనిమిది ఏళ్ళు కిరాయికి ఉన్నాం. అక్కడి నుండే మూడు స్కూళ్ళు మారాను. ముందుకు పోతే మా ఇంగ్లీషు మీడియం దెబ్బకు మూతపడ్డ మా బడి 'జ్ఞానోదయ విద్యాలయం' తన రూపురేఖలు మార్చుకుని గుర్తుపట్టకుండా అయింది. 'బడి మాదే అయినా నేనెందుకు మాదిగ సారోళ్ల కొడుకునే అయ్యాను.' 'ఈ దేశంలో వర్గాన్ని కులం నిరంతరం డామినేట్ చేస్తది అనేందుకు నా జీవితమే నాకు ఓ ప్రత్యక్ష ఉదాహరణ'. అది అమ్మిన తరువాత అక్కడి నుండి మార్కండేయ కాలనీకి షిఫ్ట్ అయ్యాం. ఫైవింక్లైన్ దాకా పోయి అక్కడ కాసేపు ఆగాం. అక్కడ గంటలు గంటలు రౌడీలు కొట్టుకునే వారని చిన్నపుడు విన్నా. చెవి తెగిపడ్డ కొట్లాడుతూనే ఉన్నారని. హత్యలు చాలా సర్వసాధారణం అయిన కాలం అది. ఇప్పటికి ఏమీ మారలే. జైలుకు పోయి వచ్చినవాడు అక్కడ హీరో. వాళ్ళని భయపెట్టే సికాస ఇప్పుడు లేదు. గోడల మీద వెలిసే పోస్టర్లు లేవు. అదిప్పుడు కార్మికుల గుండెల్లో పురాస్మృత జ్ఞాపకం. అమరుల తడి ఆరని యాది. పోరాటాల నేల ఇప్పుడు దళిత దళారుల, రౌడీల రాజ్యం. వాళ్ళు ఆడింది ఆట. పాడింది పాట. పైసా పేకో తమాషా దేఖో.

ఎందుకో జ్యోతి నగర్ లో ఉన్న ఇల్లు చూడాలనిపించింది. మళ్ళీ అదే రోడ్డులో వెనక్కి వచ్చి ఇల్లు, స్టేడియం చుట్టూ ఓ రౌండ్ వేశామ్. ఆ రోడ్డు మీదే సైకిల్ నేర్చుకుంటూ కిందపడి మోకాళ్ళు కొట్టుకుపోయింది. ఆ స్టేడియంలోనే కరాటే అని, ఫుట్ బాల్ అని కోచింగ్ కి పోయింది. ఏవి వంటబట్టక వదిలేసింది. రాత్రిదాక తిరిగి ఇంటికి వస్తే వీపు బసంత్ నగర్ ఎయిర్పోర్ట్ అయ్యింది అక్కడే. స్టేడియం ఎంట్రన్స్ పక్కన పానీపూరి బండి అతను మారాడు. ఊరంతా గప్ చుప్ వెయ్యమంటే నేనొక్కన్నే (కాగజ్ నగర్ ప్రభావంతో) పానీపూరి అనేది. అట్లా అనేది నేనొక్కనే అని అతనికి ప్రత్యేక అభిమానం ఉండేది. మనకు చివరకార్లో ఎగస్ట్రా పూరి వేసేది.

ఎల్బీ నగర్ బోర్డు అదో పురాస్మృతి. ఆ బోర్డు కింద నుండి ఓ అమ్మాయితో కలసి నడచివచ్చిన యాది. ఆ వయస్సులో అది ప్రేమో, ఆకర్షనో తెలియదు. ఆ అమ్మాయి మాత్రం ఇప్పటికి స్పెషల్ అనిపిస్తుంది. ఇప్పుడు పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లల తల్లయింది. అదే క్లాసులో ఇంకో అమ్మాయి ఉండేది. 'మాది'గది (మాది+గది) అని తనని అంటే క్లాస్ లో ఉన్న అందర్నీ నిలబెట్టి కులాలు అడిగిన అమ్మాయి. వాళ్లిద్దరి గురించి ఆపేసిన బాల్యస్మృతులు మళ్ళీ మొదలెట్టి రాయాలి. విధ్వంసం అవుతున్న జీవితాలు. వెంటాడుతున్న కులం. ఏది ఇప్పుడు జ్ఞాపకం కాదు. కళ్ళముందు కనపడుతున్న వాస్తవం. ఊరు ఇప్పుడు ట్రావెలాగే తప్ప వెంటాడుతున్న కులం చేసిన గాయాల సాక్షిగా నోస్టాల్జియా కాదు.

తిరిగి వస్తుంటే మూత పడ్డ ఎ పవర్ హౌజ్. కరిగిపోతున్న గుట్టలు. వలస కార్మికుల నెత్తురు స్వేదంగా మారి గ్రానైట్ తీస్తే, దేశదేశాలకు ఎగుమతవుతూ తెచ్చే పైసలతో కొందరి ఒంటి మీద బట్టలు 'శ్వేత'రంగులో మెరుస్తున్నాయి. ఊరు పోయి వస్తే వెంటాడుతున్నది విధ్వంసమే. అభివృద్ధి ముసుగులో జరుగుతున్న విధ్వంసమే.

నువ్వూ రావాల్సింది పిల్లా. అమ్మ తినిపించే గోరుముద్దలనే కాదు ఈ విధ్వంసాన్ని పరిచయం చేసే వాడిని. విధ్వంసమవుతున్న బతుకుల్ని పరిచయం చేసేవాడ్ని. ఎందుకు 'నేనెప్పుడూ కులం అని మాట్లాడుతా' అని ఎవరో అన్నారన్నావుగా, పుట్టుకనుండి అది చేసిన గాయాలను పరిచయం చేసేవాడ్ని. అప్పుడు నా దాకా రాకుండా నువ్వే సమాధానం చెప్పొచ్చు. ఎందుకో ఈ ప్రయాణంలో నీ కంపెనీ మిస్ అయ్యాను. నువ్వూ ఉండాల్సింది అనిపించింది.