ఇది మొదటిసారి కాదు. నీవు లేకుండా ప్రయాణం. ప్రయాణంలో నీ
జ్ఞాపకం. ఎప్పుడు పక్కకి తిరిగి పడుకున్నా మిగతా సగం ఖాళీ బెర్త్ నీ తాలూకు యాది.
మొన్న వస్తుంటే బయట వర్షం. లోపల చలి. మన పాత ప్రయాణాల్ని ఫ్యాన్ గాలి యాదిలా
మోసుకువచ్చింది. నేను కింద బెర్త్ లో ఉంటే చలి పెడుతుందని వచ్చి పక్కనే
పడుకున్నావ్. మీద చెయ్ వేసి దగ్గరగా లాక్కుంటే వెచ్చగా ఉందని అలానే చేయిపై
పడుకున్నావ్. మళ్ళీ పైకి పోయావ్. ఉదయాన్నే కంప్లైంట్ ‘రాత్రి చలి బాగా ఉంది. నీ
పక్కన పడుకుంటేనే బాగుండేది’ అని. ఎందుకు రాలేదు? అంటే నా నిద్ర చెడగొట్టలేను
అన్నావ్. ‘నాకు నిద్ర పట్టక నిన్ను మేల్కొల్పిన రాత్రులతో పోలిస్తే నువ్వు లేపడం
ఏమాత్రం డిస్టర్బెన్స్ కాదు’ అన్నా. అంతే ఎప్పటిలాగే ఓ నవ్వు. ఎట్లా నవ్వుతావే
అట్లా. ఎదలోతుల్లోంచి బొక్కెనేసి మరీ ప్రేమను తోడి కళ్ళనిండా నింపుకొన్నట్లు.
పెదాల నుండి వర్షపు చినుకులు చిలకరించినట్లు.
చాలా నెలల తరువాత కలసిన దోస్తులు. రాత్రంతా కాసిన్ని ముచ్చట్లు.
ఒక ఫోన్ కాల్ విషాదం. ముసలి సాధువును వెతుక్కుంటూ కాళ్ళు ఈడ్చుకువచ్చేంతా నడక.
రూమ్ కి వచ్చాక ప్లేయర్స్ పెదాల మీద నర్తించి, ముసలి సాధువు తన తత్వాన్ని గొంతులో దింపి దేహమంతా ప్రవహింపజేశాడు. జాయింట్
అనంతర పింక్ ఫ్లాయిడ్, గన్స్ అండ్ రొసెస్ గీతాల్లా 'ఆజ్ జానే కి జిద్ నా కరో' అంటూ ఫరీదా ఖానం గొంతుతో 'శృతి' కలుపుతూ ఓ గీతం.
కలవాలనుకుంటూ అనేక వాయిదాల అనంతరం కుదిరిన దినం. సిటీ ఆఫ్
ఎలక్ట్రానిక్స్ గా మారిన సిటీ ఆఫ్ గార్డెన్ లో చెట్ల మధ్య ప్రశాంత ప్రయాణం.
ఎప్పుడు పోయిన ఆతిథ్యం ఇచ్చే ఇండియన్ సోషల్ ఇన్సిస్ట్యూట్ ఇప్పుడూ ఇచ్చింది.
ఇద్దరు ట్రాన్స్ మిత్రులు ప్రేమతో నోరు తీపి చేశారు. అక్క ఎప్పటిలాగే అంతే ప్రేమతో
ముచ్చటించింది. అక్కడికి వచ్చిన తనకు తెలిసిన వారందరికీ పరిచయం చేసింది.
తిరిగివస్తుంటే బాగా తెలిసిన పరిమళమేదో ముక్కుపుటల్ని తాకింది.
గుర్తుపట్టడానికి ఎక్కువసేపేం పట్టలేదు. నేను తిడతానని తెలిసినా నాకు
అలవాటయ్యేదాకా కావాలని నువ్ వేసుకోచ్చిన చాక్లెట్ ఫ్లేవర్డ్ పెర్ఫ్యూమ్ పరిమళమది. మొదటిసారి
చేతిపై నువ్ కొట్టినప్పుడూ, ట్రైన్లో తలగడగా నీ బ్యాగ్ వాడినప్పుడూ అందులోంచి
వచ్చే స్మెల్ అంతగా నచ్చలేదు. నీ దేహపరిమళంతో కలిసాకే కదూ అది నచ్చింది. వస్తున్నపుడు
మెడవొంపులో కాసింత స్ప్రే చేసుకొని వస్తావేమో, నిదురరాకో, నువ్ హత్తుకుంటేనో మెడవొంపులో
తలవాల్చితే నన్ను చేరేందుకు నువ్ పడిన కష్టానికి గురుతుగా రాలిన చెమటబోట్లతో కలిసి
అదో గమ్మత్తు మత్తును నాలోకి ప్రహహింపజేస్తుంది. ఆమాటే అంటూ అక్కడే తలవాల్చి శ్వాస
ఎగబీలుస్తుంటే ‘రేయ్ చక్కిలిగింతలూ’ అంటూ నవ్వుతూనే ఉంటావ్. ఒక్క పరిమళం ఎన్ని
జ్ఞాపకాలను మోసుకువచ్చింది. ఆ జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఇంటికి చేరాను.
No comments:
Post a Comment