Monday, January 29, 2018

కడలి


1

కష్టాల కడలి
కన్నీళ్ల కడలి
అలలై పోటెత్తుతూ కడలి 
ఆనంతాన్ని దాచుకున్న కడలి 
అయిన అణువంత అహం లేని కడలి

ప్రవహిస్తున్న నదులతో 

సంగమిస్తూ కడలి 
తీరంతో సయ్యాటలో కడలి 
తీరంలో సయ్యాటలు చూస్తూ కడలి 
ప్రేమై కడలి
ప్రేమకి సాక్షమై కడలి

అమ్మ ఒడిలా అలయ్యి 

ఊయలుపుతూ కడలి 
అలలతో ఆడుతుంటే
చూస్తూ మురిసిపోతూ కడలి 
ప్రియురాలి ఊసుల్ని వింటూ కడలి 
ప్రియుడ్ని గుండెలకు హత్తుకుంటూ కడలి

2 
రెండు సరిహద్దులను 
కలిపే వంతెనై కడలి 
సరిహద్దును పహారా కాసే
నిగాహ్ నేత్రమైన సెంట్రీ కడలి

జనమై కడలి

జనసందోహమై కడలి
ఊపిరై కడలి
ఉద్యమమై కడలి
దళమై కడలి
దళాన్ని పొత్తిళ్ళల్లో 
దాచుకుంటూ కడలి

నిశీధి వేళా

రేపటి ప్రభాతానికై 
వ్యూహం పన్నుతు
తుఫాను ముందు
ప్రశాంత కడలి

కడలి

చిలిపి పిల్ల
చిత్రాల పిల్ల

కథల పిల్ల
కైతల పిల్ల

జనసంద్రంలో ఒంటరితనాన్ని
ఒంటరితనంలో జనసంద్రాన్ని వెతుకుతూ
అగ్నిపర్వతాలు లోపల బద్దలవుతున్నా
అందమైన నవ్వులు రువ్వుతూ పిల్ల

నిగాహ్ నిగ్గు తేల్చా
కవిత్వమై జ్వలిస్తున్న పిల్ల
అక్షరాలు అలలు
పదాలు తుఫానులు
వాక్యాలు ప్రళయాలు

అలలు
తుఫానులు
ప్రళయాలు
వెరసి కడలి

Friday, January 19, 2018

ఎల్లప్పుడూ


నేను ఈర్షగా లేను
నా ముందుకు వచ్చిన దేనిపైననూ
రా...
నీ భుజాలపై ఒక మనిషితో
రా...
నీ కురులల్లో వందలాది మందితో
రా...
నీ పాదాలు, ఎద మధ్య వేలాది మందితో
రా...
అవధుల్లేని సంద్రంలో కలిసేందుకు పారే
పూర్తిగా మగాళ్లతో మునిగిన నదిలా,
శాశ్వత కడలి అలల వద్దకు, కాలానికి


రా...
వాళ్ళందరిని తీసుకుని
నీకై నేను వేచిచూచే చోటకి
మనం ఎప్పటికి ఒంటరిగానే ఉంటాం.
మనం ఎప్పటికి నీవు, నేనుగానే ఉంటాం.
మన జీవితాన్ని మొదలుపెట్టేందుకు
పృథ్విపై ఒంటరిగా


(పాబ్లో నెరుడా 'Always'కి స్వేచ్చానువాదం.)

Saturday, January 13, 2018

ఆమె



ఆమెకి
అన్ని రాత్రి స్పర్శలు 
ఒకేలా అనిపించవు

స్పృశించేది తనవాడే
అయిన
ఎదో అయిష్టత

అట్లనీ
ఆమేమి ముట్టుకుంటే ముడుచుకుపోయే
అత్తిపత్తి ఆకు కాదు 

కానీ,
భావాల్ని పంచుకున్నట్లే
భావప్రాప్తుల్ని పంచుకోవాలనుకుంటుంది

తన స్వేచ్ఛలో
రాతిరి స్వేచ్చా భాగమంటుంది

పగలంతా 'మన'దయిన ఇష్టం
రాత్రి 'నీ'దవ్వడం ఏంటని
పడకదిగి
"Lust is part of love, but
It shouldn't vanish the Love between us" అని
సహజ సూత్రాన్ని గోడపై రాసింది.

.................................

అతడు గదిలోకి రాగానే ఒకనవ్వు
ఆ రాతను చూసి
రాసిన తనను చూసి
ఆమె అంతే
అతడిలో మార్పుని చూసి

13/01/2018

Saturday, January 6, 2018

ఘర్షణ ― ఐక్యత ― స్వేచ్ఛ


అతడు 'అతడి'లా
ఆమె 'ఆమె'గా
ఉండటానికి
ఎంత ఘర్షణ

ఆమె అతడిలో
అతడు ఆమెలో
సంలీనమైనట్లు
అంతలోనే ఐక్యత

అయినా
అతడేంటి
ఆమేంటి
మనసులు ముడిపెట్టాకా
అంతా వాళ్లే అయ్యాకా

…........................………

ముడి అనబడు ఒప్పందాన్ని రద్దుగోరి
నే పోతానంటే
(ఆమె లోగొంతులో ఓ గొణుగు)

అది నీ స్వేచ్ఛ
ఎన్నటికీ మారని అతడి సమాధానం

మరీ నీకు బాధ లేదా
(ఈసారి పైకే అంది)

ఎప్పటిలాగే
ఒక నవ్వు అతడి సమాధానం
ఇప్పుడది ఏకీకరణకు కాదు,
మళ్ళీ ఏకం కాని వర్గీకరణకు

("ఘర్షణ - ఐక్యత" అనే నా పాత కవితకు, కొన్ని చేర్పులతో మరో రూపం)

Wednesday, January 3, 2018

నేను ప్రేమించను నిన్ను తప్ప, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను




నేను ప్రేమించను నిన్ను తప్ప, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నేను వెళ్తాను ప్రేమించడం నుండి, నిన్ను ప్రేమించనితనానికి 
ఎదురుచూడటం నుండి వేచిచూడకపోవటానికి
నా మది కదులుతుంది మంచు నుండి మంటలోకి

నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఎందుకంటే నేను ప్రేమించేది నిన్నే

నేను నిన్ను దిగంతాల నుండి ద్వేషించాను, ద్వేషిస్తున్నాను
నీకై వాలిపోతాను, నేను నిన్ను చూడట్లేదు కానీ గుడ్డిగా ప్రేమిస్తున్నాను అదే
నీకోసం మారుతున్న నా ప్రేమకు కొలమానం


ఆనుకుంటా

జనవరి కాంతి దాని క్రూరత్వంతో నా మదిని తినేస్తుందేమో
కాంతి కిరణం,
దోచేస్తుంది నా నిజమైన ప్రశాంతత తోవని

ఈ కథలో భాగంగా మరణించింది నేనే

 కేవలం ఒక్కరే, 
నేను ప్రేమతో మరణిస్తాను, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను
ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రేమ, అగ్నిలో, రుధిరంలో

( I do not love you except because I love you అనే పాబ్లో నెరుడా కవితకు స్వేచ్చానువాదం)

సావిత్రి బాయి 2


మా చేతుల్లో తిరగాడే
ఈ నాలుగు అక్షరాల్ని
 అగ్రహార 'మగ' పొలిమేర్లు 
దాటించేందుకు
ఫూల యోధ సావిత్రి బాయి
చేసిన యుద్ధం,
కార్చిన నెత్తురు గుర్తొచ్చి
వాక్యం పదునుబడి
సాయుధమవుతుంది.

సావిత్రి బాయి


ఫూల యోధ సావిత్రి బాయి 
చేసిన యుద్ధం,
కార్చిన నెత్తురు,
పడ్డ అవ(వెలి)మానాల ఫలితం
అగ్రహార 'మగ' పొలిమేర్లు దాటి
మా చేతుల్లో తిరగాడే 
అక్షరాలను కూరిస్తే ఈ వాక్యం

Monday, January 1, 2018

కన్నీటి కాలువ


తానిక తిరిగిరాదని 
గుర్తొచ్చిన ప్రతిసారి
కన్నీరు కాలువై
కవిత్వం శరణుజొస్తుంది



Dream has Aborted


నిద్రలోంచి ఉలిక్కిపడి లేస్తాను
ఎదో ఓ కలతో

'కల' గుర్తుకురాగానే కన్నీళ్లు
నిద్రలో వచ్చే కల కాదు
రక్తమాంసాలతో నేలపై అడుగిడాల్సిన కల

మేమిద్దరం కలిసి కన్న కల
కనాలనుకున్న కల

నవజాత శిశువై రావాల్సిన కల
మాకిష్టమైన ఓ వెన్నెల రాత్రి చెదిరిపోయింది
తనను వెన్నెల్లో చూసుకోమంటూ

నెలవంకను చూస్తూ
దూరంగా రెండు ఒంటరి పక్షులు

బహుశా వాటి కల చెదిరిందేమో!?