Tuesday, March 26, 2019

ప్రేమలేఖ 28


సాకీ
నను విను
I'm in love with you


The fault in our stars. ఎవరి కథ ఇది. 'ఎవరినో ఒకర్ని యాది చేస్తాను' అని అందులో పిల్ల అన్నట్లుగానే నిన్ను గుర్తుచేసింది. ఎంత పిచ్చి ప్రేమ తనది. నీదీ అంతే. ఆపిల్ల అతగాడికి చూస్తూ I love the way you fall asleep, slowly, and all at once అని చెప్పినట్లుగా నువ్వూ అంతే. పక్కకి ఒత్తిగిల్లి పడుకున్నాక నీవైపుగా లాక్కొని నుదుటన, చెంపలపై పెట్టి పెట్టనట్లుగా ముద్దాడుతావ్. నిద్ర నటిస్తూనో, మెలకువ వచ్చో కళ్ళు తెరచి నీ ఆ మోహపు ప్రేమచూపును చూడగానే సిగ్గుతో తలను ఎదపై దాచుకుంటావ్.
నీకు గుర్తుందా! నది ఒడ్డున పచ్చిక బయల్లో ఓ జుగల్ బందీ అయి నడుస్తుంటే, ఓ పున్నమి వెన్నెల రేయి ఇక్కడ గడపాలి అన్నావ్. వెంటనే why not, we can have white wine kisses too అంటే యే ఇప్పుడు పెట్టకూడదా అని పెదాలు కలిపేశావ్.


నాను ఐ కాంట్ టేక్ బ్రీత్, ఇట్స్ నాట్ కమింగ్ అని నవ్వే నవ్వు మనవి, వారివేనా. అందరివా!?. ఏమో కొన్ని దృశ్యాలు పురాస్మృతులు. కొన్ని అనుభవాలు వెంటనడిచే నీడలు. నువ్వు నా వెంటనడిచే తోడువి. నా జీవితపు దైనందినపు దినాన తొలి, ఆఖరి పలకరింతవి. నా ముద్దుల రాక్షసివి.
దూర తీరాన ఉన్న విరహాన్ని అనుభవించడమూ బాగుంది అనే పిల్ల ఈ లేఖ చివరలో ఒక్కమాట చెప్పనూ...
That's thing about pain.
 
It demands to be felt.

ప్రేమలేఖ 27

కుండ వోంపు నడుముదా! నడుమొంపు కుండదా! అన్నట్లుగా  నడుమొంపులో మధుపాత్రతో నడుచుకుంటూ వచ్చిన సాకీ. టేబుల్ పైనున్న గ్లాసులో కాసింత మధువును వొంపి కొన్ని ఐస్ ముక్కలూ వేశాక, గొంతులోకి ఆన్ ది రాక్స్ జారుతుంటే ఎక్కడో ఓ గొంతు లీలగా వినిపిస్తోంది. పోయి చూస్తును కదా పొద్దుగుంకుతున్న వేళ వచ్చినతను ఇంకా అక్కడే ఉన్నాడు. పొద్దంతా పని చేసి ఒళ్ళు పులిసిందేమో! 'వొళ్ళు నొప్పుల మందు' వేసుకొని ఓ పద్యమెత్తుకున్నాడు.

అతడి పద్యంలోలో ఓ పల్లె పరిమళం. కాంక్రీట్ జంగల్ లో మట్టి వాసన అతని పద్యం. అది ఏ రాగమో తెలియదు. ఆరోన్నక్క రాగం ఎత్తుకున్నాడు అని పిల్లలేడిస్తే అన్నట్లు అతడి గొంతులోనూ ఓ విషాదం. ఎన్ని ఏండ్లదో తెలియదు గానీ అదొక ప్రవహమై అతడి గొంతునుండి జాలు వారుతుంది. అది 'నేను ఈ నీచమైన కాటిపని చేయుటయా' అనిన హరిశ్చంద్రుణ్ణి,  'వశిష్ఠుని వరముచేత నా పతి దేవునికి తప్ప, మరొకరికి కనిపించనిది, ఒక ఛండాలునికి కనిపించుటయా' అనిన మాలినీలను పక్కనే ఉన్న చింత చెట్టు కొమ్మను వంచి తెంపిన బరిగెతో తరుముతున్న వీరబాహుడి తిరుగుబాటు అంతా పద్యంవలె అతడి కంచు కంఠాన ఖంగుమంటూ వస్తున్నది. అతడి పద్యం, రాగం విన్నాక హరిశ్చంద్ర నాటకంలోని పద్యాన్ని మార్చి 'జాంబడి వారసత్వముచే, డప్పును చేసి, దరువు కొట్టిన ఆది సంగీతకారుడి ఛండాల గొంతున జాలువారు పద్యమా నీవిప్పుడు కడు పూజ్యురాలవు' అని రాయలనుంది.

          సాకీ నీ మత్తుచూపు, గొంతులోకి జారుతున్న ఆన్ ది రాక్స్ ఏదీ నిషా ఇవ్వడం లేదు. అవన్నీ అతడి పద్యపు పోరాట పరిమళం ముందు అంతా చిన్నబోయాయి. సాకీ నన్ను మన్నించవూ. నీ మత్తు చూపును దాటి నన్ను మేల్కొలిపిన పద్యంలోకి నడుస్తున్నాను. ఒంటరిగానున్న నన్ను ఓదార్చ వచ్చిన నిన్ను ఒంటరిగా వదిలేసి నా జాతి మూలాలు వెతుక్కుంటూ పోతున్నాను.

వెళ్లేముందు ఎప్పటిలానే ఒకే ఒక్కమాట. నువ్వూ నా తోడురావూ. నీకో కొత్త సమాజాన్ని పరిచయం చేస్తాను. ఏ వాడలోనో పున్నమి చంద్రుడి వెన్నెల వెలుగులో జతగూడుదాం. మనదైన ప్రేమను మళ్లీ మళ్లీ పంచుకుందాం. నన్ను నేను వదిలేసుకొని వచ్చిన చోటుకు నడుస్తున్నాను. నా మూలన్ని నీకు ముచ్చట్లో చెప్పిన చోటుకూ...

ప్రేమలేఖ 26

"యే హవా యే రాత్ యే చాందిని"
తలత్ తలత్ నీ గొంతులో సాకబొయ్యా. ఏం గొంతు సామీ. పాట మహ్మల్ బట్ట మీదుగా వస్తున్నట్టు. యేమి పుచ్చుకోక మునుపే ఎక్కేసావ్. ఇక పుచ్చుకుంటే? రాత్రంతా ఆ కళ్ళను తలుచుకుంటూ ఓ కన్నీటి వరదై పారడమే.

వారు చూసే ఒకే ఒక్క చూపు ప్రభావం ఎంత ఉంటుందో వాళ్ళకేం తెలుసు. ఆ చూపు తాకి గాయపడేది మనం కదా. ఆ గాయాన్ని ఓపుతూ ఎంత దీనంగా వేడుకుంటాం. 'నన్ను పెళ్లాడవూ' అంటూ.

ఎంతగా మనం ప్రేమిస్తే వాళ్ళు పలికే ప్రతీ మాట మన ఎదను తాకుతుంది. వాళ్ళూ మనల్ని ప్రేమించారు గనుకే ఎదను తాకేలా మాట్లాడగలరు. అవి ఇద్దరు ప్రేమికుల హృదయాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకునే మాటలు కదూ. ప్రపంచమంతా వాళ్ళ నవ్వు ముందు ఏపాటిది తలత్. వాళ్ళలా నవ్వేవారు ఎవరున్నారని ఈ లోకంలో. వాళ్లే లేకపోతే. ఆ నవ్వులే లేకపోతే ఈ లోకమెంత వట్టి పోయేది.

ఆ కళ్ళ మత్తె లేకపోతే ఈ ప్రపంచమింత అందంగా కనిపించేదా?
వాళ్లే లేకపోతే. వాళ్లే రాకపోతే. ఈ ఆర్ట్ లెస్, హార్ట్ లెస్ జనాలతో మనకేం పని తలత్. వొఠ్ఠీ యుద్ధ పిపాసులు కదూ వీళ్లంతా. హృదయం ముక్కలయ్యాకా ఏముందని కాళ్ళ కింది నేలకోసం ఆరాటం. హృదయం లేని మనుషులు అవసరమంటావా? ప్రేమన్నదే ఎరగని జీవితమూ ఓ జీవితమేనా?

క్షమించు తలత్ క్షమించు. ప్రేమను గుర్తించలేని మనుషులను. ప్రేమ లేని హృదయాలను. యుద్ధకాంక్షతో నిండిన మెదళ్లనూ క్షమించు. నీవు లేవు. నీ గొంతు ఉంది. గొంతులో పలికిన ప్రేమ ఉంది. విరహం ఉంది. నిన్నూ, నీ గొంతునూ ప్రేమిస్తూ వీళ్ళందర్ని నేనూ క్షమిస్తున్నాను.

ప్రేమలేఖ 25

'జల్తీ హై జిస్ కే లియే
తేరి అఖోంకో దియే 
డూండ్ లాయా హుం 
వో హి గీత్ మైఁ తేరే లియే' అంటూ తలత్ తలపుల్లో తడచిపోతూ 'జగ్ మగాతీ సడ్కోంపై ఆవారా ఫిరూ' అని అనుకుంటూ తిరుగుతున్నప్పుడు ఎందుకోగానీ గుర్తొచ్చావ్.
ఇటు సునీల్ తన విరహాన్ని ఫోన్ లో గున్ గునాయిస్తున్నాడు. అటు నూతన్ గొంతులో కొంగు కుక్కుకుని మరీ కన్నీరు కారుస్తుంది.

ఏదో మాట్లాడుతూ... మాట్లాడుతూ... అలా నీ కళ్ళలోకి చూస్తూ పలవరిస్తాను. నీ కళ్ళ మైకంలో, మోహపు చూపులో పడి. నువ్వూ అంతే దగ్గరితనాన్ని మరింత దగ్గరగా చేస్తూ, తలను రెండు చేతులతో నిమురుతూ, నుదుటిపై ఓ ముద్దై పలకరిస్తావ్ ''పిచ్చోడా, మరీ ఇంతలా ప్రేమిస్తే ఎట్లారా'' అంటూ. అప్పుడు నువ్వు చూసే చూపుంది కదా బహుశా అమ్మ కూడా అంత తపన పడి ఉండదు. 'పిచ్చోడానేను లేకపోతే ఏమైపోతావో నీవు' అని. ఏదోటి చేసుకొని బతికేస్తాననే పిచ్చినమ్మకం తనది. నీది ఏమో ఓ కొత్తపేరు వెతకాలి.

నన్ను ముద్దులలో ముంచెయ్యవూ అన్నట్టుగా మోహానాభరిత మొహం. నల్లమందు మొదలు ఎల్ ఎస్ డి దాకా ఏది ఇవ్వని మత్తును మోసుకొచ్చే పెదాలు. ఆ మైకపు కళ్ళు. ఏం కళ్ళే బాబు. ఏం చూపే బాబు వాటిది. మత్తు మైకపు మోహపు చూపు. చూస్తూచూస్తూకొద్దీ క్షణాల్లోనే ఏదో ఓ మాయ చేసేస్తావ్. ఆ కళ్ళ లోతు ప్రేమలో పడిపోతాను. ఆ చూపుల ప్రవాహంలో పడికొట్టుకుపోతాను.

'తేరి అంఖోంకో సివా, దునియా మే రఖా క్యా హే' ఫైజ్ ఫైజ్ నన్ను నువ్వు కలవరించావా? నేను నిన్ను పలవరిస్తున్నానా? ఏమో బాస్ ఏదేమైనా మనిద్దరం ఆ కళ్ళ లోతుల్లో పడి ఏ తండ్లాట లేకుండానే స్వచ్చంధంగా మునిగిపోయాం.

పెదాల దాకా వచ్చి నుదుటిని పలకరించిన క్షణాన నిన్ను నువ్వు అణచేసుకున్న వైల్డ్ బీస్ట్ లా అనిపిస్తావ్. ఎంతగా టీజ్ చేస్తావ్ పిల్ల. ఆడమ్ టీజింగ్ సెక్షన్ ఒకటి ఐపిసి లో చేర్చమని ప్రభుత్వానికి లేఖ రాయాలి. అప్పుడనుకుంటాను బాండెజ్ అయితే నీ టీజింగ్ కి నా పరిస్థితి ఎంటా అని. ఆ మాట బయటకి అనగానే పెద్దగా నవ్వుతావ్. పెద్ద పెద్ద నోరు. పెద్ద పెద్ద నవ్వు.

పిల్లా... నిన్ను సాకీ అని ఏ క్షణాన పిలిచానో తెలియదు గానీ, నువ్వెప్పుడు చంకన మధుపాత్రతో గాక, నువ్వే ఓ మధువుగా వస్తావ్.  కాసేపు ఉండి. ఉన్నకాసేపట్లోనే యుగాల ఎడబాటు తాలూకు విరహాన్ని ఓపలేని ప్రేమను పంచిపోతావ్. నువ్వెళ్ళిపోయాక నీకై ఎదురుచూస్తూ... ఇదిగో విరహాన్ని ఇలా రాసుకుంటాను...
"పిల్లా... 
మళ్లీ రావూ... 
ఓ కొత్త పొడుపుకై. 
ప్రేమాగ్నిలో దహించుకుపోయెందుకై. 
నీకై. 
నాకై. 
మనకై. 
మనదైన పిచ్చి ప్రేమకై."

Monday, March 25, 2019

Green Book అనబడు బతుకు కథ



సాకీ
నీకో కథ చెప్పనా!
ఊహూ... చెప్తాను
ఓ జీవితాన్ని
ఓ బతుకు తాలూకు
నాలుగు పరిచయ వాక్యాలనూ

గొడ్డు తోలును వొలవడం
నీవేప్పుడైనా చూశావా?
ఒక్కసారి
పియానోపై అతడి వేళ్ళ
కదలికను చూడవూ
వొట్టి వొలవడమే కాదు
వొలిచిన తోలుతో
చెప్పులు కుట్టినట్లుగా అనిపిస్తుంది

దేహాన్నీ
ఎదను తాకిన ప్రతీగాయం
ఓ గేయమై అతడి పియానోపై పలుకుతోంటే
వింటున్నారు
తన్మయత్వంతో
చెవులురిక్కించి
వెలివేసి
చెవుల్లో సీసం పోసిన వాళ్ళ
వారసులంతా
జాషువాను విన్నట్లు

పిలిచిన ఇంట్లోనే
తన ప్రతిభకు చప్పట్లు కొట్టిన ఇంట్లోనే
ఎవడు అవమానపడ్డాడు
ఒక్కవాడు తప్ప
వాడిలాంటి 'వాడ'తప్ప

ఇక్కడ నీళ్లడిగితే
కక్కుసు దొడ్లోని లోటలో ఇచ్చినట్లు
అక్కడ ఉచ్ఛపోసుకొనికి
ఆరుబయట వెలి బాత్రూమ్ వాడుకోమన్నారు

అక్కడా ఇక్కడా
సవర్ణ రెసిజమే కదూ
రాజ్యమేలుతోంది
ఘెట్టోడ్ అని వెలివేసి అక్కడ
గేటెడ్ అంటూ గిరిగీసుకొని ఇక్కడ

'వొఠ్ఠీ జ్ఞాని కావడం గొప్ప కాదు
జనాల్ని మార్చేందుకు ధైర్యం కావాలి'
అతడిప్పుడు అడవిలో పులిని
ఖాళీ చేతులతో వేటాడుతున్నట్లు
కనిపిస్తున్నాడు

సాకీ
అవమానాల్ని జయించినవాడే
అంతర్జాతీయం కాగలడు
తుఫానుకు ఎదురెళ్లిన వాడే
చరిత్రలో తన పేరు రాసుకోగలడు

ఇప్పుడు చేయాల్సిందల్లా
చరిత్రను చెత్తబుట్టలో పడవేయడమే
హిందూ అనాగరికత తవ్వకాలు జరిపి
డాక్టర్ షెర్లీలను వెలికితీయటమే

బతుకులను మసిబార్చిన పురాణాలను కాల్చి
ఇప్పుడు రాయాల్సింది గ్రీన్ బుక్ లాంటి
రెయిన్ బో బుక్ లను

ఈ కలర్ తెరను ఏలాల్సింది
ఇక 'కాలా'లే

(Green book సినిమా చూశాక)

Sunday, March 17, 2019

పరాజితుని గాథ




కడుపులో
కార్ల్స్ బర్గ్ అలలు

దూరాన
కడలి అలలు


కడలి ఒడ్డున
నాగరికత మెరుపులు

మస్తిష్కమొక
నాగరిక గాయాల పుట్ట


తీరమిప్పుడు
జనసంచారం లేని ఒంటరి

దేహామిక
ఒంటరితనాన్ని కాంక్షించే మానవి


కనుల ముందరే
భళ్ళున పగిలిపోయిన కల

చివరికంటూ మిగిలింది
ముక్కలైన హృదయమే


ఇష్టంగా కాచుకున్న
పచ్చిపులుసు
గడ్డకట్టి ఓవైపు

చెల్లాచెదురుగా
చేతిలోని మెతుకులు
మరోవైపు


పచ్చిపుండయి
సలుపుతున్న దేహామిప్పుడు
ఓ 'పరాజితుని గాథ'కి సాక్ష్యం

కూలిపోతున్న దేహం



గుండెను పహారా కాస్తున్న
పక్కబొక్కలు కాస్తా ఒక్కొక్కటిగా
పెటిల్మంటూ ఇరిగిపోతుంటాయ్

ధమణులు సిరలు ఒక్కటై
మృత్యు గీతమాలపిస్తుంటాయ్

కపాళం విచ్చుకొని
గాయపడిన సెరెబ్రమ్ దెబ్బకు
తల గంగవెర్రులెత్తుతుంటుంది
నాల్క స్పష్టాస్పష్టంగా పలుకుతుంటే
కనులు పిచ్చి చూపులు చూస్తుంటాయ్

ప్రపంచమొక అబ్ స్ట్రాక్ట్ పెయింటింగై
కనుల ముందర నడుస్తుంది

దేహపు బరువునంతా మోస్తూ
ఈడుస్తున్నాయో నడుస్తున్నాయో
తెలియని కాళ్ళు


ఒక్కో వృక్షం కూలిపోయి
బీడు పడిన నేలలా
ఇంద్రియాలన్ని ఒక్కొక్కొటిగా ఆగిపోతున్న దేహం
All organs are neutralizing

This body can't survive longer

Wednesday, March 13, 2019

ఓ శబ్దానిశ్శబ్ద నడిరేయి


కబళించేందుకే పెరిగినట్లు
ఎప్పుడు మీద పడతాయో
ఊహించలేని గండశిలలు
పక్కనే

మిణుకు మిణుకుమంటు
ఎప్పుడారి పోతుందో తెలియని
బుడ్డి దీపమొకటి
దూరంగా

చుక్కలను దుప్పటిగా నేస్తూ
చంద్రుణ్ణి అందులో
కలిపి కుట్టిందా!
అన్నట్లుగా ఆకాశం

గుడిసెకు
ఒంటి నిట్ఠాడి వలె
ఒకే ఒక్క ఎర్రని స్థూపం
ఎందరి వీరుల జ్ఞాపకమో!

యుద్ధానంతరమో
యుద్ధపూర్వమో
తెలియదు గానీ
అక్కడంతా కర్ఫ్యూ
నిశ్శబ్దం

అప్పుడప్పుడు
సైనిక పటాలాల
కవాతు వోలె
రాలిపడుతున్న
ఆకుల చప్పుడు