Monday, March 25, 2019

Green Book అనబడు బతుకు కథ



సాకీ
నీకో కథ చెప్పనా!
ఊహూ... చెప్తాను
ఓ జీవితాన్ని
ఓ బతుకు తాలూకు
నాలుగు పరిచయ వాక్యాలనూ

గొడ్డు తోలును వొలవడం
నీవేప్పుడైనా చూశావా?
ఒక్కసారి
పియానోపై అతడి వేళ్ళ
కదలికను చూడవూ
వొట్టి వొలవడమే కాదు
వొలిచిన తోలుతో
చెప్పులు కుట్టినట్లుగా అనిపిస్తుంది

దేహాన్నీ
ఎదను తాకిన ప్రతీగాయం
ఓ గేయమై అతడి పియానోపై పలుకుతోంటే
వింటున్నారు
తన్మయత్వంతో
చెవులురిక్కించి
వెలివేసి
చెవుల్లో సీసం పోసిన వాళ్ళ
వారసులంతా
జాషువాను విన్నట్లు

పిలిచిన ఇంట్లోనే
తన ప్రతిభకు చప్పట్లు కొట్టిన ఇంట్లోనే
ఎవడు అవమానపడ్డాడు
ఒక్కవాడు తప్ప
వాడిలాంటి 'వాడ'తప్ప

ఇక్కడ నీళ్లడిగితే
కక్కుసు దొడ్లోని లోటలో ఇచ్చినట్లు
అక్కడ ఉచ్ఛపోసుకొనికి
ఆరుబయట వెలి బాత్రూమ్ వాడుకోమన్నారు

అక్కడా ఇక్కడా
సవర్ణ రెసిజమే కదూ
రాజ్యమేలుతోంది
ఘెట్టోడ్ అని వెలివేసి అక్కడ
గేటెడ్ అంటూ గిరిగీసుకొని ఇక్కడ

'వొఠ్ఠీ జ్ఞాని కావడం గొప్ప కాదు
జనాల్ని మార్చేందుకు ధైర్యం కావాలి'
అతడిప్పుడు అడవిలో పులిని
ఖాళీ చేతులతో వేటాడుతున్నట్లు
కనిపిస్తున్నాడు

సాకీ
అవమానాల్ని జయించినవాడే
అంతర్జాతీయం కాగలడు
తుఫానుకు ఎదురెళ్లిన వాడే
చరిత్రలో తన పేరు రాసుకోగలడు

ఇప్పుడు చేయాల్సిందల్లా
చరిత్రను చెత్తబుట్టలో పడవేయడమే
హిందూ అనాగరికత తవ్వకాలు జరిపి
డాక్టర్ షెర్లీలను వెలికితీయటమే

బతుకులను మసిబార్చిన పురాణాలను కాల్చి
ఇప్పుడు రాయాల్సింది గ్రీన్ బుక్ లాంటి
రెయిన్ బో బుక్ లను

ఈ కలర్ తెరను ఏలాల్సింది
ఇక 'కాలా'లే

(Green book సినిమా చూశాక)

No comments:

Post a Comment