Tuesday, March 26, 2019

ప్రేమలేఖ 25

'జల్తీ హై జిస్ కే లియే
తేరి అఖోంకో దియే 
డూండ్ లాయా హుం 
వో హి గీత్ మైఁ తేరే లియే' అంటూ తలత్ తలపుల్లో తడచిపోతూ 'జగ్ మగాతీ సడ్కోంపై ఆవారా ఫిరూ' అని అనుకుంటూ తిరుగుతున్నప్పుడు ఎందుకోగానీ గుర్తొచ్చావ్.
ఇటు సునీల్ తన విరహాన్ని ఫోన్ లో గున్ గునాయిస్తున్నాడు. అటు నూతన్ గొంతులో కొంగు కుక్కుకుని మరీ కన్నీరు కారుస్తుంది.

ఏదో మాట్లాడుతూ... మాట్లాడుతూ... అలా నీ కళ్ళలోకి చూస్తూ పలవరిస్తాను. నీ కళ్ళ మైకంలో, మోహపు చూపులో పడి. నువ్వూ అంతే దగ్గరితనాన్ని మరింత దగ్గరగా చేస్తూ, తలను రెండు చేతులతో నిమురుతూ, నుదుటిపై ఓ ముద్దై పలకరిస్తావ్ ''పిచ్చోడా, మరీ ఇంతలా ప్రేమిస్తే ఎట్లారా'' అంటూ. అప్పుడు నువ్వు చూసే చూపుంది కదా బహుశా అమ్మ కూడా అంత తపన పడి ఉండదు. 'పిచ్చోడానేను లేకపోతే ఏమైపోతావో నీవు' అని. ఏదోటి చేసుకొని బతికేస్తాననే పిచ్చినమ్మకం తనది. నీది ఏమో ఓ కొత్తపేరు వెతకాలి.

నన్ను ముద్దులలో ముంచెయ్యవూ అన్నట్టుగా మోహానాభరిత మొహం. నల్లమందు మొదలు ఎల్ ఎస్ డి దాకా ఏది ఇవ్వని మత్తును మోసుకొచ్చే పెదాలు. ఆ మైకపు కళ్ళు. ఏం కళ్ళే బాబు. ఏం చూపే బాబు వాటిది. మత్తు మైకపు మోహపు చూపు. చూస్తూచూస్తూకొద్దీ క్షణాల్లోనే ఏదో ఓ మాయ చేసేస్తావ్. ఆ కళ్ళ లోతు ప్రేమలో పడిపోతాను. ఆ చూపుల ప్రవాహంలో పడికొట్టుకుపోతాను.

'తేరి అంఖోంకో సివా, దునియా మే రఖా క్యా హే' ఫైజ్ ఫైజ్ నన్ను నువ్వు కలవరించావా? నేను నిన్ను పలవరిస్తున్నానా? ఏమో బాస్ ఏదేమైనా మనిద్దరం ఆ కళ్ళ లోతుల్లో పడి ఏ తండ్లాట లేకుండానే స్వచ్చంధంగా మునిగిపోయాం.

పెదాల దాకా వచ్చి నుదుటిని పలకరించిన క్షణాన నిన్ను నువ్వు అణచేసుకున్న వైల్డ్ బీస్ట్ లా అనిపిస్తావ్. ఎంతగా టీజ్ చేస్తావ్ పిల్ల. ఆడమ్ టీజింగ్ సెక్షన్ ఒకటి ఐపిసి లో చేర్చమని ప్రభుత్వానికి లేఖ రాయాలి. అప్పుడనుకుంటాను బాండెజ్ అయితే నీ టీజింగ్ కి నా పరిస్థితి ఎంటా అని. ఆ మాట బయటకి అనగానే పెద్దగా నవ్వుతావ్. పెద్ద పెద్ద నోరు. పెద్ద పెద్ద నవ్వు.

పిల్లా... నిన్ను సాకీ అని ఏ క్షణాన పిలిచానో తెలియదు గానీ, నువ్వెప్పుడు చంకన మధుపాత్రతో గాక, నువ్వే ఓ మధువుగా వస్తావ్.  కాసేపు ఉండి. ఉన్నకాసేపట్లోనే యుగాల ఎడబాటు తాలూకు విరహాన్ని ఓపలేని ప్రేమను పంచిపోతావ్. నువ్వెళ్ళిపోయాక నీకై ఎదురుచూస్తూ... ఇదిగో విరహాన్ని ఇలా రాసుకుంటాను...
"పిల్లా... 
మళ్లీ రావూ... 
ఓ కొత్త పొడుపుకై. 
ప్రేమాగ్నిలో దహించుకుపోయెందుకై. 
నీకై. 
నాకై. 
మనకై. 
మనదైన పిచ్చి ప్రేమకై."

No comments:

Post a Comment