Tuesday, March 26, 2019

ప్రేమలేఖ 26

"యే హవా యే రాత్ యే చాందిని"
తలత్ తలత్ నీ గొంతులో సాకబొయ్యా. ఏం గొంతు సామీ. పాట మహ్మల్ బట్ట మీదుగా వస్తున్నట్టు. యేమి పుచ్చుకోక మునుపే ఎక్కేసావ్. ఇక పుచ్చుకుంటే? రాత్రంతా ఆ కళ్ళను తలుచుకుంటూ ఓ కన్నీటి వరదై పారడమే.

వారు చూసే ఒకే ఒక్క చూపు ప్రభావం ఎంత ఉంటుందో వాళ్ళకేం తెలుసు. ఆ చూపు తాకి గాయపడేది మనం కదా. ఆ గాయాన్ని ఓపుతూ ఎంత దీనంగా వేడుకుంటాం. 'నన్ను పెళ్లాడవూ' అంటూ.

ఎంతగా మనం ప్రేమిస్తే వాళ్ళు పలికే ప్రతీ మాట మన ఎదను తాకుతుంది. వాళ్ళూ మనల్ని ప్రేమించారు గనుకే ఎదను తాకేలా మాట్లాడగలరు. అవి ఇద్దరు ప్రేమికుల హృదయాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకునే మాటలు కదూ. ప్రపంచమంతా వాళ్ళ నవ్వు ముందు ఏపాటిది తలత్. వాళ్ళలా నవ్వేవారు ఎవరున్నారని ఈ లోకంలో. వాళ్లే లేకపోతే. ఆ నవ్వులే లేకపోతే ఈ లోకమెంత వట్టి పోయేది.

ఆ కళ్ళ మత్తె లేకపోతే ఈ ప్రపంచమింత అందంగా కనిపించేదా?
వాళ్లే లేకపోతే. వాళ్లే రాకపోతే. ఈ ఆర్ట్ లెస్, హార్ట్ లెస్ జనాలతో మనకేం పని తలత్. వొఠ్ఠీ యుద్ధ పిపాసులు కదూ వీళ్లంతా. హృదయం ముక్కలయ్యాకా ఏముందని కాళ్ళ కింది నేలకోసం ఆరాటం. హృదయం లేని మనుషులు అవసరమంటావా? ప్రేమన్నదే ఎరగని జీవితమూ ఓ జీవితమేనా?

క్షమించు తలత్ క్షమించు. ప్రేమను గుర్తించలేని మనుషులను. ప్రేమ లేని హృదయాలను. యుద్ధకాంక్షతో నిండిన మెదళ్లనూ క్షమించు. నీవు లేవు. నీ గొంతు ఉంది. గొంతులో పలికిన ప్రేమ ఉంది. విరహం ఉంది. నిన్నూ, నీ గొంతునూ ప్రేమిస్తూ వీళ్ళందర్ని నేనూ క్షమిస్తున్నాను.

No comments:

Post a Comment