Tuesday, March 26, 2019

ప్రేమలేఖ 27

కుండ వోంపు నడుముదా! నడుమొంపు కుండదా! అన్నట్లుగా  నడుమొంపులో మధుపాత్రతో నడుచుకుంటూ వచ్చిన సాకీ. టేబుల్ పైనున్న గ్లాసులో కాసింత మధువును వొంపి కొన్ని ఐస్ ముక్కలూ వేశాక, గొంతులోకి ఆన్ ది రాక్స్ జారుతుంటే ఎక్కడో ఓ గొంతు లీలగా వినిపిస్తోంది. పోయి చూస్తును కదా పొద్దుగుంకుతున్న వేళ వచ్చినతను ఇంకా అక్కడే ఉన్నాడు. పొద్దంతా పని చేసి ఒళ్ళు పులిసిందేమో! 'వొళ్ళు నొప్పుల మందు' వేసుకొని ఓ పద్యమెత్తుకున్నాడు.

అతడి పద్యంలోలో ఓ పల్లె పరిమళం. కాంక్రీట్ జంగల్ లో మట్టి వాసన అతని పద్యం. అది ఏ రాగమో తెలియదు. ఆరోన్నక్క రాగం ఎత్తుకున్నాడు అని పిల్లలేడిస్తే అన్నట్లు అతడి గొంతులోనూ ఓ విషాదం. ఎన్ని ఏండ్లదో తెలియదు గానీ అదొక ప్రవహమై అతడి గొంతునుండి జాలు వారుతుంది. అది 'నేను ఈ నీచమైన కాటిపని చేయుటయా' అనిన హరిశ్చంద్రుణ్ణి,  'వశిష్ఠుని వరముచేత నా పతి దేవునికి తప్ప, మరొకరికి కనిపించనిది, ఒక ఛండాలునికి కనిపించుటయా' అనిన మాలినీలను పక్కనే ఉన్న చింత చెట్టు కొమ్మను వంచి తెంపిన బరిగెతో తరుముతున్న వీరబాహుడి తిరుగుబాటు అంతా పద్యంవలె అతడి కంచు కంఠాన ఖంగుమంటూ వస్తున్నది. అతడి పద్యం, రాగం విన్నాక హరిశ్చంద్ర నాటకంలోని పద్యాన్ని మార్చి 'జాంబడి వారసత్వముచే, డప్పును చేసి, దరువు కొట్టిన ఆది సంగీతకారుడి ఛండాల గొంతున జాలువారు పద్యమా నీవిప్పుడు కడు పూజ్యురాలవు' అని రాయలనుంది.

          సాకీ నీ మత్తుచూపు, గొంతులోకి జారుతున్న ఆన్ ది రాక్స్ ఏదీ నిషా ఇవ్వడం లేదు. అవన్నీ అతడి పద్యపు పోరాట పరిమళం ముందు అంతా చిన్నబోయాయి. సాకీ నన్ను మన్నించవూ. నీ మత్తు చూపును దాటి నన్ను మేల్కొలిపిన పద్యంలోకి నడుస్తున్నాను. ఒంటరిగానున్న నన్ను ఓదార్చ వచ్చిన నిన్ను ఒంటరిగా వదిలేసి నా జాతి మూలాలు వెతుక్కుంటూ పోతున్నాను.

వెళ్లేముందు ఎప్పటిలానే ఒకే ఒక్కమాట. నువ్వూ నా తోడురావూ. నీకో కొత్త సమాజాన్ని పరిచయం చేస్తాను. ఏ వాడలోనో పున్నమి చంద్రుడి వెన్నెల వెలుగులో జతగూడుదాం. మనదైన ప్రేమను మళ్లీ మళ్లీ పంచుకుందాం. నన్ను నేను వదిలేసుకొని వచ్చిన చోటుకు నడుస్తున్నాను. నా మూలన్ని నీకు ముచ్చట్లో చెప్పిన చోటుకూ...

No comments:

Post a Comment