Tuesday, June 18, 2019

పున్నమి నాటి వెన్నెల

మబ్బుల చీల్చుకు వస్తావ్
బతుకు చీకటైన ప్రతీసారి

ఒక్కోసారి ఎంత పిలిచినా రావు
నీ రాక లేని రోజుకు అమాస అని పేరేమో

చూస్తూనే ఉంటాను నీ కదలికల్ని
జగ్ మగాతి సడ్కొంపే ఆవారానై తిరుగుతూ

చేతికి అందినట్టే అంది
పెదాలు తాకే లోపే వెళ్లిపోతావ్
నీళ్లలో నీ బింబాన్ని వదిలేస్తూ

రాత్రంతా
నిన్ను కళ్ళలో నింపుకునెందుకు
పగలంతా నిదురపోతాను

ఇప్పుడూ అంతే నిన్ను చూడాలని
టెర్రస్ ఎక్కానా
నువ్ మబ్బుల్లో దాగుతూ దోబూచులాడుతూనే ఉన్నావ్

సాకీ
తెచ్చుకున్న ప్యాలా అయిపోవొచ్చింది

నువ్వొస్తే కొసరి కొసరి ఇవ్వాలని
దాచి ఉంచాను
మత్తు మోహపు మాటలల్లో కాసింత ప్రేమను

ఎప్పటిలాగే
ఆ నలుపు పరదాల్ని
దాటుకు రావూ

(Surya Chandra DG ఇదిగో నువ్ రాయమని అడిగిన కవితా.)

Monday, June 10, 2019

ప్రేమలేఖ 33



కొన్ని శతబ్దాలుగా నిద్రలేనట్లుగా ఓ మానవి వచ్చి ఒళ్ళో తల వాలుస్తుంది. మగతలోనే చేయినలా లాక్కొని ఎదపై వేసుకుంటుంది. నన్ను జో కొట్టవూ అనేందుకు చిహ్నమేమో!. కొట్టి కొట్టనట్లుగా, తాకి తాకనట్లుగా, చప్పుడూ రాకుండ నాలుగు వేళ్లనలా ఆడిస్తుంటే మాట్లాడుతో, మాట్లాడుతో, వింటూ, వింటూ మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది.


అంతలోనే ఓ ఉలిక్కిపాటు. ఏ పీడకల వచ్చిందో. జో కొడుతున్న చెయ్యినలా గట్టిగా పట్టుకొని, 'ఇక్కడే ఉన్నావు కదూ' అంటూ.

"Give me your shoulder, ఎన్ని రోజులైంది నీ గుండె చప్పుడు వింటూ పడుకోని".
'ఏమైంది పడుకున్నావ్ కదా!'
"నువ్వోదిలేసి పోయినట్లు కలొచ్చింది".

కలలెప్పుడూ అంతే. మెదడు పొరల్లో అణచేసిన వాటిని మోసుకువస్తాయి. దాచుకున్న భయాల్ని గుర్తుచేస్తాయి. ఇదీ అంతేనేమో. ఏమో నువ్వే చెప్పాలి. అప్పుడు అడగలేదు. ఇప్పుడు అడిగేందుకు పక్కన లేవు.


మళ్లీ అంతే. నిదురపట్టక పక్కపై పొర్లాడుతుంటే ఏవేవో చెదిరిపోయిన కలలు.

నీకు గుర్తుందో? లేదో?. నాకు మాత్రం ఆ ఉదయం ఇంకా వెంటాడుతూనే ఉంది. ప్రతీ ఉదయంలానే దగ్గరకు లాక్కుందామని చేయి చేస్తే మెత్తని దేహానికి బదులు మార్బుల్ నేల తాకింది. ఆ మగతలోనే హాల్ లోకి వచ్చి చూస్తే అక్కడా లేవు. తెరచున్న ఇంటి తలుపు, నువ్ పాలకోసం పోయుంటావ్ అనే సమాధానమిచ్చింది. ఎక్కడా ??? ఎంతసేపయింది??? ఇంకా రావే!!! 'ఓ అర్జంట్ పనుండి పోయా'అంటూ ఓ చిరు సందేశం. ఆ రోజు నిద్రలో నిర్ధాక్షిణ్యంగా వదిలేసిన వెళ్లిన పోకట, మళ్లీ వచ్చింది లేదు. వస్తావన్నా ఒకే ఒక్క ఆశ. ఆ ఆశలోనే రోజులు నెలలయ్యాయి. నెలలు సంవత్సరాలు. అంతా ఓ కలలా కళ్ళముందు కదలాడుతూ.

అంతే. ఇప్పుడూ అంతే. ఏదో ఓ పిలుపు. ఉలిక్కిపాటు. కల చెదిరిపోయింది. ఇప్పటిదాకా కలగా కలవరించినదాన్ని ఇలా పలవరిస్తున్నాను.


కలలు ఎప్పుడూ చెదిరిపోతాయా? కలసి కన్న కలలే కాదు. కనాలనుకున్న కలలూ అంతేనా? నీలాగే ఓ అర్థరాత్రి నిద్రలోనే మాయమయ్యింది. ఏదీ మళ్లీ రాదే. మళ్లీ అదే ఆశ. వస్తుందనే ఆశ. వొట్టి పిచ్చి ఆశ. ఆ ఆశే కదూ మనిషిని బతికేంచేది. నడిపించేది.