Thursday, January 31, 2019

మత్తు చూపుల కనులు

సాకీ,
ఆ కనుల కొస నుండి
విసరకు
మరో చూపు
అది తాకి
మత్తెకి పోతాను
నువ్ తెచ్చిన ప్యాలా
అంతా తాగేసినట్లుగా

అవును ప్రియా
అవి కళ్ళా
కాటుక గోళాలా

ఏమా నడుమొంపులు
నువ్ వయ్యారంగా దరికి వస్తుంటే

నీ కురులు ముద్దాడాయి
నువ్ పెదాలు జత కలపకమునుపే

చూడకు సూటిగా అలా
ఆ చూపులు పురిగొల్పుతాయి
ఏదో ఓ చిలిపి పని చేయాలని

చక్కిలిగింతల నవ్వులు
వేళ్ళు నీ నాభీని మీటగానే

పలవరిస్తున్నాను
ఈ మత్తులో ఏదేదో
సాకీ,
నీ చూపు సోకి
నన్ను నే మైమరచి
నీ ముందు మోకరిల్లి

Mohan Babu 'ఐస్ తో నా దేఖో, కె హమ్ కో నషా హో జాయే' నేను ముందే చెప్పిన ఆ కళ్ళు మాములు కళ్ళు కాదు బాస్. లాగేస్తాయ్ అని. విన్నవా. రెస్పాండ్ అవ్వమన్నావ్. చూడు. ఆ చూపు సోకి, నన్ను నే మైమరచి, ఆమె ముందు మోకరిల్లి ఏదో పలవరిస్తున్నాను.

చలిగాలి

నిదురపట్టక
ఈ రాతిరి హృదయం
అడుగుతోంది
కొన్ని కథలు చెప్పమని

ఎగిరిపోవాలి
మబ్బుల ఊరిలో తిరుగుతూ
నాలానే వచ్చిన
చుక్కలతో మాట్లాడేందుకు

కానీ,
ఎక్కడ దొరకాలీ
ప్రవరుడిలా పాదలేపానం

విరహ బాధతో కోస్తుంది ఎదను
ఈ జనవరి మాసంతపు చలిగాలి

కరిగిపోతున్నాయి
కలలన్నీ కలలోనే

మేల్కొనేసరికి
పరుచుకుంటుందేమో ఓ చెట్టు నీడ

సాకీ,
నే లేచిసరికి
పక్కనుండవూ

Mohan Babu 'Tandi Hawa Yeh, Chandini Suhani' పాటకి రెస్పాండ్ కాలేదు అన్నావ్ కదూ. ఇదిగో ఇప్పుడే పాట ఇప్పుడేవిన్న. విన్నాక ఇలా రెస్పాండ్ అవుతున్న. ఆ కళ్ళ పాటవైపు వెళ్లాలంటే ఎక్కడ లాగేస్తుందో అని భయమేస్తోంది బాస్ 😜

Friday, January 25, 2019

Perhaps last poem

ఎప్పటిలానే మర్చిపోయాను అనుకుంటాను
ఏదో ఓ ముచ్చట నిన్ను యాద్జేస్తనే ఉంటది

నా గుండెల మీద నాగరికత సంతకం చేసినదానవు కదా
ఇత్నా జల్దీ కైసే బూల్ జావూ తుమ్హే

వెన్నెల రాత్రులందు ఒడువని ముచ్చట్లు
మైదానాటవి నదీతీరాలు మొదలు
నేలా సముద్రం ముద్దాడే చోటుదాక అలుపెరుగని నడకలు
అలసిపోయిన పాదాలను ముద్దాడే అలలు
మనదైన ఒంటరి ప్రయాణాలు
ఒంటరి ప్రయాణాల్లో నీవు తోడుంటే బాగుండు అనే సందేశాలు
కలలందు వెంటాడే కన్నులు
అరవిచ్చిన పెదాల కొసనుండి విసిరే నవ్వులు
అన్నీ నిన్నా మొన్నా జరిగినట్లుగానే

'ఇద్దరు కలిసి రావట్లేదేంటని' హుస్సేన్ సాగర్ బుద్ధుడు అడిగాడు
వెన్నెలా బుద్ధుడు రాత్రంతా మన జ్ఞాపకాలు కలబోసుకున్నారట
కిటికీ తలుపు తట్టి మరీ చెప్పింది వెన్నెల

నన్నొదిలి పోయిన నువ్వు నాకేమవుతావ్?

నా బతుకు
ఆదిమగుహలో తొలుసురు మానవుడు చెక్కిన కుడ్యానివా!
నదితీరపు నాగరికత కట్టడానివా!
ఖైద్ జిందగీకా ఆజాది తమన్నావా!

గుండె గొంతుకలో కొట్లాడుతుంటే ఏమీ పలకలేక అట్లే రాసుకున్న

నిన్ను నా రాతల్లో చూసుకుంటానన్న పిల్ల
బహుశా నీకోసం నే రాసే
చివరి రాత ఇదే కావొచ్చు

ఉంటాను మరీ
సాకీ
తలుపు దగ్గర ప్యాలాతో ఎదురుచూస్తూ ఉంది

Thursday, January 24, 2019

ఎదురుచూపు

గడచిపోతున్న క్షణాల్లా
ఒక్కొక్కటిగా రాలిపోతున్న ఆకులు

అనుకుంటాను
ఆకురాలిన ప్రతీసారి
శిశిరమై రాలినా
వసంతమై చిగురిస్తుందని

కనులు వర్షమై కురుస్తున్నాయి
దేహం గ్రీష్మమై కాలిపోతూ

ఓ హేమంతమా
నా ఎదురుచూపులంతా
శరత్కాలపు వెన్నెల కోసమే

23/01/19

Friday, January 4, 2019

ఓ కొసెల్లని రాత్రి


ఏదో రాయాలని కూర్చుంటాను
అస్తవ్యస్త వాక్యాలు కొన్ని
డంజన్ ముందటి రోడ్డుమీది పొన్నపూలలా
పేపర్ పై చెల్లాచెదురుగా పడతాయి

ఈ రాత్రికి ఒడగొట్టాలని
పుస్తకం ముంగటేసుకుంటాను
పాత్ర జీవితంలో చొరబడి
జ్ఞాపకాల్ని తట్టిలేపుతుంది

ఈ రాత్రికి ముసలోడి అంతు చూడాలని
ముచ్చటలోకి దిగుతాను
వాడు రెండో మోడో తత్వాలు చెప్పగానే
Sorry, I'm not interested అని
లేచి వస్తాను

ఎందుకో ఈ రాత్రి ఎటు కొసెల్తలేదు