Friday, January 25, 2019

Perhaps last poem

ఎప్పటిలానే మర్చిపోయాను అనుకుంటాను
ఏదో ఓ ముచ్చట నిన్ను యాద్జేస్తనే ఉంటది

నా గుండెల మీద నాగరికత సంతకం చేసినదానవు కదా
ఇత్నా జల్దీ కైసే బూల్ జావూ తుమ్హే

వెన్నెల రాత్రులందు ఒడువని ముచ్చట్లు
మైదానాటవి నదీతీరాలు మొదలు
నేలా సముద్రం ముద్దాడే చోటుదాక అలుపెరుగని నడకలు
అలసిపోయిన పాదాలను ముద్దాడే అలలు
మనదైన ఒంటరి ప్రయాణాలు
ఒంటరి ప్రయాణాల్లో నీవు తోడుంటే బాగుండు అనే సందేశాలు
కలలందు వెంటాడే కన్నులు
అరవిచ్చిన పెదాల కొసనుండి విసిరే నవ్వులు
అన్నీ నిన్నా మొన్నా జరిగినట్లుగానే

'ఇద్దరు కలిసి రావట్లేదేంటని' హుస్సేన్ సాగర్ బుద్ధుడు అడిగాడు
వెన్నెలా బుద్ధుడు రాత్రంతా మన జ్ఞాపకాలు కలబోసుకున్నారట
కిటికీ తలుపు తట్టి మరీ చెప్పింది వెన్నెల

నన్నొదిలి పోయిన నువ్వు నాకేమవుతావ్?

నా బతుకు
ఆదిమగుహలో తొలుసురు మానవుడు చెక్కిన కుడ్యానివా!
నదితీరపు నాగరికత కట్టడానివా!
ఖైద్ జిందగీకా ఆజాది తమన్నావా!

గుండె గొంతుకలో కొట్లాడుతుంటే ఏమీ పలకలేక అట్లే రాసుకున్న

నిన్ను నా రాతల్లో చూసుకుంటానన్న పిల్ల
బహుశా నీకోసం నే రాసే
చివరి రాత ఇదే కావొచ్చు

ఉంటాను మరీ
సాకీ
తలుపు దగ్గర ప్యాలాతో ఎదురుచూస్తూ ఉంది

No comments:

Post a Comment