Sunday, May 6, 2018

ప్రేమలేఖ 9


ప్రేమలేఖ 9

భరించలేని తలపోటు అనబడు మైగ్రేన్ ఒక ఆట ఆడుకున్నాక నిద్రపట్టక అటు ఇటు పొర్లుతూ అలాగే పడుకుండి పోయా. కన్నంటుతుండగా ఎందుకో జ్ఞాపకం వచ్చావ్. హత్తుకుందాం అని చేయి చాస్తే తాకిన గోడ నువ్వు పక్కనలేవనే వాస్తవాన్ని చెప్పింది. ఆ జ్ఞాపకాల నదిలో కాసేపు తండ్లాడి, ఇక నిద్రపట్టేలా లేదని అర్థమయ్యి గాలికి తిరుగుదామని బయటకి వెళ్ళా. ఇందిరా పార్కు దాటాక కానీ చూసుకోలేదు బండిలో పెట్రోల్ ఉందో? లేదో? లకడికాపూల్ పోతే బ్యాంకులు బంద్. మళ్ళీ మన పెట్రోల్ బంక్ కి పోయా. అక్కడ రెగ్యులర్ గా పెట్రోల్ పొసే పిలగాడే ఉన్నాడు. గుర్తుపట్టినట్టున్నాడు. 'ఏం సార్, ఒక్కరే వచ్చిండ్లు. మేడమ్ రాలేదా?' అని అడిగాడు. 'లేదు, దేశం పోయింది' అని చెప్పి వచ్చేశా. కాస్త ముందుకు వచ్చి ట్యాంక్ బండ్ ఎక్కగానే చల్లగా తాకిన గాలి. తనతోపాటే జ్ఞాపకల్ని మోసుకువచ్చింది. ఒకప్పుడు రాత్రీ జనాలతో కలకళలాడిన ట్యాంక్ బండ్ రోడ్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. అక్కడక్కడా పుట్టినరోజులు జరుపుకునే జనాలు. మొఖాలకు కేకులు పూసుకుంటూ ఆడుకుంటున్నారు. ఆ చివరి వరకు పోయి ఎలెక్షన్ కమిషన్ ఆఫీసు దగ్గర నుండి నెక్లెస్ రోడ్ వైపు పోదాం అని బండి తిప్పిన. ఆ ములమీద కేఫ్ చూడగానే మళ్ళీ కొన్ని జ్ఞాపకాలు. ఎంత కాలం ఆ కేఫ్ ముందు టీ కప్పుల్లో కరిగిపోయిందో కదా!.

రోడ్డుపై రాలిపడిన పూలను చూసి 'బాగున్నాయ్ కదా' అన్నాను. వెనకనుండి నీ సమాధానం రాకపోతే అర్థం అయింది. నువ్వు లేకుండా ఒక్కడినే పోతున్నా అని. అట్లా అనుకుంటుండగా ఎదురుగా ఓ జంట యు టర్న్ చేసుకుంటూ. ఆ పిల్ల బండి నేర్చుకుంటున్నట్టుంది. వెనుకాల ఉన్న పిలగాడు ఆ అమ్మాయి చేతులు పట్టుకొని జాగ్రత్తగా చూస్తున్నాడు. ఇంకాస్త ముందుకు పోగానే వెనకనుండి ఓ బైక్ ఓవర్ టేక్ చేసింది. మళ్ళీ ఇంకో జంట. వెనుకాల కూర్చున్న అమ్మాయి ఓ చూపు చూసి ఒక వీయర్డ్ లుక్ ఇచ్చింది. 'ఇంత మంచి రొమాంటిక్ వాతావరణంలో ఒక్కడివే పోతున్నావేంట్రా పిచ్చోడా' అన్నట్లు. ఏం చేస్తాం. వెనుకాల నువ్వు లేకున్నా, నీ జ్ఞాపకాలతో పయనిస్తున్న అని ఆ పిల్ల చూపుకు జవాబివ్వలేను కదా. లెఫ్ట్ సైడ్ ఈట్ స్ట్రీట్. ఆ పక్కనే బుద్ధుడు. మొన్న ఆ మధ్య ఎవరో బుద్ధుడి విగ్రహం గురించి మాట్లాడితే హుస్సేన్ సాగర్ లో బుద్ధుడు అనకుండా ఈట్ స్ట్రీట్ పక్కన బుద్ధుడు అన్నా. నీతో ఆ ఈట్ స్ట్రీట్ లో గడిపి గడిపి, సూర్యాస్తమయాలు, చంద్రోదయలు చూసి చూసి, హుస్సేన్ సాగర్ బుద్ధుడు కాస్త ఈట్ స్ట్రీట్ బుద్ధుడయ్యాడు నాకు.

చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం, పొద్దున కావాలన్న దొరకది అని అలా ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ దింపి రాజ్ భవన్ రోడ్డులోకి పోనిచ్చా. ఆ రోడ్డులో కాస్త పోగానే గుల్ మెహర్ పూల గాలి. ఎన్నిసార్లు ఆ పువ్వులను చూస్తూ ఆ రోడ్డులో పోలేదు. గుర్తుందా రోడ్డుమీద పడ్డ గుల్ మెహర్ పుష్పాలను కార్లు తొక్కుతూ పోతుంటే ఎంత బాధ పడ్డావ్ ఆరోజు. మన ఇంట్లో ఓ చెట్టు పెట్టుకుందాం అన్లేదు. ఈ జ్ఞాపకాల సుడిగుండంలో ఓ ఘర్షణ. ఎట్లాగూ నువ్వు వస్తావ్. వస్తావు కదూ!. అయినా ఎందుకో ఘర్షణ. ఘర్షణ ఐక్యత కోసమే కదా. అవి రెండు పెనవేసుకున్నదే జీవితం అని రాసుకోలేదు.

బేగంపేట్ దాటి ముందుకు పోతుంటే రోడ్డు పక్కన ఓ జంట కారుదిగి నిల్చున్నారు. ఎందుకో ఓ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చూసిన ఆ దృశ్యం ఒక గొప్ప సినిమాటోగ్రఫిక్ అనిపించింది. 'తల పైకిత్తి తాను. ఆమె వెంట్రుకలను మునివేళ్ళతో నిమురుతూ అతను. అతడి కళ్ళలోకి ఆమె చూస్తున్న చూపులో నా మొహాన్ని ముద్దుల్లో ముంచెయ్యవు అన్న కాంక్ష.' ఆ దృశ్యం అట్లా ఉండిపోయింది. ఆ పిల్ల చూసిన చూపులో నే వెళ్లిపోతున్నప్పుడు నువ్వు కండ్లనిండా నింపుకునే దృశ్యమే కనపడ్డది. ఎంత ముద్దొస్తావ్ అప్పుడు. ఎన్ని ముద్దులిచ్చాను ఆ కనులకు. ఆ పివిఆర్ లోనో, జీవికేలోనో సినిమా చూసి వస్తుంటే వెనకనుండి నువ్వు అద్దంలో నా ప్రతిబింబాన్నిఎంత ఆర్తిగా చూసేదానివో జ్ఞప్తికి వచ్చింది. ఇంటికి పోతుంటే జూబ్లీ ఫ్లై ఓవర్ దగ్గర ఎన్నిసార్లు దింపలేదు. అక్కడికి రాగానే ఎందుకో మళ్ళీ ట్యాంక్ బండ్ పోవాలనిపించింది. ట్యాంక్ బండ్ ని ఇంకో చుట్టేసి గాని ఫ్లాట్ కి రాలేదు.

ఇవ్వాలెందుకో వెన్నెల రాలేదు. ఏమైందో! ఏమో! ఇటు నువ్వు, అటు వెన్నెల లేక విద్యుత్ దీపాల నా ఒంటరి ప్రయాణం. వచ్చాకా నిద్ర పట్టక ఈ రాత్రి జ్ఞాపకల్ని, అనుభవాల్ని, అనుభూతుల్ని ఇదిగో ఇలా రాస్తున్న.

No comments:

Post a Comment