Friday, May 18, 2018

ప్రేమలేఖ 10


ప్రేమలేఖ రాయమని అడిగిన పిల్ల. ఇవ్వాళ వర్షం పడుతుంటే గుర్తొచ్చావొయ్. ‘వానొచ్చెనమ్మా, వరదొచ్చెనమ్మా’ అన్నాడు గోరేటి. నాకెంటో ఇవ్వాళా ‘వానతో పాటు జ్ఞాపకాలు వస్తున్నాయ్.’ అవును పిల్ల. ఈ వానపై  నా వల్ల నీకు ప్రేమయిందా? నీవల్ల నాకు అయిందా? ఎవరివలన ఎవరికి అయితేనేం! ఇద్దరికీ ప్రేమయింది. వాన పడ్డప్పుడల్లా నువ్వే గుర్తొస్తావ్ పిల్ల. ఎన్ని వాన కథలు చదువుకున్నాం. వర్షపు సాయంకాలల్లో ఎంత కవిత్వమై ప్రవహించాం. మన వాన ముచ్చట్లని రాయాలి పిల్లా. రాస్తే ఓ నవల అవుతుందా? ఏమో అయినా అవుతుంది. ఎంత మాట్లాడుకున్నాం వాన పడుతో ఉంటే. అట్లా ఆ చిరు జల్లులు, ఉదృతం అయ్యేంత వరకు బాల్కనీ నిలబడి చూస్తునో, కుర్చీ వేసుక్కూర్చొని ఛాయ్ తాగుతూనో ఉండిపోలేదూ. 

 ఎంత అందమైన జ్ణాపకాలు పిల్లా. వాన అంటే కేవలం జల్లు కురవడమేనా!  ఆ వెన్నెల మనపై పడడాన్ని వెన్నెల వాన అందామా! వెన్నెల మనపై కురిసిన రాత్రులు కదూ అవి. ఆ వెన్నెల వానలో చలంను మాట్లాడుతో తడిసి ముద్దైపోలేదూ. ఎన్ని రాత్రులు అలా వెన్నెల్లో కవిత్వం చదువుతూ గడపలేదు. ఎప్పుడు నన్నే వినిపించమనకపోతే, నువ్వు బాగా రాస్తావ్ కదా! ఎప్పుడైనా వినిపించావా? అడిగితే మూతి ముడుచుకుంటావ్. లేకపోతే మెడ ఒంపులో తల దాచుకుంటావ్. నీ మూతి విరుపులో ఓ గమ్మత్తు ఉంది. అట్లా కట్టిపడేస్తుంది ఆ సమ్మోహన దృశ్యం. వసంతంలో సుభద్ర చూపు. గాలం చూపు అంటాడు కదూ మన వసంతం. చూపుల గాలం విసిరే ఓ పిల్ల. ఆ గాలానికి చిక్కిన చేపపిల్లలా  ఎంత విలవిలలాడుతానో ఎనాడైన ఆలోచించావా. 

 ఇవ్వాళ వానలో చిక్కుబడినప్పుడు నన్ను మదిని తొలిచిన జ్ఞాపకాలు ఇవి. 

 వాన కురిసింది. వాన వెలిసింది. నగరం మునిగింది. నగరం ఇప్పుడు నడుస్తున్న సంద్రం. నగరంలో సముద్రం లేదని  అనుకునే వాళ్ళం కదూ. నగరంలో సంద్రం ప్రవహిస్తుంది. ఆ ప్రవాహంలో పడి వచ్చాను. ఓ వెన్నెల రాత్రి కథ చెప్పుకున్నాం గుర్తుందా! ఎగిరేసిన పావురాయి కథ. దాని ఇష్టానికి అది దేశం మీద పడి తిరిగి రాత్రవగానే గూటికి చేరుకున్న కథ. ఇవ్వాళ నగరంలో ప్రవహిస్తున్న నీళ్ళను చూస్తుంటే ఆ కథ గుర్తొచ్చింది. అయితే ఇక్కడ నీళ్ళు పావురాయి. అవి వాటి గూటికి పోదాం అనుకుంటే అక్కడ వాటి గూడు లేదు. నగర విస్తరణ కాంక్ష దాని గూటిని ఆక్రమించి అపార్ట్మెంట్ అయింది. రోడ్డయింది. దానికి ఎక్కడికి పోవాలో తెలియక ఆ ఆపార్ట్మెంట్ ముందు, రోడ్డుమీద నిరాహారదీక్షకు దిగింది. అనేక పావురాళ్ల దీక్ష శిబిరాలను దాటుకుంటూ నా గూటికి చేరుకున్నాను. వాటికి మౌనంగా సంఘీభావం ప్రకటించటం తప్ప ఇంకా ఏమి చేయలేక. 

 నగరంలో వాన కురిస్తే పడ్డ నీళ్ళు ఇపుడు మనలాగే నిర్వాసితులు. మనం వలస పోగలం. అవి పోవు. అడ్డందాగా ముంచేస్తాయి. మనిషికి ప్రకృతికి తేడా అది. మనిషి ప్రకృతిని ప్రేమించడం మానేసి ద్వంసం చేయడం మొదలుపెట్టాడు. నగరంలో పడ్డ మనిషి మట్టి వాసన కోల్పోయాడు. దాంతోనే ప్రేమను. 

 వాన కురిసి వెలిసిన నగరాన్ని, భాగమతి, కుతుబ్ షా లా ప్రేమ చిహ్నాన్ని చూస్తే పై మాటలు రాయాలి అనిపించింది. ప్రేమ లేని నగర విస్తరణ కాంక్ష మీద కోపం వచ్చింది. అలసిపోయిన నువ్వు ఒల్లో సేదతీరినట్లు, మెడవొంపులో తలవాల్చినట్లు, లేదా నన్ను ఓదార్చినట్లు ప్రేమగా ఈ నగరాన్ని చూసుకుంటే, ప్రేమకు గుర్తుగా కట్టబడిన నగరం ఇంకెంత ప్రేమను కొసరి కొసరి వడ్డించేదో అనిపించిది. అట్లా అనిపించడం తప్పు కాదనుకుంటాను. అది మన ప్రేమంత అందమైనదనుకుంటాను.

 ప్రేమ క్షణాలు – జ్ఞాపకాలు యుగాలు. నగరం నాకిచ్చినవి. మనకిచ్చినవి. నిజంగా యుగయుగాలు గడచిన మరచిపోని జ్ఞాపకాలు. వాన మోసుకచ్చిన జ్ఞాపకాలు.

No comments:

Post a Comment