Monday, February 12, 2018

సూఫీకి ప్రేమలేఖ




ప్రియమైన సూఫీ
కుంకుమపూల పరిమళమా
ఆపిల్ తోటల సోయగమా
ఉరకలెత్తే నదుల సంగమమా

నేను ప్రియతమ
నీలాగే భంగపడ్డదానను
ప్రేమకు గుర్తుగా కట్టబడ్డదానను

ఇంకా గుర్తుపట్టలేదా
ఓ నా పోరు సూఫీ
నేను గజల్ ని

ఇప్పుడు నిన్ను చూస్తుంటే
కళ్ళు నీటిని ఎర్రగా స్రవిస్తున్నాయే తల్లి
నీ దేహానికి వచ్చిన ఎరుపు
కుంకుమ పూల మెరుపు అనుకున్న
అది ఇన్నెండ్లుగా పారుతున్న నెత్తురా!

కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుందన్నట్లు
నీది నాది ఒకే కథ కదనే
మనల పాలించిన రాజులకు
భోగాలు, భాగ్యాలు
మనకు మిగిలింది ఎప్పటిలా కన్నీళ్లే
కమిలిపోయి, కాలిపోయి
రాలిపోయిన దేహాలు

నీ 'ప్రజాభిప్రాయ సేకరణ'
నా 'యధాతథ ఒప్పందం'
ఎన్నడూ కాగితాలు దాటి బయటకి రాలేదు
చరిత్రలో మూలుగుతూ ఉన్నాయో!
లేక చెదలైన తిన్నదో ఏమో!
ఆధారాలు చూపిన నమ్మని
మూఢ భక్తుల కాలం ఇది సూఫీ

నిన్ను పెల్లెట్లతో ఛిద్రం చేస్తున్న ఈ సైన్యమే
నీ బిడ్డల ఇంటినుండి పట్టుకపోయి చంపి
ఎదురుకాల్పులు కథలల్లుతున్న ఈ సైన్యమే
నా బిడ్డల రెండు లక్షల మందిని చంపింది
నీ దగ్గర తల్లుల ముందు బిడ్డలను,
బిడ్డల ముందు తల్లులను చెరుస్తున్న ఈ సైన్యమే
నా బిడ్డల చెరిచింది
మనది ఒకటే కథ సూఫీ

నా బిడ్డల అంత మంది చంపినా, చేరిచిన
ఇంకా నా దేశమని లొంగబడి బతుకుతూ నేను
మట్టిని, మట్టికింద ఉన్న సంపద కోసమే తప్ప
మట్టిని కాపాడే మనుషుల ప్రేమించని వాళ్ళు నావాళ్ళు ఎట్లయితరు?
నన్ను ఓటుగా తప్ప మనిషిగా చూడని వ్యవస్థ నాదెట్లయితది?
బిడ్డల చంపుకునే దేశం ఒకదేశమేనా? అని
నేను వదిలిన ఆయుధాన్ని అందుకుని
తిరగబడుతూ నీవు

పోరాడవే తల్లి పోరాడు
నీ సూఫీ గాయాలను
నా గజల్ గొంతులో వినిపిస్తా
నీవు విముక్తి అయ్యేదాక, అయ్యాక
ఎప్పటిలాగే సూఫీ గజల్ జుగల్ బందీ వినిపిద్దాం
పోరాడవే తల్లి పోరాడు
నీ పోరాటాన్ని నా గొంతుతో కాపలకాస్తాను

బోలెడంత ప్రేమతో
నీ గజల్

(సంజయ్ కాక్, పర్వేజ్ బుఖారీలకు ప్రేమతో)

No comments:

Post a Comment