Tuesday, February 20, 2018

తంగేడు పువ్వు



1
బతుకమ్మయిన తంగేడుపూల
చూసిన ప్రతిసారి గుర్తొస్తావ్ కామ్రేడ్
చాలా తక్కువ పరిచయం మనది
అయిన అందమైన జ్ఞాపకాలు
అచ్చంగా నీ నవ్వులా

ఇప్పుడు నువ్వు లేవు
నీ నవ్వూ లేదు
మిగిలినవి జ్ఞాపకాలే
కన్నీటి సంద్రమయ్యే జ్ఞాపకాలే

2
నీ బాధను చూడలేక చంద్రుడు
మబ్బుల చాటున దాక్కొనే ఉండుంటాడు
నీ రోదన విని పక్షులు కన్నీళ్లు
పెట్టుకుని ఉంటాయి
నీ నెత్తురుతో ఎర్రబారిన నేలని చూసి
ఎర్రరంగు పులుముకున్న ఆకాశం
చారేడు కన్నీళ్లు కార్చి ఉంటుంది

3
చివరి కలిసినప్పుడు
చేతిలో చెయ్యేసి
మళ్ళీ కలుద్దాం కామ్రేడ్
అని బాస చేశావ్ కదూ
ఆర్ట్స్ కాలేజ్ మెట్లపైనో
ఆదివాసీ గూడెంలోనే
ఎదురుచూస్తుంటాను
అమర'శృతి' గీతం వినిపించే
నీ రెండవ రాకడకై

(రెండేండ్లుగా రాద్దాం అని మొదలెట్టిన ప్రతిసారి కళ్ళు మసకబారి అపరిపూర్ణంగా వదిలేసిన కవిత. ఇవ్వాళ శృతి పుట్టినరోజు అని సుదర్శన్ అన్న పెట్టిన పోస్టు చూశాక పాత రాతప్రతుల్ని తిరగేసి రాశా. ఇప్పుడు అంతే ఆ నవ్వుల మోము గుర్తొస్తే మసకబారే కళ్ళతో)

No comments:

Post a Comment