Thursday, December 28, 2017

యుద్ధం



నిశ్శబ్ద యుద్ధం 
నాలో నేను
నాతో నేను

అరణ్యము నేనే
మైదానము నేనే

యుద్ధం నాతోనే అయ్యాక
నేనే అస్మదీయుణ్ణి
నేనే తస్మదీయుణ్ణి

ఎద దిగంతాల నుండి
దేహ శికరాగ్రం చేరేందుకు
ఎడతెరిపిలేని యుద్ధం 

అంతర్ముఖ మలిసంధ్య నుండి
బహిర్ముఖ తొలిసంధ్య వరకు
పెంజికటి యుద్ధం

............................

జ్ఞానం విలసిల్లుతూనే 
అజ్ఞానంలోకి నెట్టబడ్డ
గడ్డుకాలంలో సైతం
అందమైన రోజుల కోసం*

మళ్ళీ జ్ఞాన పునరుత్థానానికీ యుద్ధం 

............................

'నాన్న నీ యుద్ధానికి కాస్సేపు విశ్రాంతి ఇచ్చి
ఎందుకోసం యుద్ధమో చెప్తావా' 
అంటూ వచ్చింది ఆమె

'యుద్ధం శాంతి కోసం'
'పోయినవాటిని తిరిగి పొందటం కోసం'
నీకు తెలియందా ఇది.

అయితే
"నీ పెంజికటి యుద్ధం ఇక నాది కూడా
వస్తున్నా ఆగు కలిసే పోదాం''
అంతలోనే... ఓయ్ ఒక్కమాట
నిజం చెప్పు యుద్ధం శాంతి కోసమే కదూ! 
శాంతి కోసం కాకపోతే నువ్వెందుకు యుద్ధం చేస్తావులే. 

'ప్రశ్న తనదే
సమాధానం తనదే'

''ఆగాగు. యుద్ధం ఇద్దరిది''

* "It was the best of times, it was the worst of times, it was the age of wisdom, it was the age of foolishness." Charles Dickens 'Tale of two cities' లోని ఈ వాక్యాల్ని ఓ కవితలోకి తీసుకురావడం ఇన్నాళ్లకు కుదిరింది. 

No comments:

Post a Comment