Wednesday, December 6, 2017

అంబేద్కర్ నా అంబేద్కర్



ఈ దేశపు మనువాద వ్యవస్థను
గజగజలాడించిన విప్లవకారున్ని
‘జంటిల్మెన్’ చేసేందుకు
ఎన్ని కుట్రలు పన్నుతున్నారు
భూమి జాతీయికరణ, కుల నిర్మూలన ఆశయాల్ని
చట్ట సభల్లో సీట్ల కోసం, నోట్ల కట్టల కోసం
రిటైల్ గా తాకట్టు పెడుతూ
నీ నూట ఇరవై ఐదోవ జయంతిని
అగ్రహారాల జాతరగా మార్చి
నిన్నొక ఉత్సవ విగ్రహం చేస్తున్నారు

నువ్ ఆదేశించిన
మహత్తర కుల నిర్మూలన పోరాటాన్ని
ఏట్లో కలిపేసిన దుర్మార్గులు
నువ్ నడుంబిగించిన
సామాజిక విప్లవ సాధన
గొంతు నుమిలిన ఖూనికోర్లు
అభినవ మనువాదులు
నిన్ను వక్రికరించేందుకు
ఎంత విఫల ప్రయత్నం చేస్తున్నారు
అయినా కామ్రేడ్ అంబేద్కర్
నిన్ను తనలో  కలిపేసుకోవాలనే
హిందుత్వ కుట్ర అంతం కాక తప్పదు

మహాద్ చెరువు పోరాటంలో
నువ్ చిందించిన నెత్తురు
ఇంకా పచ్చిగానే ఉంది
రాజ్యంగా సభలో ‘వైరుధ్యల’పై నీ ఉపన్యాసం
మా చెవుల్లో ఇంకా మార్మోగుతూనే ఉంది
మనుస్మృతిని కాల్చి వేదాలకు శాస్త్రాలకు
డైనమేట్లు పెట్టి పెల్చేయమన్న  నీ పిలుపు
మా కుల నిర్మూలన కర్తవ్యాన్ని
నిరంతరం గుర్తు చేస్తూనే ఉంది
శ్రమ విభజనతో పాటు
శ్రామి’కుల’ విభజన జరిగిన ఈ దేశంలో
నీ జీవితం, నీ పోరాటం
మమ్మల్ని ప్రభావితం చేస్తూనే ఉన్నది

డియర్ కామ్రేడ్
నీ మరణాంతరం ఇక్కడ పెద్దగా మార్పులేమీ లేవు
నువ్ చెప్పిన కుల ‘మాన్ స్టర్’  ఇంకా అలానే ఉంది
ఇప్పుడది యూనివర్సిటిల్లో ‘వెలివాడ’లను
తయారు చేయడంలో తలమునకలై ఉంది
కులాల ఆధిపత్య పోరులో ‘కుల నిర్మూలన’
పాథాలానికి తోక్కబడ్డది
భూమీ జాతీయికరణ ‘విప్లవకరం’ అయి
విప్లవం నేడు అంటరానిదయింది
"భోదించు, పోరాడు, సమీకరించు" లో
పోరాటం మరచి చానా ఏండ్లయింది
ఈ బూటకపు ‘రాజకీయ ప్రజాస్వామ్యం’
నువ్ ఆశించిన సామాజిక, ఆర్ధిక
ప్రజాస్వామ్యాలని ప్రజలకింక రానివ్వనేలేదు

మనువు మనవళ్ళు
నీ జయంతులు జరుపుతున్న చోట
కౌటిల్యుని వారసులు
నిన్ను స్మరిస్తున్న చోట
నీ విగ్రహాలకు పాలాభిషేకాలు,
నీ పేర దీక్షలు చేస్తూ
నిన్ను  బ్రాహ్మణీకరించి
‘స్వామిజీ అంబేద్కర్’ని
చేయజూస్తున్న చోట
కాశీలో పొర్లుదండాలు పెట్టి
ముంబై స్టాక్ మార్కెట్ కు
వంగి వంగి దండాలు పెట్టేవాళ్ళు
నీ శత్రువులైన బ్రాహ్మణ, పెట్టుబడిదారి వాదాలకు
పాదాక్రాంతం అయ్యేవాళ్ళు
సామాజిక, ఆర్ధిక, రాజకీయ విప్లవాన్ని
విందు భోజనంగా,
చట్టసభల్లో కుర్చీగా,
ఊకదంపుడు ఉపన్యాసంగా
ప్రవచించే ‘మేధావులు’ ఉన్నచోట
అంబేద్కర్ మేం బలంగానే ఉన్నాం
స్వయంగౌరవం కోసం తలెత్తే ఉన్నాం
పిడుగులు పడిన తుఫానులే వచ్చిన
ఎదుర్కొనేందుకు సిద్దంగానే ఉన్నాం
అంబేద్కర్ అంటే పోరాటం
అంబేద్కర్ అంటే విప్లవం
కులనిర్మూలన అతని ఆశయం
స్వంత ఆస్తిని నిరాకరించిన భౌద్దం
అతని జీవన విధానం

స్వయంగౌరవం ప్రకటించిన  ప్రతిసారి
వల్లకాడవుతున్న వెలివాడల
గాయాల్ని తడుముకుంటు
రక్తసిక్త మార్గంలో
లోకాయుత, చార్వాక, భౌద్దాల నుండి
నువ్ అందించిన స్పూర్తితో
సుదీర్ఘ పోరాటానికి సిద్దంగానే ఉన్నాం
నీ వారసులం ఇంకా బతికే ఉన్నాం

ఆకలి అవమానాల అంటరాని వాడ నుండి
అంతర్జాతీయం అయిన వాడా
వెలివాడలకు వెలుగులు చూయించినవాడ
‘అలగ’జనాలను మేల్కొలిపి
సమానతకై నడిచినవాడ
నడిపించినవాడ

అంబేద్కర్  ఓ అంబేద్కర్ నా అంబేద్కర్
అందుకొ మా నెత్తుటి సాల్యూట్
మనువాదంపై  పేలబోతున్న
డైనమెట్ల విప్లవాభినందన
సామాజిక, ఆర్ధిక ప్రజాస్వామ్యాన్ని
అందనివ్వని బూటకపు రాజకీయ
ప్రజాస్వామ్యాన్ని కూల్చబోయే  ప్రజల
విప్లవ జైభీమ్

14-04-2016
శివసాగర్ కి  ప్రేమతో  

No comments:

Post a Comment