Friday, October 19, 2018

ప్రేమలేఖ 18

ఆ గొంతు
ఎదలోతుల్లోంచి వచ్చే నవ్వు
అనేకానేక భావాల్ని పలికించే కళ్ళు
ఎంత కవిత్వం  రాసుకున్నా వాటిని చూస్తూ...
అవి అట్టాగే ఉండాలని చెప్తూ..

గొంతులో జీర
జీవం కోల్పోయిన నవ్వు
విషాదపు చూపు
ఇది కాదు నువ్వు

కనులు, నోరు కలిపి నవ్వే జుగల్ బందీ
ఎగిసే అల
లోతైన సంద్రం
అనంతానంత ఆకాశం
సలువదనపు వెన్నెల
ఎగురుతూ పోయే సీతాకోకచిలుక
కురిసే మేఘం
తడిసే నేను
ఇది కదా నువ్వు

పిచ్చి పిల్లా
ముప్పై రెండు అణాల పిచ్చి పిల్లా
కాస్త నవ్వవు...
రాలిపడే ముత్యాలను ఏరి
నీ చిత్రాన్ని గీసుకుంటా

ఎందుకో పాత పుటలు తిరగేస్తుంటే ఈ కవిత దొరికింది. సందర్భం ఏమిటో గుర్తులేదు. జీవంలేని విషాదపు చూపుల నిన్ను ఊహించుకోలేను. అందుకేనేమో! ఆ సందర్భాన్ని యాది పెట్టుకోలేదు.

ముప్పై రెండు అణాల పిచ్చిపిల్లా. అరవై నాలుగు అణాల అరనవ్వు విసిరే పిల్లా. త్వరగా రావు. మళ్ళీ ఓ నవ్వుల వర్షమై కురిసేందుకు. అందులో తడిసి ముద్దై చాలా రోజులైంది. ఓయ్ సీతాకోకచిలుక ఒక్కసారి వచ్చిపోవూ. ఊహు వచ్చి ఇక్కడే ఉండిపోవూ. పుప్పొడుల ముద్దులన్నీ నీకోసం దాచి ఉంచా. పాపం వెన్నెల. ఇంకా ఎన్ని రోజులిలా మన సందేశాలని మోస్తూ ఉంటుంది. ఎప్పటిలాగే ఓ పున్నమి పూట మనదైన చోట కూర్చొని ఆ ఒంటరి చుక్కను, వెన్నెలను చూస్తూ మాట్లాడుకుందాం. పొట్లాడుకుందాం. అలుగుదాం. మారాం చేద్దాం. గారం చేద్దాం.

వార్తలు ఫాలో అవుతూనే ఉండుంటావ్ కదా. శబరిమల తీర్పు వచ్చింది. మహిళలు వెళ్లాలనుకుంటే వెళ్ళవచ్చు అని చెప్పింది. 'యత్ర నార్థ్యాస్తూ' దేశంలో మహిళకు ముట్లు రావడం అంటరానితనం. అదే  ఆడ విగ్రహానికి ముట్లు వస్తున్నాయి అంటే కొబ్బరికాయలు పట్టుకొని పరిగెడుతుంటారు. 'ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు' ఎక్కడో చదివిన జ్ఞాపకం. కానీ వాస్తవంలో 'ఎక్కడ మహిళలను దేవతలు అని పూజిస్తారో అక్కడ వాళ్ళకో గర్భగుడి కట్టి బంధిస్తారు'. గడచిన చరిత్ర, నడుస్తున్న చరిత్ర అంతా అదే కదా. ఆమెకో భర్త, ఇళ్లు ఉండాలి. ఆ ఇంటిని, ఇంటాయనని చూస్తూ ఉండడం తన బాధ్యత. ఇదే కదా ఈ దేశపు సంస్కృతి. పీడక కులాల ముచ్చట్లు పీడితులకు చెప్తే ఎట్లా నడుస్తుందని కదూ మనం మాట్లాడుకుంది. ఉత్పత్తి కులపు స్త్రీ ఇల్లు, ఇంటాయన అని కూర్చుంటే చేతిలోకి ముద్ద ఎట్లా వస్తుంది. అని కదూ ముగించింది. ఇప్పుడు ఆధునికత జీవితాల్లోకి వచ్చి ఇల్లు దాటి బయటకు నాలుగడుగులు బయటకి నడిపించింది. ఇంట్లో మొక్కే దేవున్నే గుళ్లోకి వచ్చి మొక్కుతా అంది. అంతే దేవతలు (మహిళలు) గర్భగుడిలో (ఇంట్లో) ఉండాలి. భర్తకు, పిల్లలకు సేవలు చేస్తూ ఉండాలి అని సంస్కార, సంస్కృతి వాక్యాలు నాలుకలు మీదుగా జాలువారుతున్నాయ్.

మొన్న అస్సాంలో అన్న పెళ్లికి పోయి వస్తుంటే అక్కడ కామాఖ్య గుడి దగ్గర ఆపారు. పద్దెనిమిది ముక్కలైన శక్తి స్వరూపిణి దేహపు ఒక్కో ముక్క పడిన చోటు ఒక్కో శక్తి పీఠం అయిందంటా. అట్లా అష్టాదశ (పద్దెనిమిది) శక్తి పీఠాలు ఉన్నాయటా. ఇక్కడ ఆమె యోని భాగం పడిందంటా. ఆదివాసీ సమూహం ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో హిందుత్వ ఆనవాళ్లు ఎక్కడివి అనేది ప్రశ్న. ఆ ప్రశ్నను కాసేపు పక్కన పెడితే. కామాఖ్యలో యోనిని దేవత స్వరూపమని మొక్కుతున్న జనాలే శబరిమలలో యోని స్రవించే మహిళలను గుడి మెట్లు ఎక్కోద్దు అంటున్నారు. మతం నెత్తికెక్కితే మెదడు మోకాళ్ళలోకి దిగడమంటే ఇదే కదూ. శైవ, వైష్ణవులు ఒకర్నొకరు చంపుకునెంత వైరం ఉన్న కాలంలో శివుడు, విష్ణువు (మోహిని అవతారం) సంగమించి అయ్యప్పని కనడం ఓ చారిత్రక వైచిత్రి. 'మొగోడు మొగోడు కలుసుకుంటే అయ్యప్ప, నువ్వేట్ల పుట్టినవో చెప్పప్పా' అని చిన్నప్పుడు విన్న జనానాట్యమండలి పాట యాదికి రావడం యాదృశ్చికం కాదు.

అయినా సీతాకోకచిలుకల్ని బంధించే మతాల్లో హక్కులు కోరడం పిచ్చి పనే ఐనా, హక్కును నిరాకరించిన చోట నిలబడి, కలబడి సాధించడమూ అవసరమే. బాబాసాహెబ్ కాలారాం గుడి తలుపుల్ని దళితుల కోసం తెరిపించినప్పుడు చెప్పిన మాటలు 'నాకు విగ్రహాల మీద నమ్మకం లేకున్నా, అక్కడికి పోకుండా అడ్డుకునే హక్కు మాత్రం ఎవరికి లేదు' (సరిగ్గా ఇవేనో కాదో యాది లేదు. ఆ మాటల భావం ఇదే)

చెప్పడం మరిచాను అంటావేమో. బిడ్డ అడిగింది ఎప్పుడొస్తున్నావ్ అని. నువ్ రాట్లేదని తిట్టింది అది వేరే విషయం అనుకో. ఇప్పటికి ఇంతే. ఉంటాను. లవ్ యు ఫ్రీడో.

No comments:

Post a Comment