Sunday, October 21, 2018

వెలుతురు చీకటి

ఎప్పటిలాగే ఈరోజు
కాకపోతే నువ్వు లేవనే వెలితి

దిగంతాల్లోకి చొచ్చుకొని వచ్చాక
కొన్నిసార్లు పైకి రాలేక అక్కడే ఆవాసం
అన్ని చెప్పినంత సహజంగా ఉండవు కదా

నీకో కథ చెప్తా వినూ

చీకటిలో మొదలై
వెలుతురు గుండా ప్రవహించి
మళ్ళీ చీకట్లో కలిసిన
ఓ ప్రేమికుడి కథ

సొరంగం మధ్యలో నిలబడి
మరో చివరకోసం చూస్తున్నాడొకడు
ఎక్కడినుండో వచ్చి వీపుతట్టి
వెలుతురు వైపు నడిపించింది ఒక్కర్తి

వ్యక్తావ్యక్త ఆలోచనల మధ్య
ప్రేమామోహ భావనల మధ్య
భౌతికాలౌకిక ఆనందాల మధ్య
ఘర్షణ పడి
వాళ్ళ పోరాటమంతా 'ప్రేమ, స్వేచ్ఛ'ల
కోసమే అని కనుగొన్నారు
వాటికోసమే కలసి నడచారు

విరిగిన హృదయాలను
ఒకరి బిగి కౌగిళ్ళలో మరొకరు
అతికించుకుని
అడవులు
సముద్ర తీరాలు
పల్లెలు
పట్టణ ప్రాంతాలంతా
కలియదిరుగుతూ
వాళ్లిద్దరూ ఓ జుగల్ బందీ
గొంతెత్తి పాడారు

గాలి చొరబడని
వాళ్లిద్దరి మధ్య సంద్రాలు పుట్టాకా
ఒక్కసారి ద్వేషించవూ
అంటూ వచ్చింది తాను
ప్రేమైక బంధమున్న చోట
ద్వేషానికి తావు లేదూ అంటూ
అతడు మళ్ళీ చీకట్లో కలిసిపోయాడు

No comments:

Post a Comment