Monday, November 19, 2018

ముసాఫిర్





"హం లడేంగే సాథీ, ఉదాస్ మౌసమ్ కె ఖిలాఫ్ʹʹ అంటూ గొంతులోనే ఉదాస్ పలికిస్తో పోతున్నాడు ఓ మనిషి. పిలిచి ఏంటి బాటసారి అంటే నేను ముసాఫిర్ అని ముందుకు పోయాడు. మనకు ముసాఫిర్, బాటసారి రెండు ఒకటే. కానీ అతడికి కాదు. అతడి ఎదను తట్టి లేపేది ముసాఫిర్ అనే పిలుపే. అతడే ముసాఫిరా? అది అతడి పేరా? ఏమో అతడు మాత్రం అట్లా పిలిస్తేనే పలుకుతాడు.

***

ఒక నడక అతడి వెనకాల నడుస్తుంటే ఏమో అర్థం కానీ పదాలు వల్లే వేస్తూ పోతుంటాడు. నడుస్తూ, నడుస్తూ ఏదో దృశ్యాన్ని చూసి గున్ గునాయిస్తాడు. "ఇస్ దునియామే గమ్, నఫ్రత్ ఫైల్ గయే, ఔర్ ఇన్సాన్ కి జిందగిమే గుస్తాక్ʹʹ
***

ఎన్ని వందల సార్లు రోడ్డుమీద చూసి ఉంటానూ. ఎప్పుడు నిలబడో, కూర్చునో, నడుస్తునో ఏదో అనుకుంటూ పోతుంటాడు. ʹనేల మీద విరిసిన ఓ గుల్ మొహర్. నా గుల్ సితʹ. ఎవరు ఆ గుల్ మొహర్, ఎక్కడా గుల్ సిత. ఏమో who knows?
***


ఎప్పటిలాగే ఓ ఉదయం.
జాగా: గల్లీ చివర్న చాయ్ దుకాణం.
ముచ్చట: ప్రేమించుకున్నందుకు చంపబడిన ప్రేమికులు.
పక్కనే రాగయుక్తంగా ఓ గొంతు ʹదో బదన్, దో బదన్ ప్యార్ కి ఆగ్ మే జల్ గయేʹ
ఎవరికి అర్థం కాలే. కానీ కళ్ళలో సుడులు తిరిగిన నీళ్ళు.

***

ఓ సాయంత్రం.
అదే జాగా.
ఇద్దరు యూనివర్సిటీ పొరగాళ్ళు.
ముచ్చట: తెలంగాణ సాయుధ పోరాటం.
మళ్ళీ ఇతనే ʹఓ క్వాబ్ అధురా తా, అధురే హామ్, అజ్ నహీ తో కభీనా కభీ పూరే హోంగే హామ్. తబ్ తక్ టూటే హుయే సప్నే ఔర్ హమ్ దర్దిʹ
ఏమి అర్థం కానీ పిల్లలు. Is he mad? వాళ్ళు వెళ్తూ పలికిన మాట.

***

తెల్లారి అదే జాగ.
ఓ గుంపు ముచ్చట.
నీ అవ్వ దునియా మస్త్ కరాబ్ అయింది రా బై. థూ ఒక్కడన్న నియ్యత్ తోటి లేడు.
ʹజలాదో ఇసే ఫంక్ దాలో యే దునియా
మేరే సామ్నే సే హటా లో యే దునియా
తుమ్హారిహై తుమ్ హి సంబాలో యే దునియా
యే దునియా అగర్ మిల్ భీ జాయే తో క్యా హైʹ అంటూ మళ్ళీ అదే మనిషి.
ఈ సారి ఎవరు తిట్టుకోలే. చాయ్ గిలాస అక్కడ పెట్టి ఏం చెప్పిండు రా భై ముసలోడు అని వెళ్ళిపోయారు.

***


వరుసగా నాలుగో రోజు.
ఈ ఇల్లు ఆయనదే సార్. నేను దుకాణం పెట్టుకుంటా అంటే సరే అన్నడు. అడగని ప్రశ్నకు చాయ్ బండి యాదగిరి సమాధానం.
ఇంతకు ఆయన కథెంటి?
ఏమో సార్? ఎవల్ని అడిగిన తెల్వది అంటారు.
ఆయన్నే అడగకపోయావా?
ఓ సారి అడిగిన సార్ నవ్వి ఊకున్నాడు. సార్ ఆ మూలన ఉండే ముసలైన అప్పుడప్పుడు వస్తాడు. ఇద్దరు కలిసి పాటలు పాడుకుంటారు.
***

ఓ రోజు ఉండబట్టేలేక అడిగేశా. ఏంది నీ కథ. ఇక్కడ ఎవలు ఏం మాట్లాడినా ఓ షాయరీ చెప్తావ్ అని.
ఇంతకీ నీదేవూరు? నీ ఉదాస్ కథ ఏంటి అని అడిగా.
ʹ1947లో రెండు దేశాలు ఆజాద్ అయ్యాయి. రెండు దేశాల ప్రజలు ఆ దేశాల బానిసలయ్యారు. ఆ రెండు కాకుండా మూడో రాజ్యం ఉంది. అక్కడ జనాలు రాజ్యానికి బానిసలు కాదు. రాజే డిల్లీకి బానిసయ్యాడు. నేను ఆ రాజ్యానికి చెందిన వాణ్నిʹ అన్నాడు. దాన్ని కొనసాగిస్తూ అప్పుడు చెప్పాడు. ఓ యవ్వనపు ప్రేమకథని, రాజకీయ కథని.

ʹఅనగనగా ఓ రాజ్యం. ఆ రాజ్యంలో రాజు. రాజు కింద దొరలు. దొరలు దోపిడిదారులు. దొరలకు ఖిలాఫ్ సంఘం. సంఘంతోని జనం. ఇది బిడ్డ నా కథʹ

కథ చెప్పు అంటే సాయుధపోరాటం షార్ట్ కట్ లో చెప్తావ్ ఏంది?

ʹకభీ కభీ నేను భీ సంఘంతో ఊర్లపొంటి పోతుంటి. అట్లా పోయినప్పుడు ఓ ఊర్లో ఒక అమ్మాయిని చూశాను. కోహినూర్ హే వో కోహినూర్. వాళ్ళ నాన్న దళంకి చేనులో జాగిచ్చెటోడు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో కలిసచ్చేది. ఎప్పుడో ఓసారి ఆ ఊరికి పోయేటోల్లం. కొన్నిసార్లు ఆ పిల్ల వచ్చేది. కొన్నిసార్లు రాకపోయేది. ఓసారి వాళ్ళ ఊరు మీద యాక్షన్ అయింది.ʹ అంతే కాసేపు నిశ్శబ్దం.
తరువాత?
ఏమో కొన్ని రోజులకు ఆ పిల్ల చచ్చిపోయింది అని కబర్.
ఎట్లా?
చంపేశారు బేట చంపేశారు.
ఎవరు?
ʹకిత్నే ఆద్మీతే, పూరే ఫౌజ్ తే సర్దార్ʹ అని వెళ్లిపోయాడు గొడవైపు చూస్తూ.
అక్కడ పొద్దున చాయ్ దుకాణంలో చూసిన ʹస్టాచ్యు ఆఫ్ యూనిటీʹ పేపర్.

***

ఇదంతా ఎక్కడి కథో అనుకున్నా. మా కథే 48-52 పేజీలలో దాచిన కథ. మనుషులను మతాలుగా చీల్చిన ఆధునిక రాజ్యపు నెత్తుటి దాహం, నేల దాహం తాలూకు ఓ విషాద దృశ్యం. ఇంత విషాదాన్ని కొన్ని షాయరీల్లో ఎట్లా చెప్పాడు ఈ ముసలోడు అనుకుంటూ ఉండగానే దర్వాజని


ʹహాయాత్ లే కే ఛలో కాఎనాత్ లే కే ఛలో
ఛలో తో సారే జమానే కో సాత్ లే కే ఛలోʹ అంటూ సాగిపోయాడు.
ఇప్పుడతను కాలాన్ని వెంటబెట్టుకొని నడుస్తున్న ముసాఫిర్. ప్యారే, లాలే ముసాఫిర్.


http://virasam.org/article.php?page=947&fbclid=IwAR1Xo1n6fz2Q6mXFEh-toKHCd7lScBtd_qBIlo94_B_FVNQbMd8DhfqWnB8

No comments:

Post a Comment