Tuesday, April 2, 2019

ప్రేమలేఖ 29


నా కనులలోంచి నిదురనెవరో దొంగిలించారు. ఈ రాత్రి నిదురరాని కన్నులతో మేల్కొని ఉన్నాను. ఇది నీకు నే రాసే 'మేల్కొన్న' లేఖా. 'మేల్కొలుపు' లేఖా. ఏమో! రాసే నాకైతే తెలియదు. చదివే నువ్వు చెప్పు. ఇన్ ఆంఖోంకి మస్తీమే అని అభినయించే ఏ రేఖా లేని ఒంటరి రాత్రియందు రాస్తున్న లేఖ ఇది.

వేణన్న అన్నట్లు రోదగాన నిపుణురాలు లతా మంగేష్కర్ 'మేరీ ఆంఖోంసే కోయి నీంద్ లియా జాతా హై' అంటూ పాడిన పాటను నా రాత్రిని నీ యాదిలో గడిపేందుకే అన్నట్లుగా మోహన్ షేర్ చేశాడు. అసలే ఆమె రోదగాన నిపుణురాలు. నువ్వు పక్కనలేని ఒంటరితంలో నేను. ఇది చాలదూ ఈ రాత్రీ నిదురలేకుండా గడిచిపోవడానికి.

ఇప్పుడు ఆ పాటను రాయనా? నిదురరాని రాత్రిని రాయనా? నిదుర దొంగలించబడిన నా కనులను రాయనా? నిదురను రాయనా? ఏమో ఏమి రాయాలో తెలియడం లేదు. కానీ, ఏదో ఒకటి నీకు రాయాలి అనే కోర్కె మాత్రం బలంగా ఉన్నది. ఏమి రాయాలి అని కూర్చొని ఆలోచిస్తున్నపుడు కిటికీలోంచి తాకిన చల్లని గాలి దూరతీరాల నుండి నీ ప్రేమ సందేశాన్ని మోసుకొని వచ్చింది. అంతే నిదురరాని నా కళ్ళలోకి నువ్వొచ్చావ్. ఎప్పటిలాగే విప్పారిన నేత్రాలతో వచ్చావ్. పెదాల మీద చిర్నవ్వుతో వచ్చావ్.
నువ్వట్లా కనుల ముందరకు రాగానే జగ్జిత్ రేంజ్ లో 'తుమ్ కో దేఖా తో యే కయాల్ ఆయా' అని పాడుకోవటం మొదలెట్టాను.

నేడూ నువ్ పక్కన ఉండాలనే 
కోర్కనే కోరింది హృదయం
ఏదో మాయ చేసి మభ్యపెట్టాను

అడిగాయి
నిన్ను నిండా నింపుకోవాలని కనులు
పెక్కుకాలపు మత్తులో వాటిని ముంచేశాను

ఇలా తలపోసుకుంటున్నాను
ఈ తలపుల్నే ఏమీ చేయలేక

ఇంతకు నా నిదురను ఎవరు దొంగలించారో చెప్పలేదు కదూ. వెతికాను. ఆ దొంగ ఎవరో అని వెతికాను. వెతకగా, వెతకగా దూరాల నుండి ప్రేమ సందేశాన్ని పంపిన పిల్ల అని తేలింది. ఆ పిల్లకే ఈ లేఖ.

No comments:

Post a Comment