Saturday, April 13, 2019

అయ్యా అంబేడ్కరా

అయ్యా అంబేడ్కరా
మా బత్కు విముక్తి గానమా
మా గుండె గుడిసెకు ఒంటి నిట్ఠాడా

ఎన్నో రాత్రులు నీ చదువులో కాలిపోతేనే కదా
ఈ దేశానికి ఓ రాజ్యాంగం
మా వెలి బతుకులకు కాసింత ఉప్పోస దొరికింది

పెండ్లికి ఆరు కచ్రాలు కట్టుకొని పోతుంటే
అడ్డం తిరిగిన దొరల ముందే
ఏసీ కార్లో కాలు మీద కాలేసుకుపోయే ధైర్నం
నువ్వొచ్చాకే కదా గుడిసె గుండెలదాకా నడిచొచ్చింది

అయ్యా నువ్వే రాకపోతే
మా నాలుక మీద బీజాక్షరాలు
మా చేతుల్లోకి పలకా, బలపం వచ్చేవా

నాలుకమందం గాళ్లని తిట్టిన నోర్లే
మా అడుగు యూనివర్సిటీలో పడినాక వెళ్ళబెట్టింది
నిన్ను మా గుండెల్లోకి ఆవాహన చేసుకున్నాకే

నీ మీద చెప్పులేసారని పుస్తకాల్లో చదువుకొనే
తల్లడమల్లడమైనోల్లం
నేడు నగరంలో నీ విగ్రహ విధ్వంస వార్త విన్నాక
తినే కంచంలో ఎవడో మన్నుబోసినట్లున్నది
పక్కబొక్కలను యే నరసింహుడో చీల్చి
మా గుండెను వాడి గుప్పిట్లోకి తీసుకొని నలిపినట్లున్నది
మనువు మళ్లీ పుట్టి
చెవుల్లోనే కాదు ఒళ్ళంతా సీసం పోసినట్లున్నది

నీ జయంతి సాచ్చిగా
Survival of the fittest బతుకులు
Fistగా మారనున్నాయి
నగరం నిప్పుల కుంపటి మీద
డప్పు దండోరై మోగనున్నాది
ఆరె అడ్డమొచ్చిన ఏ చర్మాన్నైనా
చెప్పు చేయనున్నది

అన్నంలో పడ్డ మన్ను సాచ్చిగా
ఉండబట్టలేక అడుగుతున్న
కడుపు చించుకుంటే
కాళ్ళమీద పడితే పడనియ్ అయ్యా
ఇప్పుడున్నా
జాంబడితో చెన్నడు కలిసొస్తాడా?

No comments:

Post a Comment