Thursday, May 23, 2019

ప్రేమలేఖ 31

ఫ్రీడో...
"పగళ్లకన్నా కొన్ని రాత్రులు సుదీర్ఘంగా ఉంటాయి". ఈ మాటలెవరన్నారో గుర్తుకులేదు. నువ్వు యాదికొచ్చిన రాత్రులందు నిదురపట్టక పట్నాన్ని ఒక చుట్టుచుడితే నాకూ అలానే అనిపించింది. ఈ రాత్రి నీ జ్ఞాపకాలంత సుదీర్ఘమైనదని.

తూర్పూ పశ్చిమలను కలుపు వర్తక దారిని సిల్క్ రూట్ అన్నట్లుగా, బంగ్లాదేశ్ నుండి ఆఫ్ఘనిస్తాన్ వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్డులా, మనం హైదరాబాద్ లో తిరగాడిన రాత్రి రోడ్డుకు ఓ పేరు పెట్టాలి.

రోడ్డు ఓ జ్ఞాపకాల పుట్ట. ఎప్పుడు పోయినా నోస్టాల్జియా. మెడవొంపులో నీ శ్వాసలా ఒంటరి రాత్రులందు మేనిని తాకే గాలి. గుల్ మోహర్ పూల పరిమళం.

నీకు గుర్తుందా! నేనెప్పుడైన నీకో రోజాపూవు కొనిచ్చిన జ్ఞాపకం. ఆరోజు ఈట్ స్ట్రీట్ నుండి బయటకు వచ్చాక 'పొద్దటి నుండి అన్నం తినలేదన్నా' అంటూ వచ్చాడు కదూ ఆ పిల్లవాడు. ఏమైనా తినిపిస్తాం రా అంటే, 'వద్దులే అంటూ రోజాపూలు కొనమన్నాడు.' స్వాభిమానం ఉన్నవాడు అని రెండు పూలు కొనగానే తుర్రుమన్నాడు. ఇవ్వాళా కనపడ్డాడు ఓ పిల్లవాడు అలాగే చేతిలో పూలతో. నువ్వూ, నీ నవ్వు యాదికొచ్చింది.

ఇదిగో ఇలా నీ జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాక ఈ రాత్రి ఎంతకూ కదలనంటుంది. జ్ఞాపకాలూ నన్ను విడవనంటాయి. అందుకేనేమో వదులుకోవాల్సినవాటిని హత్తుకుంటున్నాను. మరచిపోవాల్సినవాటిని స్మృతికి తెచ్చుకుంటూ. పగళ్లకన్నా కొన్ని రాత్రులు సుదీర్ఘమైనవి. మే మాసపు రాత్రిలో గుండె ఉక్కపోస్తూ ఉంది.

No comments:

Post a Comment