Friday, May 24, 2019

రేపటి కల


ఏమైందనిప్పుడు

వాడు భాగహారాలు చేసి విభజించిన చోటే
తీసివేతల్లో పోయినవి పోయాక
మిగిలినవాటిని కూడికలుగా ఓ చోట కూడుదాం
అంకెలుగానో... మనుషులుగానో...

బతుకు బజారైందని బేజారయ్యే బదులు
ఎప్పటిలాగే బజారెంబడి బాటను
పోరు క్షేత్రం చేసుకుందాం
ధర్నాగానో... ర్యాలీగానో...

ద్వేషమే చట్టమై రాజ్యమేలు కాలనా
వేలికోస నుండి ప్రేమవాక్యమొకటి జాలువార్చుదాం
గట్టి వచనంగానో... చిక్కటి కైతగానో...

ప్రశ్నల గొంతుకలకు సంకెళ్లు పడుతున్న చోట
మన గొంతుల్ని పోరాటాలకు అంటుగడుదాం
ధిక్కార పాటగానో... రణ నినాదంగానో...


ఈ క్షణాన దీన్ని ఓడిస్తామనేది
వొఠ్ఠి ఉటోపియన్ కలగావొచ్చు
నా భలీయమైన కోర్కేగావొచ్చు
కానీ, అది ర్రేపటి వాస్తవం

ఈ పూటకి నేనొక్కడినేగావొచ్చు
మాదొక గుంపేగావొచ్చు
రేపటి కాలాన అదే జనసంద్రానికి నాంది

రోడ్డున్నంతవరకు పోరాటముంటుంది
పోరాటమున్నంతవరకు గెలుస్తామనే ఆశా ఉంటుంది

నడుస్తున్న రోడ్డుమీదోట్టు
రేపటి లక్షాన్ని చేరేది
ఈ రోడ్డుమీదుగానే

24/05/2019

No comments:

Post a Comment