Wednesday, March 21, 2018

ప్రేమలేఖ – 4



ఇవ్వాలెందుకో ఉక్కపోతగా ఉంది. అట్లా అని బయట ఏమి ఎండగా లేదు. కానీ బద్దలవడానికి సిద్దంగా ఉన్న అగ్నిపర్వతం ఏదో సూచనగా చెమటను పంపుతున్నట్లు ఉంది. సామాజిక వివక్షత అనబడు ఉక్కపోత. అది మాములుగా ఉండదు. అయితే ఈ ఉక్కపోత కేవలం మన తరానిదేనా? ఇందాక దోస్తు ఒకడు వచ్చాడు. వాడి కథను చెప్పాడు. కథ అనడం కన్నా వాడి వ్యథ అనో, వలపోత అనో అనొచ్చు.
      
యూనివర్సిటిలో చదువుకునే రోజుల్లో వీడు కలిశాడు. కులాలు వేరయినా ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో పీదితులం కదా. చాల సహజంగానే కలిశాం. కలిసే గోడపత్రికలు అంటించాం. కరపత్రాలు రాశాం. నినాదమయ్యాం. ఉపన్యాసమయ్యాం. రాస్తారోకోలూ అయ్యాం. దెబ్బలు తిన్నాం. స్టేషన్లో పడ్డాం. మాతో పాటు ఓ పిల్ల వచ్చేది. బాపనోళ్ళ పిల్ల. రిజర్వేషన్ల అనుకూల, కుల వివక్షత ఉద్యమాల్లో కలిసి వచ్చేది. వాళ్ళనాన్న ఓ అభ్యుదయ జంధ్యం మరి. కొన్నిసార్లు ఆయన యునివర్సిటికీ వచ్చేవాడు. బాగానే మాట్లాడేవాడు. అతన్ని చరిత్రకారులు సిద్దాంతకర్త అంటారు. సిద్దాంతకర్తలు అతన్ని చరిత్రకారుడు అంటారు. కానీ అతడు అటు చరిత్రకారుడు కాదు. ఇటు సిద్దాంతకర్తా కాదు.

ఓ రోజు వీడు వచ్చి ‘రేయ్ నేను ఆ పిల్ల ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం రా’ అన్నాడు. ‘అరేయ్ మీరేమో మాలోల్లు. ఆ పిల్ల ఏమో బాపనోళ్ళ పిల్ల ఒప్పుకుంటారా’ అన్న. ‘రేయ్ వాళ్ళ నాన్న ఎంత మంచోడు అనుకున్నావ్. మేము మా ఇద్దరి విషయం చెప్పగానే, మీ ఇష్టం అన్నాడు.పెళ్ళికూడా ఆయనే దగ్గరుండి చేయిస్తా అన్నాడు. మా యింట్లో కూడా వచ్చి మాట్లాడుతా అన్నాడు.’ అని చెప్పాడు.

 పెళ్లి అయింది. ఇద్దరు ఒక్కటయ్యారు. వాళ్ళకు ఒక బాబు. అయినా వాడు ఆ పెద్దమనిషిని ‘సార్’ అనే పిలుస్తాడు. మామయ్య అని పిలవచ్చు కదరా? అంటే ‘యూనివర్సిటిలో ఉన్నప్పటి నుండి అలవాటు కదరా, పోలేదు’ అంటాడు. పెండ్లి/సహజీవన బంధం మొదలయి మూడేండ్లు అయింది. అయినా వీడు ఆ యింట్లో మనిషి కాలేకపోయాడు. ఆ యింట్లో మనిషి కావడం కోసం వాడి ‘మాల’తనాన్ని వదులుకొని బ్యూరోక్రాట్ అయ్యాడు. కులం కలవకపోయినా వర్గమైన కలవాలి కదా! ఇప్పుడు వీడొక ప్రభుత్వ ఉద్యోగి. ఐదంకెల జీతం. ప్రభుత్వం ఇచ్చిన బంగ్లా. అయినా ఆ పిల్ల వాళ్ళు కలిసినపుడు వీడు బిత్తిరి చూపులు చూస్తాడు. ఆ మధ్య దసరాదో, సంక్రాంతిదో వాళ్ళ గెట్ టు గెదర్ ఫోటో ఒకటి చూశాను. అన్ని జంధ్యాలే. అడ, మగ జంధ్యాలు. వీడోక్కడే హౌలా గాని లెక్క నేల చూపులు చూస్తున్నాడు. అప్పుడే అడిగిన. ఏదో కహాని చెప్పాడు. నిన్న ఎందుకో ఓపెన్ అప్ అయ్యాడు. అప్పుడు చెప్పాడు. ‘వీడు వదిలిన మాలతనం, వీన్ని వదలలేదని. ఇప్పటికి వీన్ని మనిషిలా గాక ‘మాల’లానే చూస్తారని.’ ఒక రకమైన నూన్యత భావనతోనే చెప్పాడు ఈ నియో బ్రాహ్మడు. ‘బతికి పోయానురా బాబుది తన రంగే, నా రంగు అయుంటే దగ్గరికైన తీసేవారో వారో లేదో!’ అని కన్నీరు కార్చాడు. నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. దాంతోపాటే ఈ వెదవపైన కోపం. ఇదంతా వీడు కావాలని చేసుకున్నది కాదు. అభ్యుదయ జంధ్యం తాట వలచాల్సింది పోయి, ఈ ఏడుపులు ఎందుకు. ఎవరి జాలి మాటలు పొందడానికి. వీడి వలపోత అంతా విన్నాక, వీడింకా దళితుడు అని చెప్పుకుంటుంటే ‘మద్దూరి’ పోయెం ఒకటి గుర్తొచ్చింది. వీడు మారు మనసు పొందుతాడో లేదో చూడాలి.

కులం ఎంత వికృతమైనది డియర్. ‘కులం’ను వదిలేసుకున్నామని ఇప్పటికి వాళ్ళ కులాల్లో పిల్లలనే పెళ్ళిళ్ళు చేస్తున్న ఎంతమంది అభ్యుదయ, విప్లవ జంధ్యాలను చూడలేదు. దళితుల్ని చేసుకుని అదేదో ‘దళిత జనోద్దరణ’ అని దంచే ఉపన్యాసాలు ఎన్ని వినలేదు. వీళ్ళ ఉక్కపోతలో ఎన్నిసార్లు తడిసి ముద్దయిపోలేదు. అయినా కలిసి బతకాలంటే కులమే కావల్నా. ఎంతమంది బతకట్లేదు. వేదికలు ఎక్కి ఉపన్యాసాలు దంచకుండ. విప్లవాలు వల్లించకుండ. మా అమ్మమ్మ, నానమ్మ, నాయనమ్మ ఏ వేదికలు ఎక్కి ఉపన్యాసాలు దంచలేదు. వాళ్ళకు మార్క్స్ తెలియదు. మావో తెలియదు. అంబేద్కర్ తెలియదు. అయినా  అమ్మా, నాన్న పెండ్లి చేసుకుంటే ‘సల్లగా బతుకుండ్లి బిడ్డా’ అన్నారు. సిద్దాంతాలు వేదాల్లా వల్లించడానికి, జీవిత అనుభవంలోనే సిద్దాంతాన్ని చూసుకునే వాళ్ళకు తేడా ఉంది అని అక్షర జ్ఞానం లేని వాళ్ళను, సిద్దాంత ఉపన్యాసాలు దంచే వీళ్ళను చూస్తె అనిపిస్తుంది.

Caste is a Monster అన్నాడు అంబేద్కర్. కుల నిర్మూలనకు కులాంతర వివాహాలను సజెస్ట్ చేశాడు. ఇదిగో కులాంతర వివాహాలు ఇలా వలపోతలుగా తయారయ్యాయి. సామాజిక, ఆర్థిక పోరాటాలు, ఇప్పుడు సాంస్కృతిక పోరాట అనివార్యతను చెబుతున్నాయి. Cultural Hegemonyని బద్దలు కొట్టే సాహిత్యం ఇప్పుడు బలంగా రావాలి.  నిజానికి ఆ సాహిత్య కృషి కింద నుండి, పైన నుండి ఒకేసారి జరగాలి. ‘కింద నుండి చెబితే అది కులవాదం ఎందుకు అవుతుంది. పై నుండి వస్తే అది అభ్యుదయం ఎందుకు అవుతుందో’ చర్చ జరగాలి. ఎందుకో పాలో ఫ్రెయిరే బాగా గుర్తొస్తున్నాడు. ‘Pedagogy of the Oppressed’ ఇంకా ఈ అభ్యుదయులకు అర్థం కాలేదు అనుకుంటా. కమ్యూనిస్టు ప్రణాళికతో పాటు,  అంబేద్కర్ ‘కుల నిర్మూలన’  అర్థం అయి ఉంటే అప్పుడు వీడి లాంటి వాళ్ళు ఇక వలపోసుకునే స్థితి రాదు అనుకుంటా. కమ్యూనిస్టు పార్టి ప్రణాళిక అర్థం అయి ఉంటే కుల నిర్మూలనా అర్థం కాకుండా ఉంటుందా! పీడితుల వలపోత అర్థం కాకుండా ఉంటుందా!

No comments:

Post a Comment