Tuesday, March 13, 2018

ప్రేమలేఖ 3



ఓయ్ ప్రేమను వ్యక్తపరచేందుకు కళ్ళు, కౌగిలింతలు, కాఫీ ముద్దులే గాక ఎప్పుడో ఒసారైనా కాస్త కవిత్వం కారాదు. ఎప్పుడూ నేను నీకు రాయడమేనా. నువ్వు బాగా మాట్లాడతావ్ కదా. ఆ మాటల్లో కవిత్వం ఉంది. ఆ మాటల్నే అక్షరాల్లోకి ఒంపరాదు. అదే కవిత్వం అవుతుంది. నీ నడకలో నాట్యం ఉంది. ఆ మాట అనగానే లేడిపిల్ల గెంతుల్లా నాట్యమాడే నీవు. నీ మాటల్లో కవిత్వం ఉందంటే ఎందుకు రాయవు?. ఆ రాత్రి ఆకాశంవంక చూపిస్తూ ఏమన్నావ్.?

''ఆకాశంలో మెరుస్తూ, మాయమయ్యే చుక్కలు
అడ్డువచ్చే మేఘాలు
వెన్నెలతో జరిపే సంభాషణలు

ఎదురెదురుగా మనం
ఒకరి కళ్ళలోకి ఒకరం
చూసే చూపులు
ఓ మౌన సంభాషణ
రెండు హృదయాలు
జరిపే కనుల సంభాషణ"

ఈ మాటలు కవిత్వం కాకపోతే ఏమిటి?!. నేను భావాల్ని అక్షరాల్లోకి ఒంపుతాను. నువ్ మాటల్లోనే కవిత్వమై ప్రవహిస్తావు. అంతే తేడా. నువు నడిచే కవిత్వపు నదివి. మాటల సంద్రానివి. 

నీ మాటలు అక్షరాల్లోకి మారుతూ, పదాలుగా, వాక్యాలుగా పరిణామం చెంది, ఓ కవితో, వచనమో అయితే చూడాలని ఆశ. చిన్న ఆశ. అంతే. అంతేనా అంటే? ఏమో? ఇప్పటికి. ఈ క్షణానికి ఇంతే. నీ జవాబుకోసం, ఎప్పటిలాగే ఎదురుచూస్తూ. 
నీ నేను

No comments:

Post a Comment