Monday, March 12, 2018

ప్రేమలేఖ 2




నువ్వెళ్ళి పోయాక చాలాసార్లు గుర్తొచ్చావ్. ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది. గుర్తురావడం ఏంటి?. నేనేదో నిన్ను మర్చిపోయినట్టు?!. గుర్తురావడం అంటే ఒక మనిషి గుర్తురావడం కాదు. పక్కన తోడు లేదని గుర్తుకురావడం. ఆవహించిన ఒంటరితనం నుండి బయటపడేందుకు ఒక అశ్వాసాన్ని కోరుకోవడం. ఎడారిలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్న ఇసుక రేణువు అవుతాను కొన్నిసార్లు. పాలపుంతలో ఒంటరి నక్షత్రాన్ని. అడవిలో చెట్ల మధ్యన ఒంటరి మొక్కని. చిట్ట చివరి కొమ్మపై ఆకును. అట్లా ఉన్నపుడు గుర్తొస్తావ్. నువ్ పక్కన లేవని. కాస్త ముభావంగా కనిపించగానే గుండెకు హత్తుకునే నేస్తం లేదని. ఒడిలో తల పెట్టుకొని, వెంట్రుకలు నిమిరే మానవి ఇప్పుడు తోడు లేదని. నువ్ లేక కవిత్వం పాదం తెగిపడ్డ పదాలయింది. కథ వాక్యాల్లో ఇమడనంటుంది. నవల ముందుకే కదలట్లేదు. ఇవన్నీ ఎప్పుడు ఉండేవే. కొత్తగా ఏమి రాయవు అంటావ్. కలసిన ప్రతిసారి.

కన్నీరు ఆపుకోవడం విషాదమే. నీకు చెప్తే మొదట నవ్వుతావ్. మరికాసేపటికి జతకడతావ్. ఎందుకంటే ఏడ్చినా, ఓదార్చుకున్న మనమిద్దరమే. ఇద్దరం వేరని ఎన్నడూ అనుకోలేదు కదా. కానీ ఇవ్వాళ అలా కాదు. ఏడవలేను. ఏడ్చినా, ఓదార్చుకోలేను. కన్నీళ్లు దిగమింగుతుంటే, గొంతులోంచి మాట బయటకు రాట్లేదు. అయిన తప్పదు తనని ఓదార్చాలి. ఊకోబెట్టాలి. ముద్దు చెయ్యాలి. కంట్లోంచి నీరు దుఃఖంతో గాక పట్టరాని సంతోషంతో వచ్చేంతగా నవ్వించాలి. అప్పుడు గాని మన గువ్వపిల్ల తనలాగా ఉండదు.దానికి నీ నవ్వే వచ్చింది. ఎంత స్వచ్చంగా నవ్వుతుంది. దిల్ ఖోల్ కె. కానీ ఇయ్యాలెందుకో పాప కంట నీరు. ఒళ్ళో కూర్చొని, మెడ చుట్టూ చేతులు వేసి పొగిలి పొగిలి ఏడ్చింది బిడ్డా. తట్టుకోవడం చాలా కష్టమైంది. కాసేపయ్యాక వెళ్తా అంది. వద్దు. కాసేపు ఉండి వెళ్లమన్నా. ఆ మాట వినడం కోసమే అడిగినట్టుంది. వెంటనే హత్తుకుపోయింది. నేను ఓ కవిత రాసుకుంటుంటే, చదివిపెట్టు అని జిద్ చేసింది. పూర్తి కాలేదు అంటే వినదే. బహుశా నా మొండితనమే వచ్చినట్టుంది. తనకు వినిపించడం కోసమే పూర్తిచేశా. చదవడం అయిపోయాక 'ఇదిగో, నా గుండెను ఇస్తున్న తీసుకో' అంది. తరువాత సినిమా చూస్తుంటే 'ఇప్పుడు ఈ సినిమా అవసరమా! మళ్ళీ అమ్మను గుర్తుతెచ్చుకోవడానికా!' అంటూ ల్యాప్టాప్ మూసేసింది. 'హమారి అధూరి కహానీ' అని రాగయుక్తంగా పాడుతూ. నన్ను తిట్టాక కానీ శాంతపడలేదు. 

ఒక్క చోట సక్కగా ఉండదు కదా. పాదాలకు చక్రాలు వేసుకొని తిరిగి, తిరిగి బెడ్రూంలోని పుస్తకాలను తీసి హాల్ లో కుప్ప పోసింది. నా కవితల పుస్తకం తిరగేస్తూ 'ఆమ్లెట్ ఆకలవుతుంది. వేసిపెట్టవా!' అని అడిగింది. వేశాక, పూర్తిగా తినకుండా సగం నాకు వదిలేసింది. కాసేపటికి, నేను వచ్చిన పని అయిపోయింది. వెళ్ళాలి. నన్ను హాస్టల్ లో దింపిరా అంది. దింపనైతే దింపాను గానీ, తిరిగివస్తుంటే తన గురించిన తలపులే. ఇంత సున్నితమైనది. ఈ దుర్మార్గపు 'జనాల' మధ్య ఎట్లా బతుకుతుందా! అని. అంతలోనే చెంపలపై కన్నీరు. ఇప్పుడు నువ్వూ ఉంటే ఎంత బాగుంటుండూ. ఎంత నేను చెప్పినా,నువ్వు చెప్పినట్టు ఉంటుందా?. నువ్వేమో మా ఇద్దరికి Rapport బాగుంటుంది అంటావ్. ఎంత క్లోజ్ గా ఉన్నా, అన్ని నాతో చెప్పుకోలేదుగా. ఆ మాట తనతో అంటే ఒప్పుకోదు. 'అన్ని నీతో చెప్తా కదా. Crushల గురించి కూడా చెప్తా కదా' అంటుంది. మళ్ళీ తనే 'ఎహె పో, నీకు అర్థం కాదు. నేను అమ్మకే చెప్తా' అని ఎగిరిపోతుంది. 

ఆ ప్రాజెక్ట్ వర్క్ ఏదో జల్దీ పూర్తి చేసి రారాదు. మేం వస్తామంటే. 'మీ ఇద్దరిని చూస్తే డిస్టర్బ్ అవుతా. రావద్దు' అంటావ్. నువ్ లేని లోటు ఇయ్యాలెందుకో చాలా ఎక్కువ అనిపించింది. కనీసం సెలవు పెట్టి అయిన రారాదు. లేకపోతే తననే నీ దగ్గరికి పంపనా. 

నువ్వు, నేను, తాను ముగ్గురం మూడు చోట్ల
ఈ త్రిభుజాన్ని కలిపే పాయింట్ కై ఎదురుచూస్తూ నేను
తనకే స్వంతం అనుకునే ప్రపంచంలో తాను
మా ఇద్దరి బాధ్యతను మోస్తూ ఎక్కడో దూరంగా నీవు
పాపం మన మంచం ఒక్కటే ముగ్గురి కోసం ఎదురుచూస్తూ ఒంటరిగా

11/03/18

No comments:

Post a Comment