Saturday, March 24, 2018

ప్రేమలేఖ 5




సినిమా ఎందుకో Manufacturing the Consent అనిపించేది. ఇప్పటికి అంతే అనుకో. చాల అరుదుగా సినిమాలు జీవితాల్ని దృశ్యమానం చేస్తాయి. జీవితాల్లో ఉండే వేదనని కళ్ళ ముందుకు తెస్తాయి. ఏదో చెప్పాలనే కసి ఉంటుంది అందులో. సినిమాతోనే సమాజంపై ఏదో ముద్ర వేయాలనే సందేశం ఒకటి అంతర్లీనంగా కనిపిస్తుంది. అటువంటి వాటిని కేవలం సందేశాత్మక చిత్రాలని ట్యాగ్ వేసేసి, ఒక బుట్టలో పడేద్దామా!? అత్యాచారాలు, హత్యలు, దోపిడిలు ఎలా చేయాలో చూపించే సినిమాలు సమాజంపై దుష్ప్రభావాన్ని వేస్తున్నాయి. కొందరిని ఆ అడ్డ దారుల్లో నడవడానికి ప్రోత్సహిస్తున్నాయి. సమాజంలో మంచి, చెడు రెండు ఉన్నట్లే, సినిమాల్లో కూడా మంచి, చెడు సినిమాలు ఉంటాయి. ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావ్ అంటావా? ఇవ్వాల ఒకానొక మంచి సినిమా చుశానోయ్. అందుకు.

నీది నాది ఒకే కథరుద్రరాజు సాగర్ కథ. రుద్రరాజు సాగర్ లాంటి అనేకమంది యువకుల కథ. ధార్మిక లాంటి అనేకమంది యువతుల కథ. కానీ మనది మాత్రం కాదు. అయినా మన చుట్టూ ఉన్న వాళ్ళ కథ. సినిమా చూస్తుంటే కలిసి చదువుకున్న ఎంగెల్స్ రచనకుటుంబం, వ్యక్తిగత ఆస్థి, రాజ్యం పుట్టుకగుర్తొచ్చింది. నాకైతే పాల్ లేఫార్గ్ రచన కూడా ఒకటి గుర్తొచ్చింది. పిల్లల్ని ప్రేమించడం రానపుడు, ప్రేమించలేనపుడు కనడం దేనికి?” అని ఎంత చర్చించుకున్నాం. ఆ చర్చలన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు తిరిగాయోయ్. అయినా పిల్లలేం, కేవలం పది నిమిషాల సుఖం అనంతరం కార్చే కొన్ని వీర్యపుచుక్కలు, అండాన్ని చేరితే పుట్టుకొచ్చిన వారో, చిరిగిన తొడుగు వలనో, వేసుకొని Un wanted వలనో పుట్టిన వాళ్ళో కాదు కదా! వాళ్ళే ప్రకటించుకుంటున్నట్లు వాళ్ళ ప్రేమకు ప్రతిరూపాలే కదా! వాళ్ళని ఎత్తుకొని, ముద్దు చేసి, అరికాళ్ళకు ఎక్కడ మట్టి అంటుతుందేమోనని గుండెలపై, భుజాలపై మోస్తూ మరీ పెంచి ఉంటారు కదా! మరి ఎందుకని పిల్లల స్వేచ్ఛను హరించాలనుకుంటారు? ఎక్కువ మార్కులు రాకపోతే, పరీక్షలో ఫెయిల్ అయితే వాళ్ళు పిల్లలు కాకుండా పోతారా? వాళ్ళ పరువు, మర్యాదలు పిల్లల స్వేచ్ఛలో గాక మార్కుల్లో చూసుకోవడమేమిటి. ఎంత దుర్మార్గ స్వభావం అది. ఎందుకో ఏ ఇంట్లో అయిన మార్కులు రాని కొడుకుపై తండ్రి చూపే పరువుఉన్మాదాన్ని వాడికి తాకకుండా నిత్యం దహించుకుపోయేది అమ్మే. ఇందులోనూ అంతే. ఆమె కార్చిన కన్నీళ్ళలో ఏమిచెయ్యలేని నిస్సహయత ఒకటి ఉంది. అంతర్లీనంగా ఈ పురుషాధిక్య సమాజం ఆమెకి వేసిన సంకెళ్ళు ఉండనే ఉన్నాయి. కొడుక్కి యాక్సిడెంట్ అయి ఆసుపత్రిలో పడున్నా ఎందుకు రాలేదని భర్తను నిలేయగలిగే అంత ధైర్యం ఉన్నా, మళ్ళి ఏమి చేయలేని నిస్సహయతే. ఈ సమస్య కేవలం రుద్రరాజు సాగర్ దిలా కనిపిస్తున్నా, ఇక్కడ మాత్రం రుద్రరాజు సాగర్ ఒక సర్వనామమే. అనేకమంది కుటుంబ పీడిత పిల్లలకు వీడొక ప్రతీక.

తండ్రి తనపై చూపే కోపం కూడా ప్రేమ అనే భ్రమలో బతికే వాడు. నాన్న కుండ బద్దలుకొట్టినట్టు నీ కన్నా నాకు పరువే ముఖ్యంఅనేదాక ఆ కోపం వెనుక పరువు పోతుందనే ఆక్రోశం తప్ప, వీడిపై ప్రేమలేదని. వాడి స్వేచ్ఛను వాడే వెతుక్కుంటూ వెళ్తాడు. స్వేచ్ఛ ఒకరు ఇచ్చేది కాదు. తీసుకునేది అని అర్థమయ్యో, అవ్వకనో కానీ మొత్తానికి వెళ్తాడు. తనను తనలా గుర్తించిన, అభిమానించి, ప్రేమించిన ధార్మికతో. తనతో జీవితం పంచుకోవాలనుకుంటున్న ధార్మికతో. స్వేచ్ఛను వెతుక్కుంటూ పట్నంకు రెండు పక్షుల ప్రయాణం. వీడు స్వేచ్ఛను వెతుక్కుంటూ పట్నం పోయాడు. కానీ ఈ మార్కుల వేటలో, తల్లిదండ్రులకి నచ్చినట్లు బతకలేక పట్టాలపై పడి, ఫ్యాన్ కు వేలాడుతో, పురుగులమందు తాగో స్వేచ్ఛనువెతుకున్న వాళ్ళని గూర్చి ఎన్ని పత్రికల్లో చదవలేదు. అన్ని సినిమల్లోలాగే ఇక్కడా వాళ్ళ నాన్న చివరికి రియలైజ్ అయ్యాడు. వాడికోసం ఒక కవిత రాద్దాం అనుకున్నాడు. పదాలు దొరక్క ఆగిపోయాడు.

ఇది కేవలం రుద్రరాజు సాగర్ కథో, దేవీప్రసాద్ లాంటి పరువుఉన్మాద తండ్రుల కథో కాదు. రోజు మనం చూస్తున్న కథే. మన చుట్టూ జరుగుతున్న కథే. మనది కాకపోయినా మన కుటుంబాల్లో జరుగుతున్న కథే. సినిమా అయిపోయాక, రాయడం మొదలుపెట్టాను. అప్పుడు అనిపించింది. మన అమ్మనాన్నలు మన ఇష్టానికి మనల్ని పెరగనియ్యకుండా వాళ్ళు దేవీప్రసాద్ లాగా బిహేవ్ చేస్తే? అప్పుడు ఈ కథ మనది కూడా. వాడిని పాస్ అయ్యేదాకా ఇంటికి రావొద్దన్నాడు దేవీప్రసాద్. మా నాన్న అయితే ఏముంది బేటా, ‘మార్చికాకపోతే మేఅదిపోతే మళ్ళి మార్చ్అన్నాడు. నాన్న కూడా అలానే అని ఉంటే. అప్పుడు రుద్రరాజు సాగర్, నాకు ప్రతీక అయ్యేవాడు.
చివరగా ఒక మాట అయినా వ్యక్తిగత అభివృద్ధి ఒకడు చెప్తే వస్తుందా? విజయానికి ఐదు మెట్లు, విజయానికి ఆరో మెట్టు అంటూ ఆకర్షనీయమైన పేర్లతో పుస్తకాలు అమ్ముకోవడం మినహా పెర్సానాలిటి డెవలప్ మెంటర్స్ చేసేది. ఏముంది. పట్టాభి, యండలు, హిప్నోలు రాసిన పుస్తకాలు చదివి ఎంత నవ్వుకోలేదు. కాషాయబట్టలు వేసుకున్న  వేదవొకడు, తనమీద తనకు నమ్మకం లేనివాడే నాస్తికుడు అన్నాడు. ఇప్పుడు వాడి పుస్తాకాలు వ్యక్తిత్వ వికాస రచనలు. ధ్యానం చేయాలనీ చెప్పి 33 ఎండ్లకై చనిపోయిన వేదవను నమ్మే వాళ్ళను చూస్తుంటే నవ్వొస్తుంది డియర్. వాళ్ళు వాళ్ళ పిచ్చి రాతలు. అవి చదివితే విజయమేమో గానీ, ఒకరకమైన నూన్యత భావనలోకి పోవడం మాత్రం ఖాయం. అట్లా పోయిన వాళ్ళు ఎంతమందో. అందులో రుద్రరాజు సాగర్ ఒకడు. ధార్మిక ఒకర్తి. సాగర్ చెప్పందుకొని మరీ కొట్టాడు. కానీ  దార్మికే హిప్పోక్రాట్ లా బతికింది. ఆ నిజాన్ని చివరికి ఒప్పుకుంది.

తల్లిదండ్రులు పిల్లలపై చేసే ఆధిపత్యాన్ని మేము వ్యతిరేకిస్తాం. అది అంతం కావాలనుకుంటాం. అందుకు మమ్మల్ని నేరస్తులంటారా. అవును. మేము నేరస్తులమేఅని కమ్యూనిస్టు పార్టి ప్రణాళికలో మార్క్స్ - ఎంగెల్స్ లు దేవి ప్రసాద్ లాంటి తండ్రుల కోసమే అని ఉంటారు.

మారింది దేవీప్రసాద్ ఒక్కడే. మారాల్సిన దేవీప్రసాద్ లు ఇంటికోకరు ఉన్నారు. తప్పు వాళ్ళది కాదు. వాళ్ళని అలా తయారు చేసిన వ్యవస్థదే. పిల్లలను, భార్యని ఆస్థిలాగ చూస్తున్న వ్యవస్థదే. పిల్లలను వాళ్ళ కోర్కెలు తీర్చే యంత్రాలుగా చూస్తున్నంత కాలం అనేక మంది రుద్రరాజు సాగర్ లు బలవుతూనే ఉంటారు. పిల్లలని స్వేచ్చగా బతకనివ్వలేని బలహీనత ఉన్నవాళ్ళు పిల్లల్ని కనకపోవడమే మంచిది. ఆస్తులకు వారసత్వాన్ని ఇవ్వడానికే కాదు. మనుషులుగా బతకడానికి అని తెలిసే రోజుకోసం, స్వేచ్ఛ సృజనకు తొలిమెట్టు అని తెలుసుకునే రోజుకోసం ఎదురుచూస్తూ...

No comments:

Post a Comment