Saturday, August 17, 2019

టూటే హువా ఖ్వాబ్


ఇరిగి పోయిన కలలు
ఎన్నో నేర్పించాయ్
ఎద పొందినదాన్నేదో
కళ్ళు పోగొట్టుకున్నాయ్

శైలేంద్ర గొప్పగా చెప్పాడు కదూ. బహుశా ఒకే ఒక్క శైలేంద్ర మాత్రమే చెప్పగలడు అనుకుంటా. అనుకుంటా ఏమిటి. శైలేంద్రనే చెప్పగలడు. అతడొక్కడే చెప్తాడు గనుకే, తాగుతూ ఏదో రాసుకుని బార్  చెత్తకుండి లో విసిరేసిన కాగితాన్ని ఏరి మరీ బాణీ కట్టుకున్నారు. నేనంటే నేనని పరుగులు పెట్టారు. అయితే ఇప్పుడు శైలేంద్ర గురించి రాయట్లేదు. అతడి వాక్యాల్లో నన్ను నేను వెతుక్కున్నాను.

"ఎద పొందిన దాన్నేదో, కళ్ళు పోగొట్టుకున్నాయ్". నేనూ అంతే కదూ. ఎద పొందిన అనేకాల్ని ఇంకా వెతుకుతున్నాను. కానీ, ఎక్కడా? ఏవీ కంటికి కనరావే. అనేకం వరకేందుకు. నువ్వు? నువ్వు మాత్రం ఎదలో తప్ప, జ్ఞాపకాల్లో తప్ప కంటికి కనబడుతున్నావా? లేదు కదా. శైలేంద్ర మేరే దిల్ కె మెహ్మాన్ అంటాడు. నువ్వూ అంతే కదూ. దిల్ కి మోహల్లాలో కొన్నాళ్ళుండి, తిరగాడి జ్ఞాపకాలను వొదిలిపోయిన అథితివి. వొచ్చిపోయిన అథితీ ఇప్పటికి మనం తిరగాడిన జాగలకు నేనెప్పుడైన వెళితే యాదికొస్తావ్. మనం ఎప్పుడూ కూర్చునే చోటే కాసేపు కూర్చొని వస్తాను. నీ యాదుల్లో ఆ కాసేపు తడచిపోతాను.

ఈ మధ్య నల్లమల పొయొచ్చాను. అభివృద్ధి అంటేనే విధ్వసంమని అనేకానేక సార్లు మాట్లాడుకున్నాం కదూ. ఇప్పుడూ అంతే. మానవ విధ్వంసక యురేనియం వెలికితీత కోసం అక్కడి చెంచులను తరిమేయబోతున్నారు. యురేనియం చేసిన విధ్వసం నీకు తెలియంది కాదు. ఫుకుషిమా గురించి ఎంత మాట్లాడుకున్నాం. ఇప్పటికీ ఫసిఫిక్ లో చేపలు రేడియాక్టివ్ గానే ఉన్నాయని రిపోర్ట్స్ వచ్చాయి. ఒక విధ్వంసం చేయడానికి మరొక విధ్వంసానికి పాల్పడుతున్నారు పాలకులు.

మొన్న పోయినప్పుడు శీలం బయ్యన్న (నల్లమల చెంచు) మాట్లాడుతూ... "నేను ఒక్కణ్ణే అడవిలోకి పోతా, నాక్కొన్ని పసులున్నాయ్. నేను అడివిలో వాటిని మేపుతుంటే, పెద్దపులి మా పక్కనుండే పోయింది. అది మమ్ముల ఏమనది. పెద్దపులి మా బిడ్డ. మేము దాని బిడ్డలం. ఏది మమ్ముల అడవిలకెళ్లి ఎల్లగొడుతా అన్నోడు వచ్చి అడివిల రెండురోజులు ఉండుమను సూద్దాం. మా లెక్కన అడివిల ఒక్కణ్ణే తిరుగుమను సూద్దాం." అన్నాడు. నిజమే కదూ. తనది కానీ నేలలో ఎవడైనా ఎట్లా యథేచ్ఛగా తిరగగలడు. అంతేనా... "మమ్మల్నంటే ఎళ్లగొడుతరు. మరి పెద్దపులులను, జింకలను, దుప్పులను, ఎలుగొడ్లను, మెకాలను, ఇంకా నూటొక్క తీరు జంతువులను ఏడికి కొంతబోతరు" అనీ అడిగారు. సమాధానం ఎవరు చెప్తారు. ఏ ప్రభుత్వాల దగ్గర సమాధానం ఉంది. మొదట పులుల అభయారణ్యం అని మనుషులను, తరువాత యురేనియం ఉందని పులులనూ ఎల్లగొడుతున్న వాండ్లు ఏమని చెప్తారు. ఎవరికి చెప్తారు.

మనం మాట్లాడితే మానవీయత అంటాం కదా. కానీ, ఈ చెంచులు మనం చెప్పే 'మానవీయత' పరిధిని దాటిన ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. ఒక్క మనిషినే కాదు. చెట్టును, పుట్టను, పక్షిని, పశువును, చివరకు మనం కౄర జంతువు అనే పెద్దపులిని బిడ్డగా చూసుకునే, చెప్పుకునే గొప్ప స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు లింగ్విస్ట్ లు ఓ కొత్త పదాన్ని కాయిన్ చేయాలి. నాగరికత నిర్ణయించిన 'మానవీయత' పరిధిలో గాక, మొత్తం ప్రకృతిని తమ అని భావించే ఆదివాసులను గురించి చెప్పేందుకు ఒక కొత్త పదాన్ని కాయిన్ చేయాలి. అంతగొప్ప మనుషులు ఇప్పుడు వాళ్ళ నేల నుండి బేదఖల్ అవుతున్నారు. ఇదొక నల్లమల గాయమేనా? కాదు. అడివున్న చోటల్లా ఇదే కథ. అడివిని, అక్కడి మనుషులను ఏనాడు పట్టించుకోని ప్రభుత్వాలు ఇప్పుడు అభివృద్ధి అంటూ అడవి బాట పడుతున్నారు. ఎవరి అభివృద్ధి? అభివృద్ధి ఖరీదు ఒక నాగరికతా? ఈ దేశం కన్నా, ఈ ప్రభుత్వాలు, చట్టాలు, రాజ్యాంగాల కన్నా పూర్వపు నాగరికతా?. చెట్లు, పుట్టలు, పశువులు, జీవరాశులు అన్నీ అన్నీ కనుమరుగై అక్కడో విషం నేలనుండి బయటకి తీయబడుతుంది. తన పురిట్లోనే ఒక నాగరికతను, పచ్చదనాన్ని బలిగొనే విషం కాస్త ఫ్యూరిఫై అయి సమస్త మానవాళిని బలిగొంటుంది.

శైలేంద్ర రాతను రఫీ పాడుతుంటే నీతోపాటే నల్లమలా యాదికొచ్చింది. నువ్వు గుర్తొస్తే మనం తిరగాడిన చోటుకు పోయి రాగలను. అక్కడే కాఫిడే లో మనకిష్టమైన ఫ్లేవర్డ్ కాఫీ తాగగలను. అదే ఫ్లై ఓవర్ మీద బండి నడుపుకుంటూ వెళ్లగలనూ. మనం గడిపిన సముద్ర తీరంలో కూర్చొని నిన్ను యాది చేసుకుంటూ మనకిష్టమైన పాటల్ని ఇయర్ ఫోన్ లో వినగలను. కానీ, ఒక్కసారి తన నేల నుండి విసిరేయబడినవారు వారి నేలను మళ్లీ చేరుకోవడం కుదరదు. అక్కడున్న తమ పూర్వీకుల యాదుల్ని తరచి చూసుకోనూ లేరు. తామొకనాడు ఉన్న నేల ఇప్పుడు పరాయిదైపోతుంది. ఆ నేలలో పుట్టుకొచ్చిన విషపు కంపెనీల చుట్టూ సాయుధ పహారా ఉంటుంది. ఇక్కడొక ఊరుండేది. అందులో మనుషులుండేవారు. ఈ నేలపై కొన్ని గురుతులుండేవి. అని చెబితే తప్ప ఎవరికీ తెలియదు. వాళ్ళ ఎద పొదుముకున్న జ్ఞాపకాలేవీ ఇక కళ్ళముందు కనపడవు. కనీసం పోయి చూసుకుందామన్నా వాటి ఆనవాళ్ళూ ఉండవు. అందుకేనేమో శైలేంద్ర 'ఇరిగిపోయిన కలలు ఎన్నో నేర్పించాయ్' అన్నాడు.

నిజమే. ఇరిగిపోయిన కలలు చాలా నేర్పించాయ్. ఎదలో నిండిన నీవు కనుచూపుమేరలో లేవు. ఏ గాఢనిద్రలోనో నువ్వు యాదికొస్తే ఉలిక్కిపడి నిద్రలేస్తాను. తరువాతిక నిద్ర పట్టదు. ఇప్పుడు అక్కడి జనాల పరిస్థితీ అదే. ఊరు పోతుందని నిద్ర పట్టడం లేదన్నారు. కళ్ళు కనపడని ముసలావిడొకర్తి ఊరు వొదిలి పోయేవాళ్ళు తనను వెంట తీసుకుపోతారో లేదోనని అన్నం తినడం మానేసింది.

ఎదలో నిండింది. దేహంలో, ఆలోచనల్లో భాగమైంది కళ్లకు కనపకుండా పోవడం విషాదం కదూ. శైలేంద్ర పాటను బతుక్కి అన్వయించుకుంటే నువ్వు యాదికొచ్చావ్. వెళ్తూ వెళ్తూ నువ్ చూసిన చూపు యాదికొచ్చింది. నల్లమలా, అక్కడి మనుషులు, వాళ్లతో మాట్లాడిన మాటలూ యాదికొచ్చాయ్. అట్లా యాదికొచ్చిన ఒక్కో యాదిని నిదురపట్టక ఇలా రాశాను.

No comments:

Post a Comment