Thursday, February 21, 2019

యుద్ధమంటే?



యుద్ధమంటే
బాత్రూముల్లో ఎగసిపడే
చైతన్యం కాదు
పడకగదిలోని
వీరత్వం అసలే కాదు

తెగిపడిన అంగాల
ఛిద్రమైన దేహాల
భయంకర రూపం

శవాలు కాలే కమురు వాసన
కాళ్ళను తాకే పచ్చి నెత్తురు
తల్లిశవం పక్కనే పాలకై
స్థన్యాన్ని వెతికే పసిబిడ్డ ఏడుపు

యుద్ధంలో ఉన్న ప్రియుడ్ని తలచుకుంటూ
ఒంటరిగా ప్రేయసి పాడుకునే
సాలిటరి రీపర్ గీతం
భయాన్ని కలిగించిన
పదవ తరగతి సోషల్ పాఠం

యుద్ధమంటే
ప్రపంచ పటంలోని
రెండు దేశాల కొట్లాట కాదు
ఒకరోజు ఫెస్బుక్ ప్రొఫైల్ పిక్చర్గ్ గా
పెట్టుకునే జెండా కాదు
కొవ్వొత్తుల ప్రదర్శన
అసలే కాదు

కోటానుకోట్ల మంది ప్రజల
చీమూ, నెత్తురు
మనిషికి మనిషికీ మధ్య
గీసే విభజన రేఖ

యుద్ధమంటే
ఒక విధ్వంసం
ఒక నాగరికత అంతం
బతికి బట్టగట్టినా
అణువణువునూ సలిపే
అణుగాయం

బతుకే యుద్ధమైన చోట
కావాల్సింది ప్రేమే తప్ప
యుద్ధభాష కాదు
(యుద్ధాన్ని కోరుకునే వారిని చూసి)

కొద్దిగా ఎడిట్ ఆంధ్రజ్యోతిలో ప్రచురితం.

No comments:

Post a Comment