Saturday, February 23, 2019

ప్రేమలేఖ 24

    ఎంతగా ప్రేమించినా ప్రకృతి మీద కొన్నిసార్లు కోపం వస్తుంది. మరీ ముఖ్యంగా తీరంలో ఒంటరిగా నడుస్తున్నప్పుడు. పాదాలను కడలి అలలు ముద్దాదినప్పుడు. ఒంటరిగానే నిర్మానుష్య ప్రదేశంలో నడుస్తుంటేనో, కూర్చోని ఉంటేనో చల్లని గాలిని మేనిని తాకినప్పుడు. గజల్ వింటూ పడుకున్నాక కిటికీలను తట్టి వర్షం మేల్కొలిపినప్పుడు. అవి కేవలం ముద్దాడవు. తాకవు. నిద్రలేపవు. పురాస్మృత యాదులన్ని మోసుకొని వస్తాయి. కావాలని మరచిపోయి, మస్తిష్కపు పొరల్లో దాచిన యాదులను తట్టిలేపుతాయి.

          ఈ రాత్రెందుకో నువ్ చాలా గుర్తొస్తున్నావ్. గోడవైపు చూస్తుంటే నీతో కలిసి నడిచిన, గడచిన కాలమంతా సినిమా నడుస్తున్నట్లుగా కదిలిపోతుంది. ‘మనది మొహామోహ ప్రేమరా’ అనేదానివి కదూ. అంటే ఏంటో ఇప్పటికీ తెలియదు. ఎప్పుడైనా అడిగితే సమాధానంగా  ముప్పై రెండణాల నవ్వు నామీదకి విసిరేసేదానివి.
ఓ సాయంత్రం అలసిపోయి వచ్చావ్. రేయ్ కాస్త చాయ్ పెట్టివ్వవూ అంటూ. ఆస్వాదిస్తూ తాగడం నీ తరువాతే ఎవరైనా. నీతో పోటీ పడాలి అనుకుంటాను. ఓ చూపుల బాణాన్ని అలా కనులకొస మీదుగా విసురుతావ్. అంతే. చాయ్ గ్లాసును దగ్గరికి తీసుకున్న వాడిని కాస్త నవ్వుతాను. ఆ నవ్వే నవ్వుకు ఇంకేముంది గ్లాసులోని  చాయ్ మీద పడుతుంది. ఇక నీకు అంతెక్కడిది. ఎంతగా నవ్వుతావ్. నీ నవ్వులన్నీ నన్ను ఉడికెంచేందుకే. నువ్వు అంతలా నన్ను ఉడికిస్తున్నా ఎందుకో కొద్దిగయినా కోపంరాదు. నువ్వు ఎప్పుడొచ్చినా జరిగే క్రియ ఇది.
ఆ రోజు రాగానే కాసేపు అలకబూనావ్. అలక పాన్పెక్కి కాసేపు పవలించావ్. ఎంతా గారాం చెయ్యాలి నిన్ను. ఒక్కమాటకు వినవు సరికదా, అలకకు కారణమూ చెప్పవు. వచ్చి అలా పడుకుంటావ్. ఎన్నీ ముచ్చట్లు చెప్పాలి. ఎంతగా బుదరకించాలి. అన్ని అస్త్రాలు అయిపోయాకా చివరి అస్త్రానికి నవ్వుతావ్. వద్దూ, నవ్వీ నవ్వీ కడుపునొస్తుంది ప్లీజ్ అంటూ...

       కాసేపటికి పెదాలు నుదుటి మీదనుండీ కనుల మీదకు జాలువారి, అక్కడ నుండి చెక్కిలిని ముద్దాడి, ఎడమవైపు తిరిగి నాసికను ఎక్కి దూకి ఏదో ఓ పురాతన వెతుకులాటకై తండ్లాడి యుద్ధం ప్రకటించాయి. ఈ యుద్ధంలో కత్తులు మొదలు ఆధునిక ఆయుధాల వరకు పనేమీ లేదు. రెండు నాల్కల యుద్ధం. నాల్గు పెదాల యుద్ధం. బయట అప్పుడే మొదలైన వర్షపు దార గోడపై దుమ్మును తనతో తీసుకొని జారుతుంది. 'బట్టలు వేసుకోవడం కూడా బరువే' అని పసిప్రాయంలో తిన్న తిట్లు ఈ క్షణం కోసమేనేమో అన్నట్లుగా అచ్చంగా మిగిలిపోయాం. ఆర్తిగా, ఆకలిగా ముద్దాడుతూ మధ్యలో పదే పదే పేరును పలవరిస్తావ్. ఆ ఉన్మత్త క్షణాన నా పేరు విని గర్వపడతాను. 'I am proud of my name when you call it' అని బయటకు అనేస్తాను. అంతే ఓ నవ్వు నవ్వుతావ్. చూపుల్ని పెనవేస్తావ్. మాటలు కరువైనప్పుడూ, బరువైనప్పుడూ నువ్ ఎప్పుడూ చేసే పని చూపుల్ని పెనవేయడం.

        ఒకటి, రెండు అట్లా ఐదారు ముద్దులు పెడితే తప్ప నీ పెదాల ఆవలి తీరం చేరలేను. పాబ్లో 'టూ బిగ్ ఐస్ ఫర్ హర్ ఫేస్' అన్నాడు. నేనైతే 'టూ బిగ్ మౌత్ ఫర్ హర్ ఫేస్' అని జతచేస్తా అంటే. 'ఇప్పుడు జత చేయాల్సింది పదాలు కాదు. పెదాలు అంటావ్.

      ఆకలిగొన్న చిరుత ఆహారంకై చూసినట్లుగా పైన కూర్చొని ఓ ఆకలి చూపు చూస్తావ్. అప్పుడనుకుంటాను నీ ఆకలికి నా పెదాలే ఆహారమని.  అంతలోనే కాసేపు ఊపిరి ఆపినంత పనిచేస్తావ్. You're my wild beast. కింది పెదవిని పళ్ళ మధ్యన ఆనించి, కనుల కొలకుల్లోంచి ఓ చూపు విసురుతావ్. ఆ వెంటనే నవ్వు. చేతులు తలమీదుగా పోయి వెంట్రుకల్లోకి పాకుతాయ్. కుదుళ్లను వేళ్ళమధ్యన ఇరికించి పైకి లాగుతావ్. 'ఓయ్ నొప్పి' అని నేనగానే. 'అయ్యో' అని నుదుటిమీద పెదాల ముద్ర వేస్తావ్. నీ కనులు, ముక్కు, నోరు కలుపుతున్న త్రిభుజాన్ని వదిలి నా చూపులు కిందకి జారుతుంటే. తల నిమురుతున్న నీ చేతులు కాస్త సిగ్గు పడడం మొదలెడుతాయి. అవి అప్పటికప్పుడు ఎదను దాచుకునే రక్షణ కవచాల అవతారమెత్తుతాయ్. 'సిగ్గులేదూ' అని ఎప్పటిలాగే నీ అరవిచ్చిన పెదాలు పలికే మాటలు. 'ఊహూ, అయినా ఇంకా సిగ్గుపడటానికి ఏమి మిగిలుందని?' అంటాను నేను. 'నాకుంది బాబు' అంటూ మొఖాన్ని ఎదమీద దాచుకుంటావ్. 'సిగ్గు ఓ భౌతిక రూపమైతే అదీ సిగ్గుపడేలా సిగ్గుపడడం నీకెట్లా సాధ్యం అమ్మాయ్' అని అనగానే. నా ఎదమీద నీ పళ్ళ ముద్ర లవ్ బైట్ అయి పడుతుంది. 'ఏంటే ఇది' అంటే. 'మన ప్రేమ గుర్తులే అబ్బాయ్, చూడు హార్ట్ షేప్ లో ఎంత బాగా పడిందో. మైదాకు పండినట్లు ఎర్రగా' అని మరింత ప్రేమిస్తావ్.

ఇంత ప్రేమించిన నీవు అర్థంతరంగా ఎలా వదిలిపోయావో ఇప్పటికీ అంతుపట్టదు. కరిగిపోయిన కాలాలందు నువ్వు ఓ కన్నీటి జ్ఞాపకం. ఓ తడి ఆరని మాట. కలసి కలగన్న ఓ అందమైన ఊహ. అంతలోనే ధ్వంసమైన స్వప్నం. మన కథ ఎక్ అధూర క్వాబ్. యే కభీ పూరా నహీ హోగా.

No comments:

Post a Comment