Tuesday, February 19, 2019

ప్రేమలేఖ 22


సాకీ...
ఇంకా ఎన్నాళ్ళని ఈ మోహపు కలలు. ఇవ్వాలెందుకో కొత్తపొడుపును కలగా కనాలనుంది. ఎప్పటిలానే ఈసారీ కలిసి కందాం ఈ కలనూ. అయితే ఈ కలలో నేను ఖాళీ గ్లాసుతో ఎదురుచూడను. నువ్వూ ప్యాలాను మోసుకురావు. ఇది నేను ఎప్పటిలాగే రాసే ప్రేమలేఖా కాదు. ఒక యుద్ధ బీభత్స పరిధినిదాటి నీకు రాస్తున్న లేఖ. మన ప్రేమలాగే పచ్చిలేఖ.

నీకు గుర్తుందా! వాఘా సరిహద్దులో సాయంత్రపు పరేడ్ చూసి 'అదొక ఉన్మాదపు ప్రకటన' అన్నావ్. చుట్టూ అరిచే నీ స్నేహితులను 'యుద్ధ పిపాసులు' అన్నావ్. అంతలోనే 'యుద్ధమంటే తెలియని వొఠ్ఠీ అమాయకులూ' అన్నావ్. ఆ రాత్రి మనం మాట్లాడుకుంది మొదటీ, రెండవ ప్రపంచ యుద్ధాలు గురించి కదూ. ఎంతమంది చనిపోయారు?. ఎంతమంది తల్లులు బిడ్డలను, భార్యలు భర్తలను, ప్రేమికులు వారి ప్రేమను యుద్ధానికి ఆహుతిచ్చారు. కాదు కాదు యుద్ధమే వారిని మంటల్లో కాల్చింది అని కదూ ఆ వెన్నెల  వెలుగులో మాట్లాడుకుంది.

మొదటి ప్రపంచ యుద్ధం నుండి తెరుకోకమునుపే ఈ పృథ్వి రెండవదాన్నీ చూసింది. హిట్లర్ ఉన్మాదం. నాజీల దురాగతం. మరీ చిన్నపిల్లలని కాల్చి చంపే దేశము ఓ దేశమేనా? ఆ గ్యాస్ చాంబర్లు. హీరోషిమా, నాగసాకీలు. అంతా అంతా ఒక విధ్వంసపు కాలం. ఇప్పటికీ యుద్ధమంటే వెన్నులో వణుకుపుట్టించే చరిత్ర పాఠం. యుద్ధానికి వ్యతిరేకంగా నిలబడి దాదాపు ఐదు లక్షల మంది సైనికులను పోగొట్టుకున్న రష్యా. యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చి గెలిచిన చైనా విప్లవం. అభివృద్ధి అంటే ఆర్థికాభివృద్ధి మాత్రమే కాదు, మానవ వికాసమూ అని చెప్పిన సోషలిజం. ఆ ముచ్చట్లన్నీ  కరిగిపోయిన ఆ రాత్రికి వెలుతురైన కొవ్వొత్తులు.

యుద్ధం గుర్తొచ్చిన ప్రతీసారి మంటో కథలే కళ్ళలో మెదులుతాయ్. యుద్ధం పిచ్చివాళ్లుగా తయారుచేసిన టోబా టేక్ సింగ్ లు, 'ఖోల్ దో' అని వినగానే పైజామాలు జారవిడిచేంతగా నిరంతర అత్యాచారానికి గురైన ఆడపిల్లలు. శవాలతోనూ రతిసల్పిన 'ఠండా ఘోష్'లాంటి కథలు గుర్తొస్తాయి. 47 విభజన కథలే అయినా దానికి ముందు నాజీ దురాగతమూ అదే. చరిత్ర లిఖించడానికి ఇష్టపడని హైదరాబాద్ ఆక్రమణా అదే. కునాన్ పుష్పోరా గుర్తుందా. ఆ రాత్రి మాట్లాడుతూ 'వాకపల్లికి పదిరేట్లురా కునాన్ పుష్పోరా, ఎందుకని ఇవి వెలుగులోకిరావు' అన్నావ్. కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల కథలూ, వెతలూ ఇవే అని కదూ మాట్లాడుకుంది.

సాకీ, దేశభక్తి అంటే ప్రభుత్వాన్నీ, సైన్యాన్నీ విమర్శించకూడదు అన్నవాడు ఎవడో తెలుసుకోవాలనుంది. ఈ మాట అంటే దేశద్రోహపు ముద్రవేసి నడిరోడ్డున లించినా లించుతారు. అయినా తప్పదు. ముస్లింలను విదేశీయులనే ప్రచారం మెదళ్లలోకి పోయినంతగా, ఆర్యులు వలసవాదులు అనే వాస్తవం ఐదో తరగతి పాఠంగానైనా గుర్తించరు. ఎంత చారిత్రక వైచిత్రి సాకీ ఈ దేశానిది. కాశ్మీర్ లో ఏ ఉగ్రవాదమైతే దాడి చేసిందో, పాకిస్తాన్ లో, ఆఫ్గనిస్తాన్ లో అదే దాడి చేసింది. టెర్రరిజం అంటే భయకంపితుల్ని చేయడం కదూ. 'నేటితో నాలోని రచయిత చచ్చిపోయాడు. ఇక బతికున్నది కేవలం పెరుమాళ్ మురుగన్ మాత్రమే' అని రాసుకునేంతగా తనలోని రచయితను భయపెట్టిన దాడి పేరేమిటి? కల్బుర్గి, పన్సారే, గౌరీలను చంపిన క్రియ పేరేమిటి? నా వంటింటి నుండి మాంసపు వాసన రాకుండా భయపడుతూ వంట చేసుకునే దౌర్భాగ్యానికి నెట్టేసిన స్థితి పేరేమిటి? టెర్రరైజ్ చేయడమే టెర్రరిజం అయితే ఇవంతా ఏమిటీ? ఇది రాసినందుకు అమ్మనీ, అక్కనీ, చెల్లినీ, తిట్టే ఉన్మాదం పేరేమిటి? మలాలపై దాడి చేసిందీ ఉగ్రవాదమే, గోద్రా అల్లర్లలో గర్భస్థ పిండాన్ని త్రిశూలానికి గుచ్చి మంటల్లో మాడ్చిందీ ఉగ్రవాదమే. ఇది అర్థమయిన నాడు దేశం ఒకేఒక్క అడుగు ముందుకుపోతుంది.

ఈ దేశపు ప్రజాస్వామ్యం ఓ మేడిపండు. దాన్ని కాపాడే ఇంటలెజెన్షియ ఓ గురివింద గింజ. అది ఉరికొయ్యకన్నా ప్రమాదకరమైన జంధ్యపుపొగును సవరించుకొని అన్నదమ్ములను విడదీస్తుంది. చరిత్రని పురాతన తవ్వకాలుగా వెతికితే అహ్మద్ నాకు తమ్ముడై దొరకడూ. అనార్కలో, అఫ్సానానో మేనత్త కూతురై ఎదురుపడదూ. నువ్వు మాత్రం ఎవరు మా అరుంధతి అత్త కూతురివి కాదూ. మన 'వసంతం' అన్నట్లు 'తవ్వాల్సింది, పూడ్చల్సింది చాలానే ఉంది'

యుద్ధం గురించి అనుకుంటే ఇవన్నీ గుర్తుకొచ్చాయి. యుద్ధం వచ్చి ఏ బాంబు దాడిలోనో నేను పోతానని? నీకు వచ్చిన కలతో సహా. ఎంత వెక్కి వెక్కి ఏడ్చావ్ అప్పుడు. అప్పుడే కదూ నిదురపట్టక టెర్రస్ మీద వెన్నెల వెలుగులో రాత్రిని కాలబెట్టింది. మాట్లాడుతూ, మాట్లాడుతూ, వింటూ వింటూ ఏ తెల్లవారే సమయానికో ఒళ్ళో నిదురపోయావ్. రాత్ గయి, మగర్ బాత్? రహ్ గయి.

No comments:

Post a Comment