Thursday, February 21, 2019

ప్రేమలేఖ 23


ఎన్నోసార్లు అనుకున్నాను. ఆ రాత్రిని చెరిపివెయ్యాలనీ. ఆ రాత్రి తాలూకు జ్ఞాపకాలనూ. ఇప్పటికీ అంతే. కానీ, అవి తెరలు తెరలుగా కండ్లముందు కదలాడుతూనే ఉంటాయ్. అచ్చం సినిమాహాల్లో తెరలాగా. ఆ రాత్రిని రాస్తే అది ఒక స్క్రీన్ ప్లే.

ఎంతలా ప్రేమిస్తున్నావ్ అని కదూ నువ్వడిగింది. ఏమని చెప్పను సమాధానం. ఆ క్షణాన మాటలు మరచిపోయి మౌనం దరిచేరాను. రెండు చేతులను అలా కలవేసి. నీ దరికీ చేరాను. ఏదో ఓ ఉన్మత్త మాయ. మైకం కప్పేసింది ఇద్దరిని. కొన్ని కనులు మూసుకొనే అనుభవించాలి అనుకున్నావేమో! కన్రెప్పలు కిందికి వాల్చావ్. ఎగబీలుస్తున్న శ్వాసల మధ్యన ఇద్దరిలో ఎవరు కలిపామో మర్చిపోయాను గానీ ఒక జత పెదాలు మరో జతను కలిసాయి. ఆ ఒకే ఒక్క నిమిషపు ముద్దు. కేవలం ఒకే ఒక్క నిమిషపు ముద్దు. కాసేపటికి తేరుకొని 'సారీ' అని కదూ నువ్వన్నది. ఎంత సిగ్గో ఆ బుగ్గలది. సిగ్గంతా పులుముకొని తెల్లని బుగ్గలు ఎర్రబడ్డాయి. ఎందుకో నవ్వొచ్చింది అంతలా సిగ్గుపడే నిన్ను చూసి. 'ఏది ఇదంతా సిగ్గే' అని నేనంటే ముఖాన్ని, మోహాన్ని నా గుండెలపై దాచుకున్నావ్. ఒళ్ళు తెలియకుండా తాగిన అనుభవం ఏనాడూ లేదు. ఆ క్షణాన కేవలం ఐదడుగుల దూరం చేరడానికి ఎంత తడబడ్డాను.

వెళ్లి అలా గోడను ఆనుకుని కూర్చున్నాం. ఎన్ని వందల, వేల సార్లు పొదుముకుని ఉంటాను నిన్ను. ఆ క్షణం మాత్రం ఓ అద్భుతం. అది ఓ అనుభవం. నువ్వు ఎప్పుడూ చూసే చూపే కాకపోతే ఈసారి మరింత ప్రేమ. హృదయాంతరాలలో దాగిన ప్రేమనంతా తట్టిలేపి కళ్ళకు కాటుకలా పూసుకున్నట్లుగా ఓ మత్తు చూపు. మోహపు చూపు. ఆ చూపుకే నేను మళ్ళీ మళ్ళీ పడిపోయా. ఈసారి మాత్రం మెడవొంపులో. Can i bite?. NO, పొద్దున ఆఫీస్ ఉంది. ఏదో ఉన్మత్త స్థితి ఇద్దరిలో. మళ్లీ పెదాలు జతను కోరాయి.

కాసిన్ని ఐస్ ముక్కలు, మరింత విస్కీ. నిజం చెప్పనూ విస్కీ కన్నా నీ పెదాల మత్తె ఎక్కువగా ఎక్కింది. ఈ మాటే అంటే, తీసుకో మరింత మత్తును అన్నట్లు మళ్లీ జత కలిపావ్. Open your eyes. చూపులు, పెదాలు జత కలిసిన ఓ అద్భుత దృశ్యం. ఇప్పటికీ అంతే అనుభవించి పలవరిస్తున్నానే తప్ప రాయలేక పోతున్నాను. ఆ రాత్రి ముద్దుల్లో కాలిపోయింది. మత్తులో కరిగిపోయింది. ఇదిగో ఇట్లా నా ఎదలో నిలిచిపోయింది.

ఇప్పటికీ అనుకుంటాను. నువ్వెళ్ళిపోయాకా ఆ రాత్రి, ఆ రాత్రి తాలూకు జ్ఞాపకాలు నాకెందుకని. కానీ, ఈ మెమోరి ఉంది చూశావూ. బహు చెడ్డది. అప్పుడప్పుడు హింసించడానికన్నట్లు గుర్తుచేస్తూ ఉంటుంది.

No comments:

Post a Comment